Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 8

    "జ్ఞాపికా... తొందరపడకు! మీ డాడీ వచ్చాక  ఆయన తీసుకోందే ఏవీ మాట్లాడకు! నా మీద ఒట్టు!!" అని జ్ఞాపిక తన తలమీద పెట్టుకుంది.
    "కామీ ....మనం స్ఫూర్తి దగ్గరికెళ్దామే! నాకు స్ఫూర్తిని చూడాలని ఉంది!"
    చటుక్కున లేచి పరుగెత్తుకుని స్పూర్తి దగ్గరికి వెళ్లబోయారిద్దరూ!
    "జ్ఞాపికా.... ఎక్కడికి? నువ్వెక్కడికీ వెళ్లొద్దు! మీ డాడీ, డాక్టరూ చెప్పేవరకూ నువ్వు నా ప్రోటేక్షన్ లోనే ఉండాలి!" ఆర్డర్ వేసింది వార్డెన్.
    కామిని వైపు చూసింది విలవిలలాడుతూ జ్ఞాపిక!
    "జ్ఞాపికా... కళ్ళు మూసుకు పడుకో! తక్కినవి నేను చూసుకుంటా! ఇప్పుడు నీ కంటే ముందు స్ఫూర్తిని చూసుకోవాలి నేను!" అంది చెవి దగ్గర.
    "అదే నేనూ చెప్పేది! నువ్వెళ్లు! నాకేం  ఫర్వాలా!" అని  వెనుదిరిగింది. చెవి దగ్గరకొచ్చి "నువ్వేం చెయ్యాలో తెలుసుగా!" అడిగింది మెల్లగా. కామిని జ్ఞాపిక  అరచెయ్యి నొక్కింది....తెలుసన్నట్టు!
    కామిని వెళ్లింది.... ఇంచుమించు పరిగెత్తుతున్నట్టు!
    స్ఫూర్తి ఇంకా  నిద్రపోతూనే ఉంది. రేవతి స్ఫూర్తి మంచంమ్మీద తలపెట్టుకు నిద్రపోయింది.
    "రేవతీ....లే! అని రేవతిని లేపి తలుపు బోల్టుపెట్టి, "బకెట్ తో నీళ్లు తీసుకురా!" అని తొందరచేసింది.
    ఎందుకని అడక్కుండా రేవతి వెళ్లింది.
    అల్లరిపిల్లలుగా కనిపించేవాళ్ళు అవసరం వస్తే ఎంతో మెచ్యూరిటీగా వ్యవహరిస్తారు. ఏ  జీవితానుభావం లేకుండానే వారికి కాలం మేధాశక్తినీ, సమయస్ఫూర్తినీ ఇస్తుంది.
    గబగబా అండర్ వేర్ నాప్ కిన్ తీసింది!
    వేసిన  బట్టలు విప్పింది.
    చెయ్యాల్సింది చేసి మళ్లీ ఫ్రెష్ నాప్ కిన్ అండవేర్ వేసి  డ్రస్ చేసింది! మొహం తడిబట్టతో తుడిచింది. ఆ తడికి మొహం చిట్లిస్తూ కళ్ళు తెరవకుండానే-
    "జ్ఞాపికా! నడుంనొప్పే! బాగా నొప్పే! ఇంకో టాబ్లెటివ్వవే!" అంది.
    "స్ఫూర్తీ....నేను కామినిని! చూడు ఇలా!" అంది తల ఒళ్ళోపెట్టుకుని.
    "నువ్వు షాపింగ్ నుండి వచ్చేశావా! నా  లిస్ట్ తెచ్చావా!" అంది కొంచెం కళ్ళుతెరిచి.
    "తెచ్చా కానీ! నీకెలా ఉందిపుడు?" ఆత్రం ఆపుకోలేకపోతోంది....గొంతులో ఏడుపు తన్నుకొస్తోంది.
    "నడుంనొప్పే! పొట్టికడుపులో నొప్పే! ఒళ్ళంతా నొప్పులు! భరించలేను....బాధగా ఉంది! వార్డెన్ కు చెప్పకు! హొళీ ఆడడానికి పర్మిషన్ తీసుకున్నందుకు వార్డెన్ తిడతారు! పొత్తికడుపెందుకు నెప్పిగా ఉందే? నడుముకు కదా.... దెబ్బ తగిలింది!" అర్థంకాలా స్ఫూర్తికి.
    జరిగిందేమీ తెలీదని తెలిసిపోయింది కామినికీ, రేవతికీ!
    "మరేంలేదు! నీకు పీరియడ్ వచ్చింది! కొంచెం జ్వరం కూడా ఉంది! అందుకే పొత్తికడుపులోనూ, ఒళ్ళంతానూ నెప్పిగా ఉంది! కొద్దిసేపట్లో జ్ఞాపిక డాడ్ వస్తారు! ఆయనొచ్చాక అన్నీ సర్దుకుంటాయి! నువ్వు కళ్ళు మూసుకు పడుకో! నేను నడుం మీద మసాజ్ చేస్తా!" అని  బోర్లా తిప్పింది.
    స్ఫూర్తి- కామిని నడుమును వాటేసుకుని బోర్లా పడుకుంది!
    కామినికి ఏడుపోచ్చేసింది..... వెక్కివెక్కిపడింది! రేవతి క్కూడా విషయం  తెలీకపోయినా ఎందుకో.... ఏడుపొచ్చింది. తను కూడా కామినికి అనుకుంది. ముగ్గరూ అలా అనుకునే ఉండిపోయారు చాలాసేపు!
    అదే బంధం! సృష్టిలో బలమైన బంధం!! ఎవరన్నారు రక్తసంబంధం  గొప్పదని? స్నేహ సంబంధం ముందు కన్నతల్లి రక్తసంబంధం కూడా దిగదుడుపే! అది నిజమైన స్నేహమయితే!!
                                                                           *    *    *
    ఒక్కతే పడుకుని ఉంది జ్ఞాపిక....పైకి చూస్తూ!
    కళ్ళు తెరిచినా, మూసినా... అదే అదృశ్యం! లేచి పరుగెత్తుకెళ్లి స్ఫూర్తిని వాటేసుకోవాలని ఉంది. తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే అందరికీ అనుమానం వస్తుంది. అందుకే కంట్రోల్ చేసుకుంది! కానీ, ఎమోషన్ ను ఆపుకోలేకపోయింది! ఎందుకో... ఏడుపోచ్చింది!
    దిండులో మొహం దాచుకుని వెక్కిపడుతుంటే.. ఏడుపోచ్చింది!
    ... సెంపెంగ పూలూ, మొగలిపుప్పోడీ కలిగిన వాసన!
    బెడ్ లైట్ వెలుగులో చటుక్కున లేచికూర్చుంది! రోమియో! య్యా! రోమియో స్కిన్ స్మెల్! పట్టలేని ఊరట! ఎందుకు....? తననసలు చూడలేదు, ఎలా ఉంటాడో తెలీదు! కానీ, ఇంత ఊరట! తన ఉనికి  తెలియగానే ఇంత ఆరాటం... ఎందుకో!
    వార్డెన్ తో ఎవరో మగగోంతు రిక్వెస్ట్ చేస్తున్న సవ్వడి!
    చటుక్కున లేచి ఆ స్మెల్ వస్తున్న గుమ్మం వైపు నడిచింది. అప్పటికే ఆ ఆకారం దగ్గరయింది. ఆ స్మెల్ తనను అలుముకుంది! అమాంతం ఆ స్మెల్ ను వాటేసుకుంది తమకంతో.
    తన బర్త్ డేని అల్లరిగా, సంతోషంతో పంచుకున్న హృదయం! తన జ్వరపు తీవ్రతకు సేవ చేసిన శరీరం! తనను పసిపిల్లలా లాలించిన హృదయం!
    గుండెల్లోని దుఃఖం పొంగుకొచ్చింది! ఒంటరితనం పోయింది! వెక్కివెక్కి స్ఫూర్తిని ఆ విధంగా హింసిస్తుంటే చూసిన కసి! తనేం చెయ్యలేకపోయిన అశక్తత! తను గాజుపలకతో బలంగా కడుపులో పొడిచిన తెగువ.... అన్నీ కలిసి బేలగా- బేలగా గుండెల్లోంచి గొంతులోకి, గొంతులోంచి కళ్ళలోకి, కళ్ళల్లోంచి బలమైన ఆ హృదయంపైకి కన్నీళ్లుగా  చేరాయి! ఆ చేతులు తనని అలాగే బిగించి పట్టుకున్నాయి బలంగా!
    ఎక్కడా దొరకని రిలాక్సేషన్! అప్పటివరకూ పడిన టెన్షన్ కు పీక్ స్టేజ్!
    "ఐ లవ్ యూ! ఐ లవ్ యూ!" అనేసింది.
    ఆ మాట అనడానికి- ఆ మనిషి ఎలా ఉన్నాడో చూడక్కర్లేదు! ఆ మనసేవిటో తెలిస్తే చాలు! ఆ మనసు తోడులో తను నిశ్చింత పొందగలననే భావన చాలు! శరీరాన్ని చూసీ, డిగ్రీలను, ఆస్తులను చూసీ, అంతస్థులు చూసీ, చివరికి- వయసును చూసీ కూడా పుట్టదు ప్రేమ! కేవలం అంతరంగాన్ని చూసి పుడుతుంది! అంతరంగమే ప్రేమకు స్థానం, అర్హత... రెండూనూ! అతనేవీ అనలేదు... అలాగే ఏడ్వనిచ్చాడు!
    మెల్లగా జ్ఞాపికను దిండుమీద పడుకోబెట్టి వెనుదిరిగి వెళ్లబోయాడు.
    "ప్లీజ్.... వెళ్ళొద్దూ! నాకు భయంగా ఉంది వెళ్ళొద్దూ! నాతో ఉండూ!" అంది. తలతిప్పి గుమ్మంవైపు చూసింది! అక్కడ మసక వెలుతుర్లో....డాడీ! అంతే- అమాంతం మంచమ్మీంచి దూకింది!
    "డాడ్! డాడ్! డాడ్!!" అరుస్తూ అలలా ఎగిసి, నదిలా దూకి వెళ్లి తండ్రిని వాటేసుకుని గట్టిగా ఏడ్చేసింది. తండ్రిలోంచి పుట్టి తండ్రిలో లీనమయింది.
    అతను వాళ్ళిద్దర్నీ దాటుకుని వెళ్లబోయాడు.
    ఆయన అతని చెయ్యి పట్టుకుని ఆపారు! అతను ఆగిపోయాడు.
    "హనీ! నేనొచ్చేశాను! రిలాక్స్, మై స్వీట్ హార్ట్! రిలాక్స్ హనీ! డాడీ  వచ్చాక ఇంకా ఏడుస్తారా! రిలాక్స్!"
    ఆపేసింది. తండ్రంటే ఆడపిల్లకు ఎంతిష్టమో- ఆడపిల్లను ప్రేమించిన తండ్రికే తెలుస్తుంది! ఆ భుజాలమీద మోసి, ఆ గుండెల మీద ఆడించి, ఆ అరచేతుల్లో ఉయ్యాలలూపిన ఆ  తండ్రికే తెలుసు.... తన కూతురి మమత్వం! ఆయనక్కూడా కళ్ళలో నీళ్ళొచ్చాయి.... కూతురి ఉద్వేగానికి!
    "ప్లీజ్ సర్!" అతను వారించాడు.
    మెల్లగా స్విచ్ వేశారాయన.
    ఆ వెలుతురుకు కళ్ళు చిట్లించి డాడీని అతుక్కుపోయింది. డాడీ వచ్చాక ఇక ఏవయినా ఫర్వాలా! వెళుతూరొచ్చినా,  చీకటొచ్చినా, మరణం వచ్చినా ఫర్వాలా....పర్వాలా! డాడీ చూసుకుంటారు. అందుకే అలా డాడీని అతుక్కుపోయింది.
    ఆయన అతనివైపు చూస్తూ "జ్ఞాపికాకి జ్వరం వచ్చినపుడు హాస్పిటల్ లో డాష్ ఇవ్వబోయి తప్పుకున్నారు.... అవునా!" గుర్తుపట్టారాయన.
    "య్యా! అయాం రేవంత్! జ్ఞాపికా సీనియర్!"
    అప్పుడు కళ్ళు తెరిచింది! తల తిప్పి అతనివైపు చూసింది! మళ్లీ సెంపెంగపూలూ, మొగలిపుప్పొడి కలిసిన అనుభూతి! తన సంతోషం, బాధ పంచుకున్న అనుభూతి!
    "య్యూ... రోమియో! రేవంత్!!" చూపుడువేలు సాచి అడిగింది.... నిజమా- అన్నట్టు చూస్తూ నమ్మలేనట్టు!
    కళ్ళు రెండూ తాటించాడు.
    తడికళ్ళతో నవ్వింది పువ్వులా! రేవంత్ వెళ్లి తలుపు వేసి వచ్చాడు.
    తలుపు వేయడానికి నింపాదిగా, బలంగా అడుగులు వేస్తున్న అతన్ని అలానే  చూస్తుండిపోయింది. డిగ్ని ఫైడ్గా ఉండే రేవంత్ కాన్ఫిడెంట్ గా , గైడ్ గా,  సీనియర్ గా, వెల్ విషర్ గా ఒక అద్భుతమైన మూర్తిని గుర్తుకుతెచ్చే ఫ్రెండ్ రేవంత్; అల్లరిగా, చిలిపిగా, ఆటగా,  మమకారంగా, ఆవేశంగా, ఉక్రోషాన్ని రేపి ఉర్రూతలూగిస్తూ ఉడికించి మరీ ఊరడించే రోమియో ఒక్కరా?
    'ఈజిట్ పాజిబుల్?' అనుకుంది.
    "నో! సమ్ థింగ్ రాంగ్! నేనేదో భ్రమపడుతున్నాను. రేవంత్ ప్రాక్టికల్ జోక్ చేస్తున్నాడు. రేవంత్ నడక చిరుతపులి అడుగుల్లా ఉంటుంది- నింపాదిగా, ధీమాగా! రోమియో నడక సముద్రంలో డాల్ఫిన్ జారినట్లు ఉంటుంది. ఇంపాజిబుల్! రేవంత్- రోమియో కావడానికి చాన్స్ లేదు. తనే ఏదో డిప్రెషన్ లో కన్ ప్యూజ్ అవుతోంది. తుళ్లింతకూ, నిశ్శబ్దానికీ ఒకేచోట తావెక్కడ ఉంటుంది? చిలిపితనం, గంభీరత్వం ఒకే మనిషిలో ఎలా చోటుచేసుకుంటాయి? కన్ ప్యూజ్ కన్ ప్యూజ్ గా  అలాగే చూస్తుండిపోయింది రేవంత్ వైపు- డాడీని కూడా మర్చిపోయి చిన్నగా  పెదాలు ఆశ్చర్యంతో విచ్చుకుని!
    ఆ పెదవుల వైపు చూస్తూ, ఆ కళ్ళల్లో ఆశ్చర్యాన్ని చదువుతూ మెల్లగా తనూ ఆధరాలు అరవిచ్చి నవ్వాడు... చైర్  లో కూర్చుంటూ! మళ్లీ అదే గంభీరమైన నవ్వు! కానీ, మొగలిపూల,  సంపెంగపూల స్కిన్ స్మెల్ తో  ఎలా పాజిబుల్?
    ఇంకా కళ్ళార్పకుండా అటే చూస్తున్న కూతుర్ని చూసి - బాగా షాక్ అయ్యి అలా నిర్లిప్తంగా ఉండిపోయిందనుకున్నారు డాడ్! భుజాలు పట్టుకుని కుదిపి-
    "లుక్... హౌ సెన్సిటివ్ గర్ల్ మై డాటర్ ఈజ్! జస్ట్ లైక్ ప్లవర్ పెటల్స్!" అని రేవంత్ వైపు చూసి  మళ్లీ కంటిన్యూ చేశారు- "బట్ వెరీవెరీ స్ట్రాంగ్ ఆల్సో, జస్ట్ లైక్ రాక్ ఫ్లవర్స్ పెటల్స్!" అని కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తూ.
    అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది. డాడీ ముందు తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంది.
    "ఏమయింది హనీ!" కాస్త రిలాక్సయ్యాక డాడీ అడిగేసరికి, అప్పటిదాకా అనుచుకున్న, ఉద్వేగం కళ్ళల్లోంచీ, మాటల్లోంచీ బయటకొచ్చేసింది.
    అంతా చెప్పి...
    "నా అరుపుకు ఇద్దరు కిటికీలోంచి దూకేశారు! మూడో అతను దూకబోయి జారిపడ్డాడు! నాకు భయంతో స్పృహ తప్పింది. మొదటి ఇద్దర్నీ నేను చూడలేదు. మూడో అతన్ని చూశాను.... అతనే చనిపోయింది!" అంది అసలు విషయం వివరిస్తూ!
    ఏ ఆధారమూ లేదు.... ముందు ఇద్దర్నీ పట్టుకోవడానికి!
    తెగి పడిందని జ్ఞాపిక ఇచ్చిన తన చైన్ తప్పితే- ఆ సంఘటనకు చెందిన ఏ వివరాలూ లేవు!
    స్ఫూర్తినసలు ఇంటరాగేట్ చెయ్యలేదు! చెయ్యనివ్వలేదు!
    "ప్రఖ్యాతి చెందిన ఉమెన్స్ హాస్టల్లో చైన్ దొంగతనానికి ముగ్గురు దొంగల ప్రవేశం! ఇద్దరు పరారీ! ఒకరి మరణం...!" అని పేపర్లూ, టీ.వీ.లూ వార్తలు ప్రసారం చేశాయి.
    స్ఫూర్తి తల్లిదండ్రులు  చూసెళ్లారు! హొళీ ఆడినందుకు కోప్పడ్డారు. నడుము నొప్పికి రెస్ట్ తీసుకుందువు- ఇంటికి రమ్మన్నారు.
    క్లాసులు పోతాయి రానంది! ప్రాజెక్ట్ వర్క్ పోతుందంది!
    వాళ్ళూ వెళ్లిపోయారు. అంతా సద్దుమణిగింది. జ్ఞాపిక ఫాదర్, కూతురి నార్మల్ ప్రవర్తన చూశాక తిరిగివెళ్తూ- "నన్ను కన్విన్స్ చేశారుగానీ, మీరు చేస్తూంది తప్పని పిస్తోందమ్మా!" అన్నాడు.
    "లేదు డాడ్! హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్!" జ్ఞాపిక.
    జ్ఞాపికా, కామినీ ఆ రూమ్ లోఉండలేక  రూమ్ మార్చారు!
    స్ఫూర్తిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడు రేవతి మామూలుగా అయిపోయి తను కూడా స్ఫూర్తికి కోఆపరేట్ చెయ్యగలుగుతోంది. స్ఫూర్తికి నడునొప్పి తగ్గడానికి బానే టైమ్ తీసుకుంది. అదంతా పడటం వల్లనే అనుకుంది స్ఫూర్తి. జ్ఞాపికా, కామినీ కూడా ఆ విషయమే సమర్థించారు.
    ఒకరోజు కామినీ, జ్ఞాపిక, రేవంత్ కూర్చుని డిస్కస్ చేసుకుంటున్నారేదో సబ్జెక్ట్! ఆ వేడిలోంచి ఈ సందర్భం పుట్టింది-
    "మనం చేతకానివాళ్ళం! మన చట్టాన్ని ఉపయోగించుకోవడం రానివాళ్ళం! మన స్నేహితురాలికి దారుణం జరిగినా నోరువిప్పి న్యాయం అడగలేనివాళ్ళం! కిరాతకుల్ని చూసినా అబద్దాలు చెప్పి రక్షించేవాళ్ళం!" రేవంత్ ఆవేశపడ్డాడు.
    "నీ ఆవేశానికి అర్థం ఉంది రేవంత్! కారణం కూడా ఉంది! కానీ, ఆలోచించు.... మన సామాజిక వ్యవస్థ గురించి! రెడ్డీ హాస్టల్ లో  జరిగిన ఇన్సిడెంట్ కు ఆ అమ్మాయిని ఇంటరాగేట్ చేసిన విధానం నీకు తెలుసు.  దాద్రా  ఎక్స్ ప్రెస్ లో పబ్లిక్ రేప్ ను ఏవీ జరగలేదని కేసు కొట్టేసిన విషయం తెలుసు. అమీనా కేసులో అమాయకపు ఆడపిల్ల  తప్పించుకున్నా- కులస్థుల చేత, తల్లిదండ్రుల చేత వెలివేయబడ్డ సంగతీ తెలుసు! ఇప్పుడు స్ఫూర్తిని ముగ్గురు రేప్ చేశారనిమనం సాక్ష్యం చెబితే రౌడీలను అరెస్ట్ చేస్తారన్న నమ్మకం లేదు. స్ఫూర్తి అమ్మానాన్న వచ్చి దానికి పెళ్ళి కాదన్న భయంతో 'మా అమ్మాయిని ఎవరూ ఏంచెయ్యలేదు'  అని డాక్టరు సర్టిఫికేట్ చూపించి కేసు కొట్టేయించి దాన్ని ఇంటికి తీసుకెళ్తారు. దాని చదువాగిపోతుంది. పోనీ, వాళ్ళమ్మానాన్నా ఒప్పుకున్నా- దానికి తనను రేప్ చేసినట్టు ఇంతవరకూ ఆలోచన లేదు. ఆ విషయం తెలిస్తే అది షాకవుతుంది. దాన్నెవరూ చేసుకోరు. పైగా.... ఐ విట్ నెస్ కింద జ్ఞాపికను, స్ఫూర్తినీ 'రేప్ ఎలా జరిగిందీ, ఎంతసేపు జరిగిందీ, ఏమేం చేశారు?'.... అని పోలీసులడిగే ప్రశ్నలకు స్ఫూర్తి  పిచ్చిదవుతుంది! ఒక రేప్ కు గురయిన స్త్రీ 'నన్ను రేప్ చేశారు బాబూ...!' అని చేతులు సాచి చెప్పినా- 'రేపంటే ఏవిటి? ఏమేంచేశారు?' అన్న ప్రశ్న దగ్గర్నుండీ ఆమె వర్జినిటీ టెస్ట్ దాకా చేసి- అది రేప్ కాదనీ, రేప్ చేసే ప్రయత్నం కూడా లేదనీ.... కేసు వాదించి గెలిపించే లాయర్లున్న వ్యవస్థ మనది!" కోపంతో, అసహనంతో ఆగింది కామిని.
    "వ్యవస్థ భయపడి నిజాన్ని ఆపడం న్యాయమా? ఇంకో ఇద్దరు నేరస్థులు తప్పించుకున్నారు. అంటే... వాళ్ళకు రేప్ చేసినా ఏవీ కాదు' అని లైసెన్స్ ఇచ్చినట్లేగా! అంటే.... 'ఆడపిల్లను రేప్ చేస్తే ఇండియాలో ఏమీ చెయ్యరు' అని ప్రపంచానికి మన చేతగానితనాన్ని తెలియచెయ్యడమేగా! మరిన్ని రేపులను, మరిన్ని దారుణాలను మనం ప్రోత్సహించినట్లేగా!"
    "అది నీ స్వంత విషయమైతేగానీ తెలిసేది కాదు రేవంత్! స్ఫూర్తి నీ చెల్లెలనుకో- దాన్ని కోర్టులో నిలబెట్టి 'నిన్ను వాడు ముట్టుకున్నాడా? ఎక్కడా? అప్పుడు బట్టలున్నాయా? కాళ్లు ఎలా మడిచాడు.., చేతులు ఎలా పట్టుకున్నాడు?' అని అడుగుతుంటే తట్టుకోగలవా? అన్నీ అడిగి అదసలు రేప్ కాదని కొట్టేస్తే భరించగలవా?" జ్ఞాపిక అడిగింది ప్రశాంతంగా.
     "ఒక కన్యకు అన్యాయం జరిగితే అపహాస్యం చేయడమేగానీ అనునయించడం తెలీని సంస్కృతికీ భయపడి అమ్మాయి సిద్దంగా ఉన్నా,  తల్లిదండ్రులు తమ కూతుర్ని బలిచేసేందుకు సిద్దంగా లేని స్థితి మనది. ఇది మన చేతగానితనం! గాంగ్ రేప్ చేసిన అమ్మాయిని వివాహం చేసుకునే సంస్కారం- ఆదర్శాలు వల్లించే మీలో ఉందా?" సూటిగా అడిగింది జ్ఞాపిక.

 Previous Page Next Page