Previous Page Next Page 
అసావేరి పేజి 9

    "ఆమెకు తెలుసు అతడ్ని ఇప్పుడే చూస్తున్నానని! కానీ ఎప్పటి నుంచో తెలిసినమ్తవరకూ ఆలోచిస్తున్నాడు. తన స్నేహంకోసం రోజూ గగనాన సంచరించే చందమామే దిగివచ్చాడా? అనుకొంటూ పరిసరాలను మరిచి తను ఆర్తిగా చూస్తూంది.
   
    కాదు మనసు పోరాటానికి జవాబు చెప్పలేకపోతూంది. ఇట్స్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ప్రేమ పోరాటంలో ఏర్పడే లౌకికమయిన ప్రేమ! తొలిచూపునే గుండెలోతుల తూపులా దూసుకుని వెళ్ళి అక్కడ ఒక గాయమై లిప్తలో గేయమై అదే బ్రతుకు ధ్యేయమై అది లేనినాడు ప్రాణమే హేయమూ అనిపించే ఒక భావం!
   
    భావుకత! అదే తొలిచూపు ప్రేమ! ఆ ప్రేమకు భాష్యం లేదు! స్థితిగతుల అంతస్థుల ఆలోచనలు రావు! అది దైవికం! అందుకే అది ఆ క్షణాన రేపటి వెతని గుర్తుచేయదు. సంఘం మరునాడు పేర్చే చితినీ పాటించుకోదు. ఆ ప్రేమే శాశ్వతంగా వెలిగే ప్రమిద. ప్రేమికుల్ని సమిధలుగా మార్చుతూనయినా అరారమై నిలిచే గాథ! దటీజ్ లౌ ఎట్ ఫస్ట్ సైట్ అండ్ లౌ స్టోరీ ఆఫ్ రోమియో జూలియట్!"
   
    సావేరి వింటూంది ఆసక్తిగా! అది కథలోని పారవశ్యమో లేక ఆమెలో కలిగే వివశత్వమో ముగ్ధసావేరి ఇప్పుడు అల్లరి సెలయేరుగాక మిన్నీరై చూస్తుంది.
   
    "కేప్యులెట్ ఉత్సవం సాగుతూంది. ఓ క్షణం రోమియో జూలియట్ దృష్టినుంచి తప్పించుకున్నాడు హఠాత్తుగా ఆమె ముందున్న ప్రపంచం చీకటైంది! ఆమె విశాల నేత్రాలు చీకటిలో చెలిమిని కోరే ఆర్తిగా అటు ఇటూ వెదికాయి. అప్పుడు ఓ చిరుస్పర్శ
   
    ఆమె చేతి వ్రేళ్ళను మృదువుగా స్పృశిస్తున్నారెవరో! అదే ఆమె మనసు తంత్రిని మీటింది. నేత్రాలను అరమోడ్పులుగా మార్చింది. అది నిద్రకాదు! మనసుని మేల్కొలిపే జాగృతి ముద్ర! ఒడలు జలదరించింది.
   
    రోమియో కంఠం ఆర్ద్రంగా వినిపిస్తూంది.
   
    "ఈ నా స్పర్శలో మైలపడిన ఓ లావణ్యవతీ! నిన్ను తాకిన ఈ పుణ్యఫలంతో పునీతున్ని కావాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళూ ఏది నా జీవిత గమ్యం అంటూ నన్ను నిలదీసిన నా పెదవులు నిన్ను స్పృశించే యాత్రికులై కడదాకా పయనించాలని కోరుకుంటున్నాయి.... నీ స్మరణంతో కదిలి కదిలి అలసటగా రాలిపోతేనేం? అంటూ ఉద్విగ్న పరుస్తున్నై....
   
    నా ప్రార్ధన మన్నించు.... రోమియో పెదవులు ఆమె వ్రేళ్ళను తాకాయి. అధో పులకింత! ముద్దు.... ముగ్ధ కరిగింది. బాధ మరిచింది....తనువే భావమై ఆ భావం చెరగని అనుభవమై, పిదప రవమై, భాష్యమై అప్పుడు జారింది ఆమె కనుకొలకులనుంచి ఓ నీటిబొట్టు! దట్స్ ఫిలాసఫీ ఆఫ్ లౌ ఎట్ ఫస్ట్ సైట్_As it is said To love is to bring forth upon the beautiful both in body and soul-"
   
    అప్పుడు చూసింది సావేరి!
   
    అది మొన్న చెరిగిన స్వప్నమో లేక ఇక చెరిగిపోనమ్మా.....అంటూ మనసు పొరలను తాకిన తొలిచూపుల గాయమో లేక నూరేళ్ళ గేయమో అక్కడ ద్వారం దగ్గర ఒక రూపం....లిప్త మనిషి అనిపించింది. అరలిప్తలో అది తననే పలకరించాలని వచ్చిన ప్రత్యూష పవనంగా కనిపించింది.
   
    ఆ రూపం సైతం ఆమెనే చూస్తూంది. కనురెప్పల కదలిక సైతం ఎదుటి రూపాన్ని కనుమరుగు చేస్తుందా అన్న ఆత్రంగా ఆమెనే గమనిస్తూంది.
   
    "యూ ఆర్...." లెక్చరర్ పిలుపు ద్వారం దగ్గిర నిలబడ్డ శంకూ దృష్టి మరల్చలేకపోయింది.
   
    మరోసారి....
   
    "సర్....నేను....శంకూ....ఫస్టియర్...." తడబడ్డాడు తేరుకున్న శంకూ! క్లాస్ ఘొల్లుమంది ఒక్క సావేరి తప్ప!
   
    "కమిన్!" కదిలాడు శంకూ. క్లాస్ రూమ్ లోకి మాత్రమే  కాదు. ఓ కావ్యసృష్టికి కారణం కాగల సావేరి హృదయంలోకి కూడా.
   
                                       *    *    *    *    *
   
    అర్దరాత్రి గడుస్తూంది.
   
    ఊరంతా సద్దుమణిగింది. బామ్మ నిద్రపోయింది. కాని శంకూ మంచంపై పడుకొని ఆకాశంలోకి చూస్తున్నాడు.
   
    అతడి పెదవులపై తెలియకుండా మెదిలే నవ్వుల తరగలు__
   
    కదిలే చందమామ కూడా కన్నార్పకుండా అతడ్నే చూస్తున్న అనుభూతి.
   
    ఆమె.... ఆమె....గుర్తుకొస్తూంది. అదేపనిగా ఆ రూపం మెదులుతూంది. అన్నం సరిగ్గా తినలేకపోయాడు. ఇప్పుడు నిద్రరాక నలిగిపోతున్నాడు. పక్కకి ఒత్తిగిల్లాడు. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
   
    రేయి గడుస్తూంది కానీ ఇంకా ఆమె గుర్తుకొస్తూనే వుంది.
   
    పైకి లేచాడు ఉక్రోషంగా.
   
    ఓ గాలి అలా అతడి చెంపల్ని తాకింది చిలిపిగా.
   
    మరుక్షణం ముందొక రూపం కదిలినట్టు అనిపించింది.
   
    కళ్ళు చిట్లించి చూశాడు.
   
    వివస్త్రగా మారుతున్న మంగ చిన్నగా నవ్వుతూంది. ఎదురుగా అతడు చూస్తుండగానే బ్లౌజు తీసేసింది.
   
    రెప్ప వేయడం మరిచాడు.
   
    అతడు నోరు తెరిచాడు ఏదో అడగాలని.
   
    కానీ అప్పటికే అతడిపై బడిన మంగ అతడి నోటిని గుండెలతో మూసింది. బలంగా... కసిగా....
   
    "మంగా" బాధగా మూలిగాడు శంకూ.
   
    అప్పటికే పూర్తిగా రగులుకున్న మంగ అతడ్ని మాట్లాడనివ్వ కూడదనుకుంది. బలంగా అతడ్ని మీదికి లాక్కోవాలని ప్రయత్నిస్తూంది.
   
    నిశిరాత్రి గాలి ఇప్పుడు నిప్పుల సెగల్ని చిమ్ముతుంటే ఒక్క ఉదుటున ఆమె పట్టు విడిపించుకొని దూరంగా జరిగాడు.
   
    అవాక్కయింది మంగ కోపంగా చూస్తూ.... "ఏమైంది" అంది రొప్పుతూ.
   
    "వద్దు" తల అడ్డంగా వూపాడు. కాదు భయంతో వణికిపోతున్నాడు. అతడి కళ్ళనుంచి నీళ్ళు ఏ క్షణంలో అయినా రాలిపడేట్టున్నాయి.
   
    అతి సున్నితమైన ఒక ప్రపంచపు నడిబొడ్డున బ్రతకడమే అలవాటైన శంకూ భాష్యం చెప్పలేని ఓ చిత్రమైన స్థితిలో నలిగిపోతున్నాడు.
   
    "ఇష్టం లేదా?" కాంక్షను నిగ్రహించుకుంటూ అడిగింది. "చెప్పు శంకూ....నేను నీకు నచ్చలేదా...."
   
    ఎలా చెప్పాలో తోచడంలేదు. ఎలా చెబితే ఆమెకు అర్ధమౌతుందో శంకూకి అర్ధం కావడంలేదు. "అదికాదు మంగా...."
   
    "నన్ను చెప్పనియ్ శంకూ....నేను కోరి వచ్చాను. అలా అని నేను తిరుగుబోతుని కాను. నిజమే...నాకంటే నువ్వు చిన్నవాడివే.....కాని....నీ చూపుల్నిబట్టి నీకూ నేను కావాలేమో అనిపించింది...."
   
    "మంగా" శంకూ పెదవులు అదురుతున్నాయి. "నేను అలా నిన్ను చూడలేదు" ఇంతకన్నా స్పష్టంగా చెప్పలేడు శంకూ.
   
    "కానీ...ఇందాక...." గుర్తుచేస్తూ అంది "నీ కళ్ళలో చనుబాలు వేసినప్పుడు నువ్వు రుచి చూడటంలో అర్ధమేమిటి? నేను రాత్రికి వస్తానన్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఎందుకుండిపోయావు"
   
    తల వంచుకున్నాడు. ఒక గాలి తెమ్మెర అతడి పాలభాగాన పేరుకున్న స్వేదాన్ని తాకి నెమ్మదిగా విడిపోతుంది.
   
    "నేను...అసలు...ఏం మాట్లాడాలో తెలీక అలా వుండిపోయేను మంగా! కానీ..." హఠాత్తుగా శంకూ గొంతు ఆర్ద్రమైపోయింది. "ఆ పాలు రుచి చూసింది ఎందుకంటే...ఆ పాలతో అమ్మ గుర్తుకొచ్చింది. అవి అమ్మ పాలులాంటివే అయితే ఎలా వుంటాయో తెలుసుకోవాలనిపించింది"

 Previous Page Next Page