"ఆహా....ముసల్దానిలా వుంటుందే నిర్మల ఆవిడన్న మాట!"
ఘొల్లుమనబోయిన గుంపు రవి చూపుతో నిగ్రహించుకున్నారు.
"అదేం శంకూ....ఇదెక్కడి ఘోరమోయ్! కేరెక్టర్ ఏక్టరెస్ మీద కన్నేవేసేమిటి...."
"అదికాదు బామ్మలా ఉంటుందని" సిగ్గుపడిపోతూ జవాబు చెప్పాడు శంకూ.
"అవునూ ఈ సృష్టిలో బామ్మలు ఏమి చేయును?" రవి అడిగాడు గ్రాంధిక ఫక్కీలో.
"మనవళ్ళను పెంచును" వెంకట్ టక్కున జవాబు చెప్పాడు. "పైగా నిక్కర్లు తొడిగి మనవళ్ళను కాలేజీలకు కూడా పంపును"
"పాటలు కూడా పాడును" అన్నాడు శంకూ అప్పటికి ఆ భాష తనూ జీర్ణించుకున్నట్టుగా.
"అంతేకాదోయ్ మనవడూ....?" రవి వ్యంగ్యంగా అన్నాడు.
"పెళ్ళికాకుండా కూతురు కడుపు చేయించుకుంటే పుట్టిన బిడ్డల్నీ పెంచును....."
అది తనని ఉద్దేశించి అన్నట్టనిపించి గిర్రున కళ్ళలో నీళ్ళు తిరిగాయిగాని భయంతో శంకూ తమాయించుకున్నాడు.
"ఏంది బే ఆ చూపు? నేనన్నది నిజమే" రవి రెట్టించేసరికి చెంపల పైకి జారిన నీళ్ళను తుడుచుకున్నాడు శంకూ.
ఆ గదిలో రెండు నిమిషాలపాటు నిశ్శబ్దం ఆవరించింది.
"సో.....అలా దేభ్యం మొహం వేసుకు చూడక అర్జెంటుగా ఓ పాటపాడు. బామ్మలు పాటలు కూడా పాడునన్నావుగా....ముందు పాడు."
పారిపోవాలని ఉంది. అమ్మ గురించి ఎగతాళిగా అన్న మాటలు ఇంకా వినాల్సివస్తుందేమో అని చాలా దూరంగా వెళ్లిపోవాలనిపించింది.
కదలబోయిన శంకూ చేతిని పట్టుకున్నాడు రవి. "నిన్నేరా....సోలో అయినా ఫర్వాలేదు. డ్యూయెట్టయినా ఫర్వాలేదు....పాడు" గద్దించాడు.
దిక్కులు చూస్తున్న శంకూని చేరుకున్న వెంకట్ కి రవి సంగతి తెలుసు. "పాడెయ్ శంకూ....తప్పదు కళ్ళుమూసుకుని పాడెయ్" అన్నాడు.
బామ్మ గుర్తుకొచ్చింది. "కళ్ళుమూసుకుని తినేయ్. కళ్ళుమూసుకుని పడుకో" అని తరచూ అనే బామ్మ మాటలూ జ్ఞప్తికిరాగా ధైర్యాన్ని చిక్కబట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. వదిలేట్టులేరు.
నెమ్మదిగా పాడటం మొదలుపెట్టాడు. ఆగకుండా కళ్ళు మూసుకుని మొత్తం పాడేశాడు. ఓ పని అయ్యిందన్న సంతృప్తితో రెప్పలు తెరిచి చూసేసరికి అంతా చుట్టూ క్షతగాత్రులయిన సైనికుల్లా పడిపోయి నిద్రపోతున్నారు.
"ఎంత పని చెప్పావు శంకూ" వెంకట్ జాలిగా చుట్టూ చూశాడు. "ఇప్పుడెలా మేల్కొలిపేది? పాటపాడమంటే ఏ సినిమా పాటో పాడక ఇలా జోలపాట పాడతావా....అందులోనూ జో అచ్యుతానంద అంటూ నిద్రకు సంబంధించిన సాంగ్ మొత్తం పాడేస్తావా?"
"అదొక్కటే నాకు వచ్చు."
"ఇంకేమీ రాదా?"
"మా తెలుగు తల్లికి...."
"ఆపెయ్...అక్కడాపెయ్...."
"అవును...బామ్మ పాడినప్పుడు నేనూ అలాగే నిద్రపోతాను అంత బాగా బాగా పాడనా?" ఇంతమందిని ఒకేసారి నిద్రపుచ్చినందుకు కాస్త సంతోషంగా అనిపించింది.
"పాడుపాట" వెంకట్ బాధగా అన్నాడు అవతల క్లాసెస్ కి టైమ్ అవుతూంది మా వాళ్ళని నిద్రలేపేది, మేలుకొలుపుకి సంబంధించిన పాటే మన్నా వచ్చా" వెంకట్ ఇంకా పూర్తి చేయనేలేదు. అమాంతం అందరూ లేచారు ఒకేసారి.
"వద్దు.....అలాంటి గీతంతోనో ఘాతుకంతోనో మా గుండెల్లో గునపాలు గుచ్చకు..." ముక్తకంఠంతో పలికారు. "అద్సరే....బామ్మగారి మనవడూ...." రవి ఎగతాళిగా అన్నాడు. "ఓ చిన్న అనుమానం! అసలు నీకు బామ్మలు తప్ప ఈ సృష్టిలో ఏమేం తెలుసు....?"
"వయసులో వున్న ఏ ఆడదాన్నయినా చూశావా....?"
"కనీసం స్నానం చేసేటప్పుడు తలుపు కన్నంలోనుంచి ఏ స్త్రీ సౌందర్యాన్నయినా ఆస్వాదించావా....?"
"తప్పేముంది నాయనా....వయసుకి సహజమైన చిలిపి కోర్కెలే అవి.....చెప్పు సిగ్గుపడకు...."
శంకూ అయిష్టంగా తలవంచుకున్నాడు. అన్నీ పాడుమాటల్లా అనిపించాయి.
"దబ్బపండులా ఉన్నావు! ఇంతవరకూ ఎవర్నయినా ముద్దుపెట్టుకున్నావా....పోనీ ఏ అమ్మాయి అయినా నిన్ను ముద్దుపెట్టుకుందా....డెఫినెట్ గా పెట్టేసుకునుంటుంది. ఎవరితోనూ చెప్పలేం....ఒప్పేసుకో ....అదిగో నీ సిగ్గు చూస్తుంటే అర్ధమైపోతుంది.....పెట్టుకున్నావు కదూ....యస్....నవ్వుతున్నావు ....అంటే నిన్ను...ఎవరో గాఢంగా గట్టిగా ముద్దెట్టేసుకున్నారు.....చెప్పు....ఎవరు?"
"బామ్మ" శంకూ టక్కున చెప్పిన జవాబుకి అంతా తూలిపడబోయారు.
"రేయ్ శఠగోపం! ఇది రివర్స్ రేగింగులా వుంది. బుర్రలు తినేయక వెంటనే ఓ పనిచెయ్...." రవి రోషంగా ఆదేశం జారీచేశాడు. "ఈ గది పక్కనున్న కారిడార్ లో నుంచి ముక్కు సూటిగా ముందుకు నడిస్తే వందడుగుల మూడంగుళాల దూరంలో అమ్మాయిల రెస్ట్ రూమ్ వుంటుంది. అక్కడ కిటికీ దగ్గర ఓ పిల్ల మల్లెచెండు పెట్టుకొని కలలు కంటూ వుంటుంది. ఆ జడలో ఓ మల్లె లాగేసి పట్టుకొచ్చివ్వాలి....వెళ్ళు...."
శంకూ నుదురు చెమటతో తడిసిపోయింది.
"పో...లేదా పేంటు పీకేసి వేమన గెటప్ లో వూరంతా తిప్పేస్తా" రవి కోపంగా ముందుకొచ్చేసరికి భయంగా రెండడుగులు వెనక్కేశాడు. మరుక్షణం ఆపద అప్పటికి తప్పిందనుకున్నాడేమో బ్రతుకుజీవుడా అంటూ పరిగెత్తాడు అమ్మాయి గదివేపు కాదు_క్లాస్ రూమ్ కేసి....
* * * *
For beauty starved with her serverity
Cuts beauty off from all posterity
She is too fair wise wisely too fair
Says Romeo to Bernivitio....
ఒక శబ్దకోశం నుంచి జారిపడుతున్న స్వప్నాల స్వరలహరిలా ప్రేమ కావ్యపు పంక్తులు జవహర్ కంఠంనుంచి రసరమ్యంగా వినిపిస్తున్నాయి. జవహర్ ఇంగ్లీష్ లెక్చరర్ గా ఆ కాలేజీలో ఎంతటి అపురూప స్థానాన్ని సంపాదించుకున్నాడూ అంటే పాఠం ప్రారంభించిన మరుక్షణం తనను తాను మరిచిపోతాడు....ఓ ధ్యానంలోకి జారినట్టు సానుభూతితో తన పరిసరాలలో సైతం ఒక పారవశ్యపు వెల్లువని నింపి, చెబుతున్నది విద్యార్దుల మనసు పొరల్లోకి చొచ్చుకుపోయేట్టు ఏకాగ్రతని పాటిస్తూంటాడు.
అది అతడి ప్రత్యేకత. అతడి కంఠంలోని శ్రావ్యత స్పష్టత విద్యార్దుల్ని మంత్రముగ్దులుగా మార్చుతూ ఉంటుంది. అది మాత్రమే కాదు. వ్యక్తిగా సైతం అతడభిమానించే ప్రేమకథ షేక్స్ పియర్ రోమియో జూలియట్ అభిమానించడమేకాదు.
రెండు లేత హృదయాల కలయిక ఆ సంగమంలోని ఆర్ద్రత వారిని విడదీసిన విధినెదిరించి మరణంతో మళ్ళీ ఏకమయిన సన్నివేశం అలవోకగా అతడి కళ్ళలోనూ నీళ్ళను నింపుకుంటాయి.
"మెంటెగ్యూ కేప్యులెట్స్ మధ్య వైరం రోమియోని నిరోధించలేదు....అందుకే స్నేహితులతో అది ప్రమాదమని తెలిసినా మొహానికి 'మాస్క్' తొడుక్కుని 'కేప్యులెట్ బాల్' కి వెళ్ళాడు... ఆ ఉత్సవంలో ఎటు చూసినా జనం కేరింతల ప్రభంజనం_ ఇక్కడ రోమియోని రప్పించింది కవి షేక్స్ పియర్ కాదు. రోమియో కథ నడిపించిన విధి! అక్కడ చూశాడు పద్నాలుగేళ్ళు సైతం పూర్తిగా రాని జూలియట్ ని. అంతే చుట్టూ వున్న మనుషుల సందడి అదృశ్యమై కేవలం ఆమె మాత్రమే అతడి కళ్ళముందు నిలిచింది కాదు! ఆ రూపం క్రమంగా మనసు పొరల్లోకి చొచ్చుకుపోతూంది. ముందు స్వప్నమేమో అనుకున్నాడు. అది క్షణకాలం స్వప్నమైతేనేం ఒక చిన్న స్పర్శతో బ్రతుకే పునీతమౌతుందని నెమ్మదిగా చాలా నెమ్మదిగా ఆమెని చేరుకున్నారు. జూలియట్ స్థితీ అలాగే వుంది...." ఒక గంభీర స్వరఝరిలా సాగిపోతూంది.