Previous Page Next Page 
అసావేరి పేజి 10

    ఒక నీటిబొట్టు మంగ కళ్ళలో పేరుకుంది.
   
    ఆ చివరి వాక్యం విన్నాక మంగ గుండె అరక్షణం ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది.
   
    "ఒట్టు మంగా....బహుశా అమ్మే వుంటే అలా పాలు నా కళ్ళల్లో వేసేది కదా అనిపించింది" మసక వెలుతురులో శంకూ లేత చెంపలపై నుంచి నీళ్ళప్పుడు ధారగా కారుతున్నాయి.
   
    మంగ చేయి ఆప్యాయంగా శంకూ తలపై పడింది. వెనువెంటనే అతడి చెంపలపై జాలువారిన ఆశ్రువుల్ని తుడిచింది. అదో చిత్రమయిన స్థితి. కోరికల ఉప్పెన హఠాత్తుగా గడ్డకట్టినట్టు చాలా లాలనగా అర నిమిషము చూసింది. ఎక్కడో సమస్యకి శాశ్వతమయిన తెర పడినట్టు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
   
    చాలాసేపటికి తల పైకెత్తిన శంకూ అప్పటికే మంగ వెళ్ళిపోవటం గమనించాడు.
   
    ఆ మరుసటిరోజే కాదు. మరో మూడు రోజులపాటు మంగ అతడికి ఎదురు కాలేకపోయింది.
   
                                                             *    *    *    *    *   
   
    ఉదయం సూర్యుని లేత కిరణాలు ఎప్పటిలాగే కిటికీని దాటి ఫోమ్ బెడ్ ని చేరుతుంటే అసహనంగా లేచింది సావేరి.
   
    సామాన్యంగా ఆ సమయానికి సావేరి నిద్రలేచి తలారా స్నానం చేసి పూదోటని చేరుకునేది పూచిన పూలని చూస్తూ ఒక ప్రియనేస్తంలా అన్నిటినీ పరామర్శిస్తూ మొక్క మొక్కనీ పలకరించేది. మృదు మందహాసంతో వనకిన్నెరలా కళ్ళతోనే కబుర్లు చెప్పేది.
   
    ఆ దృశ్యం ఇంటి పనివాళ్ళకే కాదు. తల్లి రాధమ్మకి, తండ్రి వీర్రాజుకీ నేత్రానందంగా వుండేది.
   
    కానీ మూడు రోజులుగా ఆమె దినచర్యలో మార్పు వచ్చింది. అది అందర్నీ ఆశ్చర్యపరచింది. ముఖ్యంగా బావ రాజేందర్ ని. తనకు కాబోయే భార్య అన్న భావమో లేక ఎంతచూసినా తరగతి సౌందర్యం సావేరిది అన్న ఆలోచనలో అవకాశాన్ని జారవిడుచుకునేవాడు కాదు. ఉదయరాగంలో కదిలే సావేరిని చాటుగా చూస్తూ స్వప్నంలోకి జారేవాడు. సొంత వూరులో ఉదయం పదిగంటలదాకా నిద్రలేవని రాజేందర్ కేవలం యీ దృశ్యం చూడాలని తూర్పు తెల్లవారకముందే నిద్రలేవటం అలవాటు చేసుకున్నాడు.
   
    అదిగో ఇప్పుడు అలాంటి అవకాశం చేజారినట్లు అతడూ కలవరపడ్డాడు.
   
    మావయ్య వీర్రాజుకి కుడిభుజంగా రేపోమాపో మకుటాన్ని పెట్టుకోగలిగే యిప్పటి యువజన నాయకుడిగా రాజేందర్ ఆ యింట చాలా స్వతంత్రుడు పైగా రాధమ్మకి స్వయానా తోడబుట్టినవాడు.
   
    అందుకే తనే ఆరాతీద్దామని సావేరి గదిలో అడుగుపెట్టాడు. అప్పటికే సావేరి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూంది.
   
    కొన్ని క్షణాల క్రితమే మంగ వుంచిన 'హార్లిక్స్' అక్కడ టీపాయ్ పై కనిపిస్తుంటే చేత్తో అందుకున్నాడు.
   
    "చల్లారిపోతోంది సావేరీ" జవాబు లేదు. రెట్టించాడు మళ్ళీ.
   
    ఓ అందమైన స్వప్నం చెదిరినట్లు "ఏమిటీ" అంది వెనక్కి తిరగకుండానే.
   
    "యవ్వనం కాదు.....హార్లిక్స్" అలవాటుగా ఓ జోక్ వేశాడు. "నిజం నీ పెదవులు తాకాలని నాలాగే యీ కప్పు కూడా యిదిగో నిప్పుల్ని కక్కుతూంది."
   
    "షటప్...." ఇంగ్లీషు మీడియంలో బాల్యమంతా చదువుకున్న సావేరి యింకా చాలా తిట్లను ఆ భాషలోనే ప్రయోగించేదే...కానీ నిభాయించుకుంది. అది కూడా కాదు. ఓ స్వాప్నికావస్థలో నిలబడ్డ ఆమె అతను వీలైనంత త్వరగా గదిలో నుంచి వెళితే బాగున్నని ఆలోచిస్తూంది.
   
    "ఇంకా బాగుంది."
   
    "వ్వాట్...." వెనక్కి తిరిగిన సావేరి తీక్షణంగా చూస్తూ అంది.
   
    "అదే కోపంలో నీ అందం...."
   
    "బుల్ షిట్...ఇలా నా దగ్గర మాట్లాడితే చంపుతా. ఆ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. ఐ డోంట్ మైండ్ రిపీటింగిట్ వన్సెగైన్."
   
    నవ్వుతున్నాడు. అదికాదు రోషంలో ఎగిరిపడే ఆమె లేత పరువాన్ని తదేకంగా గమనిస్తున్నాడు.
   
    ఇక్కడ సావేరి ఆ విషయాన్ని గమనించడంగాని, ఆమె కోపం తారాస్థాయికి చేరుకోవడంగానీ యాదృచ్చికం కాదు. "అవుట్....గెట్టవుట్ ఐసే...అదిగో...అదిగో యిలా నవ్వితే చంపుతా...."
   
    "అదృష్టవంతురాలివి" మామూలుగా నవ్వుతూనే అన్నాడు. "అవును సావేరీ! నా పేరు చెబితే చాలు జనం హడలిపోతుంటారు. పోలీసులు సైతం గడగడలాడుతుంటారు. అలాంటి యీ సర్పాన్ని చాలా దారుణంగా కంట్రోల్ చేస్తున్నావు. అంతకుమించి రేపు మన పెళ్ళయ్యాక చేయాల్సిన సేవలన్నీ అడ్వాన్స్ గా నాచేత చేయించుకుంటున్నావు...." కప్పు అందించబోయాడు.
   
    సరిగ్గా సావేరి కోపానికి గండి పడిందక్కడే.
   
    విసురుగా ఆమె చెయ్యి లేవడం అది కప్పుకు తగిలి దూరంగా ఎగిరి నేలపైపడి ముక్కలు కావటం అక్కడ రాధమ్మ నిశ్చేష్టురాలయి నిలబడటం క్షణాల్లో జరిగిపోయింది.
   
    "ఏమిటే నీకేమైంది? బంగారంలాంటి కప్పు ముక్కలయిపోయింది కదే" రాధమ్మ ఆందోళనగా అడిగింది.
   
    "లెట్ హిమ్ కంట్రోల్ హిజ్ టంగ్ మమ్మీ....నాకు కోపం తెప్పిస్తే కప్పుల్ని విసురుతా ఆ...."
   
    "నీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి."
   
    "వదిలెయ్ అక్కా! అమ్మడు మూడ్ లో లేనట్టుంది."
   
    "నా మూడ్ గురించి మాట్లాడినా చంపుతా" బుసకొడుతూ ముందు కొచ్చేసరికి రాజేందర్ కొద్దిగా కంగారుపడ్డాడు. అదోలా నవ్వుతూ బయటికి నడిచాడు.
   
    రాధమ్మ కప్పు ముక్కల్ని ఏరబోతుంటే మంగ అప్పటికే గదిలోకి వచ్చి నేలపడ్డ హార్లిక్స్ తుడిచేస్తూ ముక్కల్ని ప్లాస్టిక్ బకెట్ లో పడేసింది. "మీరెళ్ళండమ్మా! నేను చేస్తాగా!"
   
    "ఈ ఇంటిలో దీనికి ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది" గొణుక్కుంటూ వెళ్ళిపోయింది రాధమ్మ.
   
    మంగ సావేరి కోసమే ప్రత్యేకించబడిన పనిమనిషి మాత్రమే కాదు సావేరి దగ్గర బాగా చనువున్నది కూడా. "ఏటైంది అమ్మాయిగారూ! అంత కోపమేటి?"
   
    "నన్ను అల్లరి చేస్తే నేను విసిరికొట్టనా" అంది సావేరి నా చిన్నారి పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్నట్టు.
   
    "మీరీ మధ్య మరీ కోపిష్టి అయిపోతున్నారు. మీరు కోపంగా వుండాల్సింది సాయంకాలం పూటేగా..." టైం టేబుల్ గుర్తుచేసింది. "అసలేమైంది?"
   
    బిడియంగా తల వాల్చింది. "అస్తమానం వస్తుంటే ఏం చేయను?"
   
    "ఎవరు? ఎందుకొస్తున్నారు?" ఎవరో తెలీనట్లు చూస్తూ అడిగింది.
   
    "నన్ను అల్లరి చేయడానికి."
   
    "అలాంటప్పుడు అయ్యగారితో చెప్పాల్సింది."
   
    "చెబీతే ఏం చేస్తారు?"
   
    "పట్టుకుని మందలిస్తారు"
   
    "దొరికితేగా?" అసహనంగా అంది.
   
    "వచ్చినవాడు దొరక్క ఏం చేస్తాడు?"
   
    "అబ్బా నీకస్సలు అర్ధంకాదు."
   
    "నిజమేనమ్మా....నిజంగానే అర్ధంకావడంలేదు. ఈసారి వస్తే అమ్మగారికయినా చెప్పెయ్."
   
    "ఎవరికి చెప్పినా లాభం లేదు."
   
    "అదేం?"
   
    "ఆ మనిషి గదిలోకి రావడంలేదు."
   
    "మరి?"
   
    "మనసులోకి అంటే ఆలోచనల్లోకి...." విష్పరింగ్ గా అంది. గది ఊడ్చుతున్న మంగ ఉలికిపాటుగా తలపైకెత్తింది. "ఏమిటేమిటీ, మనసులోకి వస్తున్నాడా? అదీ మీ అనుమతి లేకుండానా...." అర్ధమైపోయింది .....వయసుని మనసు అదుపుచేసే ఓ అనర్ధం జరిగిపోయిందని "ఎవరమ్మా....ఎవరా అబ్బాయి" రహస్యంగ అడిగింది.

 Previous Page Next Page