"ఊ..... చెప్పు...."
"నువ్వే చెప్పు...."
"ఎందుకు?"
"అలా షికారు తిరిగి వద్దామని?" వ్యంగ్యంగా అని అతనివైపు చురుగ్గా చూసింది.
"అంటే నా మాటలు నీకు జోక్ గా వున్నాయన్నమాట"
"రాంగో..... ప్రేమ విషయంలో నేను చాలా తొందరపడ్డానేమోనని నాకిప్పుడు అనిపిస్తుంది. నాకేం తక్కువ చెప్పు..... మా కాలేజీలో వున్న అమ్మాయిలలో నేనే నంబర్ వన్ బ్యూటీని."
"నెంబరు టూ ఎవరు?"
"ఎందుకూ..... వెళ్ళి లైనెయ్యడానికా?"
"అలా అంటే నాక్కోపం వస్తుంది బాలా..... నా ఈ గ్రేట్ లైఫ్ లో లైనేసింది..... లవ్ చేసింది నిన్నే.... అందుకు రుజువుగా నన్నేం చేయమంటావో చెప్పు? ఈ డాబామీద నుంచి దూకమంటావా"
"ఇప్పుడంత అవసరం లేదు కానీ..... ముందు మన పెళ్ళి విషయం ఆలోచించు.... రేపు మన విషయం తెలిశాక మా వాళ్ళు కానీ, మీ వాళ్ళు కానీ మనల్ని వేరు చేస్తారేమోనని భయంగా వుంది."
ఆమె ప్రశ్న విన్న రాంగో నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
కొన్ని క్షణాల తరువాత....
"ఆల్ రైట్.... అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటావ్?"
"మనమే పెళ్ళి చేసేసుకుందాం."
జాజిబాల ఠక్కున చెప్పింది.
ఆమె సమాధానం విన్న రాంగో గతుక్కుమన్నాడు.
ఇన్నాళ్లు ఆమె మాటలను జోక్ గా తీసుకున్నాడు కానీ, ఆమె మాటల సరదా కోసం అన్నవి కావన్నమాట....స్థిరమైన నిర్ణయం ఏనాడో తీసుకున్నది.... అన్న సత్యం జీర్ణించుకోవడానికి అతనికి కొన్ని నిమిషాలు పట్టింది.
ఆడవాళ్ళలో వయసు పెరిగే కొద్దీ ప్రతిరోజూ, ప్రతి గంటకూ, మనసు పరిపక్వత పొందుతూ వుంటుంది. అందుకే పదహారేళ్ళ అమ్మాయిలో వుండే పెళ్ళి గురించిన అవగాహన.... ఇరవై ఆరేళ్ళ అబ్బాయిలో ఉండకపోవచ్చు.
ఎన్ని సంవత్సరాలైనా మగవాడు జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే చూస్తాడు కానీ స్త్రీ అలా కాదు.....పుష్పించిన మరు నిమిషం నుంచే ఆమె ఊహా సౌధంలో కొన్ని కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయలు రూపుదిద్దుకుంటాయి. ఆడదెప్పుడూ ఒడిదుడుకులు లేని స్థిరమైన సంసార జీవితాన్నే కోరుకుంటుంది.
అలాంటి ఒక సగటు ఆడపిల్ల కాబట్టే జాజిబాల తన జీవితాన్ని గురించి తనే ఒక నిర్ణయానికి వచ్చేసింది.
"పెళ్ళి అనేసరికి ముఖం అలా పెట్టావేంటి? కొంపదీసి నన్ను పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం నీకు లేదా ఏంటీ?"
"ఛ....ఛ.... అలా ఊరికే ప్రతిదానికీ అపార్ధం చేసుకోక కనీసం మనకు మైనారిటీ అయినా తీరాలి కదా. మన పెద్దల సహకారం లేకపోయినా మనం స్వతంత్రంగా జీవించగల పొజిషన్ అయినా సంపాదించగలగాలి. అప్పటి వరకూ ఆగడం మంచిదేమోనని ఆలోచిస్తున్నాను.
"అలా అయితే చదువు మానేసి ఇప్పుడే నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటాను" అన్నది జాజిబాల.
"బాగానే వుంది. మనం చదివిన ఇంటర్ మీడియట్ చదువులకు ఉద్యోగాలు దొడ్లో కాసిన జామకాయల్లా దొరకవు...."
ఆమెకు విసుగేసింది.
అప్పటికే చాలా రాత్రయింది.
"అవును....అన్నీ ప్రాబ్లమ్స్..... బాగా ఆలోచించు రాంగో..... ఏదో ఒకటి మనం వెంటనే ఆలోచించాలి...." అంటూ లేచి నిలుచున్నదామె.
"మరి.....ఫ్రెంచ్ కిస్...."
"ఇస్తాను కానీ...... నీ నిర్ణయం ఏమిటో రేపు చెప్పిన తరువాత"
కోపంగా వెళ్ళిపోయింది జాజిబాల.
ఆ రాత్రంతా రాంగో ఆలోచనలతోనే గడిపాను తప్ప ఎంత ప్రయత్నించినా నిద్రాదేవి అతని దరి చేరలేకపోయింది.
ఎప్పటికో నిద్ర పట్టిందతనికి....
* * *
మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్!
ప్రపంచంలోని సంస్కృతి అంతా అక్కడ కుప్పపోసినట్టు, రక రకాల భాషలు మాట్టాడే మనుషులతో ఆ రైల్వే స్టేషన్ ఎప్పుడూ సందడిగా వుంటుంది.
ఆరవ నెంబర్ ఫ్లాట్ ఫారమ్ పై ప్రయాణీకుల రద్దీ ఆ సమయంలో ఎక్కువగా వున్నది.
కారణం.....అంతకు ముందే ఆ ఫ్లాట్ ఫారమ్ లో ఆగివున్న ఎక్స్ ప్రెస్ రైలు మరి కొద్దిసేపటిలో బయలుదేరబోతున్నదంటూ ఎనౌన్స్ మెంట్ వినిపించింది.
ఒక నిమిషం తరువాత...
పెద్దగా కూతవేసి ఒక్క జర్క్ తో ముందుకు కదిలింది ఆ ఎక్స్ ప్రెస్!
సరిగ్గా ఆ రైలు వేగాన్ని పుంజుకునే సమయానికి ఒక బోగీలో నుంచి రెండు ఆకారాలు అత్యంత లాఘవంగా ఫ్లాట్ ఫారమ్ మీదకు జంప్ చేశాయి.
ఆ దూకడంలో ఏ మాత్రం బాలెన్స్ తప్పినా ఫ్లాట్ ఫారం మీద జారిపడి తల ముఖం కాస్త నజ్జు నజ్జు అయిపోవడం ఖాయం!
రైలులో నుంచి క్రిందకు దూకిన శాల్తీలను దూరంనుంచి చూడనే చూశారు రైల్వే పోలీసులు.