Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 7


    "మళ్ళీ ఏమయింది?"

    "మర్నాడు సాయంకాలం మీ అన్న మధుమూర్తి వచ్చి శ్రీనివాస్ ను పలకరించాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడి. నవ్వుకున్నారు. శ్రీను ఇంట్లోకి వచ్చాడు.

    "అమ్మా! నేనో చోటికి వెళ్తాను. రాత్రికి వస్తాను. ఒంటరిగా రాను. జంటగా వస్తే నువ్వు క్షమించాలి" అని వెళ్ళిపోయాడు బాబూ! అదే ఆకరు చూపు. నా బిడ్డ నా కంట పడలేదు." ఏడ్చింది మరోసారి. 

    "అన్నయ్యను అడిగావా!"

    "అడిగాను బాబూ! అతను తనకేం తెలియదు అంటున్నాడు. ఊర్లోకి వస్తానంటే స్కూటరెక్కించుకు పోయాను" అంటాడు.

    "శ్రీనివాస్ కనిపించి ఎన్ని రోజులయింది!"

    "వారంపైనే అయిందయ్యా"

    "రిపోర్ట్ చేసావా!"

    "పోలీసులకు వెళ్లి చెప్పాను బాబూ. ఆడపిల్లా తప్పిపోవడానికి అంటున్నారు. ఆ బాలరాజు తండ్రి ఒకటేమాట!" మధమూర్తికే తెలుసు నీ కొడుకు అడ్రసు" అంటూ ఆమె కళ్ళు ఒత్తుకుంటూనే వుంది.

     "ఏడ్వకు పార్వతమ్మా! నేను వెళ్ళి అన్యయ్యను కనుక్కుంటాను"

    "కాలేజీకి వెళ్తే కూడా అత్తారింటికి వెళ్ళే అమ్మాయిలా ఒకటికి నాల్గుసార్లు చెప్పేవాడు. నాకు చెప్పింది వూరు దాటడు. నా కొడుకును విడిచిపెట్టమను బాబూ. ఈ వూరు విడిచే వెళ్ళిపోతాము" అతని చేతులు పట్టుకుంది.

    "అలాగే పార్వతమ్మా! నువ్వు నిశ్చింతగా వుండు." అన్నాడు

    శ్రీనివాస్ ను బంధించారా!

    మధుమూర్తి స్వభావం తెలిసినవారు, అనుమానిస్తారు. అతను ఎన్నికలు జరుగుతుంటే మనుష్యుల్నే దాచేస్తాడు.

    ఆలోచిస్తున్న సిద్దార్ధను పేరు పెట్టి ఎవరో పిలిచారు. అతను తలఎత్తాడు.
   
    కరీమ్ చాచా నిలబడి వున్నాడు.

    "అరే సిద్దూ బేటా.........." 

    "కరీమ్ చాచా! నువ్వేం మారలేదు" అన్నాడు. వడివడిగా వెళ్ళి అతడిని చేరుకున్నాడు.    

 Previous Page Next Page