శిశిర్ కారెక్కుతూంటే అందరితోపాటు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన అపురూప అతడి రెక్క పట్టుకుని అడిగింది "మళ్ళీ ఎప్పుడొస్తావ్?" అడుగుతూంటే ఆ పిల్ల పెద్ద పెద్ద కళ్ళలో నీటి తెర ఛెమక్ మంది.
మళ్ళీ సెలవుల కోసం రోజులు లెక్క పెట్టుకుంటూనే గడిపేశాడు శిశిర్.
తల్లి వీలుకాదంటే మేనమామ వెంట వచ్చేశాడు.
వచ్చాక రెండు మూడు రోజులు సరిగా మాట్లాడలేదు అపురూప చాలా నొచ్చుకున్నాడు శిశిర్
.
"అప్రూప నాతో మాట్లాడ్డం లేదండీ!" అంటూ వాళ్ళ నాయనమ్మతో మొరపెట్టుకున్నాడు.
"ఎందుకే వాడితో మాట్లాడ్డం లేదట?" ఆవిడ అడిగింది.
"రెండు రోజులకోసం వచ్చి పోయేవాళ్ళతో స్నేహాలు బాధ కలిగిస్తాయ్ నానమ్మా" ఆ పిల్ల ముఖం త్రిప్పుకొంటూ అంది.
"పోయినసారి నువ్వు వెళ్ళిపోయాక నాలుగు రోజులు వరకు నేను మనిషిని కాలేకపోయాను తెలుసా? తిక్క పట్టిన దానిలా అయ్యాను. ఎవరితో ఆడుకోవాలనిపించదు. ఎవరితో మాట్లాడాలనిపించదు. అప్పుడే అనుకున్నాను ఎవరితో ఎక్కువగా స్నేహం చేయకూడదని! నాలుగు రోజులకోసం వచ్చిపోయేవాళ్ళతో అస్సలు స్నేహం చేయకూడదు"
"నేను చదివే చదువు ఇక్కడుంటే నేనసలు వెళ్లే వాడినికాదు! లేదుగా! చదూకోకుండా ఇక్కడుండడం కుదరదుగా?"
"పట్నం బాబువి! ఈ పల్లెటూరి పిల్లకోసం ఆగిపోతావని నేనేం అనుకోలేదు! వెళ్ళు!"
"నేను వెళ్ళానేగాని రోజులు లెక్కబెట్టుకొంటూనే గడిపాను తెలుసా? నేను నిన్ను ఒక్కరోజు కూడా మరిచిపోలేదు తెలుసా?"
"ప్లీజ్! అప్రూపా!" అతడి కళ్ళలో నీళ్ళు తిరగబోతున్నాయి.
"నా పేరు అపురూప? అప్రూప కాదు"
"మీ అమ్మగారిని మీ నాన్నగారు 'అర్ణా!' అని పిలుస్తారుగా? చక్కగా ఆవిడ పేరు అరుణ అయితే! అంత పెద్దాయనే పిలువగా నేను పిలుస్తే ఏం?"
"అదంతా నాకు తెలీదు గాని నన్ను అపురూప అనిపిలిస్తేనే పలుకుతాను"
"అలాగే... అలాగే! అయితే మాట్లాడతావన్నట్టే కదా?"
"ఇప్పుడు మాట్లాడేవన్నీ మాటలు కావా?"
"కోపంతో మాట్లాడేవి మాటలెలా అవుతాయి?"
"నీ మీద నాకెందుకు కోపం?"
"ప్లీజ్, అప్రూపా!"
"మళ్ళీ అప్రూపా!?"
"సారీ. అప్రూపా!"
అతడంటున్న తీరుకు ఫక్కున నవ్వింది అపురూప.
ఆట పాటల్తో రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి.
"రేపు మా అమ్మ నాన్న వస్తున్నారు నన్ను తీసికెళ్ళడానికి!" ఓ రోజు ఉత్సాహంగా చెప్పాడు. తల్లిదండ్రులొస్తున్నారన్న సంతోషం కళ్ళలో మెరుస్తూంటే -
అంతే! మాటలు టక్కున బంద్ చేసి మూతి ముడుచుకొంది అపురూప.
మూడు రోజులు, అతడు వెళ్ళిపోయేదాకా సరిగా మాట్లాడలేదు.
ఈసారి అర్ధం చేసుకొన్నాడు శిశిర్. తను వెళ్ళిపోతున్నాడన్న బాధకొద్దీ మాట్లాడ్డం లేదని.
"ఈసారి దసరా సెలవుల్లోనే వచ్చేస్తాగా?" అన్నాడు శిశిర్.
అయినా సరిగ్గా మాట్లాడలేదు అపురూప. అతడిని తప్పించుకు తిరిగింది.
తీరా అతడు అందరితో చెప్పి కారులో వెళ్ళిపోతుంటే పరుగున వచ్చి కిటికీలోంచి అతడి చెయ్యందుకొని అడిగింది "తప్పక వస్తావుగా దసరా సెలవులకి?"