ఓ రోజు సత్యమూర్తి వాళ్ళ యింటికి పోయేసరికి ఓ వృద్దుడు ప్రసాదరావుని దగ్గర కూర్చోబెట్టుకుని బోధిస్తున్నాడు.
"పరిస్థితి చూసి జాలిపడి చెబుతున్నానురా నాయనా ముందు వెనుకలూ ఆలోచించి మరీ మాట్లాడు. నువ్వు నీ చెల్లెలికి దమ్మిడీకూడాకట్నం ఇచ్చే స్థితిలో లేవు. రెండో పెళ్ళయితే మాత్రం? అతనికి నలభయి ఏళ్ళు కూడా దాటలేదు. బోలెడు ఆస్థి. ఈ అవకాశం జారవిడుచుకున్నావంటే ఇలాంటి సంబంధం నీకు చస్తే రాదు. ఏమంటావు?"
"నేను ఉషని రెండో పెళ్ళివాడి కివ్వను మామయ్యా"
"నాకు మాత్రం సంతోషంరా నాయనా? అయితే ఏం చేస్తాం? పెద్దవాడిని కాబట్టి మీ కుటుంబ క్షేమం కోరినవాడ్ని కాబట్టీ అన్ని విధాలా ఆలోచించి చెబుతున్నాను. ఎన్నాళ్ళకూ పెళ్ళి చెయ్యకపోతే దాని జీవితం ఎటూగాకుండా పాడైపోతుంది."
ప్రసాదరావు ఓ క్షణం మౌనంగా ఊరుకుని "సరేలే మామయ్యా! ఆలోచించి చెబుతాలే" అన్నాడు.
ఆ వృద్దుడు లేచి నిలబడి "ఇదంతా మీ హితవుకోసమే, రేపు వస్తాను" అంటూ మెల్లిగా వెళ్ళిపోయాడు.
సత్యమూర్తి దిగాలుపడి కూర్చున్న స్నేహితుడి దగ్గరకు వెళ్ళి "ఏమిటి ప్రసాద్! ఎవరతను?" అని అడిగాడు భుజంమీద చెయ్యివేసి.
అతను తలెత్తి "మాకు దూరపు బంధువు. మా ఉషకు పెళ్ళి సంబంధం తీసుకువచ్చాడు" అన్నాడు.
ఉష లోపలనుండి ఆవేశంగా దూసుకువచ్చింది. కోపంతో, అవమానంతో ఆమె అధరాలు కంపిస్తున్నాయి. "మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చాడన్నయ్యా అతను మనింటికి? నాన్నగారు పోయిన కొత్తలో మనం దిక్కులేక అల్లాడుతూంటే ఇరువైపు తొంగిచూశాడా? నాలుగు దులిపి బయటికి అల్లాడుతూంటే ఇటువైపు తొంగిచూశాడా? నాలుగు దులిపి బయటికి వెళ్ళగొట్టాల్సింది."
"పోన్లే ఉషా, పెద్దవాడు."
"పెద్దవాడు! ఆయన మాట విని నా బాధ్యత ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తున్నావా? అన్నయ్యా! నేను నీకు బరువుగా వున్నానా?
ప్రసాదరావు చలించిపోయి, "అదేమిటి ఉషా అలాఅంటావు. నన్ను నువ్వు అంతే అర్ధంచేసుకున్నావా?" అని అడిగాడు గాద్గాదికంగా.
ఆమె గొంతుకూడా తడబడింది. "క్షమించు అన్నయ్యా! నీ మనసు నాకు తెలుసు. అతనికేమీ బదులు చెప్పకుండా మౌనం ధరించేసరికి భయంవేసింది. నేను చాలా చెడ్డదాన్ని" అంటూ అక్కడ వుండలేక లోపలకు వెళ్ళిపోయింది.
ఒక్కసారి తమ ఉనికి తనకు స్పురించినట్లు, విషాదవాహిని పొంగులెత్తి పారినట్లు ప్రసాదరావు ఉలికిపడి ఎటోచూస్తూ వుండిపోయాడు. నిజం అనేది నిరంతరం వుటుంది. దాని మనుగడ దాటి బయటపడే దారుణక్షణాలే హఠాత్తుగా దాపురిస్తూవుంటాయి.
"అలా పోయివద్దాం పద ప్రసాద్" అని సత్యమూర్తి తేరుకుని మెల్లగా అన్నాడు.
అతను స్నేహితుడ్ని అనుసరించి బయటికి వచ్చి నెమ్మదిగా నడవసాగాడు.
"మూర్తీ" అన్నాడు దారిలో ప్రసాదరావు వొణికె కంఠంతో. "మా ఉష అంటే నాకు పంచప్రాణాలు. అది నా చెల్లెలే కాదు కూతురు ఏమో అలాంటి భావమే కలుగుతూంటుంది దాన్ని చూస్తూంటే....దానికి పెళ్లవటం, అత్తారింటికి వెళ్ళటం, నా వొంటరితనం యిదంతా ఊహించలేకుండా వున్నాను. కాని దానికి ఎప్పుడో పెళ్ళిచెయ్యాలి. నాకు తెలుసు. ఎలాంటివాడు వస్తాడో.... ఎన్ని మలుపులు తిరగాలో..."
ఈ ఆర్ద్రత...సౌమ్యత....సత్యమూర్తి పులకరించి పొయ్యాడు.
"నీకూ ఓ చెల్లెలు వుందా మూర్తీ?"... ... మొట్టమొదటి సారిగా అనుకోని విధంగా అడిగాడు ప్రసాదరావు.
"ఉంది" అన్నాడు అప్రయత్నంగా సత్యమూర్తి.
"పేరు?"
"విజయ"
"మీ విజయ సంపన్నురాలు. నీవంటి అన్న....ఎంత అదృష్టం!"
సత్యమూర్తి నిట్టూర్చాడు. అది ప్రసాదరావు గమనించ లేదు. "అవును" అన్నాడు సత్యమూర్తి వినివినిపించనట్లు.
"మీ ఉషని చదివించకూడదూ?" అన్న అతని ప్రశ్న అతని నోటిదాకా వచ్చింది.
"డబ్బు?" అని అతనంటాడు.
"నేనిస్తాను" అని తన జవాబు.
"అది అంగీకరించడు. చాలా స్వాభిమాని. దాని వ్యక్తిత్వం నీకు తెలీదు మూర్తీ?"
ఇలా ప్రశ్నా-జవాబూ తనే వూహించుకుంటూ నడుస్తున్నాడు.
అలాగే రోజులు...ఆ పరిచయాలతో, వాత్సల్యాలతో, ప్రేమపూరిత వాతావరణంలో, చిక్కని సంఘటనలతో, సున్నితంగా వీచే మృదుసుగంధం లాగా గడువసాగాయి.
అలాగే...అలాగే...అతని చదువు పూర్తయింది. అవర్స్ చివర పరీక్ష రాశాడు.