Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 7

    పిలిచి పిలిచి నోరు నొప్పి పుట్టింది! తలుపుమీద కొట్టి కొట్టి చేతులు నొప్పి పుట్టాయి! "మర్యాదగా తలుపు తీస్తావా లేదా?" సహనం నశించిపోయి అరిచింది.

    "లాభం లేదు, మేడమ్! అందరి ఎదుట పడడానికి ముఖం చెల్లడం లేదేమో!"

    "తలుపులు తెరవకుండా లోపలే సమాధి అవుతుందా?"

    "ఈ కేసు పోలీసుల చేతిలో పడితే సజీవ సమాధి జరుగుతుంది దాని బ్రతుక్కి? వెధవ పనులు చేసినప్పుడు లేని సిగ్గు ఇప్పుడు వచ్చిందా? గోవిందూ! తలుపులు విరగ్గొట్టించు!" వార్డెన్ నిప్పులు తొక్కిన కోతిలా ఉంది!

    గోవిందు వెళ్ళి పని వాళ్ళను తీసుకువచ్చి నిమిషాలమీద తలుపులు తెరిపించాడు!

    తలుపులు తెరవబడుతూనే లోపలికి జొరబడ్డారు అందరూ. మంచం మీద దుప్పటి బిగించి పడుకొని ఉంది గీతా భవాని! మంచం దగ్గరికి విసవిసా నడిచింది వార్డెన్. సర్రున దుప్పటి లాగి పారేసింది. "ఏయ్ గీతా భవాని!" ఆమె నోట్లో అరుపు పూర్తిగా బయటికి రాలేదు! గీతా భవానీ పక్కంతా, చీరంతా రక్తమయం! గీతాభవాని కళ్ళు మూతలు పడి వున్నాయి!

    "మైగాడ్! ఇది చచ్చిందా! బ్రతికిందా?" ముక్కు దగ్గర వేలుంచి చూసింది వార్డెన్. శ్వాస ఆడుతున్నట్టుగా అనిపించి ధైర్యం పుంజుకొంది. "పాపీ చిరాయువు అన్నారు. ఇలాంటి ఘటాలు అంత సుఖంగా పోతాయా?" చీత్కారం చేసింది.

    గీతాభవాని చలువలు కమ్మి మతి తప్పిందని, ఏ క్షణంలోనైనా ఆమెలో ఆ కాస్త ఊపిరి ఆగిపోవచ్చని తెలిసిపోవడానికి ఎంతోసేపు పట్టలేదు. దోషిపట్టుబడిందేగాని, దోషి ఏం సంజాయిషీ ఇస్తుందో నన్న కుతూహలంతో సతమతమౌతున్న అందరికీ, గీతాభవాని మతి తప్పి చాలా దయనీయమైన స్థితిలో పడి ఉండడం - తీరని ఆశాభంగం కలిగించింది.

                  ముందు ఎంత కోపం, అసహ్యం కలిగినా వాతం కమ్మినట్టుగా పడి ఉన్న గీతాభవానిని చూస్తుంటే రంగమ్మకి చాలా జాలేసింది. దుప్పటి నిండా కప్పింది. దుప్పటి క్రిందుగా చేతులు పోనిచ్చి అరిచేతుల్లో రాచ సాగింది వేడి తెప్పించడం కోసం! వెంటనే డాక్టర్ని పిలిపించమని తొందరపెట్టింది.

    "మళ్ళీ ఇదొక తద్దినమా?" వార్డెన్ విసుక్కొంటూ వెళ్ళి డాక్టర్ రత్నప్రభ ఇంటికి ఫోన్ చేసింది.

    అవతల ఫోన్ అందుకొన్న నర్సు రత్నప్రభ ఇంట్లో లేదని రాతి వాళ్ళన్నయ్య రఘురామయ్యగారింటికి వెళ్లిందని చెప్పింది. వార్డెన్ ఫోన్ నంబరు త్రిప్పి రఘురామయ్య ఇంటికి ఫోన్ చేసింది.

    "రత్నప్రభగారున్నారా?"

    "......."

    "వారిని ఫోన్ లోకి రమ్మనండి!"

    రత్నప్రభ ఫోన్ లో పలుకుతూనే, హాస్టల్లో జరిగినా ఉదంతమంతా చెప్పింది వార్డెన్. గీతాభవానికి సీరియస్ గా ఉందని, వెంటనే రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసింది.

    పావుగంటలో ప్రియదర్శిని హాస్టల్ చేరుకొంది రత్నప్రభ. తనతో ఆమె వదిన సువర్చలని కూడా తీసుకువచ్చింది, సోషల్ వర్కర్ వి, ఇలాంటి సమస్యల్లో నీకు పరిష్కారం తేలిగ్గా స్పురిస్తుందని చెప్పి!

    రత్నప్రభ వస్తూనే గీతాభవానిని పరీక్ష చేసి వెంట వెంటనే రెండు ఇంజక్షన్సు చేసింది "బ్లెడ్ చాలా పోయింది. బ్లెడ్ ఎక్కించాలి! మా నర్సింగ్ హోంకి వెంటనే పంపించే ఏర్పాటు చెయ్యి!" వార్డెన్ కి చెప్పి "ఇంతకీ పిల్లెక్కడా?" అనడిగింది.

    "రండి, డాక్టర్! చూద్దురు!" వార్డెన్ దారి తీసింది.

    అందరూ హాస్టల్ వెనక్కి చేరుకొన్నారు.

    పాప ఇప్పుడు ఏడవడం లేదు, తన ఉనికిని ప్రపంచానికి తెలియజేయడం అయిపోయినట్టుగా తన భవిష్యత్తు మనుషుల చేతిలో పెట్టాను కదా అన్నట్టుగా నిశ్చింతగా నిద్రపోతూంది! తల్లి ఒడి ఇవ్వాల్సిన వెచ్చదనాన్ని సూర్యకిరణాలు ఇస్థున్నాయి! లే ఎండలో ఆ పిల్ల ఎర్రమందారంలా ఉంది!

    "ఇంత దట్టంగా ఉన్న ముళ్ళ చెట్లను దాటి అక్కడికి వెళ్ళడం అసాధ్యం! నా కనిపిస్తూంది, ఆ పిల్ల పుడుతూనే ఆ కిటికీలోంచి విసిరేసి ఉండాలి ఆ తల్లి! ఆ పిల్ల ముళ్ళకంచలో పడితే ఆ ముళ్ళు బాకుల్లా ఆ లేత ఒంట్లో గుచ్చుకొని ఎప్పుడో చచ్చిపోయేది! అదృష్టవశాత్తూ ఆ ఇసక తిన్నెమీద పడింది!" సువర్చల తన ఊహాగానాన్ని వినిపించింది.

    కొందరు ఆమె ఊహను బలపరిచారు.

    కొందరు కాదన్నారు.

    అంతెత్తు నుండి పడితే ఆ పిల్ల ప్రాణం పడిన క్షణమే పోయేదన్నారు. తర్జన భర్జనలతో కాలయాపన చేస్తున్నారేగాని, పుడుతూనే మెత్తని పొత్తిళ్ళ మధ్య తల్లి ప్రక్కన వెచ్చగా పడుకోవాల్సిన పాప గరుకు ఇసికే పొత్తిలిగా, సూర్యకిరణాలే తల్లి వెచ్చదనంగా పడి ఉన్నదని ఎవరికీ జాలి కలిగినట్టు లేదు!

    సుందరయ్యకు తప్ప! అతడు ఎక్కడినుండో ఓ గొడ్డలి సంపాదించుకు వచ్చి గబ గబా ముళ్ళచెట్లు నరికివేసి పాప దగ్గరికి వెళ్ళడానికి దారి చేశాడు. వెళ్ళి పాపని రెండు చేతులమీద ఎత్తుకొని ఇవతలికి తీసుకువచ్చాడు.

    కాని, ఆ పాపని అందుకోడానికి ఎవరి చేతులూ ముందుకు రాలేదు! వివాహితకు పుడితే అమృతఫలం; అవివాహితకు పుడితే పాప ఫలంగా భావించే ఈ సమాజం ఆ పాపకి స్వాగతం చెప్పడానికి తయారుగా లేదన్న సంగతి త్వరగానే గ్రహించాడు సుందరయ్య.
   

 Previous Page Next Page