Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 7

    "ఆ మేనీటర్ మూలంగా  ఇప్పటి వరకూ అందిన  రిపోర్టును  బట్టి  ఇరవయి  ఆరుగురు  చనిపోయారు. మొదటి రెండు మరణాల తర్వాత, ప్రమాద హేతువైన  ఆ పెద్దపులిని  మేనీటరుగా నిర్ధారించి అనుభవమున్న  వేటగాళ్ళను ప్రోత్సాహించడం, దాన్ని  మట్టుపెట్టగల  వారికి  పదివేల రూపాయల బహుమతిని  ప్రకటించడమూ జరిగింది. కానీ...."

    "మీరు జరిగింది  చెబుతున్నారు. మేం అడుగుతున్నది  జరగబోయే  కార్యక్రమం గురించి?" దురుసుగా  అడిగాడో విలేఖరి.

    ఆవేశాన్ని  అదుపులోకి  తెచ్చుకుంటూ, "ఐ విల్ డు వాటీజ్ టుబి డన్!" జవాబు చెప్పి  సీటులోంచి  పైకి లేచాడు  చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్.

    అసంపూర్తిగా  చర్చను ముగించబోయిన  అనిల్ కుమార్ ను చూస్తూ ,"అటవీశాఖ లక్ష్యం  వన్యమృగ  సంరక్షణ మాత్రమేకాదు. వన్యమృగాల  బారి నుంచి  మనుషుల్ని  రక్షించడం  కూడా!" ఓ రిపోర్టరు సర్కాస్టిక్ గా బాణం విసిరేసరికి  బిగుసుకున్న  పిడికిళ్ళతో  నిస్సహాయంగా  నిలబడి పోయేడు.

    బాధ్యత గల  పదవిలో  వుంటూ  తొందరపాటుతో  ఒక్కమాట జారినా  దానికి రంగులు  పులిమి  పత్రికాముఖంగా  తన అస్థిత్వాని  కెంత ముప్పు  తెచ్చేదీ  అతనికి  తెలుసు .అందుకే  తమాయించుకున్నాడు.

    ప్రెస్ కాన్ఫరెన్సు  ముగిసిన  మరికొన్ని నిముషాలలో  పి.ఎ. ని పిలిచి ,కన్జర్వేటర్స్ తో   అత్యవసర సమావేశం  ఏర్పాటు  చేసే విషయంపై  మాటాడి  వెంటనే  అందర్నీ  స్టేట్ హెడ్ క్వార్టరుకు  పిలిపించే ఉత్తర్వును జారీ చేశాడు.

    మరుసరి రోజుకల్లా  రాష్ట్రంలోని  వివిధ ప్రాంతాల  కన్జర్వేటర్సు  హైదరాబాద్ చేరుకున్నారు.

    సమావేశం  జరుగుతుండగానే  వైజాక్ డిస్ట్రిక్ట్  కలెక్టరు  నుంచి  ఫోనొచ్చింది.

    అది...."మేనీటర్  ఓ పశువుల  కాపరిని  ఆ ఉదయాన  చంపి మరణాల సంఖ్యని  ఇరవయి ఏడుకు పెంచిం"దని.   

    అసహనంగా అందరివేపు  చూశాడు  చీఫ్ కన్జర్వేటర్....

    "వాట్టుడూ?"

    అక్కడ  సమావేశమయిన  అటవీశాఖ  అధికారు  లందరిలోనూ  ఇదే ప్రశ్న....

    పరిస్థితి  ఇలా  చేయిదాటిపోతుంటే  ప్రభుత్వం  చేతులు  ముడుచుక్కూచోదు....ప్రజా  సంక్షోభాన్ని  ప్రతికలు  బహిర్గతం  చేస్తుంటే  తనకు అపవాదు  మాత్రమేకాదు....అసమర్ధుడన్న  అపకీర్తితో  స్థాన భ్రంశం  కూడా  జరుగుతుంది.

    పదిహేనేళ్ళ  సుదీర్ఘ  కాలంలో ఎవరి  ఆసరాతోనూ  పనిలేకుండా  స్వయంకృషితో  వున్నత స్థానాన్ని  ఆక్రమించిన  అనిల్ కుమార్ అతని సర్వీసులో  తొలిసారి  చాలా విచిత్రమయిన  సంక్లిష్ట స్థితిలో  నలిగిపోతున్నాడు.

    మధ్యాహ్నం  భోజనం  కూడా  చేయలేదు. హోమ్ మినిష్టరు ఫోన్ లో స్వయంగా అతని  ఎగ్జిస్టెన్స్  విషయంలో  హెచ్చరించేసరికి భోజనం  చేయాలనిపించలేదు.

    వెంటనే సమస్యను  ఓ కొలిక్కి  తీసుకురావాలి....ఎలా!

    చాలాసేపు  ఆలోచించాడు....

    హఠాత్తుగా ఏదో స్పురించినట్టయి  ఇంటర్ కామ్ లో పి.ఎ. ని పిలిచి  "గెట్ మి ది పర్సనల్ ఫైల్సాఫ్ ఆల్ డిస్ట్రిక్ట్  ఫారెస్టాఫీసర్స్" అన్నాడు.

    అటవీశాఖ  ఉన్నతాధికారిగా  ఆయన  ఎలాంటి  టెన్షన్ లో వున్నదీ  అర్ధం  చేసుకున్న  పి.ఎ. మరికొన్ని  నిముషాలలో  ఫైల్సన్నింటినీ  అతని  టేబుల్ పై  వుంచాడు.

    "కేన్సిల్ ఆల్ మై అపాయింట్ మెంట్స్" తననెట్టి  పరిస్థితులోనూ  డిస్టర్బ్ చేయవద్దని  హెచ్చరించి సీరియస్ గా ఓ ఫయిల్ అందుకున్నాడు.

    ప్రతి ఫయిలునూ  చాలా కూలంకషంగా  స్టడీ  చేస్తున్నాడతను.

    తల పోటుతో  కళ్ళు  నొప్పి  పుడుతున్నా  సాయంకాలం  నాలుగైదు ఫైలు తర్వాత  ఫైలు చూస్తూనే  ఉన్నాడతను.

    అతడు ఫైల్స్ లో వెదుకుతున్నది ప్రస్తుత  సమస్యకు  ఖచ్చితమయిన  జవాబు  దొరుకుతుందని  కాదు. ఇలాంటి  బృహత్తర కార్యక్రమములో  నెగ్గుకురాగల  వ్యక్తి  కోసం, తన అంచనాకు  దగ్గర  కాగల మనిషి కోసం గాలిస్తున్నాడతను.

    ఓ ఫైలు  చూస్తూ  ఆగిపోయాడు....

    ఫైలులోని  అంశాలను  మళ్ళీ మళ్ళీ పరిశీలించాడు. ఆ ఫైలుకు సంబంధించిన ఆఫీసర్ 'పర్సనల్ అప్రయిజల్' ను అతడి వ్యక్తిత్వం గురించి  ఆ 'రీజన్' కు చెందిన  కన్సర్వేటరు  రాసిన  విషయాలను మరీ మరీ చదివాడు.

    కార్యదీక్ష సునిశిత  బుద్ధితోపాటు  ఆ వ్యక్తిలోని  క్రమశిక్షణ, నిజాయితీలు  మాత్రమే  కాదు ఆయన్ని  ఆకట్టుకున్నది__

    ఎటువంటి  ప్రలోభాలకూ  లొంగకుండా  వెళ్ళిన  ప్రతిచోటా అతడు  సృష్టించిన మేగ్నిఫిషెంట్  రికార్డ్స్.... అంతకుమించి  ఫారెస్టు సర్వీసులో  చేరకముందు  కాలేజి  దశలోనే  నేషనల్  రైఫిల్ షూటింగ్ పోటీలో  ప్రధమస్థానాన్ని  దక్కించుకున్న  అతడి యోగ్యతకు  సంబంధించిన  జెరాక్స్ కాఫీ....

    సాలోచనగా  ఫైల్లోకి  చూస్తూ  కొంతసేపు  వుండిపోయాక  మిష్టర్ అనిల్ కుమార్ ఇక ఆలస్యం చేయలేదు.


                                                                                    4

    నల్లమల ఫారెస్టుదాటి  ఘాట్ రోడ్డుగుండా  వేగంగా  ప్రయాణం  చేస్తోంది  లేలాండ్ లారీ.

    మిట్టమధ్యాహ్నం  కావడంతో  ఎండ తీవ్రంగా  వుంది.

    లారీ డ్రయివరు  పక్కనే  కూచున్న  కలప యజమాని  వేగంగా  పోనిమ్మని మరింత  తొందర పెడుతుంటే  ఒడుపుగా  లారీని  తోలుతున్నాడు  డ్రయివరు. ఎత్తయిన  కొండ  చుట్టూ  నిర్మించబడిన  ఆ ఘాట్ రోడ్డుపై  ఏమాత్రం  అజాగ్రత్తగా లారీ  నడిపినా  కొన్ని వందల అడుగుల  లోతుగల  అగాధంలోకి  జారిపోవడం  ఖాయం. కనీసం  శవం ఆనవలైనా  దొరకని  లోయవేపు  చూస్తుంటే  హెయిర్ పిన్ బెండ్స్ తో నిండిన  ఆ మార్గంలో  ఏ డ్రయివరూ  అతి ప్రమాదకరమైన  తొందరపాటుకి  సిద్ధపడడు.

    ఓ వంద  గజాల  దిగువన  రోడ్డుకి మధ్యగా  ఓ జీప్ ఆగి ఉండటంతో  గుండె  గుభేలుమంది  కలప యజమానికి.

    ఆ జీప్ ఎవరికి  చెందిందీ  సునాయాసంగానే  గ్రహించగలిగాడు. అందుకే  ఆగకుండా  పక్కకు తప్పించి వెళ్ళిపొమ్మని  హెచ్చరించాడు.

    ఇరుకుగా  వున్న రోడ్డు  కావడంతో  రిస్కు  తీసుకోవడానికి  సిద్ధపడలేక  సందిగ్ధంలో  మిగిలిపోయిన లారీ  డ్రయివరు  మిగిలిన  ఖాళీ జాగాలో  హఠాత్తుగా  ప్రత్యక్షమైన  వ్యక్తిని చూసి  గట్టిగా  బ్రేకులు నొక్కాడు.

    కీచుమంటూ  ఆగింది లారీ, జీపుకు కొన్ని  అడుగుల దూరంలో.

    అక్కడ  మధ్యగా నిలబడిన  వ్యక్తి  మరెవరో  కాదు. విధి నిర్వహణలో  ఎటువంటి  పలుకుబడికి  లొంగకుండా  అడవిని  కొల్లగొడుతున్న  దొంగ  వ్యాపారుల  గుండెల్లో  అలజడిని  సృష్టింస్తున్న  'డి.ఎఫ్.ఓ' చైతన్య.

    ఆ సమయంలో  అక్కడ అలా  ప్రత్యక్షమౌతాడని  ఊహించని  కలప  యజమాని  బిక్కచచ్చిపోయాడు చైతన్యను చూడగానే.

    మరో పది నిముషాలు  ప్రయాణంచేసి  వుంటే  రిజర్వ్  ఫారెస్టును   దాటి నందికొట్కూరు  చేరిపోయేవారు.

    అనుకోని  అవాంతరానికి  క్షణంనొచ్చుకున్న  యజమాని ధైర్యాన్ని  కూడగట్టుకొని  పర్మిట్ పేపర్లతోపాటు  చైతన్య ముందుకు వచ్చేడు.

    ఇలాంటి  అక్రమ   రవాణాలో  తల పండిపోయిన  ఆ వ్యక్తి అంతకు పూర్వమే  చైతన్య గురించి  చాలా విన్నాడు.

 Previous Page Next Page