"మనమంతా ఎంతో గౌరవంతో రాజశేఖర్ గారిపట్ల అచంచలమైన విశ్వాసంతో ఎందుకు వుంటామో మీ అందరికీ తెలియనిది కాదు. దారి తప్పిన తమ్ముళ్ళను దారిలో పెట్టి వారి జీవితాలకు ఓ దారి చూపించే నిస్వార్ధపరులు అన్న రాజశేఖర్ గారు. ఎందరో నిర్భాగ్యులకు నేడు పట్టెడన్నం దొరుకుతుందంటే అది వారి చలవే....నేరస్థులైనవారు మానసికంగా కృంగిపోయి తమ జీవితంలో నరకం తప్ప ఇంకేదీలేదనే నిరాశావాదంలో మునిగిపోయి వున్న తరుణంలో ఆ అభిప్రాయం తప్పు అనీ, తాను సాహసించి, తన చేతనందించి వారిని సమాజానికీ ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుతున్న మహాపురుషులు ఆయన. ఇలా వారి గురించి ఎన్నాదయినా చెప్పవచ్చు. అంతటి చరిత్ర కలిగిన మహానుభావుని శిష్యకోటిలో నేనొకడ్ని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. వారు చేసే మహత్కార్యాలకు నేను సహాయపడ గలగడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. చంద్రునిలో నూలుపోగులా, నావంతు సేవ నేను చేస్తున్నాను."
లీగల్ ఎడ్వయిజర్ మురుగన్ సమావేశాన్ని ప్రారంభించి, విందు ఏర్పాట్లు చూడడానికి, రాజశేఖర్ కు చెప్పి స్టేజి దిగి వెళ్ళిపోయాడు. సమాజంలో నేరస్థులుగా ముద్రపడిన మాజీనేరస్తులు ఎందరో సత్ప్రవర్తన అలవరచుకుని, తమ నాయకుడు గొప్పతనాన్ని వేనోళ్ళ పొగిడారు. వేదికమీదవున్న పెద్దమనుషులుకూడా తమకు తోచిన రీతిలో రాజశేఖర్ ను స్తుతించారు.
అనుకున్నదానికంటే సంతృప్తికరంగా, ఆహ్లాదకరంగా ముగిసిపోయింది ఆ అభినందన సభ.
చివరిలో ఆ రోజునే క్రొత్తగా వచ్చిన ముగ్గురు అనాథ బాలుర వివరాలను అడుగుతుండగా జరిగిందొక సంఘటన.
మద్రాసు సెంట్రల్ స్టేషన్ లో రైల్వేలు బోగీలను శుభ్రం చేసే మిషతో చేరుకొని, ఒక పెద్దమనిషి సూట్ కేసుని దొంగిలిస్తూ పట్టుబడ్డారు. ఆ ముగ్గురూ బాలురు. వారిని సంస్కరించే వుద్దేశంతో తీసుకొచ్చాడు మురుగన్.
ధైర్యం చెప్పి, వారి భుజాలను తట్టడానికి, నిలుచున్న వాడల్లా కొంచెం ముందుకు వంగాడు రాజశేఖర్.
"ధన్...." మంటూ ప్రేలింది రివాల్వర్. క్షణంలో వెయ్యోవంతు వేగంతో అతన్ని రాసుకున్నంత దగ్గరగా_తలపైనుంచి దూసుకుపోయింది బుల్లెట్.
ఆ సమయంలో అతను ఏమాత్రం కిందకు వంగకపోయినా, తల కొంచెం పైకిలేపినా అది ఛిన్నాభిన్నమై పోయి వుండేది.
వెనువెంటనే రెండోసారి కూడా రివాల్వర్ ప్రేలిన చప్పుడైతే వినిపించింది కానీ, ఆ బుల్లెట్ ఎటువైపు దూసుకెళ్ళిందో కనిపించలేదు.
అంతవరకూ ఎవరూలేనట్టు కనిపిస్తున్న ఆ ప్రదేశంలో ఉన్నట్టుండి, తమతమ ప్రదేశాల నుండి బయటకు వచ్చారు రాజశేఖర్ కు అనుక్షణమూ కంటికి రెప్పలా రక్షణ వలయాన్ని ఏర్పరచే సెక్యూరిటీ ఫోర్స్!
వెంటనే అనాధ శరణాలయం ముఖద్వారాన్ని మూసివేశారు. లోపలవున్నవారు ఒక్కరూ బయటకు వెళ్ళే ఆవకాశం లేకపోయింది.
రివాల్వర్ ప్రేలిన చప్పుడు వినిపించిన దిశగా అంగుళం అంగుళం వెదకసాగారు సెక్యూరిటీ సిబ్బంది.
అతనిపై జరిగిన హత్యాప్రయత్నాన్ని చూసి ఖంగుతిన్న పెద్ద మనుషులను సమాధానపరిచాడు రాజశేఖర్.
"నాకేం కాలేదు. మీరేమీ ఖంగారుపడకండి....జరగవలసిన కార్యక్రమాలన్నీ యధావిధిగా జరుగుతాయి..."
"కానీ....మీలాంటి మంచి మనిషిమీద..."
"ఎందుకు చేయకూడదు? ప్రతి మనిషికీ ఏదోరూపంలో శత్రువులు వుంటూనే వుంటారు! నా వల్ల బాధితులు కావచ్చు. ఈర్ష్యాసూయల వల్ల కావచ్చు. ద్వేషం వల్ల కావచ్చు. కారణం ఏదయినా హత్యాప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరైనప్పటికీ మావాళ్ళ చేతుల్లోంచి తప్పించుకోలేరు. డైనింగ్ హాలులో విందు లెటజ్ గో టు ద హాల్" అంటూ వేదిక దిగాడు రాజశేఖర్.
అంతా అతన్ని అనుసరించారు.
సెక్యూరిటీ గార్డొకడు తనతో ఏదో చెప్పడానికి వచ్చి సందేహిస్తూ నిలవడం గమనించి తనే అతని దగ్గర కెళ్ళి విషయమేమిటని ప్రశ్నించాడు రాజశేఖర్ గార్డు చెప్పింది విన్నవెంటనే మ్రాన్పడిపోయాడతను.
యధాలాపంగా తల తిప్పిచూసిన అతని కంటికి ఒక కిటికీలో నుంచి_ ప్రక్క గదిలో సెక్యూరిటీ గార్డుల కస్టడీలో వున్న చందన కనిపించింది.
ఆమె చేతిలోని రివాల్వారు ఇంకా అలానేవుంది.
ఆమె దగ్గర వున్న రివాల్వర్ తనదే. తనపై హత్యాప్రయత్నం చేసింది తన భార్యేనని చెప్పడం వల్ల కలిగిన షాక్ నుంచి వెంటనే తేరుకోలేకపోయాడు రాజశేఖర్.
రివాల్వరు ప్రేల్చిన వెంటనే గార్డుల కంట పడిందామె.
ఖచ్చితంగా ఆమే తనని చంపబోయిందనేది నిజం!
ఎందుకు చేసిందాపని...? తనను చంపినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
ఆస్థి మొత్తం చేజిక్కించుకోవచ్చుననే దురాశతో చేసి వుంటుందా? ఏమో....ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది రాజశేఖర్ కు.
ఈ విషయం బయటకు పొక్కితే తన పరువేం కాను? క్షణం ఆలోచించి, వెంటనే నిర్ణయం తీసుకున్నాడతను. అతని సూచనల ప్రకారం చందనను వదిలివేశారు సెక్యూరిటీ గార్డులు.
పార్టీ ముగిసిపోగానే, సరాసరి తన బంగళాకు బయలుదేరాడు రాజశేఖర్.
* * *