ఆవిడ ముఖం కూడా పాలిపోయి ఉంది-
'ఎక్కడికి పెద్దమ్మా!' ఆందోళనగా అడిగింది మాధవి -
పరమేశ్వరి మాధవిని కౌగిలించుకుని ఏడ్చింది -
'శ్యామల పరిస్థితే ఏం బాగుండలేదని ఉత్తరం వచ్చింది-తీసుకు రావటానికి వెళ్తున్నాను-'
మాధవి గుండె గుభిల్లు మంది- పెళ్ళయి ఏడాది నిండలేదు-ఈ అనారోగ్యం ఏమిటో?
బరువు గుండెతోనే పరమేశ్వరిని రైలెక్కించి వచ్చింది- శ్యామల ఆరోగ్యం కాస్త చక్కబడేవరకూ పెళ్ళి ప్రస్తావన వాయిదా వెయ్యమని మధుని బ్రతిమాలింది-మధును కొంత నిరుత్సాహం కలగక పోలేదు-అయినా సహృదయుడు గనుక విషయం అర్ధం చేసుకుని సహనం వహించాడు-
వస్తూనే మాధవిని ఆప్యాయంగా కౌగిలించుకుంది శ్యామల ఇద్దరికీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి - శ్యామలను చూసి భయంతో వణికిపోయింది మాధవి-సన్నగా తీగలా ఉండే శ్యామల విపరీతంగా లావైపోయింది-వళ్ళంతా బాగా నీరు పట్టింది-
'ఇదేవిఁటీ శ్యామలా! ఇంతవరకూ ఎందుకు డాక్టర్ కు చూపించుకో లేదూ? ఈ వళ్ళేమిటి?'
శ్యామల కళ్ళల్లో వెనుకటి వెలుగు లేదు-నీరసంగా నవ్వుతూ 'నా ఖర్మ! బాగా ముదిరే వరకూ రోగమనే తెలీదు- ఇప్పుడిక చూపించుకోవాలి - నువ్వున్నా వుగా! నాకే భయమూ లేదు-' అంది మాధవి భుజం మీద చేతులేస్తూ-
ఆ మర్నాడే శ్యామలను తీసుకుని మాధవి హాస్పిటల్ కెళ్ళింది-
లేడీ డాక్టర్ ముఖం శ్యామలను చూస్తూనే వడిలిపోయింది-
'వెంటనే హాస్పిటల్ లో చేర్పించెయ్యండి-నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను-' అంది-
మాధవి గుండెల్లో రాయిపడింది-పరమేశ్వరి అక్కడే బావురుమని ఏడ్చేసింది-
శ్యామలను హాస్పిటల్ లో చేర్పించారు-పగటి వేళ పరమేశ్వరీ, సాయంత్రం మాధవి భోజనం తీసికెళ్తున్నారు-పది రోజులు గడిచాయి-శ్యామల పరిస్థితి బాగుపడలేదు సరిగదా ముఖం మరింత వుబ్భింది- యధాప్రకారం సాయంత్రం కేరియర్ తెచ్చి శ్యామల దగ్గిర కూర్చుంది మాధవి-
శ్యామల తను అల్లుతోన్న స్వెట్టర్ పక్కకు పెట్టి 'హమ్మయ్య! తెల్లవారిన దగ్గిర్నుండీ నువ్వెప్పుడొస్తావా అనే తహ తహ! నిన్ను చూస్తే కానీ నాకు స్థిమిత పడదు-' అంది-
'నాకూ రావాలనే ఉంటుంది-వెధవ కాలేజి పని ఒకటి తగలబడింది కదా!'
'నీ పనిని తిట్టను-దానివల్లే అందరం బ్రతుకుతున్నాం-'
'మీవల్ల బ్రతికిన దాన్ని -కాస్త మీకు ఉపయోగపడుతున్నాను-'
'మావల్ల ఏం బ్రతికావ్! నీ స్వయం కృషితో పైకొచ్చావు-'
'పోనిస్తూ! కానీ నువ్వీ అల్లికేవిఁటీ? విశ్రాంతి తీసుకోక!...'
శ్యామల కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి - పేలవమైన చిరునవ్వుతో 'ముందు ముందు నా పాపకు ఏం చెయ్యగలనో! ఏం చెయ్యలేనో? ఓపిక ఉన్నంత వరకూ అయినా చెయ్యనియ్యి-ఇక ఒకటే విశ్రాంతి లభిస్తుందేమో!'
మాధవి నిలువునా వణుకుతూ శ్యామల నోరు మూసేసింది-
'వద్దు! వద్దు! శ్యామలక్కయ్యా! ఇలా మాట్లాడకు-నేను సహించలేను- నీకు బాగవుతుంది-తప్పకుండా నయమవుతుంది-'
'బాగయితే మంచిదే! కానీ ఒక్క మాట...'
'చెప్పు...'
'నాకు చాలా భయంగా ఉంది మాధవీ! రాత్రిళ్ళు నా ఆయాసం చూస్తోంటే నేను సవ్యంగా బ్రతికి బయట పడ్తానని తోచదు... ఉండు.... అడ్డురాకు... నన్ను చెప్పనీ! సవ్యంగా జరిగితే సరే! లేక నేను మరణించి నా పాప బ్రతికి వుంటే మాత్రం ఆ పాప బాధ్యత నీదే! మావారి మనసులో ఏముందో నాకు తెలీదు-ఆయనకు ఏ విషయమూ పట్టదు-నా సంగతే చూడు! నా జబ్బు ఇంత ముదిరిపోయే వరకూ నాకు జబ్బు చేసిందని కూడా తెలీదు-! ఆయన మనసులో నాకు స్థానం లేదేమో! అలాంటి వ్యక్తి చేతులో నా పాపను వదలలేను-నా చిట్టి తల్లిని లేత వయసులోనే అనాదరణకు గురి చెయ్యకు - ఎదుటి వ్యక్తుల నిరాదరణ పసిమనసుకు ఎంతటి రంపపుకోతో నీకే తెలుసు - నా పాపకు ఆ గతి కలగ నియ్యకు....మాధవీ!...'
ఉద్రేకంతో ఇన్ని మాటలు మాట్లాడిన శ్యామల ఆయాసంతో రొప్పసాగింది - వళ్ళంతా చెమటలు పట్టిపోయింది - మాధవి గాభరాగా శ్యామల వెన్ను నిముర్తూ 'ఊరుకో! శ్యామ ఊరుకో! నిండుమనిషివి- అనవసరంగా ఆయాసం తెచ్చుకోకు-' అంది-
శ్యామల అంత ఆయాసంలోనూ తన చెయ్యి జాపుతూ,
'మాటియ్యి - నా పాపకు అండగా ఉంటానని మాటియ్యి-' అంది-
మాధవి కన్నీళ్ళతో ఆ చేతిలో చెయ్యి వేసింది-
'నాకు తెలుసు-నువ్వు సుఖంగా ప్రసవించి నీ పాపతో హాయిగా ఉంటావు- ఒకవేళ నా దారుణ దురదృష్టం కొద్దీ, అలా కాకపోతే, నీ పాపకు నేనే తల్లిని-నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకూ నీ పాప తల్లిలేని పిల్ల కాదు-'
శ్యామల సంతృప్తిగా ఊపిరి తీసుకుంది -అంతలో ఆయాసం మరింతయింది - మాధవి గాభరాగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చింది - ఆవిడ శ్యామలను చూసి 'ఈవిడకి ఎవరు ఉద్రేకం తెప్పించారు? ఈ సమయంలో ఉద్రేకాలు పనికిరావు-' అని విసుక్కొంటూ ఏదో ఇంజక్షన్ చేసింది-
చాలా సేపటికి శ్యామలకి కాస్త నెమ్మదించింది-
'చూశావా శ్యామలా! ఎంత అవస్థ కొని తెచ్చుకున్నావో? ఇంకెప్పుడూ ఇలా అనవసరంగా హైరానా పడకు-నే నుండగా నువ్వు దేనికీ బెంగ పెట్టుకోకు-'
'పెట్టుకోను - నా పాపకు నువ్వు తల్లి నవుతానని మాటిచ్చావు-ఇంక నాకే దిగులూ లేదు-బ్రతకాలనికూడా లేదు- బ్రతికి నేను పొందబోయే సుఖాలూ లేవు-'
'ఇలా మాట్లాడితే, నేను పారిపోతాను-ఎందుకింత నిరాశ నీకు?'
'భర్త ప్రేమకు నోచుకోని స్త్రీకి నిరాశ కాక ఏముందీ?' వెక్కివెక్కి ఏడ్చింది శ్యామల -
చిత్తరువులా నిలబడి పోయింది మాధవి-
'నీ భర్తకు నీ మీద...'
ఆపైన మాట్లాడలేక పోయింది-
'అవును- నా భర్తకు నామీద అసలు ప్రేమలేదు - విధిలేక నాతో సంసారం చేసారు- ఆయన ఎవరినో ప్రేమించారు- రాత్రివేళ నిద్రలో 'పొరపాటు జరిగింది-పొరపాటు జరిగింది-' అని కలవరించటం అనేకసార్లు విన్నాను-బయటంతా నవ్వుతూ త్రుళ్ళుతూ ఎంతో చైతన్యం గా ఉంటారు- నా దగ్గిరకి రాగానే ఆయనలో జీవం అంతా నశించినట్లయి పోతుంది- యంత్రంలా మారిపోతారు-ఆయన అనురాగం పొందాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై పోయాయి - నన్నొక వ్యక్తిగానైనా గుర్తించలేని ఆయనకు నేనెలా ఆప్తురాలిని కాగలను? అందుకే నా కసలు బ్రతుకు మీద ఆశలేదు-' మాధవి కళ్ళలోంచి నిప్పులు కురిసాయి-
'ఛీ! ఏం మనుష్యులు? నాలుగువేలు కట్నం తీసుకుని...'
'అదే!... అదే కారణం ఇంతకూ....ఆయన నన్నుకోరి చేసుకోలేదు-నాలుగు వేలు కట్నంగా ఇచ్చి కంఠంలో మాంగల్యాలు కట్టించుకోగలిగాను కాని ఆయన మనసులో స్థానాన్ని పొందలేకపోయాను-ఆయన నిద్రలో కలవరించిన దాన్నే నేను జాగ్రదవస్థలోనూ అంటున్నాను- 'పొరపాటు జరిగిపోయింది...'
ఉసూరుమంది మాధవి-
'నిన్నింత క్షోభ పెట్టినందుకు అతను తగిన ఫలితం అనుభవిస్తాడు-' ఉద్రేకంతో అంది-
'వద్దు! వద్దు! అలా శపించకు - ఆయన నన్ను ప్రేమించకపోయినా, నేను ఆయనను ప్రేమిస్తున్నాను - ఆయన సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నాను-'
భారంగా కళ్ళు మూసుకుంది శ్యామల-
కోపంతో మనసు కుతకుత ఉడుకుతున్నా ఆ పరిస్థితిలో శ్యామలను మాట్లాడించటం ఇష్టం లేక బలవంతాన నిగ్రహించుకుంది మాధవి-
శ్యామలకి నొప్పులు ప్రారంభమయ్యాయి- ఇంట్లో అందరూ లేబర్ రూం దగ్గిరే ఉన్నారు-
ప్రసవ వేదన అనుభవిస్తూనే 'ఆయనకు వైరియ్యి మాధవీ!' అంది శ్యామల-
టెలిగ్రాం అందుకోగానె వచ్చేశాడు రాజారావు- యమయాతన పడుతోన్న శ్యమలా ముఖం రాజారావును చూడగానే వికసించింది- చేతిని జాపింది- కన్నీళ్ళతో ఆ చేతిని అందుకున్నాడు రాజారావు-
'నన్ను క్షమించు శ్యామలా!' అన్నాడు గద్గదికంగా!
'ఇందులో క్షమార్పణల ప్రసక్తి ఏముందీ? మీరు నన్ను ఏనాడూ కష్టపెట్టలేదు-మీ వశంలో లేని మీ మనసుకు మీరెలా బాధ్యులు?'
'పొరపాటు జరిగిపోయింది-
'అవును......పొరపాటు...'
శ్యామల నొప్పులు ఎక్కువయి పోయాయి- డాక్టర్ హెచ్చరికతో రాజారావు బయటికి నడిచాడు - శ్యామల మూలుగులు అంతకంతకూ భయంకరంగా వినిపిస్తున్నాయి - చివరకు సన్నని పసిపాప రోదన ధ్వని వినిపించింది- ఉగ్గ బట్టుకొని బయట కూర్చున్న ఆప్తులందరూ ఒక్కసారి తేలిగ్గా నిట్టూర్చారు - డాక్టర్ బయటకొచ్చింది - ఆతృతగా లేచారు అందరూ-
'సారీ! తల్లి ప్రాణం రక్షించలేక పోయాను-శిశువు క్షేమంగా ఉంది-ఆడపిల్ల...'
* * *
(రెండవభాగం ప్రారంభం రచయిత్రి, శ్రీమతి తురగా జానకీరాణి)