"మీకు నచ్చితేనే - ఎందుకంటె నాకెలాగూ వచ్చే నెలలో పెళ్ళి అవబోతుంది. నేను సంసారం ప్రారంభించే ముందే విమలకు కూడా అయిపోయే అమ్మా, నాన్న లకు ఇంక వేరే బాధ్యత ఉండదు. నేను బయట కెళ్ళిపొతే ఇక్కడ పరిస్థితులేలా ఉంటాయో ఏమో తెలీదు. మీకు వివాహం కాలేదని తెలీగానే - విమల కోసం - మిమ్మల్ని అడిగితే బావుంటుందనిపించింది."
నెమ్మదిగా చెబుతుందామె.
చలపతి మనసంతా ఆమె మీద జాలితో నిండిపోయింది. తను, సావిత్రి పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలుస్తే ఆమె నిరాశపడిపోతుంది. అయినా చెప్పక తప్పదు.
సినిమాలో ఏం జరుగుతుందో ఇద్దరికీ తెలీదు. తన మనసులోని విషయాలన్నీ చెప్పాక అతని జవాబు కోసం ఎదురు చూడసాగిందామె.
* * *
"ఆయామ్ సారీ గీతగారూ! నేను ఇంతకుముందే ఓ అమ్మాయినీ పెళ్ళి చేసుకోవాలన్న అభిప్రాయంలో ఉన్నాను. ఆ అమ్మాయిదీ మావూరే........"
"ఓ......" అంది గీత ఆశ్చర్యంగా ఆమె గొంతులో నిరాశ తెలుస్తూనే ఉంది.
"అయితే ఆయామ్ సారీ! విష్ యూ గుడ్ లక్" అంది చప్పున కోలుకుంటూ.
"థాంక్యూ ......." అన్నాడు చలపతి.
సినిమా అయిపోయేవరకూ ఇంకేమీ మాట్లాడలేదు.
హాల్లోంచి బయటకోస్తుంటే కనిపించింది రాజ్యలక్ష్మి. ఆమెను చూసి తడబడ్డాడు చలపతి. తనిలా గీతతో సినిమాకు రావటం ఆమెకేమయినా అనుమానం కలిగిస్తుందేమో!
"ఏమండోయ్! సినిమాలు బాగా చూస్తారనుకుంటానే?" అందామె ఆగిపోయి.
"అబ్బే అనుకోకుండా వచ్చాను" గీతను పరిచయం చెయ్యాలని గీత వేపు తిరిగాడతను.
"వస్తానండీ! అవతల మా పక్కింటామే వుంది" అంటూ వెళ్లిపోయిందామె.
"ఎవరామె?" అడిగింది గీత.
"మన నర్సరాజు మిసెస్"
"అయ్ సి......"
ఇద్దరూ అటో ఎక్కారు.
"మీ పెళ్ళి వచ్చేనెలలో అవబోతోందా?" అడిగాడు చలపతి.
"అవును! మా రిలేషన్సే అతను."
"కంగ్రాచ్యులేషన్స్ ."
"థాంక్యూ!"
అటో ఇంటి దరిదాపుల కొచ్చాక మళ్ళీ మాట్లాడిందామే" మీరు ఒక్క సహాయం చేస్తారా?"
"చెప్పండి! ఏమిటది?"
"నేను ఇవాళ మాట్లాడిన విషయాలన్నీ పూర్తిగా మర్చిపోండి! మనం ఎప్పటిలాగే ఫ్రెండ్స్! ఓ.కే"
"ఓ.కే"
అటో ఆమె ఇంటి ముందాగింది. ఇద్దరూ దిగాక తనే చార్జీ కట్టేశాడు చలపతి.
"గుడ్ నైట్."
తన ఇంటివేపు వడివడిగా నడిచాడతాను. ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు గీత గురించి. ఎంత ఫ్రాంక్ గా మాట్లాడిందామె! ఎంత బాధ్యత వహిస్తోంది తన కుటుంబం గురించి?
ఆ తరువాత అతని ఆలోచనలు సావిత్రి మీదకు మళ్ళినాయ్. ఏం చేస్తుండి వుంటుంది? తన గురించి ఆలోచిస్తుందా? తనకోసం ఎదురు చూస్తుందా? ఏమో! ఎప్పుడూ ఆమెతో లోతుగా మాట్లాడలేదు.
ఆలోచనలతో ఎప్పుడు నిద్ర పట్టిండీ తెలీనే లేదు.
ఆ తర్వాత నెలరోజులు ఎలా గడిచిపోయినయ్యో అతనికే తెలీదు. పగలంతా ఆఫీసులో పని, రాత్రంతా సావిత్రి గురించిన ఆలోచనలు!
ఇన్ని రోజులూ తన ఉద్యోగం కోసమే ఎడుర్చూశాడు గానీ సావిత్రీతో వివాహం ఓ సమస్యగా తోచలేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే అదీ అంత తేలికకాదేమో అనిపిస్తోంది. ఏదేమయినా ముందోసారి అక్కడి కెళ్ళి ఓ రోజుండి పరిస్థితిలేలా ఉన్నాయో చూసుకురావాలి! ఆ తరువాతే ఏదయినా ఆలోచన.
జీతం తీసుకోగానే శనివారం రాత్రి బస్ కి బయల్దేరాడు. చలపతి ఉదయానికల్లా ఊరు చేరుకుంది బస్! ఇంకా పూర్తిగా తెల్లారలేదప్పటికి. మసక చీకట్లు అలుముకునే ఉన్నాయ్.
చేతిలో చిన్న సంచితో ఇంటివేపు నడవసాగాడు చలపతి. అతనికి తెలుసు! ఈ సమయానికి సావిత్రి వాళ్ళింటి ముందు ముగ్గులు పెడుతూ ఉంటుంది రోజూనూ! ఆమె దగ్గరగా వచ్చి నిలబడ్డ చలపతిని చూసి ఆశ్చర్యంగా నిలబడింది సావిత్రి.
"నువ్వా!" అంది సంతోషంగా.
"అవును! అక్కడ అన్నీ ఏర్పాటయిపోయినయ్! మరి మన సంగతెం చేయాలో చెప్పు!" త్వరత్వరగా మాట్లాడాడు చలపతి.
"ఏమో! నాకేం తెలుసు! నువ్వెలా చెప్పితే అలాగే!"
కొద్దిక్షణాలు ఆలోచనలో పడిపోయాడు చలపతి.
"సరే! ముందు మా మావయ్యతో మాట్లాడనీ -- మధ్యాహ్నం ఓ సారి గడ్డివాము వెనుకకు రాకూడదు?"
"సరే!" అందామె.
చలపతి అక్కడ నుంచి అత్తయ్య ఇంట్లోకి నడిచాడు. అతన్ని చూడగానే ఆశ్చర్యపోయిందామే "ఏమిటంత హటాత్తుగా వచ్చావు?" అంది అనుమానంగా.
"ఊరికినే!" అంటూ సంచిలోని స్వీట్ పాకెట్ తీసి పిల్లలకిచ్చాడు చలపతి.
"ఎలా వుందిరా అక్కడ?" అడిగాడు అతని మావయ్య.
బాగానే ఉంది మావయ్యా! కాపోతే కొంచెం వంటకి కష్టమవుతోంది . అన్నాడు చలపతి.
"నేనూ మీ అత్తయ్యా కూడా అదే అనుకొన్నాం! త్వరగా పెళ్ళి చేసుకోకపోతే భోజనానికి కష్టం అవుతుందని. మీ అత్తయ్య ఏవో సంబంధాలు కూడా చూసింది."
చలపతి ఉలిక్కిపడ్డాడు. సావిత్రి విషయం చెప్పటానికే ఇబ్బందిగా ఉంటే మధ్యలో మరో కొత్త సమస్యా?
"సాయంత్రం ఓ అమ్మాయిని చూసి వద్దాం! మన ప్రక్క ఊరే! పిల్ల టెన్త్ పాసయిందట! ఫోటో చూశాను. ముక్కు మొహం బాగుంది" అంది అత్తయ్య.
అతనేమీ మాట్లాడలేదు. మధ్యాహ్నం వరకూ ఆలోచిస్తూ ఇంట్లో కూర్చున్నాడు.
భోజనం చేశాక నెమ్మదిగా సావిత్రి వాళ్ళ ఇంటివేనుక వేపు గడ్డివాము దగ్గరకు చేరుకున్నాడు. సావిత్రి ఇంకా రాలేదు? సావిత్రి ఏమంటుందో? పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఈ విషయం కదపాలో తనకు తెలీటం లేదు.
సావిత్రి నెమ్మదిగా - వెనక్కు తిరిగి చూసుకుంటూ గడ్డివాము దగ్గర కొచ్చింది.
"ఇలారా" వాము వెనుక నుంచీ పిలిచాడు చలపతి. ఆమె మరోసారి చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని వచ్చింది.
"త్వరగా చెప్పు - మా పిన్ని నిద్రపోలేదు- " అంటు నెమ్మదిగా ఆమెను చూస్తూ కొద్ది క్షణాలు మైమరిచిపోయాడు చలపతి! పెద్ద పెద్ద కళ్ళు, అ కళ్ళల్లో భయం, కంగారు, నుదుటి మీద స్వేదబిందువులు - ఓ వింత అందంతో మెరిసిపోతోందామే.
"ఏయ్! నీకే చెప్పేది! మాట్లాడవేం?" అతని భుజం తడుతూ పిలిచిందామే.