శ్రీనివాసరావు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోసాగాడు. సుధీర్ చెప్పేది నిజమేనా? తను అసంభవాలనుకొన్నవి సంభవాలయే అవకాశం ఉందా. సుధీర్ మాటల్లో తను హేమను వివాహం చేసుకోబోవటంలేదు" అన్న మాటే అతను విన్నాడు. ఆ తరువాత ఇంకేమీ వినిపించడంలేదతనికి. అతని మనసు అతనిని అక్కడినుంచి ఎంతో దూరం మోసుకెళ్ళిపోయింది. తన జీవితంలో ఇంతటి ఆనందం బహుశా ఎపుడూ అనుభవించి ఉండడు.
"అదీగాక అసలు మా ఇద్దరి ఆలోచనల్లోనూ చాలా వ్యత్యాసం వుంది. హేమలాంటి ఆధునిక యువతంటే నాకు నచ్చదు. నువ్వునన్ను ఏ విధంగానయినా ఊహించుకో! కానీ నాకు పురాతన సాంప్రదాయాలంటేనే గౌరవం, ఇష్టమూనూ! ఆడదంటే ఆడదానిలాగానే ఉండాలి. చీర కట్టుకోవాలి. బొట్టు పెట్టుకోవాలి. మగవాడంటే గౌరవమివ్వాలి. పరాయి పురుషుల ఎదుట సిగ్గుపడాలి తొలగిపోవాలి! అంతేగానీ నా పెళ్ళాంకూడా నాలాగానే పాంటూ షర్టూ వేసుకొని, వాచీ పెట్టుకొని" హలో హౌడూయూ డూ" అంటూ కనపడిన వాడినల్లా పలుకరించి చేతులు కలుపుతూ తిరుగుతూ ఉంటే నేను సహించలేదు. అది "స్త్రీ జాతి అభివృద్దికి చిహ్నం" అంటే నే నొప్పుకోను....." తాపీగా మాట్లాడాడు సుధీర్.
"అలా అని నన్నో బూజుపట్టిన భావాల మనిషిగా జమవేయకు. భర్తని భార్య ఎలా గౌరవించాలో భార్యను భర్తకూడా అదే గౌరవంతో చూడాలని కూడా నేనంటాను" కొద్దిక్షణాల తర్వాత తిరిగి అన్నాడతను.
శ్రీనివాసరావ్ చిరునవ్వు నవ్వాడు. అతనికి సుధీర్ మాటల్లోని సారాంశం ఏమిటో ఏమాత్రం తెలీలేదు. అసలతని మనసక్కడలేదు తను హేమను ఎంతగా ప్రేమిస్తుందీ. ఆమెను వివాహం చేసుకోవాలన్న ఆలోచనా అన్నీ చెప్పాలనుందతనికి. కానీ అందుకు తగ్గ అవకాశం లభించడంలేదు.
"నీకో విషయం చెప్పేదా?" నెమ్మదిగా అడిగాడు శ్రీనివాసరావ్. తన మనసుని ఎంత త్వరగా అతనికి తెలియజేద్దామా అని ఉందతనికి.
"ఏమిటది?"అడిగాడు సుధీర్ సిగిరెట్ ముట్టించుకుంటూ.
"నువ్వు అన్యధా భావించనని మాట ఇవ్వాలి".
"బావుంది! అదేమిటో తెలీకుండా ఎలా?" నవ్వుతూ అన్నాడు సుధీర్.
"నీకు హాని కలిగించే విషయమేమీ కాదులే!"
"అలాగయితే ఇంక నేను మరోలా ఎందుకు భావిస్తాను? ఫరవాలేదు చెప్పు ప్రోత్సహిస్తూ అన్నాడు సుధీర్.
"నేను మీ మావయ్య కూతురు హేమను వివాహంచేసుకోవాలను కొంటున్నాను "వేగంగా కొట్టుకొంటున్న గుండెలతో అన్నాడు శ్రీనివాసరావ్. త్రుళ్ళిపడ్డాడు సుధీర్ అతనికి రెండు నిమిషాల వరకూ నోటమాటరాలేదు. "హేమను వివాహం చేసుకొంటావా?" అంటూ రెట్టించి అడిగాడు నమ్మకం కలుగనట్లు.
"అవును! ఆమెకు అంగీకారమయితే!".
"అసలు ఆమెనే చేసుకోవాలని ఎందుకనుకొంటున్నావ్!" అడిగాడు సుధీర్.'
'ఏమో! ప్రమాణ పూర్వకంగా చెబుతున్నాను. ఆమెలో ఏ అంశం నన్నాకర్షించిందో నాకు తెలీదు. కానీ ఆమెను వివాహం చేసుకోకపోతే ఇక అసలు వివాహమే అవసరం అనేంత గాఢంగా ఆమె ప్రేమలోపడిపోయాను....." కల్మషంలేకుండా అన్నాడు శ్రీనివాసరావ్.
"అలావెనుకాముందూ చూడకుండా ప్రేమలోపడిపోతే ప్రమాదం" నవ్వుతూ అన్నాడు సుధీర్.
"ఆ సంగతి పడిపోయాక చెపితే ఏం లాభం?" తనూ నవ్వుతూ అన్నాడు శ్రీనివాసరావ్. "అవును! ఆ మాటా నిజమేలే". "నాకు హేమ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుంది...." అడిగాడు అతను.
"ఏమిటది? ఆమె ఎలాంటిదనా?"
"ఉహు! ఆమె వ్యక్తిగత విషయాలు కాదు నాక్కావలసింది. వివాహం గురించి ఆమెకు గానీ, ఆమె తల్లిదండ్రులకు గానీ ఉన్న అభిప్రాయాలు. ఉదాహరణకి కొంతమందికి తమ కూతురిని కేవలం డాక్టర్ కే ఇచ్చి పెళ్ళి చేయాలనో, లేదా కేవలం ఇంజనీరు కే ఇవ్వాలనో -లేదా మరో ఆఫీసరనో - ఇలా ఎన్నో ఉద్దేశ్యాలుంటాయ్ అలాగే ఆమెకు కూడా తనక్కాబోయే వరుడు ఇలా ఉండాలని ఏమయినా పట్టింపులుండవచ్చు? వాటిగురించి నీకేమయినా తెలుస్తే చెప్పు"
సుధీర్ కొద్దిక్షణాలు ఆలోచనలో పడ్డాడు. "నాకు తెలిసినంతవరకూ వాళ్ళెప్పుడూ అసలామె వివాహంగురించే ఆలోచించలేదు....." అన్నాడు నెమ్మదిగా.
"ఎందుకని?" ఆశ్చర్యంగా అడిగాడు. శ్రీనివాసరావ్.
'మీరెప్పుడొచ్చారీ వూరు?" అడిగిందామె.
"ఇంతకుముందే! బస్ స్టాండ్ దగ్గర్లో వున్న హోటల్లో దిగాను".
"ఏదయినా పనిమీద వచ్చారా?"
"అవును!" వెంటనే అసలు విషయం ప్ర్రారంభించడానికి భయపడ్డాడతను. అతన్నింక వివరాలు అడగడం బావుండదని మౌనం వహించిందామె.
"మీనాన్నగారున్నారా?" అడిగాడతను.
"ఉహు! ఆఫీసు కెళ్ళిపోయారు. ఈమధ్య కొంచెం వర్క్ ఎక్కువగా ఉందని తొమ్మిదిగంటలకే వెళ్ళిపోతున్నారు....." తన తండ్రితో అతనికేం పనా అని ఆలోచిస్తూ అందామె.
"సాయంత్రం ఎన్ని గంటలకు ఇంటికొస్తారు?" అడిగాడతను.
"ఈమధ్య ఆరింటికిగానీ రావటం లేదుమరి"
కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడతను. మరి సాయంత్రం వరకూ వేచివుండడమాలేక ఆఫీసు కెళ్ళి మాట్లాడవచ్చా? హఠాత్తుగా ఆలోచన తట్టిందతనికి. ఆమె వంటరిగానే ఉన్నట్లుంది ఇంట్లో. ముందు ఆమెతోనే మాట్లాడి అన్నీ స్పష్టంగా తెలుసుకొంటే ఎలా వుంటుంది? ఒకవేళ ఆమెక్కూడా ఏమయినా తెలుసుకోవలసిన విషయాలుంటే తననడిగి తెలుసుకోవచ్చు.
"కాఫీ తాగుతారా, టీయా?" అడిగిందామె.
"ఇప్పుడా శ్రమేమీతీసుకోకండి! ఇక్కడికి బయల్దేరేముందే కాఫీ ఫలహారం అయింది!".
'అయినాసరే! అతిధి మర్యాదచేయడం మాధర్మం కదా లేకపోతే రేపు మా బావ దగ్గరకెళ్ళినప్పుడు "మీ మరదలు హోప్ లెస్ గాళ్ అంటూ సర్టిఫికెటిచ్చేస్తారు....." నవ్వుతూ అని లోపలికెళ్ళి అయిదు నిమిషాల్లో రెండు కప్పుల్లో కాఫీతో తిరిగివచ్చింది.
"నేనో ముఖ్యమయిన పనిమీద వచ్చాను...." అన్నాడతను కాఫీ తాగుతూ.
హేమ అతని వంక కుతూహలంగా చూసింది. "ఏమిటది?"
శ్రీనివాసరావుకి చెమటలు పట్టేస్తున్నాయ్. ఆ విషయం ఎలా ప్ర్రారంభించాలో తెలీడంలేదతనికి. "అదే! వివాహం విషయం!" అన్నాడు తడబడుతూ.
"వివాహమా?"
"అవును..."
"ఎవరిది?"
"మీదే! మీకు ఎప్పుడూ వివాహంచేయాలనుకొంటున్నారో ఫాదర్ ని కనుక్కుందామని వచ్చాను...."
హేమసిగ్గు పడింది. కాని అది పైకి కనిపించకుండా ఉండడానికని త్వరత్వరగా మాట్లాడేసింది. "నాకేం అర్ధం కావడంలేదు, నా వివాహ విషయంలో మీకు శ్రద్ద కలిగిందేమిటి?" చిరునవ్వుతో అంది.
శ్రీనివాసరావ్ ధైర్యం తెచ్చుకొన్నాడు. తనింక సబ్జెక్టులోకి వచ్చేయాలి. లేకపోతే లేనిపోని అపోహలు!" మీరు అన్యధా భావించనంటే మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడతాను..."
ఆమెకళ్ళలోకి చూస్తూ అడిగాడతను. ఆమె గుండెలు వేగంగా కొట్టుకొన్నాయ్.
అతను తనతో మాట్లాడదల్చుకొందేమిటి? ఏమిటది?" అంది అతనినుంచి చూపులు మళ్ళించుకొని.
"మనిద్దరికీ పరిచయమయిన రోజు మీకు గుర్తుందికదా! ఆ రోజు నుంచే మిమ్మల్ని వివాహం చేసుకోవాలన్నకోరిక కలిగింది నాకు. అంతగా ఆకర్షింపబడ్డాను మీ అందానికి. కానీ మీరూ సుధీర్ వివాహం చేసుకోబోతున్నారేమోనన్న ఆలోచన కలిగి నా కోరిక వెంటనే అణగదొక్కేశాను. కానీ ఈ మధ్య సుధీర్ ని కలుసుకొన్నప్పుడు మాటల్లో మీరిద్దరూ వివాహం చేసుకోబోవటంలేదని చెప్పాడు. నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యను. వెంటనే అట్టడుగుణ పడివున్న ఆశలు మళ్ళీ పురివిప్పినయ్. సుధీర్ కి సంగతంతా చెప్పాను. అతను ఈ విషయాలన్నీ మీ నాన్నగారితోనే మాట్లాడమని అడ్రస్ ఇచ్చి పంపాడు. ఇదీ సంగతి...." వణుకుతోన్న కంఠంతో అన్నాడతను.
ఆమె తలెత్తి అతనివంకచూడలేకపోతోంది. తనకసలు అతని మీద ఎలాంటి అభిప్రాయమూలేదు. ఆలాంటప్పుడు హఠాత్తుగా అతనువచ్చి "మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను" అంటే ఏం మాట్లాడగలుగుతుంది?
"హేమగారు!" కొద్ది క్షణాల తర్వాత సౌమ్యంగా పిలిచాడతను.
"ఊ!" "మీ అభిప్రాయం ఏమిటి?" ఆత్రుతగా అడిగాడతను.
"ఏమో! ఇంత త్వరగా నేనేంచెప్పగలను?" తలవంచుకొనే అందామె.
"అఫ్ కోర్స్! అదీ నిజమేలెండి. నా ఉద్దేశ్యం ఏమిటంటే నా గురించి మీరు ఏమయినా తెలుసుకోవాలనుకొంటే అడిగెయ్యండి. మొఖమాటపడాల్సిన పనిలేదు" చనువుగా అన్నాడతను.
ఆమె కొద్దిక్షణాలు ఆలోచించింది. అతని గురించి తనకేంకావాలి? ఏం తెలుసుకోవాలి? ఉద్యోగమా? జీతమా? బాధ్యతలా? అవి తనెప్పుడూ పట్టించుకోదు. అవన్నీ తెలుసుకొన్నంత మాత్రాన తనకు ఒరిగేదేమిటి? అసలు తనకో పెళ్ళికొడుకుని వెతకాల్సి వస్తుందని ఎవరనుకొన్నారు?
"అవన్నీ నాన్నగారు మాటాడుతారులెండి" అందామె.
"అఫ్ కోర్స్! నిజమేననుకోండి! ఆల్ రైట్-మరి నేను మీ నాన్నగారి ఆఫీస్ కెళ్ళవచ్చా?" లేచి నిలబడుతూ అన్నాడతను. "వెళ్ళండి! ఫరవాలేదు" అతనితోపాటు బయటివరకూ నడిచింది హేమ. శ్రీనివాసరావ్ ఆఫీసుకి బయల్దేరాడు. సుధీర్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం రామరాజుని వెతికిపట్టుకొనేసరికి అరగంటపట్టింది. ఆ సమయానికి కాంటీన్ లో 'టీ' తాగుతున్నాడతను.