"చిన్నమాట!"
"స్నానం చెయ్యకుండా నేను నిన్ను ముట్టుకోను!"
"ముట్టుకోకుండా ఈ డబ్బు తీసుకో!"
డబ్బుమాట వినగానే మేనమావ గభాలున ముందుకువచ్చాడు. డబ్బుకు మైలలేదు.
బాలూ ఇచ్చిన డబ్బు ఆత్రంగా లెక్కపెట్టుకుని నిర్ఘాంతపోయాడు. రెండువేలు!
"వద్దురా బాలూ! నామీద ఇంత అభిమానం చూపించకు. అందుకు నేను అర్హున్ని కాను."
"నా తల్లిని చివరిరోజులలో ఆదుకున్నావు. అంతకంటే ఏం చెయ్యాలి మావయ్య!"
"ఒరేయ్ బాలూ! నీ ముందు అబద్ద మాడలేకపోతున్నానురా! మీ అమ్మను, నాచెల్లెలిని నేనేం ఆదుకున్నానురా! దానికి పళ్ళూ, పాలూ, టానిక్కులూ ఇచ్చి మంచి వైద్యం చేయిస్తే బ్రతికేదేమో! అవన్నీ నేనెక్కడ తేగలనురా!"
"అయితే అమ్మ పోషణలేక, సరిఅయిన వైద్యంలేక చచ్చిపోయిందంటవా మావయ్యా?"
"అక్షరాలా అంతేరా! చచ్చిన దానిమీద అబద్దాలాడి నీ డబ్బు గుంజుకో లేను. నీ డబ్బు నువ్వే తీసుకో!"
"వద్దులే మావయ్యా! ఉంచుకో! ఆడబ్బు దగ్గరపెట్టుకుని నేను బ్రతకలేను!"
"ఎంత మంచివాడివిరా!"
"ఆ మాట మాత్రం అనకు మావయ్యా!" కసురుతున్నట్లు ఆని చర చర వెళ్ళిపోయాడు బాలూ.
ఎవరైనా తనను 'మంచివాడు' అంటే మాత్రం సహించలేడు సుశీల మళ్ళీ ఆ మాట అనగానే "నీకు తెలియదు. నేను చాలా దుర్మార్గున్ని" అన్నాడు.
"నేను నమ్మను. ఒకవేళ మీరు ఏదైనా కానిపని చేసినా అది పరిస్థితుల ప్రభావంవల్ల కావచ్చు."
విరగబడి నవ్వాడు బాలూ.
"మైడియర్! 'మంచివాడు' అని తేలిగ్గా అనేస్తారు.మంచివాడు కావటం మాటలుకాదు. అందుకు చాలా చాలా శక్తి కావాలి! పరిస్థితులు సవ్యంగా ఉంటే అందరూ మంచివాళ్ళే! ప్రతికూలించినప్పుడే వ్యక్తిత్వాలు పరీక్షకు వచ్చేది- మంచి అంటే ఏమిటో అర్ధంచేసుకుని...మంచిగా బ్రతకాలనుకొని....చివరకు పరీక్షకు నిలబడలేనివాళ్ళే హీనులు; హీనాతిహీనులు!"
తనను తను శపించుకొంటున్నట్లు కసిగా అన్నాడు బాలూ
* * *
"మిస్ నీరజా! మిమ్మల్ని సిస్టర్ ట్రోజా రమ్మంటున్నారు." అటెండర్ వచ్చి చెప్పింది. టీచర్స్ రూంలో కూచుని పిల్లల హోంవర్కులు చూస్తున్న నీరజ ఆశ్చర్యంగా "నన్నా?" అంది.
సిస్టర్ ట్రోజా ఆ కాన్వెంటులో హెడ్ మిస్ట్రెస్ గా ఉన్నారు తగినంత ప్రత్యేకమైన కారణముంటే తప్ప తన గదిలోకి ఎవ్వరినీ పిలిపించుకోదు.
"మిమ్మల్నే! నాకు చెవుడులేదు!" చికాగ్గా అని వెళ్ళిపోయింది అటెండర్.
పిల్లల హోంవర్క్ పుస్తకాలు షెల్ఫ్ లో సర్ది సిస్టర్ ట్రోజా రూంలోకి వెళ్ళింది నీరజ...
సిస్టర్ ట్రోజా నీరజను చూడగానే అనవసరంగా కంగారుపడుతూ "రా! రా! కూర్చో" అంది, అలవాటుకు మించిన ఆదరంతో.
నీరజ వచ్చి కూర్చుంది.
"మిస్ నీరజా! నువ్వు చాలా సిన్సియర్ టీచర్ వి. పిల్లలకు కూడా నువ్వంటే చాలా యిష్టం. పిల్లల మనస్సులో అలాంటి స్థానాన్ని పొందగలిగిన టీచర్లను నేను చాలా గౌరవిస్తాను."
సిస్టర్ ట్రోజా పొగుడుతోంది. కాని ఆవిడ ముఖభంగిమ మాట్లాడుతూన్న ధోరణి ఏదో సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లుగా ఉన్నాయి.ఒక టీచర్ని పనికట్టుకుని పిలిపించి ఇలా పొగడటం కూడా ఆవిడ స్వభావానికి విరుద్దమే? దడదడలాడుతున్న గుండెలతో ఆవిడ చెప్పబోయేదానికోసం ఎదురు చూస్తూ కూచుంది. సిస్టర్ నీరజముఖంలోకి ఒకసారి చూసి చూడలేనిదానిలా ముఖం తిప్పుకుని మళ్ళీ ప్ర్రారంభించింది.
"ఇటీవల మన కాన్వెంట్ పరిసరాలలో పోలీసులు తిరుగుతున్నారు. పోలీసు ఆఫీసర్ మురళి వాళ్ళను నియమించాడని తెలిసింది. మురళిగారితోనే మాట్లాడాను..." ఒక్క నిముషం ఆగి గొంతు సవరించుకుంది సిస్టర్...మురళి పేరు వినగానే నీరజ రక్తం చల్లబడిపోయింది. సిస్టర్ గబగబ చెప్పుకుపోసాగింది.
"నీ గురించి చెప్పారు. నడిబజారులో నిన్ను టాక్సీలో తీసుకుపోగలిగిన ఆ గూండాలు చాలా సమర్దులయి ఉండాలి అన్నారు. అంతకంటే విడ్డూరం నువ్వు వాళ్ళ చేతుల్లోంచి తప్పించుకు రావటం అంటున్నారు. నువ్వు వాళ్ళను కలవటమో...వాళ్ళు నీకోసం రావటమో...జరిగే అవకాశం ఉందనీ....అందుకే నిన్ను కనిపెట్టి ఉంటున్నామనీ అన్నారు. మన కాన్వెంట్ సంగతి నీకూ తెలుసు. గూండాలు, పోలీసులు......ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ పనికిరావు..."
ఆ కాన్వెంట్ లో చదువుకునేవాళ్ళంతా చాలా పెద్దింటి పిల్లలు. చదువు చాలా బాగుంటుంది. క్రమశిక్షణా ఉంటుంది. కానీ ధనిక వర్గాలవారు మాత్రమే భరించగలరు. ఆ కాన్వెంట్ లో ఒక పక్క ఇలా ధనికవర్గాల దగ్గరనుండి డబ్బు వసూలు చేస్తారు. మరొకవంక అనాధలను ఆదుకుంటారు.
"నీకు జరిగినట్లే ఇక్కడి పిల్లల కెవరికైనా జరిగితే కాన్వెంట్ కి ఎంత అప్రతిష్టో ఆలోచించు..."
నీరజ ఏమని సమాధానం చెప్పగలదు.
తను అనదలచుకొన్న ఆఖరి వాక్యం అనేసింది సిస్టర్. "నువ్వెక్కడైనా ఉద్యోగ ప్రయత్నం చెయ్యి. నేను మంచి టెస్టి మోనియల్ ఇస్తాను. ఉద్యోగం దొరికేవరకూ నీకు ఇబ్బంది లేకుండా ఒక నెల జీతం కూడా ఇస్తున్నాను." అతి తియ్యని ఈ మాటల సారాంశం 'నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాము.' అని.
అటెండర్ సిస్టర్ దగ్గిరకు వచ్చి 'అయ్యగారు వచ్చారు.' అంది.
సిస్టర్ ముఖం చిట్లించి "ఏ అయ్యగారు?" అంది.
"మన కాన్వెంట్ కు బాగా విరాళాలు ఇస్తారే, ఆయన..."
సిస్టర్ ముఖం వికసించింది.
"రమ్మను."
దర్జాగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు బాలూ. కూర్చున్న నీరహ గభాలున నిలబడింది. నడుస్తూన్న బాలూ లిప్తమాత్రం ఆగిపోయి అంతలో నిర్లక్ష్యంగా తలతిప్పుకుని సిస్టర్ చూపించిన కుర్చీలో కూర్చున్నాడు ఆలస్యం చెయ్యకుండా తన జేబులోంచి డబ్బుతీసి సిస్టర్ ముందుంచి, "వెళ్తాను," అని లేచాడు.
"ఒక్క క్షణం కూచోండి! మీరు వచ్చినప్పుడు నాదగ్గిర మరెవరూ ఉండకూడదన్నారు. గుప్తదానమంటేనే మీ కిష్టమని అన్నారు. కానీ, ఇవాళ మీరు ఆ అమ్మాయికి ఏమైనా సహాయం చెయ్యగలరేమో కనుక్కుందామని ఇక్కడే కూచోనిచ్చాను..."
బాలూ ఆశ్చర్యంగా "ఎలాంటి సహాయం?" అన్నాడు.
ఈ మధ్య ఈ అమ్మాయిని గూండాలు ఎత్తుకుపోయిన సంగతి మీరు పేపర్లో చూసే ఉంటారు. ఆ గొడవలతో ఈవిడని ఉద్యోగంలోంచి తీసెయ్యవలసి వచ్చింది. మీరు మరొక ఉద్యోగం చూసిపెట్టగలరా? చాలా మంచిమనిషి. విధి లేక తీసేస్తున్నాను. కాని, చాలా బాధపడుతున్నాను."
నీరజ రెప్ప ఆర్పకుండా బాలూనే చూస్తూ కూచుంది. బాలూ ముఖం తిప్పుకుని "ప్రయత్నిస్తాను." అని చటుక్కున లేచి వెళ్ళిపోయాడు.
సిస్టర్ ఆనందంతో "నీరజా! ఇతడు నీకు సహాయం చేస్తాడు. చాలా మంచివాడు. మీరు మంచివారు అంటే ఇతనికి చాలా కోపం వస్తుంది. అంత మంచివాడు!" అంది.
నీరజ పకాలున నవ్వింది. సిస్టర్ తెల్లబోతూ "ఎందుకు నవ్వుతున్నావు?" అంది.
"ఏం లేదు. వస్తాను మేడమ్! ఇవాళే నా రాజీనామా ఇచ్చేస్తాను."
"అయామ్ సారీ నీరజా! కానీ ఆయన నీకు మరొక మంచి ఉద్యోగం చూస్తారు. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్!"
"థాంక్యూ మేడమ్!"
చేతులు జోడించింది.
సాధారణంగా ప్రభు నీరజ ఇంటికి రాడు. నీరజే ప్రభు దగ్గరకు వెళ్ళేది. లక్ష్మీదేవి దగ్గర ఉన్న చనువుతో ప్రభు ఉన్నప్పుడూ లేనప్పుడూ కూడా వెళ్ళి అక్కడే ఉండిపోయేది. కానీ ఇటీవల లక్ష్మీదేవి పూర్తిగా మారిపోయింది. నీరజ వెళ్తే పలకరించనుకూడా పలకరించకుండా లోపలకు వెళ్ళిపోసాగింది. తల్లికి భయపడి యశోధరకూడా స్నేహంగా ఉండలేకపోతోంది....ప్రభు ఇంట్లో ఉంటే నీరజ దగ్గిరకువచ్చి కూచునేవాడు. కానీ ఆ సమయంలో లక్ష్మీదేవి కళ్ళలో కనిపించే వ్యధకూ, తిరస్కారానికీ, నీరజ తట్టుకోలేకపోయేది. కాని ప్రభుకోసం ఆరాటం మానుకోలేకపోయింది. ఏరోజు కారోజు ప్రభు తనదగ్గరకు వస్తాడని ఎదురుచూస్తూనే ఉంది. వస్తాడు! ప్రభు తప్పకుండా తన కోసం వస్తాడు. ఎవరికోసమూ ప్రభువు తను వదులుకోలేదు. అంత స్వార్ధ త్యాగం తనలో లేదు.
ఆరోజు ప్రభువు చూడగానే నీరజ ఆనందం పట్టలేకపోయింది.
"పద, ఎక్కడైనా బయటికిపోయి మాట్లాడుకుందాం!" అంది.
అక్కడే ఉన్న వర్ధని సహించలేకపోయింది.