"బాలూ! నువ్వు లంచం తీసుకున్నావా? అడగలేక అడగలేక అడిగింది తల్లి...ఎంత శాంతంగా అడిగినా ఆవిడ కంఠధ్వనిలో బాధ స్పష్టంగా వినిపిస్తోంది.
"లేదమ్మా లేదు! నేను ఎప్పుడూ ఏ అన్యాయమూ చెయ్యలేదు..."
అంతవరకూ పరిస్థితులను ఎంతో స్థైర్యంగా ఎదుర్కొన్న బాలూ కన్నీళ్ళతో దీనంగా అన్నాడు.
కదిలిపోయింది తల్లి...
"ఫరవాలేదులే బాబూ! నువ్వు నిజాయితీగా ఉన్నావు. అంతే చాలు! మరొక ఉద్యోగం దొరుకుతుందిలే" అంది. కానీ అది అంత తేలిక కాదని బాలూ అనుభావంతో తెలుసుకున్నాడు. చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకున్నాడు, అదీ బ్లాక్ మార్క్ తో మరొక ఉద్యోగం ఎవరిస్తారు?
అతను దారిలో వెళ్తోంటే "అదిగో, అతని గురించే మొన్న పేపర్లో పడింది. లంచాలు తీసుకోవటం వల్ల ఉద్యోగం పోయిందిట!" అని స్పష్టంగా బాలూకి వినిపించేలాగ చెప్పుకునేవారు.
"మంచి పని జరిగింది. ఇలా పదిమందికి జరిగితేకాని దేశంలో లంచగొండితనం పోదు," అని సంతోషిస్తూ నీతినిజాయితీల పట్ల తమకు గల అభిమానాన్ని ప్రకటించుకునేవారు.
మూడు నెలలు గడిచిపోయాయి. ఉద్యోగం దొరకలేదని బాధ...సమాజంలో వెలివేసినట్లు చూడబడుతున్నానని బాధ....ఆర్ధికమైన ఇబ్బందులకు తట్టుకోలేక బాధ. అన్ని బాధలనూ మించిన బాధ...తన తల్లి కళ్ళలో దైన్యం చూడలేని బాధ...
తట్టుకోలేకపోయాడు బాలూ...తిన్నగా రమణ్ లాల్ దగ్గరకు వెళ్ళాడు. బాలూను చూసి ఆశ్చర్యపోయాడు రమణ్ లాల్
"ఇదేమిటి? నా దగ్గరకు ఎందుకు వచ్చారు?"
"మీ మూలంగానే నా ఉద్యోగం పోయింది. ఇప్పుడు నాకు మీరే ఉద్యోగం ఇప్పించాలి?"
"అప్పుడు మీరు నామాట వినలేదు. ఇప్పుడు నేను మీకు ఎందుకు సహాయం చేస్తాను?"
"మీరు సహాయం చెయ్యగలరు, చేస్తే ఈసారి మీమాట కాదనను ఎలాంటి దైనా సరే! ఏ సందర్భంగా అయినా సరే!"
రమణిలాల్ కళ్ళు మెరిసాయి...
"సరిగా ఆలోచించుకుని అంటున్నాణు. నేను ఇంతవరకూ అబద్దాలాడలేదు..."
"ఇంకముందు నేను అబద్దాలే ఆడమంటే?"
"ఆడతాను!"
"గుడ్! మీకు నేను ఉద్యోగం ఇయ్యగలను. జీతం కూడా చాలా ఉంటుంది. మీరు ఆశించినదానికంటే....మీ డిగ్రీతో సంపాదించ గలిగిన దానికంటే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది..."
"థాంక్స్!..."
"ఆగండి ఈ ఉద్యోగంలో మీరు ఒకచోట స్థిరంగా ఉండరు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి తిరుగుతూ ఉండాలి."
బాలూ ఒక్క క్షణం సమాధానం చెప్పలేకపోయాడు.
"ఏం? ఇష్టంలేదా?"
"ఇష్టమే!"
"ఊళ్ళవెంట తిరిగేటప్పుడు మీరు ఒంటరిగానే ఉండాలి. మీకు అప్పుడప్పుడు ఆఫ్ వస్తూ ఉంటుంది, అప్పుడు మాత్రమే కుటుంబాలతో ఉండవచ్చు..."
తను ఒక్కరోజు కనపడకపోయినా తల్లడిల్లిపోయే తల్లి ముఖం కళ్ళముందు మెదిలింది బాలూకి...
"ఏం? ఈ ఉద్యోగం వద్దా?"
"కావాలి?"
"మరొక మాట? మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో ఆ చిరునామాలన్నీ మీ ఇంట్లోవాళ్ళకి తెలియకూడదు ...ఏదో ఒక హోటల్ అడ్రస్ ఇస్తాము. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆ అడ్రస్ కే జరగాలి..."
"అలాగే?"
"ఎక్కడ ఏ కొంచెం హెచ్చుతగ్గు వచ్చినా మీకే ప్రమాదం?"
"ఆ భయం అక్కర్లేదు. మరోసారి ఎలాంటి ప్రమాదంలోనూ చిక్కుకోను!"
రమణ్ లాల్ పకపక నవ్వాడు.
బాలూ తల్లికి బాలూ ఉద్యోగం ఏ విధంగాను సంతోషాన్ని కలిగించలేదు.
"నిన్ను విడిచి నేను ఉండలేను బాలూ!" అంది కన్నీళ్ళతో.
"తరచు సెలవులు వస్తూ ఉంటాయమ్మా! అప్పుడు మనం కలిసే ఉండవచ్చును..."
"ఏమో!" కృంగిపోతూ అంది...
అంతకంటే కృంగిపోతున్నాడు బాలూ...
"అమ్మా! నువ్వు గట్టిగా వద్దు అంటే నేను వెళ్ళను. ఈ ఉద్యోగం కూడా వదులుకోమని అనకు..."
"వద్దు! వద్దు! ఇది వదులుకోకు! వెంటనే చేరిపో! నువ్వన్నట్లు సెలవులు ఇవ్వగానే కలుసుకోవచ్చును..."
ఆలోచనల కన్నింటికీ స్వస్థిచెప్పి రమణ్ లాల్ దగ్గిరకు వచ్చేసాడు బాలూ...
రమణ్ లాల్ కు స్మగ్లింగ్ వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఆ గేంగ్ లో బాలూని కూడా చేర్చుకున్నాడు. విషయం అర్ధమయ్యాక కూడా బాలూ పెద్దగా బాధపడలేదు. మంచికీ చెడ్డకీ అతనికి భేదం లేకుండా పోయింది. తను చాలా డబ్బు సంపాదిస్తాడు. తన తల్లిని చివరిరోజులోనయినా సుఖపెడ్తాడు. అది చాలు...
తన చేతికి డబ్బురాగానే తల్లికి మనియార్డర్ చేసాడు...ఇంచుమించు నెలరోజుల తర్వాత ఆ మనియార్డర్ బాలూకే తిరిగివచ్చింది....నిర్ఘాంతపోయాడు బాలూ. ఏమయిపోయింది తన తల్లి? ఇంటికి వెళ్ళాడు. తను వెళ్ళగానే తల్లికి జబ్బుచేసిందనీ మేనమావ తీసికెళ్ళాడనీ తెలిసింది. హోటల్ వాళ్ళకి మేనమావ అడ్రస్ తెలీదు. తెలుసుకోవలసిన అవసరం వాళ్ళకు లేదు. అందుకే డబ్బు తిరిగి వచ్చింది.
మేనమావ దగ్గరకు వెళ్ళాడు. బాలూను చూస్తూనే మండిపడ్డాడు మేనమావ...
"ఆహా! ఏం సుపుత్రుడివిరా నాయనా! ఎంత తీరిగ్గా వచ్చావు?" అన్నాడు.
"అమ్మ ఏది?"
"ఇంకెక్కడి అమ్మ? తల్లి చావుబ్రతుకులలో ఉంటే పత్తా తెలియకుండా పోయావు. ఏం ఉద్యోగంరా, బోడి ఉద్యోగం. మీ అమ్మ నిన్ను కలవరించి కలవరించి ప్రాణాలు వదిలింది. చివరికి కర్మలు కూడా నేనే చెయ్యవలసి వచ్చింది..."
'అమ్మ చచ్చిపోయింది...' బాలూ మనసు హోరుమంటుంది. అతనికి కన్నీళ్ళు రావటంలేదు. అలా కూర్చున్నాడు. మేనమావా కంగారుపడి కుదుపుతూ "బాలూ!" అన్నాడు.
"అమ్మ ఎలా పోయింది?"
"దరిద్రులంతా ఎలా పోతారో అలాగే! రెండుమూడు నెలలుగా నీకు ఉద్యోగం లేదటగా! ఉన్నదేదో నీకు పెట్టి తను ఉపవాసాలు చేసిఉంటుంది. బాగా నీరసించింది. గుండెనొప్పి వచ్చింది. దానికి తోడు నీకోసం మనోవ్యధ..."
బాలూ కూచున్నచోటినుంచి లేచి బయలుదేరాడు.
"ఎక్కడికిరా?" అన్నాడు మేనమావ.
వెనక్కు తిరిగకుండానే "శ్మశానానికి!" అన్నాడు బాలూ.
మేనమావ విసుక్కుని ఊరుకున్నాడు. బాలూ శ్మశానంలో తన తల్లి తగలబడిన చోటు చూశాడు. అక్కడి మంటలను చూస్తూ అక్కడే కూర్చుండిపోయాడు.
మరునాడు పీక్కుపోయిన ముఖంతో ఇంటికివచ్చిన బాలూనుచూసి "స్నానం చేసి భోజనానికి రా!" అన్నాడు మేనమావ ముఖం చిట్లిస్తూ.
"నేను వెళ్ళిపోతున్నాను."
"వెళ్ళు!"