Previous Page Next Page 
నీరజ పేజి 9

                                 

                                       


    "సిగ్గులేకపోతే సరి? ఈ దశలో షికార్లుకూడానా? దమ్ముంటే పెళ్ళిచేసుకుని, ఆ తరువాత వెళ్ళండి షికారుకి..." అంది కోపంగా...
    ప్రభు ముఖం ముడుచుకుని అక్కడి చాపమీద కూర్చున్నాడు.
    "పోనీలే ఇక్కడే మాట్లాడుకుందాం!" అన్నాడు.
    'నేను నీరజను పెళ్ళి చేసుకుంటాను. మేం ఇక్కడే బయటికి వెళ్తాము' అని ప్రభు అంటే బాగుండునని నీరజ ఎంతగానో అనుకుంది. కానీ ప్రభు అలా చాపమీద కూచునేసరికి తనూ ఒక వారకి కూచుంది. వర్ధని కదలకుండా అక్కడే ఉంది. నీరజను వర్ధనిని లక్ష్యపెట్ట దలచుకోలేదు.
    "ఇన్నాళ్ళు కనపడలేదు!" అంది.
    "అవును నాకు ఎన్నో రోజులు గడిచిపోయినట్లుగా ఉంది. ప్రతి క్షణం నిన్ను తలుచుకుంటూనే ఉన్నాను. యశు పెళ్ళి నిశ్చయమయిపోయింది. ఎల్లుండి నిశ్చయ తాంబూలాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆ హడావిడిలో రాలేకపోయాను"
    క్షమించమని ప్రాధేయపడుతున్నట్లుగా ఉన్న ప్రభు ధోరణికి నీరజ మనసు చల్లబడింది. కళ్ళతోనే నవ్వింది.
    "ఫంక్షన్ గొప్పగా చేయాలని అనుకుంటోంది అమ్మ. చాలా మందిని పిలుస్తోంది!"
    నీరజ భయపడింది. ఈ పరిస్థితిలో అందరిముందుకూ తను వెళ్ళగలదా? రానంటే ప్రభు ఊరుకుంటాడా? అతనికి ఎలా నచ్చచెప్పాలి?
    ప్రభు కొంచెంసేపాగి అన్నాడు:
    "యశుకు కాబోయే భర్త డాక్టర్! అతనికి చాలామంది స్నేహితులున్నారు. వాళ్ళంతా గొప్పవాళ్ళు....బాగా పలుకుబడి ఉన్నవారు....అందరి మధ్యా నువ్వు...అదే...నీకు ఇబ్బంది అవుతుందేమో! ఏమీ అనుకోకు! నిన్ను మరోసారి వాళ్ళిద్దరూ ఉండగా పిలిచి ప్రత్యేకంగా పార్టీ ఇస్తాను. సరేనా..."
    ప్రభు తనను రావద్దని అంటున్నాడు! నీరజ మనసు మొద్దుబారిపోయింది. నీరజ ముఖం చూస్తూ తడబడ్డాడు ప్రభు-
    "నీరజా! నువ్వు రా! అందుకు కాదు-నేను....నీకోసమే..."
    "ఫరవాలేదు ప్రభూ! నేను రానులే!"
    శాంతంగా అంది నీరజ.
    ప్రభుకు ఇంక మాటలు దొరకలేదు...." మళ్ళీ వస్తాను" అని వెళ్ళిపోయాడు.
    'వాళ్ళంతా గొప్పవాళ్ళు.....పలుకుబడి ఉన్నవాళ్ళు.....వాళ్ళ మధ్యకు నువు రావద్దు...'
    ఈ మాటలు హోరుమంటున్నాయి నీరజ మనసులో...
    నీరజ మనసులో ఘోషను మించి విరగబడి నవ్వింది వర్ధని.
    "ఆహా! ఏం ప్రేమ! ఏం అనురాగం! నలుగురిలో తనకు తెలిసిన మనిషి అని చెప్పుకోలేకపోతున్నాడు? ఇక పెళ్ళి చేసుకుంటాడు! నమ్మవలసిందే?" ఎంత ఆనందం, ఆ వికటాట్టహాసంలో-
    
                                          *    *    *
    
    కరెంట్ పోయింది. వీధిలో విధ్యుద్దీపాలు కూడా ఆరిపోయాయి. రాత్రి పదిగంటల సమయంలో ఒంటరిగా నిలబడిన నీరజకు భయంవేసింది.
    "నీరజా! అన్న చిరపరిచితమైన పిలుపు వినిపించింది. ఆ పిలుపు -- నీరజ మనసులో పేరుకునే దుఃఖాలన్నిటినీ క్షణాలలో కరిగించగలిగిన ఆ పిలుపు నీరజ మనసులో భయాన్ని ఎగరగొట్టి మరేదో లోకాలలోకి తీసుకుపోయింది.
    ప్రభు నీరజ పక్కన నించుని నీరజచేతిని పట్టుకుని "నీరజా?" అన్నాడు మళ్ళీ...
    "ఇంత చీకట్లో నన్ను ఎలా గుర్తుపట్టగలిగావు?"
    "దాదాపు రెండుగంటలనుంచీ నీకోసం రోడ్డుమీద కాచుకుని ఉన్నాను- -"
    "ఎందుకూ?"
    "అది తెలియకనే! నన్ను ఎందుకిలా తప్పుకు తిరుగుతున్నావో చెప్పు!"
    "నీకు అడ్డు రాకూడదనుకున్నాను!"
    "పచ్చి అబద్దం. అనుక్షణం నా ఊహలకు చివరికి నా ఊపిరికి అడ్డుపడుతూనే ఉన్నావు."
    నీరజ నవ్వింది.
    "ముందు ఇది చెప్పు! నేను క్లబ్ లో రిసెప్షనిస్ట్ గా జాయినయ్యాను- తెలుసా?"
    "తెలియకుండా ఇక్కడెలా కాచుకుని ఉంటాను?"
    "ప్రభూ! అలాంటి ఉద్యోగాలలో పరువుగల ఆడవాళ్ళు ఎవరూ చేరరు!"
    "నువ్వు చేరావుగా! ఇంక ఆ మాట అనటానికి వీల్లేదు!"
    "నేను చేరింది..."
    "నీరజా! ప్లీజ్! ఇక్కడ కాదు! ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం!"
    "ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తాం?"
    "నా ఫ్రెండ్ కొక ఇల్లు ఉంది. అక్కడ ప్రస్తుతం ఎవరూ లేరు-అక్కడికి
    నీరజ కాదనలేకపోయింది.
    ఇంట్లో అడుగు పెట్టగానే విధ్యుద్దీపాల కాంతిలో నీరజను చూసి "నువ్వు చాలా మారిపోయావు!" అన్నాడు ప్రభు-క్లబ్ లో ఉద్యోగానికి అత్యంత అధునాతనంగా అలంకరించుకుంది నీరజ...
    "అవును మారిపోయాను-అలంకరణలో మాత్రమే కాదు- అంతరంగంలో కూడా...."
    "ఎన్ని మారినా ఒక్కటి మాత్రం మారలేదు-మారదు-నువ్వు నా దానివి నీరజా!..."
    ప్రభు నోట ఇలాంటి మాటలు విన్నప్పుడు ఇదివరకు పరవశించిపోయేది నీరజ ఇప్పుడు అలా ఆనందించలేకపోయింది. వెటకారంగా నవ్వింది.
    "ఏమో ప్రభూ! ఆ నమ్మకం నాలో నిలవటం లేదు- అదే ఉంటే నేను ఈ క్లర్క్ ఉద్యోగానికి కక్కుర్తి పడేదానిని కాను!"
    "తొందర పడ్డావు నీరజా! ఉద్యోగంలో చేరకుండా ఉండవలసింది!"
    "తొందర పడ్డానా! లేదు ప్రభూ! బాగా ఆలోచించుకునే చేరాను! ఎందుకో తెలుసా?...గొప్పవాళ్ళతో ... పలుకుబడిగలవాళ్ళతో ... కలిసి తిరగవచ్చు నని..."
    నీరజ దెప్పిపొడుపు అర్ధమయింది ప్రభుకు-కానీ తను ఎలాంటి పరిస్థితుల్లో అలా మాట్లాడవలసి వచ్చిందో-అది నీరజకు అర్ధమయ్యేలా ఎలా చెప్పాలో మాత్రం అర్ధంకాలేదు.
    ఆహ్వాన పత్రికలమీద పేర్లు రాస్తున్న ప్రభు "అమ్మా! నీరజకు కూడా ఇన్విటేషన్ పోస్ట్ చేస్తే బాగుండదు? నేనే స్వయంగా పిలుస్తాను" అన్నాడు.
    "నీకు మతిపోయిందా?" ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మీదేవి-ప్రభుకు నిజంగా మతిపోయినట్లే అయింది.
    "ఏం?"
    "ఫంక్షన్ కు నీరజణు రమ్మంటావా?"
    "నీరజ రాకుండా మనింట్లో వేడుక ఏమిటమ్మా!"
    లక్ష్మీదేవి మాట్లాడలేదు-ప్రభు కోపంగా తన చేతిలో ఇన్విటేషన్ కార్డ్స్ కింద పడేసాడు.
    "ప్రభూ! నీతో నేను వాదించలేను, నీ జీవితం నీయిష్టం! కానీ నీ చెల్లెలి బ్రతుకు పాడుచేసే అధికారం కూడా నీకు ఉందా?"
    "ఏం మాటలమ్మా!"
    "పరిస్థితి బాగా అర్ధంచేసుకుని ఆలోచించి మాట్లాడుతున్న మాటలు ప్రభూ! నీరజను నేను ఎంతగా అభిమానించేదాన్నో నీకు తెలియదా? కానీ, ఈ సందర్భంలో నీరజ ఇక్కడికి వస్తే....అందరి కళ్ళూ నీరజవైపు తిరిగితే...నీరజ గురించి గుసగుసలు నలుగురూ చెప్పుకోవటం మొదలుపెడితే...అదంతా ఎవరికి సుఖమో ఆలోచించు? మరొక సంగతికూడా ఉంది. నీది-విశాల హృదయమని అనాలో...విపరీత మనస్తత్వమని అనాలో...నువ్వొక్కడివి ఇలా ఆలోచిస్తున్నావు-నువ్వు నీరజను చేసుకోవటం అందరూ హర్షించలేరు- యశోధరకు కాబోయే భర్తకు కూడా ఇలాంటివి ఇష్టం ఉండకపోవచ్చు...ఈ కారణంగా నిశ్చయతాంబూలాలవరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే ఎవరికీ నష్టమో ఆలోచించు. యశోధర పెళ్ళి అయిపోయాక నీయిష్టం వచ్చినట్లు చేసుకో! నేనేమీ మాట్లాడను!"

 Previous Page Next Page