"రెస్ట్ రోజున ఫస్ట్ షోకీ సెకండ్ షోకీ వెళ్తాం కదా! ఆ తరువాత చార్ మినార్ దగ్గరున్న రెడ్ రోజ్ ఇరానీ హోటల్ కెళ్ళి 'టీ' తాగి రావాలికదా! అప్పటికి తెల్లారిపోతుంది. అది సరేగానీ ఇల్లు చాలా బావుందిరా. ఎంతక్కొన్నావ్?"
"పిచ్చివాగుడు వాగకు. ఈ మధ్యే అద్దెకు దిగాను. కొన్నావ్ గిన్నావ్ అంటే ఇంటి ఓనర్ ఇద్దరినీ బయటకు గెంటుతాడు"
"ఓకే! ఆ టాపిక్ మానేసి ఎడ్జస్టయిపోదాం!" సంచీ ఓ పక్కనపెట్టి కుర్చీలో కూలబడ్డాడతను.
"ఆహా! ఎంత కాలమయిందిరా పడక్కుర్చీలో కూర్చుని! అదిసరేగాని మన భోజనం మాటేమిటి? మన భోజనవసతి గృహం ఏది?"
"దగ్గరేలే!"
"రుచికరంగా వుంటుందా, లేక మా రైల్వే కాంటీన్ లో భోజనం లాగుంటుందా?"
"అంత గొప్పగా వుండదుగానీ, మరీ రైల్వే కాంటీన్ లో లా మాత్రం వుండదు"
"అయితే ఫరవాలేదు. రోజూ భోజనం చేయవచ్చు" ఆనందంగా అన్నాడు చిరంజీవి.
రామనాథం సింహాద్రితోపాటు వచ్చిన చిరంజీవిని చూసి ముచ్చటపడ్డాడు.
మన "ఫ్రెండాండీ?" అనడిగాడు వినయంగా.
"అవును" అన్నాడు సింహాద్రి.
"అంటే- ఇదివరకు వచ్చిన రాధాకృష్ణగారి లాగానండీ!"
"అవును"
"అంటే వీరు కూడా టేబుల్ మీద కత్తిగుచ్చి బాంక్ పరీక్షలు రాసి బాంక్ ఆఫీసర్ గా సెలక్టయారాండీ?"
"నో నో నాటెటాల్! నీ పేరేంటోయ్?" అతన్నడిగాడు చిరంజీవి.
"రామనాథం అండీ!"
"చూడు రామనాథం! టేబుల్ మీద కత్తిగుచ్చటం మన పాలసీకాదోయ్! అది మా బాచ్ మేట్ రాధాగాడి పాలసీ. దానికి మేమేమాత్రం బాధ్యులం కాదు. నాది అంతా శాంతియుతమయిన పాలషీ! లివ్ అండ్ లెట్ లివ్ అంటే బతుకు బతకనీ పాలసీ అన్నమాట! కత్తులతో సర్వీస్ కమీషన్ పరీక్షలు రాయడం మన పాలసీకి విరుద్దం! నేనెప్పుడూ పరీక్ష తాలూకు ప్రశ్నా పత్రాలు కొని రాస్తాను. రెండ్రోజులు ముందే కొంటానన్నమాట. అంతేగాని కత్తులూ కటార్లూ ఛఛ! అవుట్ డేటెడ్! ట్రైబల్ కల్చర్ అది. వాళ్ళు కూడా కత్తులు వాడటం లేదిప్పుడు"
రామనాథం ఆనందించాడు.
"మా బాగా చెప్పారు సార్! నిజమే! కత్తులేమిటండీ నాకర్ధం కాదు. అలాంటి వెధవపన్లు బొత్తిగా నచ్చవండీ నాకు. మా తమ్ముడు కూడా రాధాకృష్ణగారి లాగానే కత్తి తీసుకుని పరీక్ష కెళ్తూంటే నేను కత్తి లాగేసుకున్నానండీ! అందుకే ఆడు వాచర్ని మెడపిసికి చంపినా కోర్టులో కేసు నిలవలేదండీ! మా వాడు నిర్దోషి అని వదిలేసి పరీక్ష పాస్ చేయించేశారు. అదే నేను గనుక కత్తి లాక్కోపోయినట్లయితే మరి రుజువులు దొరికిపోయి మా వాడిని జైల్లో వేసేవారే కదండీ!"
"అవునవును" ఒప్పుకున్నాడు చిరంజీవి.
"నువ్ చాలా ఇంటెలి జెంట్ పనిచేశావ్! అందుకే మనమెప్పుడూ కత్తుల జోలికి పోగూడదోయ్! ఆంధ్రప్రదేశ్ లాంటి అద్భుతమైన రాష్ట్రంలో వుండి మనకా ఖర్మెందుకు చెప్పు! ఏ పరీక్ష రాయాలన్నా వారం రోజులు ముందే ఆ పరీక్ష కొశ్చెన్ పేపర్లు ఓపెన్ మార్కెట్లో దొరుకుతుంటే కత్తులేమిటోయ్? మీ తమ్ముడు చాలా అనవసరమయిన అభిప్రాయాల్తో నిండిపోయినట్లున్నాడు. నన్నడిగితే వాచర్ని మెడ పిసకడం కూడా అనవసరం అంటాను. వాళ్ళు మాత్రమేం చేయగలరు? పూర్ ఫెలోస్! కావాలంటే డొక్కలో రెండు పిడిగుద్దులు వేస్తే చాలు. కిక్కురుమనకుండా పడివుంటారు. నన్నడిగితే అది కూడా అనవసరం అంటాను. కొశ్చెన్ పేపర్లు ఈవెనింగ్ మార్కెట్లో ఫుట్ పాత్ ల మీద గుట్టలు గుట్టలుగా అమ్ముతుంటే..."
రామనాధానికి విసుగు పుట్టుకొచ్చింది.
"ఇప్పుడే భోజనం వడ్డిస్తాను" అనేసి లోపలకు పరుగెత్తాడు.
* * * * *
"అవున్రా! నాకు తెలీకడుగుతాను- నీకీ దిక్కుమాలిన బతుకెందుకు? డిజిగ్నేషన్ లేని ఉద్యోగం, ఈ గదిలో ఈసురోమంటూ ఉండడం. ఆ హోటల్ రామనాథం గాడు భోజనం అన్న పేరుతో వడ్డించే చెత్తంతా తినడం - ఎందుకొచ్చిన చావు" గదిలో కొచ్చాక నిద్రవస్తలోకి జారిపోతూ అడిగాడు చిరంజీవి.
"హా..." అని ఆవలించి ఆవలింతలోనే మాట్లాడాడు సింహాద్రి.
"ఇంకేం జేయమంటావురా"
"నీ తాతెవరో నీ పేరుమీద కొంచెం ఆస్తి వదిలి వెళ్ళాడు కదా! అది తింటూ ఏసీ రూమ్ లో జీవితం గడపక ఎందుకొచ్చిన తిప్పలు ఇవి?"
"అదో పెద్ద కథరా!"
"సీరియల్ నవలంత కథా?"
"అంతకంటే కొంచెం చిన్నది"
"అయితే చెప్పు"
"ఆ ఆస్తికి మా వయ్యకు ట్రస్టీగా పెట్టాడు తాతయ్య. నాకు పాతికేళ్ళొచ్చే వరకూ ఆ ఆస్తిలో ఒక్కపైస కూడా రాదు."
"వెరీ బాడ్" జాలిపడ్డాడు చిరంజీవి.
"చాలా బాడ్" వప్పుకున్నాడు సింహాద్రి.
"ఇప్పుడు నీ ఏజ్ ఎంత?"
"ఇరవై నాలుగు"
"అడెడెడెడె.... నువ్వు ఇంకొక్క సంవత్సరం ముందు పుట్టి వుంటే ఈపాటికి నీ చేతికొచ్చేసేది"
"అవును. కానీ అలా కుదర్లేదు కదా"
కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు చిరంజీవి. తను ఏదో ఉపాయం ఆలోచించి సింహాద్రిని ఆ ట్రస్టీ కోరల నుంచి రక్షించాలనిపించిందతనికి.
"ఆ! బ్రహ్మాండమయిన అయిడియా దొరికింది" గట్టిగా అరచి లేచి కూర్చున్నాడతను.
"ఏమిటది? తనూ లేచి కూర్చుంటూ అడిగాడు సింహాద్రి.
"నీ యస్సెల్సీ రిజిష్టరులో డేటాఫ్ బర్త్ సంవత్సరం మార్చెయ్"
"అదీ మావయ్య ఇవప్పెట్టెలో ఉంది"
"ఓహో! అక్కడ దెబ్బతిన్నావన్నమాట! పోనీ ఈ ఒక్క సంవత్సరం ఖర్చులకుగాను ఓ లక్ష అప్పుగా ఇమ్మనకపోయావా?"
"అడిగాన్రా బాబూ! లక్ష కాదుగదా ఒక్కపైసా కూడా ఇవ్వనన్నాడు"
"వట్టి క్రాక్ లాగ ఉన్నాడు"
"పరమ క్రాక్"
"ఆరోజు కాలేజీ హాస్టల్ నుంచి ప్రిన్సిపాల్ మనను బయటకు గెంటినప్పుడు కూడా మనిద్దరి మీదా చాలా అసహ్యంగా అరిచి గొడవచేశాడు"
"మనం కాబట్టి ఊరుకున్నాంగానీ అదే ఇంకెవరైనా అయితే 'గెట్ లాస్ట్' అనేవాళ్ళు"
"అనేవాళ్ళేంటి గెంటేసేవాళ్ళు"
"ఫైనలియర్లో ఉండగా మనం సెకండ్ షో సినిమాకెళ్తే హాల్లో ఆటమధ్య మనని సిగరెట్ తాగుతూండగా పట్టుకుని పోలీసుల కప్పజెప్పాడు గుర్తుందా?"
"హారబుల్ సైట్ అది! ఎలా మర్చిపోతాం? పోలీస్ స్టేషన్లో ఆ నల్లులు, లాకప్ లో ఉన్న వాళ్ళ కేకలు, ఏడుపులతో పిచ్చెక్కిపోయింది. అవునూ అలా రాత్రంతా లాకప్ లోఎందుకు పడేశారా అనేది నాకింతవరకూ అర్ధం కాలేదు"