Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 7

 

    సన్నగా విజిల్ చేశాడు భవానీ శంకర్.
    అవును  దానికి అప్లయ్ చేస్తే? ఆ ఉద్యోగంలో తనకు గొప్ప అనుభవం లేకపోవచ్చు. గానీ అనుభవం సంపాదించడం ఎంతలోకి! అయిదు నిముషాలు చాలు! అదీ గాకుండా వెయ్యి అబద్దాలాడి ఓ ఉద్యోగం సంపాదించుకొమన్నారు ఎల్డర్స్!
    వెంటనే అది కట్ చేసి జేబులో పెట్టుకున్నాడు.
    సరిగ్గా ఆ సమయములోనే తన పక్కన్నుంచీ ఓ పెద్ద పులి, "అటో! ఏయ్ అటో" అంటూ గాండ్రించటం వినిపించింది.
    "పెద్ద పులులు ఎంత అడ్వాన్స్ అయిపోయాయ్! అని ఆశ్చర్యపోతూ అటు వేపు చూసి మరింత ఆశ్చర్యపోయాడు.
    అలా అరచింది పెద్ద పులి కాదు! తెల్లని ఖద్దరు బట్టలు - వాటి మీద టమాటో, పగిలిన కోడిగుర్లు మరకలూ , నున్నని బట్టతలా - చేతిలో ఓ ఖరీదయిన చేతికర్రతో నిలబడిందా మానవాకారం.
    "ఏయ్! అటో! అలా చూస్తావేంటి? బంజారాహిల్స్ కి పద త్వరగా'! ఊ!" అంటూ గాండ్రించింది ఆకారం మళ్ళీ.
    భవానీశంకర్ కి పొజిషన్ అర్ధమయిపోయింది.
    తన అటో స్టాండ్ లో ఓ ఖాళీ అటో పక్కన నిలబడి ఉండటం చేత తననే అటో డ్రైవర్ అనుకుంటోందా పులి.
    "ఏయ్! ఏమిటి? వినిపించటంలేదూ? చెవుడా నీకు! అర్జెంట్ గా వెళ్ళాలి. స్టార్ట్ చెయ్! స్టార్ట్ చెయ్?' అంటూ ఆటోలో కూర్చుని మళ్ళీ అరిచాడు ఆర్. భీమారావ్. తన కారు అక్కడికి పదడుగుల దూరంలోనే
సమ్మె' ప్రారంభించాక అతను అటో కోసం అక్కడి కొచ్చాడు హడావుడిగా!
    "అది కాదండి - నేను అటో ...." అంటూ అసలు సంగతి చెప్పబోయాడు కానీ ఆర్. భీమారావ్ అదేమ వినిపించుకోదల్చుకోలేదు.
    "మీ అటోవాళ్ళ వేషాలు నాకు తెలుసు! ఇష్టం లేకపోతే లక్ష కుంటిసాకులు చెప్తారు! కానీ నేనలాంటి బేవార్స్ సాకుల్ని నమ్మే రకం కాదు? ఊ! స్టార్ట్ చేసేయ్! అర్జెంట్! అర్జెంట్ - కమాన్ క్విక్ -" వెనుక జనం వస్తున్నారేమోనని ఉండుండి వెనక్కు తిరిగి చూస్తూ అన్నాడు.
    "అదికాదండీ ! నేనసలు అటో డ్రైవర్ని కాదు...."
    "ఓహో! కొత్త 'సాకు' కనిపెట్టావన్న మాట! మర్యాదగా స్టార్ట్ చేస్తావా? పోలీస్ ని పిలువమంటావా? నేనెవరో తెలుసా భీమారావ్ ని! మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భీమారావ్ ని! నిన్నూ నీ ఆటోని కూడా మూయించేస్తాను-"
    భవానీశంకర్ కి ఏం మాట్లాడాలో తెలీటం లేదు.
    "నేను నిజంగానే ...."
    "డోంట్ వెస్ట్ మై టైం! కమాన్ అర్జెంట్! అర్జెంట్...."
    భవానీశంకర్ ఇంక ఆలస్యం చేయదలుచుకోలేదు. అంత అర్జెంట్ పనులున్న పార్లమెంట్ మెంబర్ కి - "మానవసేవే - - మాధవ సేవ" స్కీమ్ కింద, తను అటో నడిపి సహాయం చేయటంలో తప్పు లేదనిపించింది.
    మరుక్షణం - స్కూటర్ నడిపే అనుభవాన్ని ఆటోకి ఉపయోగించి స్టార్ట్ చేశాడతను.
    "రైట్ టర్న్ - రైట్ టర్న్ - రైట్ టర్న్ " అంటూ హటాత్తుగా అరిచాడు భీమారావ్ బంజారాహిల్స్ లో రోడ్ నెంబర్ టుల్వ్ కొచ్చాక!
    ఉలిక్కిపడి అదే వేగంతో రైట్ కి కోసేశాడు భవానీశంకర్.
    తరువాతేం జరిగిందో తెలీదు గానీ పెద్ద శబ్దం వినిపించిందతనికి. ఆ తరువాత తను గాలిలో ప్రయాణం చేస్తున్నట్లు తెలిసింది. మరి కొద్ది సెకన్ల లో తన ప్రయాణానికి భూమి అడ్డు రావటంతో దభేలు మని కింద పడక తప్పలేదు.
    వళ్ళు దుమ్ము దులుపుకుంటూ లేచి చుట్టూ చూశాడు. అప్పుడే ఆటోకి మరోపక్క నుంచి తనూ తన స్వంత దుమ్ము దులుపుకుంటూ లేస్తున్నాడు ఆర్. భీమారావ్. రోడ్డు కడ్డంగా మధ్యలో ఉన్న ఎలక్ట్రికల్ ఫొల్ ని గుద్దుకుని ప్రక్కకు వరిగి ఉంది అటో.
    "బ్లడీ ఫెలో ! ఏమిటా డ్రైవింగ్? హైదరాబాద్ లో రోడ్డుకి మధ్య ఎలక్ట్రికల్ ఫోల్స్, పెద్ద గోతులూ ఉంటాయని తెలీదూ/ ఇడియట్- పద! ఇప్పుడే పోలీస్ ని పిలిపించి నిన్నూ - నీ ఆటోని లోపల వేయించేస్తాను పద! కమాన్!' అంటూ భవానీశంకర్ చేయి పట్టుకుని బరబరా ఈడుస్తూ తన మేడలోకి లాక్కెళ్ళాడు.
    హల్లో సోఫాలో పక్కపక్కనే కూర్చుని అమ్మాయి తండ్రి రాగానే ఎలా విష్ చేయాలి, ఎలా మాట్లాడాలి రిహార్సల్స్ వేసుకుంటున్న అమ్మాయీ, దీప్ చంద్ భీమారావ్ ఆకారం చూచి దడుసుకున్నారు. వళ్ళంతా దుమ్ము పేరుకుపోయి, బట్టలంతా టమాటో, కోడిగుడ్ల లిక్విడ్ తో నిండిపోయి భయంకరంగా కనబడుతున్నాడతను.
    తన కూతురికి అతి సమీపంగా కూర్చుని అలా సరదాగా కబుర్లు చెప్తున్న యువకుడి మీద వళ్ళు మండిపోయింది భీమారావ్ కి. ఇలా అడ్డమైన యువకుడూ తన కూతురితో వచ్చి ఇంట్లో తిష్ట వేయడం ససేమిరా నచ్చని విషయం!
    "డాడీ.....వాట్ హెపెండ్...." అంటూ ఆప్యాయంగా దగ్గరకొచ్చింది అమ్మాయ్.
    అంతకుముందు వేసుకున్న రిహార్సల్స్ ప్రకారం బీమారావ్ ఇంట్లోకి రాగానే తను దగ్గరకెళ్ళి "గుడీ ఈవెనింగ్ సర్! వెరీగుడ్ ఈవినింగ్ ఇన్డ్డీడ్! ఆయామ్ దీప్ చంద్! ఫేమస్ రైటర్ దీప్ చంద్! అంటూ పరిచయం చేసుకోవాలి దీప్ చంద్. అయితే అది మాములు పరిస్థితుల్లో అయితే సహజంగా, హుందాగా ఉంటుంది. కాని ఇలా కోడిగ్రుడ్లు, టమాటో ఆటోలో నుంచి కింద పడిన దుమ్ముతో ఇంట్లో కోస్తున్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి ఆ విధంగా విష్ చేయడం అంత సమంజసం కాదని దీప్ చంద్ గ్రహించలేకపోయాడు.
    "గుడీవినింగ్ సర్! వెరీ గుడీవినింగ్! ప్లెజెంట్ అండ్ ఒండ్రఫుల్ ఈవినింగ్! మిమ్మల్నిలా కలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది! బైదిబై నాపేరు దీప్ చంద్!" అంటూ కరచాలనం చేయడానికి చేయి చాపాడతను.
    భీమారావ్ కి కోపం నషాళానికంటింది.
    "హూ ఈజ్ దిస్ మాడ్ ఫెలో!" మండిపడుతూ అమ్మాయ్ నడిగాడు.
    "ఓ! మాడ్ ఫెలో కాదు డాడీ! రచయిత! ఫేమస్ రైటర్ దీప్ చంద్ ఇతనే!" సంబరంగా చెప్పిందామె.
    "వ్వాట్ ! రచయితా?" పిడికిలి బిగిస్తూ అన్నాడు భీమారావ్.
    అతనికి కడుపు రగిలిపోతోంది. అంతకుముందే ఓ రచయిత వల్ల టమాటోలు, కోడిగుడ్ల దాడికి గురయ్యాడు! ఇప్పుడు మరో రచయిత తనింట్లోనే తన కెదురుగా నిలబడి కరచాలనం చేయడానికి సిద్దంగా ఉన్నాడు! హైదరాబాద్ లాంటి సుందరమైన నగరం - ఎందుకిలా రచయితలతోనూ, జర్నలిస్టులతోనూ క్రిక్కిరిసిపోయిందో ఏమాత్రం అర్ధం కావటం లేదు! తను ప్రధానమంత్రి అయితే వీళ్ళను షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ద్వారా అనవాల్లెకుండా చేసేది ఖాయం!
    "యస్సార్ ! రచయిత దీప్ చంద్ నేనే! నేను రాసిన "ప్రేమేరా జీవితం' నవల చదివే వుంటారు మీరు...." అంటూ తన నవలల వివరాలు అందించబోయాడతను.
    "షటప్!" ఉగ్రుడయి అరిచాడు భీమారావ్. "నీకు అరనిముషం "టైమిస్తూన్నాను! ఈలోగా నాకు కనబడనంత దూరం పరిగెత్తు! లేకపోతే జీవితాంతం హాస్పిటల్లో గడపాల్సి వస్తుంది."
    దీప్ చంద్ కి విషయం అర్ధమయింది. టైమ్ చూసుకుని ఒలింపిక్స్ లోని కార్ల్ లూయిస్ వేగాన్ని కూడా అధిగమిస్తూ కనుమరుగైపోయాడు.
    అమ్మాయికి కోపం, నిరాశ, దిగులు, చిరాకు అన్నీ ఒకేసారి కలిగి నయ్! "డాడీ" అంది రోషంగా!
    భీమారావ్ భవానీశంకర్ వేపు చూశాడు కోపంగా.
    "నువ్విక్కడే వుండు! ఫోన్ చేసి పోలీసుల్ని పిలిచి అప్పగిస్తాను" అంటూ లోపలికి నడిచాడు.  
    "నా మాట కొంచెం వినండి! నేనసలు జర్నలిస్టుని! అక్కడ నిలబడితే మీరే నన్ను అటో డ్రైవరనుకుని ఫోర్స్ చేస్తే అటో డ్రైవ్ చేశాను! ఈ మాత్రానికే పోలీసులెందుకండి మన మధ్య! దిసీజ్ క్లియర్ కేసాఫ్ ఫ్రెండ్ షిప్ అండ్ ఎఫెక్షన్! కేవలం మానవసేవే - మాధవ సేవ స్కీమ్ లో భాగం! అంతే!"
    "డోంటాక్!' అనేసి లోపలికెళ్ళి డయల్ చేయసాగాడతను.
    అమ్మాయికి విషయమంతా అప్పటికి అర్ధమైంది. అయితే తండ్రి ఇలా భయంకరంగా మారిపోవడానికి కారణం ఈ జర్నలిస్టు పక్షి అన్న మాట! అంటే తమ పెళ్ళి విషయం తండ్రికి నివేదించే కార్యక్రమాన్ని సర్వనాశనం చేసింది ఈ జర్నలిస్టు ఇడియట్ అన్నమాట!
    అతనివంక కోపంగా చూసిందామె.
    అయితే భావానీశంకర్ అప్పటికే అమ్మాయి తాలుకూ అద్భుతమయిన అందానికి మంత్రం ముగ్ధుడయి ఆమె వంకే తన్మయత్వంతో చూస్తుండిపోయాడు. అందానికి హద్డుల్లెవని తనకు తెలుసు గానీ ఆ విషయం ఋజువయింది - ఇదిగో - ఇప్పుడే!
    అతని వాలకం చూసేసరికి అమ్మాయికి కోపం మరింత ఎక్కువయింది.
    "గెటౌట్" అంటూ అరచింది ఉక్రోషంగా.
    ఆమె 'గెటౌట్' అని అరుస్తోంది ఎవర్నో తెలీక చుట్టూ చూశాడు భవానీశంకర్. కానీ అక్కడ ఇంకెవ్వరూ కనిపించడం లేదు.
    ఒకవేళ ఆ అమ్మాయి తననే ఉద్దేశించి మాట్లాడుతున్నట్లయితే - తనమీద ఎందుకలా మండిపడుతుందో ఏమాత్రం అర్ధం కావటం లేదు.
    "అయ్ సే- యూ- గెటౌట్...." ఈసారి ఇంకొంచెం ఉక్రోషంగా అరచిందామె. ఆ క్షణంలో తను అక్కడినుంచి బయటపడకపోయినట్లయితే ఆమె భోరున ఎడ్చేస్తుందేమో అని అనుమానం కలిగిందతనికి.
    అదీగాక మరోపక్క భీమారావ్ గొంతు ఫోన్లో మాట్లాడటం వినిపిస్తూనే ఉంది.
    "హలో పోలీస్! నేను భీమారావ్ - ఎంపీ ని మాట్లాడుతున్నా. అర్జంటుగా మా ఇంటికొచ్చి ఓ అటో డ్రైవర్ని అరెస్ట్ చేయాలి! నన్ను తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఫొల్ కేసి కొట్టాడు - అండర్ స్టాండ్?"
    అంతే! భవానీశంకర్ ఆలస్యం చేయలేదు.
    వెనక్కు తిరక్కుండానే మెరుపులా మాయమయిపోయాడు.

    
                                              *****

    శివతాండవం మరోసారి స్వప్న వేపు చూశాడు.

 Previous Page Next Page