మూర్తికి సంతోషం కలిగింది. కాని ఓ శీర్షిక నడిపే బాధ్యత స్వీకరించటానికి తన అనుభవం చాలుతుందా?
"నాకు అంత...శక్తిలేదేమో సార్." అన్నాడు నమ్రతగా.
"మూర్తీ! దీన్ని గురించి నేనప్పుడే నిర్ణయం తీసేసుకున్నాను. శీర్షిక నడపటానికి కావలసిన స్వేచ్చ నీకే యిస్తున్నాను. దాని పేరు కూడా నువ్వే సెలక్ట్ చెయ్యి. ఈ సమాజం మీద పదునైన విసుర్లు నాకు కావాలి. ఇదిగో పత్రిక ఏ విధంగా వుండాలో ఆ ఫార్ములా అంతా యీ కాగితాల మీద రాసుకున్నాను. తీసుకెళ్ళి చూసి నీకేదైనా సలహాలు తోస్తే చెప్పు."
మూర్తి కాగితాలు అందుకుని తన సీట్ లోకి వెళ్ళిపోయాడు.
కొన్నాళ్ళలో పత్రిక మొదలయింది. మెరుపు, దాని పేరు. అందులో మూర్తి నడిపే శీర్షిక "పిచ్చివాడి చేతిలో రాయే" అందులో సంఘంలోని ఆనాటి తాజా సంఘటనలు, పరిణామాలు, రాజకీయాలమీద పరిశీలనలు, అత్యా చారాల మీద దండయాత్రలూ, కొంతమంది ప్రముఖుల మీద సద్విమర్సతో కూడిన విసుర్లూ, రావలసిన మార్పు మీద ఆవేదనా-ఆవేశంతో కూడిన సలహాలు-ఒకటేమిటి? సమాజానికి సంబంధించిన సమస్తం రూపంలో వర్తిస్తూ వుండేది.
రానురాను ఆ శీర్షికకు పేరొచ్చింది. పాఠకుల దగ్గర్నుంచి అభినందిస్తూ అనేక ఉత్తరాలు రాసాగాయి. సర్క్యూలేషన్ కూడా బాగా పెరిగింది.
రాఘవ ఉద్యోగం వెతుక్కుని, తాలూకాఫీసులో గుమాస్తాగా చేరేసరికి మూర్తి పత్రికలో సబ్ ఎడిటర్ అయ్యాడు.
* * *
రాఘవ పెళ్ళిచేసుకున్నాడు.
సీత అప్పుడప్పుడూ అతనికి గుర్తు రాకపోలేదు. మనసులో ఏ మూలనో ఆమె రూపం మెదిలేది. ఒక్క క్షణం తర్వాత ఆ తెరల్లో ఎక్కడో మరుగున పడిపోయేది.
పెళ్ళి చేసుకున్నాక రాఘవ-లక్ష్మిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాడు. తాను ఒక స్త్రీకి భర్త అయింమ్దుకు అతనికి గర్వంగా వుండేది. అతని కళ్ళకి ఆమె చాలా అందగత్తెలా కనిపించేది. ఎప్పుడూ ఆమెతో మాట్లాడుతూ వుండాలనీ, ఆమెకూడా తిరుగుతూ వుండాలనీ తహ తహగా వుండేది.
మొదట్లో కొన్నాళ్ళు బాగానే సాగింది కాని, తర్వాత ఓ కొత్త యిబ్బంది వచ్చింది.
అత్తకూ కోడలుకూ ఒక్క క్షణమైనా పడేది కాదు. మొగుడూ పెళ్ళాం కలసి ఎక్కడికైనా బయటకెడితే ఆవిడకు చాలా బాధగా, ఉక్రోషంగా వుండేది. తన వస్తువేదో ఆడది యింకో రూపంలో వచ్చి లాగేసుకుంటున్నట్లు గింజుకుపోయేది. ఆ బాధ సూటిగా బయట పెట్టేందుకు వీల్లేదు. ఇంకేదో కారణం కల్పించుకుని ఆడిపోసుకునేది. లక్ష్మి కొంచెం ఆలస్యంగా నిద్రలేచేది. ఈలోగా రాఘవ లేచి స్నానాధికాలు కూడా ముగించుకునేవాడు. ఇది ఆవిడకు దారుణంగా కనిపించేది. ఏదో అనకుండా నోరు వూరుకునేది కాదు. ఆవిడ అన్నప్పుడల్లా లక్ష్మి ఏడుస్తూ పడుకుని ఆపూట భోజనం మానేసేది. ఆమె అలాగే పడుకున్నదంటే బ్రహ్మాదులు వచ్చినా ఆ అలక తీర్చలేక పోయేవారు. రాఘవ యిద్దరి మధ్యా పడి నలిగిపోతూ వుండేవాడు. అటు తల్లి అంటే దేవతతో సమానం ఇటు పెళ్ళామంటే పంచప్రాణాలు. కాని ఆ నలిగిపోవటం అతనికి ఎబ్బెట్టుగా వుండేది కాదు. ఈ ప్రకృతిలో అదో సహజ పరిణామమనీ, అది అనుభవించటంలొ అస్వాభికం ఏమీ లేదని అనుకునేవాడు.
* * *
మూర్తిని వెదుక్కుంటూ ఓ రోజు ఓ అమ్మాయి వచ్చింది.
"నమస్కారమండీ"
దీక్షగా రాస్తున్న వాడల్లా తలెత్తి చూశాడు.
ఎర్రగా, చురుగ్గా, లేతగా, మొగ్గలా వున్నది.
"నా పేరు వసంత. మీ రచనలు చదువుతూ వుంటాను. చూద్దామని వచ్చాను"
"కూర్చోండి!"
వసంత కూర్చుంది. అతన్ని చూడటానికి అప్పుడప్పుడూ ఎవరెవరో రావటం కద్దేగాని, యీ అమ్మాయిలో వున్న ప్రత్యేకమైన ఆకర్షణ అతన్ని కొంచంగా కదిలించింది.
"పిచ్చివాడి చేతిలో రాయి, శీర్షిక చాలా బాగుందండీ."
నవ్వి వూరుకున్నాడు.
"మీ కథలు కూడా బాగుంటాయి."
"థ్యాంక్స్" అన్నాడు.
"మీ కథలన్నీ చదివి చాలా ముసలివారనుకున్నాను"
"నేను కూడా ముసలివాడ్నే అనుకుంటున్నానే" అన్నాడు నవ్వుతూ.
"ఊఁ. ఏం కాదు"
"మీ అభిమాన రచయిత లెవరు?" అనడిగాడు.
"ప్రస్తుతం మీరే"
కొంచెం తడుముకుని "నేను కాకుండా...యింకా" అన్నాడు.
"ఆలోచిస్తేనేగాని గుర్తురాదు"
"మీ యిష్టం" అన్నట్లు ఊరుకున్నాడు.
ఆమె కాసేపు ఏవేవో విషయాలు మాట్లాడింది. కథ లెలా రాస్తారు, ముందు ఆలోచించుకుని రాస్తారా, రాస్తూ ఆలోచిస్తారా, కథ పేరు ముందు పెడతారా, అంతా రాశాక పెడతారా, ఒక్కో కథ రాయటానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఇత్యాదులు.
అన్నిటికీ ఓపిగ్గా జవాబులు చెప్పాడు.
"అయితే-మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దామంటారు?" అన్నది లేస్తూ ఆఖరికి.
"కలవాల్సిందే అంటారా?"
"మరి ఆలోగే అనిపిస్తోంది-నా మనస్సుకి"
అట్లా మొదలైంది.
ఒకసారి జగన్నాధపురం వంతెన దగ్గర, మరోసారి సర్పవరం దగ్గర-ఇంకోసారి-సముద్రతీరాన-యిట్లా కలుసుకుంటూ వుండేవాళ్ళు.
ఒకసారి పండాల చెరువుమీదను నడిచి వస్తున్నారు. శుక్రవారం అవటంచేతనేమో త్రిపురసుందరీ గుడివద్ద జనం రద్దీగా కనిపించారు.
అతనేమీ మాట్లాడలేదు. ఆమెను అనుసరిస్తూ సింహద్వారం దాకా వచ్చాక "యిక్కడ నిల్చుంటాను. వెళ్ళిరా" అన్నాడు.
ఆమె తెల్లబోయింది. "అదేం?"