మాకాలనీ పేరు మీకు తెలుసుకదా!
మా కాలనీ అంటే నా ఉద్దేశ్యం నిజంగా మా సొంతకాలనీ అనికాదు.
మేమంతా ఆ కాలనీలో అద్దెకుంటున్నాం. ఆ కాలనీ ఇళ్ళ ఓనర్లందరూ వేరే ఎక్కడో సొంత ఇళ్ళల్లో ఉంటున్నారు. వాళ్ళకు సొంతిళ్ళు లేవని హౌసింగ్ బోర్డువాళ్ళు వాళ్ళ కోసం కట్టించిన కాలనీలో మేము అద్దెకుంటున్నాము.
ఆ రోజు ఆదివారం అవడం వల్ల ఉదయం ఎనిమిది గంటల వరకూ హాయిగా నిద్రపోవచ్చని నేను ప్లాన్ చేశాను. ఎందుకంటే నిద్ర అనేది తెలుగు రాజధానిపౌరులకు రేషన్ లొ దొరికే మంచినీళ్ళలాంటిది.
ఎందుకంటే రాత్రి పన్నెండింటివరకూ ఆ చుట్టుప్రక్కల గుడిలోనో, మసీదులోనో లౌడ్ స్పీకర్లలో పాటలూ, అరుపులూ కేకలూ వినబడుతూనే ఉంటాయ్. అంచేత అంతవరకూ గ్యారంటీగా ఎవరికీ నిద్రవుండదు. పోనీ పన్నెండు తర్వాతే పడుకుందామా అంటే, మా కాలనీ నల్లాల్లో నీళ్ళు రాత్రి ఒంటి గంట నుంచీ రెండింటి వరకూ మాత్రమే వస్తాయ్.
"పోనీ రెండింటికి పడుకోవచ్చుకదా- దానికింత రాద్దాంతం ఎందుకట?" అని మీరు విసుక్కోవచ్చు.
కానీ రెండింటికీ కూడా పడుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే రెండింటి నుంచీ మూడున్నర వరకూ మన ఆంద్రప్రదేశ్ లో దొంగలుపడే టైము. రోజూ ఆ టైములో మనింట్లోనో, పక్కింట్లోనో లేదా కాలనీలో ఏదొక ఇంట్లో దొంగలు పడక తప్పదుకదా! మరి ఆ దొంగలు అలా ఊడ్చుకెళ్ళి పోయాక మనం నలుగురినీ పిలవడం- లేదా నలుగురూ మనల్ని పిలవడం- అందరూ కలసి ఆ దొంగతనం గురించి మాట్లాడుకోవడం- జోకులేసుకోవడం- జరుగుతుంది కదా! ఇక నాలుగ్గంటలకు పాలవాన్ వచ్చేస్తుంది.
అయిదు గంటల్లోపల పాలపాకెట్ తెచ్చుకోకపోతే- ఆ తరువాత దొరకదు. మనపాకెట్ ని మరోపావలా ఎక్కువ ధరకు ఎవరికో అమ్మేస్తాడు బూత్ వాడు. లేదా ఆ పాకెట్ లోని పాలు కొన్ని తీసేసి నీళ్ళు కలిపేస్తాడు.
"పోనీ నాలుగున్నరకు పడుకోవచ్చు కదా, మాయరోగమా?" అని మీరనవచ్చు కానీ సరిగ్గా నాలుగున్నరకే పనిమనిషి తలుపులుకొడుతుంది. ఆమె టైము నాలుగున్నర నుంచీ అయిదు వరకూ ఆ అరగంటసేపూ అంట్లు ఎగిరి పడటం, దొర్లడంలాంటి శబ్దాలు ఎవరాపగలరు? పోనీ ఆ పనిమనిషిని ఆరున్నరకు రమ్మందామా అంటే- "నేను నాలుగున్నరయితేనే వస్తాను! ఇష్టంలేకపోతే రిజైన్ చేస్తాను" అని వార్నింగిస్తుంది. అంచేత అయిదింటివరకూ నిద్రఖాళీ!
ఆ తరువాత వంటచేసే కార్యక్రమం ప్రారంభమయిపోతుంది. అప్పుడే న్యూస్ పేపర్.
ఇవాళ పేపర్లో ఏమి రాశారో చూద్దాం అనే కోరిక నిద్రను పూర్తిగా తరిమేస్తుంది. ఇక ఆరింటికి లేచి రెడీ అవడం ప్రారంభిస్తేగానీ ఎనిమిదింటికి యింట్లోనుంచి బయటపడటం సాధ్యంకాదు. ఎనిమిదింటి నుంచి బస్ స్టాప్ లొ ఆంధ్రప్రదేశ్ వారి ఆర్.టి.సి. బస్ కోసం పడిగాపులు పడితేగాని తొమ్మిదిగంటలకు బస్సు దొరకదు. తొమ్మిదింటి నుంచీ గంటన్నరపాటు అది చీమలా వేగంగా ప్రయాణిస్తేగానీ మన రాజధాని ట్రాఫిక్ లో పదికిలోమీటర్ల దూరం వెళ్ళలేదు కదా!
కనుక ఆదివారం ఒక్కరోజుమాత్రమే కరువుతీరా నిద్రపోయేందుకు ఎక్కువ అవకాశాలున్నాయ్.
అయితే ఆ రోజు ఆరింటికల్లా తలుపులు గట్టిగాబాదడం వినిపించేసరికి అప్పుడేపడుతున్న నిద్రకాస్తా ఎగిరిపోయింది.
ఎవరా తలుపింత భీకరంగా, యింతపొద్దున్నే బాదుతున్నారని చిరాగ్గాలేచి వెళ్ళి తలుపు తెరిచాను.
ఎదురుగ్గా శాయీరామ్ నిలబడి వున్నాడు.
"హలో- గుడ్ మాణింగ్!" అన్నాను కోపంగా.
"మన కాలనీలో ఎనిమిదింటికి మీటింగుంది" అన్నాడు చిరునవ్వుతో.
నాకు వళ్ళుమండిపోయింది.
"మొన్నేకదా దొంగల తాలూకు మీటింగయింది?" అన్నాను చిరాగ్గా.
"అవును."
"అప్పుడు వాళ్ళూ మనం ఓ అగ్రిమెంటుకొచ్చేం కదా!"
"అయ్యాయిగానీ- ఇప్పుడు మన నియోజకవర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్ (డబ్ల్యూ) అభ్యర్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకని బై ఎలక్షన్-"
"అరె! ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడట?"
"తప్పక మినిష్టర్ అవుతాడని ఉన్న ఆస్తంతా ఖర్చుచేశాడట! తీరాచూస్తే మంత్రి పదవి దొరకలేదు. ఉట్టి ఎమ్మెల్యేగా ఉంటే ఖర్చు చేసినదానికి పదింతలే సంపాదించే అవకాశం ఉంటుందట! ఇంకేం చేస్తాడు పాపం!"
"అయితే ఇప్పుడు మనం మీటింగ్ ఎందుకు పెట్టుకోవాలి?"
"ఎందుకేమిటి? ప్రతి ఎలక్షన్ కి మనకాలనీ వాళ్ళందరంకలిసి మీటింగ్ పెట్టుకుని ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకోవడం మామూలేగా?"
"ఇంకా నిర్ణయించుకునేది ఏముంది? మన కాలనీ ఎప్పుడూ కాంగ్రెస్ (డబ్ల్యూ)కేగా వోటువేసేది?"
"కానీ ఈసారి కొత్తపార్టీ వచ్చింది కదా? అందుకని మళ్ళీ ఓసారి డిస్కస్ చేసుకుంటే..."
"కొత్తపార్టీ ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు.
"కాంగ్రెస్ (జెడ్)"
"కాంగ్రెస్ జడ్డా?"
"అవును!"
"అంటే ఈ కాంగ్రెస్సుల్లో అదే ఆఖరిదన్నమాట! దీంతో ఇంకపార్టీ చీలేందుకు అవకాశం లేనట్లేగా!"
"ఎందుకులేదూ?"
"ఎందుకేమిటి ఇంగ్లీష్ లిపిలో జెడ్ వరకేగా ఉంది."
శాయీరామ్ నవ్వేడు.
"పిచ్చివాడా? రెండక్షరాలతో మళ్ళీ కొత్తసిరీస్ మొదలు పెట్టవచ్చుగా?"