Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 7

                                 


    అందరూ ఆ ఎగ్రిమెంట్ కి హర్షం వెలిబుచ్చారు. ఆ తరువాత అల్పాహార విందు జరిగింది. విందులో దొంగల నాయకునితో ఇంటర్వ్యూ ప్ర్రారంభించాడు జర్నలిస్టు గోపాల్రావు.
    "అయ్యా! తమరి స్వగ్రామం ఏది?"
    దొంగల లీడర్ నవ్వాడు. "మాది తమిళనాడు మా గ్రూపులో ఆంధ్రప్రదేశ్ కి చెందినవారెవరూ లేరు ప్రస్తుతానికి" అన్నాడు.
    "అదేమిటి మీ స్వంత స్టేట్ లొ దొంగతనాలు చేసుకోకుండా ఇలా పరాయి రాష్ట్రాల కెందుకు ఎగబడుతున్నారు?"
    దొంగల నాయకుడు ఆ ప్రశ్నకు చిరాకుపడ్డాడు.
    "నీళ్ళు ఎటు ప్రవహిస్తాయి?" అనడిగాడు గోపాల్రావుని.
    "పల్లం వేపు"
    "అవునా? మరి మేమూ అంతే! ఏ రాష్ట్రంలొ పోలీసు డిపార్ట్ మెంటు చేతకానిది ఉంటుందో అక్కడ హాయిగా బ్రతకొచ్చుగదా మేము!"
    "ఓహో అదా సంగతీ!" అసలు రహస్యం తెలిసినట్లు రాసుకున్నాడు గోపాల్రావ్.
    "అంటే మీ ఉద్దేశ్యం-కేవలం పోలీస్ డిపార్ట్ మెంట్ దేనికీ పనికిరాదు అన్న రాష్ట్రంలోనే దొంగతనాలు చేస్తారన్నమాట! అంతేనా?"
    "అంతేకాదు- ఇంకోటి కూడా వుంది."
    "అదేమిటి? ప్రజలు! ఇక్కడి ప్రజలు గంగిగోవుల్లాంటివారు. కత్తిచూపించగానే సర్వస్వం యిచ్చేస్తారు. ఎన్ని దొంగతనాలుచేసినా- ఎంతమందిని చావగొట్టినా కిక్కురుమనకుండా పడివుంటారు. ప్రజలణు రక్షించటం చేతకాని ప్రభుత్వాన్ని తీసిపారేయాలని కోరుకోరు! కనుక మేము హాయిగా రిటైరయ్యేవరకూ సుఖప్రదమయిన జీవితం గడపొచ్చు. ఈ రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్ అని అందుకే మేము పేరుపెట్టాం!"
    "సరే- ఇప్పుడు మీరు ఇంతధైర్యంగా వచ్చారు కదా ఇక్కడికి! ఒకవేళ పోలీసులు వచ్చి పట్టుకుంటే ఏంచేసేవారు?"
    ఆ దొంగల నాయకుడు పకపకానవ్వాడు.
    "ఏమిటి నవ్వుతారు?"
    "ఇంత చిన్న విషయం తెలీదంటే ఆశ్చర్యంగా వుంది."
    "ఏమిటా చిన్న విషయం?"
    "పోలీసులెప్పుడయినా దొంగతనం జరుగుతుండగా గానీ, మర్డర్ జరుగుతుండగా గానీ లేక యింకేదయినా క్రైమ్ జరుగుతుండగాగానీ ఎవరినయినా పట్టుకోవడం గురించి విన్నారా?"
    "లేదు."
    "మరింక ఇప్పుడు మాత్రం ఎలా పట్టుకుంటారయ్యా, భలే జర్నలిస్టులయ్యా మీరు! మీలాంటి జర్నలిస్టులుండబట్టే దేశం యిలా అఘోరించింది- వస్తా" అంటూ లేచాడతను.
    అందరూ కారువరకూ వెళ్ళివాళ్ళకి వీడ్కోలు ఇచ్చారు అంతే! ఆ తరువాతెప్పుడూ మా కాలనీలో దొంగతనం జరగలేదు. ఇంకమనకి ఏ ప్రాబ్లెమూ లేదు. హ్యాపీగా దొంగలకు మామూళ్ళు 'పే' చేస్తూ ప్రశాంతంగా జీవితం గరిపేయవచ్చని అనుకుంటూండగానే మళ్ళీ అవాంతరం వచ్చి పడింది.
    మా కాలనీ జనరల్ సెక్రటరీ రంగారెడ్డి ఇంట్లోనే దొంగలు పడ్డారు. ముందు రంగారెడ్డి దొంగల్ని చూసి షాకయ్యాడు.
    "మీరెవరు?" అడిగాడువాళ్ళను.
    "కనబట్టంలా! కళ్ళు దొబ్బినాయ్ బే? దొంగలం!"
    "దొంగలంటే ఎవరో క్లారిటీ ఇవ్వండి సార్! రాజకీయ నాయకులా, ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్ లా? చీఫ్ మినిష్టర్లా, ఇన్ కమ్ టాక్సోళ్ళా, కార్పొరేషనోళ్ళా, ఆర్టీఏ వోళ్ళా, పోలీసులా-వీళ్ళల్లో ఏ దొంగలు?"
    దొంగల నాయకుడికి కోపం వచ్చింది.
    "థూ నీయవ్వ! మేమలాంటి వైట్ కాలర్ దోపిడీలు చేయంబే!  సాలా- ఇజ్జత్ కా సవాల్ హై! మా వంశమేంది, మేమందనుకుంటివిరా! తరాలకెళ్ళి ఫ్యూర్ దొంగతనాలు చేసుకుంటూ, గుజరాయిస్తున్నాం బే-"
    రంగారెడ్డికి కోపం వచ్చింది. వెంటనే బెల్ మీట నొక్కాడు. అందరూ పరుగెత్తుకొచ్చారు. వాళ్ళకీ మేటర్ చెప్పాడు రంగారెడ్డి.
    "ఇగో! ఇది టూమచ్! మీ దొంగల ముఠా, మా కాలనీ ఓళ్ళు కలసి అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం కదా! దాని ప్రకారం ప్రతినేలా మీకు మామూలు కూడా ఇస్తున్నాం! మళ్ళీ దొంగతనానికి ఎందుకొచ్చినట్లు?"
    దొంగల లీడర్ ఇంకా మండిపడ్డాడు.
    "ఏంది? మాతో అగ్రిమెంట్ చేసిన్రా? దమాక్ గిట్టా తిరుగుతోందా? సాలా- సిటీల ఈ కాలనీకి ఫస్ట్ టైమ్ వచ్చినాం బే! జబాన్ సంబాల్ కే బాత్ కర్!" అన్నాడు దబాయింపుగా.
    మాకు మతిపోయినట్లయింది.
    వెంటనే అగ్రిమెంట్ సైన్ చేస్తున్నప్పుడు మేము దొంగలతో కలసి దిగిన ఫోటో తీసుకొచ్చి చూశాం.
    నిజమే! ఆ దొంగల ముఠావేరు- ఈ దొంగల ముఠావేరు. దొంగల లీడర్ రంగారెడ్డి చేతిలోని ఫోటోలాక్కుని చూశాడు.
    "నీయవ్వ! ఈ రామప్పన్ గాంగ్ తో అగ్రిమెంట్ చేసినారు! ఆళ్ళది తమిళనాడు- మాది మహారాష్ట్రాయె- ఆళ్ళకు మాకు ఏం సంబంధమున్నది?"
    మా గుండెల్లో గ్రానైట్ రాళ్ళు పడినయ్.
    "అంటే! మీరు మరాఠీ దొంగలా?"
    "అవ్!"
    "మరి ఈడ - మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికెందుకొచ్చిన్రు?" అడిగాడు యాదగిరి.
    "మేమొక్కళ్ళమేంది బే! ఏస్టేటోళ్ళయినా ఈడకే వస్తారు"
    "ఏంటిక్కడ ఎట్రాక్షన్?"
    "ఈడ పోలీసు డిపార్ట్ మెంట్ ఇండియాలోనే బెస్ట్ డిపార్ట్ మెంట్ రా! మొన్ననే మా దొంగలందరం కలసి ఆలిండియా లెవల్లో ఒపీనియన్ పోల్ కండక్ట్ చేశాం. దాని ప్రకారం ఆంద్రప్రదేశ్ పోలీసులే పూర్తిగా చేతకాని దద్దమ్మలని తేలింది. మరి అందరూ ఈడకు రాకుండా ఇంకేడకు పోతార్రా?"
    మేమంతా ఒకరి మొఖాలొకరు చూసుకున్నాం.
    "అయితే ఇప్పుడేమంటారు?" అడిగాడు శాయీరామ్.
    "మీరు కూడా అగ్రిమెంట్ సైన్ చేస్తారా?"
    "నెలకు మామూలెంతిస్తారు?" అడిగాడు దొంగల లీడర్ అనుమానంగా.
    "వాళ్ళకిచ్చినట్లే- నెలకు అయిదువేలు! అది కాష్! ఇన్ కమ్ టాక్స్ కూడా ఉండదు మీకు-"
    "ఏంది? అయిదువేలా? మీకేమయినా దమాకున్నదా? అందులో మేమేం తినాలా- పోలీసులకేం ఇయ్యాల?"
    మేము ఉలిక్కిపడ్డాం.
    "వాట్? పోలీసులకివ్వాలా?" ఆశ్చర్యంగా అడిగింది సావిత్రమ్మ.
    "అవ్వమ్మా! మేమే ఏరియాలో దొంగతనం చేస్తే ఆ ఏరియా పోలీస్ స్టేషన్ల అయిదువేలు లంచం ఇవ్వాలే! గిట్ల మీతో అగ్రిమెంట్ జేసినట్లు తెల్సిందంటే పోలీసుల్తో మేము భీ ఇట్లనే అగ్రిమెంట్ చేసుకోవాల్సోస్తది."
    మాకేం చేయాలో అర్ధం కాలేదు. ఇది కొత్త కాంప్లికేషన్.
    "అంటే మరేం చేద్దామంటారు?" అడిగాడు గోపాల్రావ్.
    "పోలీసులకు అయిదువేలు- మాకు అయిదువేలు- మొత్తం పదివేలివ్వాలి" ఉలిక్కిపడ్డాం.
    "ఇలా ఒక్కొక్క స్టేట్ దొంగలకు పదివేలు మామూలు ఇస్తాపోతుంటే- మా కాలనీలో అందరం అడుక్కుతిన్నాగానీ మీ బాకీ తీరది" అన్నాడు యాదగిరి.
    చాలాసేపు డిస్కషన్స్ తర్వాత చివరకు వాళ్ళూ మేమూ ఒక అండర్ స్టాండింగ్ కొచ్చాం!
    మరాఠీ దొంగలముఠాకి మా కాలనీ నెలకు ఎనిమిదివేలు కట్టాలి. అందులో నాలుగువేలు వాళ్ళు పోలీసులకు కడతారు.
    అప్పటికప్పుడే అగ్రిమెంట్ సైన్ చేయటం జరిగిపోయింది.
    వాళ్ళందరికీ, చాయ్, సిగరెట్లు ఇచ్చి- అడ్వాన్స్ గా ఒకనెల మొత్తం ఇచ్చి సాగనంపేసరికి తెల్లారిపోయింది.
    ఆ రోజునుంచీ అందరం హాపీగా ఉండవచ్చనుకున్నాం గానీ - నిజానికి ఆ రోజునుంచీ ఎవరికీ కంటినిండా నిద్రలేదు.
    అందుక్కారణం- ఇంకే రాష్ట్రం నుంచి కొత్త దొంగల ముఠా వస్తుందో అన్న భయం-
    

        
                                   

                                          *    *    *

 Previous Page Next Page