"నాకర్ధం కాలేదు"
"అంటే?"
అంటే కాంగ్రెస్ (ఎ-బి), కాంగ్రెస్ (జడ్-హెచ్) అలా లక్షల కొద్ది కాంబినేషన్లతో బోలెడు పార్టీలు ఏర్పాటు చేసుకోవచ్చు."
"నిజమే" ఒప్పుకున్నాను.
"అయితే పద త్వరగా మరి ఎనిమిదింటికల్లా మీటింగ్ మొదలెట్టాలి."
వారానికోరోజు దొరికే ఈ రేషన్ నిద్రని వదులుకోవడానికి నాకు మనసొప్పలేదు.
"నాక్కొంచెం పనివుంది గురూ! మీరు మీటింగ్ స్టార్ట్ చేసేయండి. తరువాత వస్తాను" అన్నాను అబద్దమాడేస్తూ.
"అదేం కుదరదు. కాలనీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వయ్యుండి నువ్ రాకపోతే అందరూ గొడవచేస్తారు."
"సరే" అన్నాను గత్యంతరం లేక.
ఇంకోసారి ఛస్తే కాలనీ కమిటీ పదవులే మాత్రం ఒప్పుకోకూడదని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాను.
శాయీరామ్ వెళ్ళిపోగానే- నేను రెడీ అయి మీటింగ్ జరిగే చోటుకి చేరుకున్నాను. అప్పటికే శాయీరామ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాబట్టి తానే దగ్గరుండి వేదిక, మైక్, షామియానాలు అన్నీ ఏర్పాటు చేయించేశాడు.
ఎనిమిదింటికి కాలనీలోని వాళ్ళు చాలామంది మీటింగ్ కొచ్చేశారు.
"కాలనీ ప్రెసిడెంట్ గోపాల్రావ్ గారు ముందు మాట్లాడుతారు." అన్నాడు శాయీరామ్ మైక్ దగ్గర నిలబడి.
గోపాల్రావ్ మైక్ దగ్గరకొచ్చాడు.
"సోదరులారా! ఉన్న పార్టీలతోనే మనమందరం నానా ఇబ్బందులూ పడుతూంటే గోరు చుట్టుపై రోకటిపోటులా ఇప్పుడు కాంగ్రెస్ (జడ్) అవతరించింది. ఆ పార్టీ తాలూకూ అభ్యర్ధి నిన్నే మన కాలనీకొచ్చి మనం ఆయనకే ఓట్లువేస్తే మన కాలనీలో ప్రతి ఇంటికీ ఓ ఇత్తడి బిందె ఇస్తానన్నాడు. కనుక మనం ఇప్పుడు పరిస్థితిని సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది."
"ఇత్తడి బిందె ఏ సైజుది?" ఎవరో ఒకామె ఆడవాళ్ళలో నుంచి అడిగింది.
"సైజు వివరాలు ఆయనింకా అందజేయలేదని నేను మనవి చేస్తున్నాను."
"మిగతా పార్టీలవాళ్ళు ఏమంటున్నారు?" మరొకావిడడిగింది ఆశగా.
"మిగతావాళ్ళల్లో కాంగ్రెస్ (డబ్ల్యూ) వాళ్ళు అదివరకు లాగానే ప్రతి ఓటుకి ఓ చెంచా ఫ్రీగా ఇస్తారు. ఇక టిడిపి (ఎక్స్) వాళ్ళు ప్రతి ఇంటికి ఓ ప్లాస్టిక్ బకెట్ ఇస్తామంటున్నారు. టిడిపి 'క్యూ' వాళ్ళు ప్రతి ఇంటికీ ఓ అమెరికన్ బ్రాయిలర్ చికెన్ ఇస్తారట. ఒకవేళ ఎవరయినా కోడి తిననివారుంటే వాళ్ళకి కోడికిబదులుగా కోడిగుడ్లు ఇచ్చేస్తారు. కాంగ్రెస్ (జి) వాళ్ళు ప్రతి ఓటరుకి పదకొండు గాలన్ల గుడంబా పోస్తారట కనుక...."
అతనిమాట పూర్తికాకుండానే సావిత్రమ్మలేచి నిలబడింది.
"మిగతా పార్టీలు ఇస్తామంటున్న సామాన్లన్నీ ఇదివరకు ఎలక్షన్లలోనే సమకూర్చుకున్నాం. ఇంతవరకూ ఎవరూ ఇత్తడి బిందె ఇవ్వలేదు. కాబట్టి మన ఓటు కాంగ్రెస్ (జెడ్) కే వేసేద్దాం."
దాంతో అంతా రణగొణధ్వనులు మొదలయ్యాయ్.
"ఆ బిందెసైజు తెలుసుకోందే మాటెలా ఇస్తాం?" అని ఒకరు.
"నా చీరలన్నీ బొత్తిగా చిరిగిపోయాయి పిన్నిగారూ! బిందె బదులు నాలుగు చీరలిమ్మంటే ఇవ్వరంటారా" అని ఇంకోకావిడ.
"కిందటిసారి వాళ్ళిచ్చిన స్టీలు చెంచాలు తుప్పు పట్టిపోయాయి. ఆ సచ్చినోళ్ళని ముందా చెంచాలు వాపసు తీసుకుని మంచివి ఇమ్మని కబురు చేయండి" అని ఇంకొకావిడ.
ఈ రణగొణ ధ్వనిలోంచి ఒకావిడ కంఠంలో ఖంగుమనిమోగింది.
"అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోయాయి! ఇంకా ఈ బిందెలూ, చీరలూ, చెంచాలు ఏమిటి! నా మొఖం! టి.వి. సెట్లుగానీ, స్టీలు అల్మారాలుగానీ ఇవ్వమని అడగరాదూ?"
"అవునవును. ఎంతకాలం ఈ చిల్లరబేరాలు?" ఇంకెవరో సపోర్టుచేశారు.
నేను గొంతు సవరించుకున్నాను.
"అంతఖరీదయినవి ఎవరిస్తారు? ఒక్కో ఇంటికి ఓ టి.వి సెట్టంటే చూడండి మరీ-- కనీసం రెండుకోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది వాళ్ళకి అదెలా సాధ్యం?" అన్నాను నచ్చచెప్తూ.
"ఏం మాయరోగమేమిటి? స్టాంపుల కుంభకోణాల్లోనూ, ప్రభుత్వ భూముల కుంభకోణాల్లోనూ ఇంకా ఇతరత్రా ఇంతకు పాతికరెట్లు సంపాదించుకోరా." విరుచుకుపడిందొకావిడ.
"సంపాదించుకున్నాగానీ- వాళ్ళు ఖర్చుచేయరు-" నన్ను సమర్ధిస్తూ అన్నాడు గోపాల్రావ్.
"చేయకపోతే పోనీండి. మన ఓటు కూడా వాళ్ళకేయం" అందామెమొండిగా.
ఆడాళ్ళతోనూ పోలీసులతోనూ ఎప్పుడూ వాగ్వివాదం పెట్టుకోకూడదని మా గోపాల్రావ్ చెప్పిన విషయం నాకు గుర్తుంది. అంచేత ఆ విషయం శాయీ రామ్ కి కూడా గుర్తుచేశాను.
అతను వెంటనే సైలెంటయిపోయాడు.
ఈలోగా ఓటాక్సీ వేగంగా వచ్చి ఆగిందక్కడ. అందరం ఆశ్చర్యంగా అటువేపు చూడసాగాం. టాక్సీలోంచి మా కాలనీలోనే ఉంటున్న శ్యామల్రావు ఖద్దరు చొక్కా పంచెతోదిగి చిరునవ్వుతో మా అందరికీ నమస్కారం చేశాడు. అందరికీ మతిపోయినట్లయింది ఆ అవతారం చూసి.
"శ్యామల్రావ్ గారికి జై" అంటూ వెనుకే వాళ్ళ పెద్దబ్బాయి కూడాదిగాడు.
శ్యామల్రావ్ చిరునవ్వుతో వేదిక మీదకు వచ్చి నిలబడి జనార్ధన్ తోనూ, శాయీ రామ్ తోనూ, నాతోనూ కరచాలనం చేశాడు.
"తమరు అనుమతిస్తే నా ఓటర్లకు ఓ అభ్యర్ధన చేస్తాను" అన్నాడు చిరునవ్వుతో.
"మీ ఓటర్లేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు జనార్ధన్.
"మీరంతా నా నియోజకవర్గంలోని ఓటరులే కదా! కనుక మన కాలనీ ఓట్లన్నీ నాకే వేయడం న్యాయమని మనవిచేస్తాను" చిరునవ్వుతో అన్నాడు.
ఆ చిరునవ్వు చూస్తూంటే నేను చూస్తున్నది కలో నిజమో అర్ధంకావటంలేదు నాకు. నేను ఆ కాలనీలోగత పదేళ్ళుగా ఉంటున్నాను. ఈ పదేళ్ళలో ఏ ఒక్కరోజు కూడా అతను నవ్వటం ఎవ్వరూ చూడలేదు.
"అంటే.... అంటే.... మీరూ ఎలక్షన్ లో...."
"అవున్నాయనా! మన నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నాను." అప్పుడే పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించి వచ్చిన పెద్దమనిషిలా శాంతంగా అన్నాడతను.
మా సంభాషణ అంతా మైకులో అందరికీ వినబడుతూండడంవల్ల సభలో కలకలం బయల్దేరింది.
"సోదరులారా! మీకు నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరంలేదని నాకు తెలుసు. ఎందుకంటే నేను మీ వాడిని. మీలోపుట్టి పెరుగుతున్న మన కాలనీవాడిని, ఎలక్షన్లో నేను కూడా ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నానని మీకందరకూ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. నిజానికి నాకసలు రాజకీయాలంటే మీ అందరిలాగానే చిరాకు. కానీ ఈ రోజున మనదేశంలో అస్తవ్యస్త పరిస్థితులు చూశాక గుండెద్రవించిపోయి ఒక్కదూకుదూకాను. కనుక నన్ను మీరందరూ తప్పక ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను ఎన్నుకుంటే 159 నెంబర్ బస్ ని కాలనీ లోపలి వరకూ లాక్కొస్తారు. పైప్స్ లో మంచినీళ్ళు దొరికే టైముని అర్దరాత్రి నుంచి ఉదయం మూడింటికి మార్చేస్తాను. మన కాలనీలో ఉన్న పిచ్చికుక్కల్ని పక్కకాలనీలోకి తరిమేయిస్తాను" ఆగాడతను.