Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 7

    "ఏ ముఖం పెట్టుకుని వస్తాడు? ఎప్పటికీ రాడు. వచ్చినా అతడి ముఖాన పేడనీళ్ళు జల్లి బయటకు పంపుతాను కానీ, లోపలకు రానీయను."    
    "దట్సాల్ రైట్! ఇక మీ పాత కథ గురించీ మనిద్దరిలో ఎవ్వరమూ తలచుకోనక్కరలేదు."    
    "ఒక్కమాట చెప్తాను. నేను బలహీనురాలినయి అతడికి లొంగి పోలేదు. వాడు 'ఈ మాత్రం నమ్మకం లేకపోతే ఇక ప్రేమకు అర్ధమేమిటీ!' అని నిష్టూరంగా మాట్లాడాడు అప్పుడు అతనికి కోపం వస్తుందనే భయంతో, అతడికి కోపం తెప్పించలేని బలహీనతలో....."    
    "లీవ్ ఇట్! నేను మిమ్మల్ని బాగా అర్ధం చేసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చాను దగ్గిర దగ్గిర పదిహేను రోజులు బస్ స్టాప్ లో నిలబడినా మీరేనాడూ నన్ను చూడలేదు. నన్నేకాదు. ఆ పరిసరాలలో ఎవరినీ చూసేవారుకాదు మీ కళ్ళలో కల్మషం లేదు. నిర్మలమైన కాంతి ఉంది. మీ మనసులో కుత్సితం లేదు అది కావాలి నాకు. కొందరు ఆడవాళ్ళని చూస్తుంటాను, వాళ్ళు కన్యలే కావచ్చు, కానీ, ఆ కళ్ళలో ఎంత చాంచల్యం? విలాసాల పేరిట, హోయలు పేరిట, ఆ అంతరంగం ఎంత వికృతంగా బయటపడుతూ ఉంటుంది? మీరు ఒక బిడ్డకు తల్లి అయ్యారు. అది ప్రకృతి సహజం. ధైర్యంగా మీ మాతృత్వాన్ని అంగీకరించారు. అంతమాత్రాన మిమ్మల్నేదో కళంకం చుట్టుకొందని అనుకోలేను."    
    "మీలాంటివాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు."    
    "మీలాంటివాళ్ళూ కొద్దిమందే ఉంటారు."    
    ఇద్దరూ నవ్వుకున్నారు.    
    "కానీ, అమ్మ విషయం కూడా నా మనసును స్థిమితంగా ఉండనీయటంలేదు. ఈ వయసులో ఈ దశలో ఆమెనలా ఒంటరిగా వదలి నేను మీ ఇంటికి రాగలనా?"    
    "నేను ఆ విషయం కూడా ఆలోచించాను. ముందు మన పెళ్ళిజరిగి పోనీయి. ఆ తర్వాత శకుంతలతోపాటు మీ అమ్మను మన యింటికి పిలిపించుకునే మార్గం ఆలోచిస్తాను,"    
    "థాంక్యూ! నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?"    
    "నిరభ్యంతరంగా!"    
    "మీరు ఇంతవరకూ ఎందుకు పెళ్ళి చేసుకోలేదు?"    
    "నేను చదువుకునే రోజుల్లో ఒకమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్లే ఉంటూ, నా కంటే డబ్బున్నవాణ్ని పెళ్ళి చేసుకుంది. మీ ఆడవాళ్ళందరూ మొగవాళ్ళు కట్నాలు తీసుకుంటున్నారని గోల పెడతారుగానీ, మీరు కూడా మనిషికంటే, మనసుకంటే, డబ్బు, హోదా, ఇవే ప్రధానంగా చూస్తారు."    
    "అవును. అది నేనూ చూస్తున్నాను." ఒప్పుకుంది విమల.    
    "ఆ తరువాత నాకు ఆడవాళ్ళంటేనే విరక్తి కలిగింది. ఎవరినీ చేసుకోవాలనిపించలేదు."    
    "మరి నన్నెందుకు అభిమానించారు? నాలో ఆమె పోలిక లున్నాయా?"    
    "ఛ - ఛ! నీ కళ్ళలో అంతకుముందు నేను ఏ స్త్రీ కళ్ళలోనూ చూడని స్వచ్చత, అమాయకత్వం కనిపించాయి. ఆ కళ్ళను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి మీ షాప్ కి వచ్చేవాడిని ఆ తరువాత నిన్ను నా సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయానికి వచ్చాకే నిన్ను బస్ స్టాప్ లో పలకరించాను."    
    "నేను ఒక విషయం చెపితే మీరు నమ్మగలరా?"    
    "నువ్వు అబద్దమాడతావని నేను అనుకోను. ఆ అవసరం నీకు లేదు."    
    "ఈ స్థితిలో ఉన్న నాకు ఏదో ఒక ఆధారం దొరికితే చాలని మిమ్మల్ని పెళ్ళిచేసుకోవాలని అనుకోవటంలేదు. నేనూ మిమ్మల్ని ప్రేమించాను ఆ సంగతి మీరు షాప్ కి రావటం మానేశాక తెలిసింది."    
    "థాంక్యూ! ఇంకా ఆటో పిలవనా?"    
    విమల తల ఊపింది.
    
                                                              5
    
    మరీ పెద్దది కాని డాబా ఇల్లు ముందొక పూలతోట. ఆతరువాత చిన్న బాల్కనీ అందులో నాలుగయిదు కేన్ చెయిర్స్. అది దాటాకహాలు అందులో సోఫాలు-మధ్య టీపాయ్ గోడకు ఏవో సీనరీస్. గుమ్మాలకు ప్రింటెడ్ కర్టెన్స్. విమల హాలులోకిరాగానే, జేగంట గణగణమ్రోగింది. విమల ఉలిక్కిపడినట్లయి ముందుకు వేయబోయిన అడుగు వెనక్కు తీసుకుంది. శర్మ నవ్వి, "భయంలేదు అమ్మ పూజ ఇప్పుడే ముగిసినట్లుంది. ఇక కాస్సేపట్లో హాల్లోకి హారతీ, ప్రసాదాలూ వస్తాయి" అన్నాడు.    
    అంతలోనే హారతి పళ్ళెం చేత్తో పట్టుకుని హాల్లోకి వచ్చి మరోసారి గంట గణగణ మ్రోగించింది ఈశ్వరి. ఆ శబ్దం వినగానే బడిగంట విన్న స్కూల్ పిల్లలా-దొడ్లోంచి పనిమనిషి పక్కగదిలోనుంచి సీతాపతి ముందు ఇంట్లోనుంచి ముగ్గురు చిన్న పిల్లలు, అన్నివైపులనుండి గుమిగూడారు. ఈశ్వరి విమలను ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిచేసి చూసింది. కానీ ఏమీ మాట్లాడలేదు. హారతి ఇస్తున్నప్పుడు ఆవిడ మాట్లాడదు. అందరూ హారతి అతి భక్తిగా కళ్ళకద్దుకొంటూంటే, తెల్లబోయి నిలబడ్డ విమల-శర్మ నెమ్మదిగా చేత్తో పొడిచేసరికి తనూ హారతి భక్తితో కళ్ళకద్దుకుంది. ఆ తరువాత హారతి పళ్ళెంతో బయటకు వచ్చింది అప్పుడు అడిగింది- "శ్రీ! ఈ అమ్మాయి ఎవర్రా?" అని.    
    "మన కామేశ్వరి లేదూ-దాని స్నేహితురాలమ్మా! కామేశ్వరి నువ్వు పురాణం బాగా చదువుతావని చెప్పిందట. ఒక్కసారి విందామని వచ్చింది."
    తెల్లబోయి చూసింది విమల. ఈశ్వరిమాత్రం. కామేశ్వరి స్నేహితురాలు నీకెలా తెలుసని అయినా అడక్కుండా తన పురాణం వినడానికి ఒకరు అతి శ్రద్దతో వచ్చినందుకు మురిసిపోతూ, "ఆఁ! ఏమిటో ఏదో చదువుతాను. ఈ రోజుల్లో ఎవరికీ కావాలి ఇలాంటివి? అయినా నేను బాగా చదువుతానని అందరూ అంటారనుకో" అంది ప్రసాదాలు పంచుతూ-    
    "ఇదిగో గౌరీ ప్రసాదం ఇది లక్ష్మీదేవి ప్రసాదం. ఇది కేశవ స్వామి ప్రసాదం, ఇది ఏడుకొండల వెంకన్న ప్రసాదం" అని వివరించసాగింది. ఆవిడ 'భేదము లేని భక్తికి' నివ్వెరపోతూ నిలబడి పోయింది విమల.    
    అక్కడున్న మిగిలిన వాళ్ళందరికీ ఆ దేవుళ్ళ పేర్లన్నీ తెలుసు. రకరకాల ప్రసాదాలు రుచిగానేకాక భారంగా కూడా ఉంటాయని తెలుసు. అందుచేత ఒక దేవుడి ప్రసాదం చేతిలో పడగానే కళ్ళ కద్దుకుని నోట్లో వేసుకుని మరో ప్రసాదం కోసం చెయ్యి జాపేవారు. వాళ్ళనిచూసి సంకోచపడుతూ విమల కూడా అలాగే చేసింది. ప్రసాదాలు పంచటం అయ్యాక అప్పుడు పట్టుబట్ట మార్చుకుని సోఫాలో వచ్చి కూచుంది ఈశ్వరి.

 Previous Page Next Page