Previous Page Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 7

 

     రామచంద్రమూర్తి ఆ కుర్రాడి భుజం తట్టాడు ఆప్యాయంగా.
    "నిజమే! మనం ప్రాక్టీస్ చేస్తోంది మెంటల్లీ డి రాంగ్ డ్ డెమోక్రసీ!"
    "అంటే పోలీసులు, గుండాలు వప్పుకున్నంత మేరకు స్వేచ్చా స్వాతంత్ర్యాలతో బ్రతకటం" బస్ లో ఇంటికి బయలుదేరాడతను. దారిలో రహమాన్ దుకాణం దగ్గర ఆగాడు. అతనికింకా అప్పు పెట్టమని ఎలా అడగాలో అర్ధం కావటం లేదు.
    రెహమాన్ వినయంగా లేచి సరుకులన్నీ ఇందాకే పంపించాను సార్" రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయాడు.
    'అలాగా! చాలా థాంక్స్ రహమాన్! ఇంకో నెలరోజుల్లోనే నా పెన్షన్ ఫిక్సయి పోతుంది. ముందు నీ బాకీయే తీర్చేస్తాను."
    "బాకీదేముంది సార్! మీ దగ్గరెక్కడికి పోతుంది! దాన్ని గురించి ఏమీ వర్రీ అవకండి" ఉదయం సరుకులివ్వనని తిప్పికొట్టిన వాడిలో ఇంత సడెన్ గ మార్పెలా వచ్చింది? వెనక్కి తిరుగుతుంటే అన్నాడతను.
    "నటరాజ్ చెప్పాడు సార్ మీరు కార్పోరేషన్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారని నా సపోర్ట్ మీకు తప్పకుండా వుంటుంది."
    రామచంద్రమూర్తి నివ్వెరపోయాడు.
    "నేను ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నానా?"
    "మీరు తప్పకుండా గెలుస్తారు సార్! ఈ వార్డ్ లో జనమంతా కావాలని మిమ్మల్ని నిలబెడుతున్నారని నటరాజ్ చెప్పాడు."
    "అదా! అవునవును" అనేసి అక్కడి నుంచి వచ్చేశాడతను.
    నటరాజ్ అలా అబద్దాలు చెప్పటం చిరాకు కలిగించిం\డతనికి. అయినా 'రాజకీయం' ఆనేసరికి యింతా మర్యాదా? ఇంత భయమా?  యింటి     దగ్గర కొస్తుంటే ఉమాదేవి అరుగు మీద జడ ముందుకి వేసుకుని నిలబడి కనిపించింది.
    రామచంద్రమూర్తిని చూసి నవ్వింది.
    "బావగారెక్కడికెళ్ళి వాస్తున్నారో?"
    "సికింద్రాబాద్!"
    "మీ ప్రయత్నం వృధా! మీకెవరూ వుద్యోగం యివ్వరు. నటరాజ్ చెప్పినమాట విని ఎలక్షన్స్ లో నిలబడండి! మా విప్లవనారీ సమితి మెంబర్స్ అందరితో మీకే ఓట్లు వేయిస్తాను."
    "ఓహో! నటరాజ్ చాలా పెద్ద ఎత్తునే ఏదో డ్రామా మొదలెట్టి నట్టున్నాడు. వాడి సంగతేమిటో తేల్చుకోవాలి ముందు" అంటుండగానే సీత బయటికొచ్చి వారిద్దారినీ చూసి ముఖం చిట్లించుకుంది.
    "లోపలకు రండి! అక్కడ నిలబడ్డారెందుకు?"
    "వస్తున్నానండీ! రాకెక్కడికి పోతాను" అంటూ లోపలకు నడిచాడతను.
    "మధ్యాహ్నం భోజనం చేయకుండా ఎక్కడ తిరుగుతున్నారు? వేళకు రెండు ముద్దలు తినకుండా బాగున్న ఆరోగ్యం కూడా చెడగొట్టుకుంటారా ఏమిటి?"
    చిరుకోపంతో అందామె.
    రామచంద్రమూర్తి కాళ్ళూ, చేతులూ కడుక్కొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
    "నటరాజ్! త్వరగా భోజనం వడ్డించు" తనూ అతనేదురుగా కూర్చుంటూ అంది.
    "అదేమిటి? నువ్వూ తినలేదా?"
    "మీరొస్తారని ఎదురు చూస్తున్నాను."
    నటరాజ్ యిద్దరికీ భోజనం వడ్డించాడు.
    "అయన కోసం మీరూ, మీ కోసం ఆయనా అలాగే ఎదురుచూస్తూ కూర్చోండి! నేను మాత్రం ఎవరికోసమూ ఎదురుచూడను" అన్నాడతను.
    "అది సరే గానీ నటరాజ్! మనవాళ్ళందరికీ ఏదో ప్రచారం చేస్తున్నావట ఏమిటి సంగతి?" అడిగాడు రామచంద్రమూర్తి.
    "ప్రచారం ఎందుకయిందీ? ఉన్నమాటే చెప్తున్నా. మన వార్డ్ లో అందరూ అదే మాట అంటున్నారు."
    "ఏమని? నేను ఎలక్షన్స్ లో నిలబడలనా?"
    "మీరంటే ఖచ్చితంగా మీరని కాదనుకోండి! కొంచమయినా సిగ్గు, శరం, నీతి, నిజాయితీ ఉన్న వాళ్ళెవరయినా ఎన్నికల్లో నిలబడితే బాగుండు , మన వార్డ్ బాగుపాడుతుంది అనుకుంటున్నారండీ! మరి అవన్నీ వున్న కాండిడేట్ మీరే కదండీ!"
    "నటరాజ్ నీకు ఆఖరి వార్నింగ్ యిస్తున్నాను! అయనకలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ రేకేత్తించకు అసలే అమాయక చక్రవర్తి . నిజమని నమ్మినా నమ్ముతారు" నవ్వుతూ అంది సీత.
    "నేనేం చెవిలో పూలు పెట్టుకున్నాననుకున్నారా! ఎవరేం చెప్తే అది చేసేయడానికి?" నిష్టూరంగా అన్నాడు రామచంద్రమూర్తి.
    "అంకుల్" అంటూ శాంతి స్కూలు యూనిఫారం లో పరుగెత్తు కుంటూ వచ్చింది.
    "ఈ రెండేళ్ళల్లో ఒకవేలు పట్టుకోండి!"
    "ఏమిటి విశేషం?"
    "ఈ రెండు కొచ్చేన్స్ లో ఒకటి పరీక్షలో వస్తుందని తెలుసు! అందులో ఏది వస్తుందో నువ్వే చెప్పాలి. త్వరగా పట్టుకో, పరీక్షకు టైమాయిపోతోంది."
    రామచంద్రమూర్తి ముఖం సీరియస్ గా పెట్టాడు.

 Previous Page Next Page