Previous Page Next Page 
షా పేజి 7

 

    "అయ్యో! ఎప్పుడో నీ వాగుడుకి నా తల కాస్తా పేలిపోతుంది" అందామె రెండు చెవులూ మూసుకుంటూ.
    "అయితే - నీ తల క్షేమంగా వుండాలంటే మరి - టిక్కెట్ తీసుకో వదినా--"
    "సరే సాయంత్రం మీ అన్నయ్య వచ్చాక చెప్పి తీసుకుంటాన్లే--"
    "బాబోయ్ - అంతపని చేయకు!"
    "ఏం ఎందుకని?"
    "రెండో టికెట్ అన్నయ్యకే అమ్మాలి తల్లీ! నా బేరం చెడగొట్టకు."
    "బాగుంది, నేను మీ అన్నయ్య వేరునా?"
    "అంతేగా వదినా! ఈ టిక్కెట్స్ కి సంబంధించినంత వరకూ శంకూ, సీతా కూడా వేరే వేరే"
    "సరే! అయితే ఇప్పుడే ఫోన్ చేసి దీపకు చెప్తాను - అన్నీ ఇంట్లోనే అమ్ముతున్నవని!"
    "అయ్యొయ్యో! అంతపని చేయకు. మన పరువు పోతుంది. అల్ రైట్! నువ్వొక్క టిక్కెట్టే తీసుకో వదినా! మిగతావి తీసుకుని వీధిన పడతాను.---" అంటూ ఓ టిక్కెట్ ఆమె చేతిలో వుంచి బయటకు పరుగెత్తాడు.
    "కాబోయే పెళ్ళాం కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాడు" నవ్వుతూ అంది సుభద్ర.
    శ్రీధర్ చాలాసేపు తన చాంబర్ లోనే కూర్చుండిపోయాడు. ఆపీస్ స్టాప్ అంతా ఇళ్ళకు వెళ్ళిపోయారప్పటికే. సీలింగ్ ఫాన్ గాలిని కోసే శబ్దం , లేచి కిటికీ కి అడ్డుగా వున్న కర్టేన్స్ పక్కకు లాగాడు. కింద రోడ్డు మీద ట్రాఫిక్ చాలా రద్దీగా వుంది.
    తను అనుకున్నదాని కంటే వేగంగా కంపెనీ పరిస్థితి దిగజారిపోతోంది. మార్కెట్లో వున్న స్టాక్ ఏమాత్రం అమ్ముడవటం లేదు.డాక్టర్లకు , ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన "బాన్" అనుమానాలను కలిగించింది.
    మెడికల్ రిప్రజెంటేటివ్ లు కొంతమంది అప్పుడే వేరే కంపెనీ లలో జాయినయిపోయారు. మిగతా ఆఫీస్ స్టాప్ కూడా వాంటెడ్ కాలమ్స్ వెదుకుతున్నారు.
    బాకీ వున్న టాక్సులు, బాంక్ లోన్ - అన్నీ కట్టివేస్తే - తను ఒక్క పైసా కూడా బాలెన్స్ లేకుండా మిగులుతాడు.
    అదే తనను బాదిస్తున్న విషయం.
    డబ్బు విషయంలో తను చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. పేకాట, రేసులు ఈ రెండూ తన అద్భుతమైన ఆర్ధికపరిస్థితిని మాములు స్థితికి దిగజార్చాయ్. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిస్తే బహుశా వాటికి జోలికి పోయేవాడు కాదేమో! కానీ ఆలోచన అప్పుడు రావటం టూ లేట్!
    "సార్!" ఫ్యూన్ లోపలకొచ్చి నెమ్మదిగా పిలిచాడు. శ్రీధర్ ఆలోచనల్లోంచి తేరుకున్నాడు.
    "ఏమిటి?"
    "టైము తోమ్మిదవుతుంది సార్------"
    శ్రీధర్ ఆఫీసులోనుంచి బయటకొచ్చి కారులో కూర్చున్నాడు --- ఎటు వెళ్ళాలో అతనికి తెలీటం లేదు.
    ఇంటికా! అప్పుడే ఇంటికి వెళ్ళడానికి మనస్కరించడం లేదు. ఇంత త్వరగా వెళ్తే సుభద్ర తన మూడ్స్ చదివేస్తుంది.
    ఎందుకలా వున్నారని అడిగితే కారణం చెప్పలేదు.
    జరుగుతోదంతా చెప్తే -----తనతో పాటు ఆమె కూడా బాధపడటం తప్పితే - ---మరో ఉపయోగం లేదు. అసలు తన బాధ ఇంకెవరూ పంచుకోవడం తన కిష్టం లేదు. సుభద్రా , తన తమ్ముడు సృజన్ , తన పిల్లలూ - వీరందరినీ వారించే అధికారం తన కేక్కడుంది? చేతనయితే అందరినీ నిలబెట్టాలి. అంతవరకే! అసలు తమ కంపెనీ మూతపడబోతున్న విషయం , దారుణ పరిస్థితిలో వున్న తమ ఆర్ధికస్థితి - ఇవేమీ వారికి తెలీకూడదు.
    కారు ఎక్కడెక్కడో తిరిగి ఓ ఖరీదయిన బార్ ముందాగింది.
    ఇదే మొదటిసారి తను ఒంటరిగా ఈ బార్ కి రావటం. సాధారణంగా తమ కంపెనీ కి సంబంధించిన పార్టీలకు అందరితో బాటు వస్తుండేవాడు. అంచేత పేకాట, రేస్ లు అలావాటయినట్లుగా ఈ తాగుడు తనకి అలవాటు కాలేదు కానీ ఇవాళ తాగాలనిపిస్తోంది.
    భరించలేనంతగా పెరిగిపోయిన ఆందోళనను తగ్గించడానికి అదొక్కటే మందేమోనని అనిపిస్తోంది.
    "హలో" ఎవరో భుజం మీద చేయి వేసేసరికి ఉలిక్కిపడి తల పక్కకి తిప్పి చూశాడు.
    "ఏమిటోయ్ ఆ కంగారు" నవ్వుతూ పలకరించాడు ప్రకాష్.
    "నువ్వా?"
    "నేనేగానీ అలా ఆ బార్ తాలుకూ బోర్డూ వంక చూస్తూ నిలబడ్డావేమిటి? బాగా నిషా వచ్చేవరకూ వాసన చూసి వెళ్ళి పోదామనుకుంటున్నావా?" నవ్వుతూ అడిగాడతను.
    "పద -- లోపలికెళ్దాం!" అన్నాడు శ్రీధర్.
    ఇద్దరూ లోపలకు నడిచి ఓ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. బార్ అంతా ఇంచుముంచుగా పుల్ అయిపొయింది.
    "మనదేశంలో సినిమాహల్స్, బార్స్ - ఎప్పుడూ "హౌస్ ఫుల్" కెపాసిటీ లో నడుస్తుంటాయ్ అనుకుంటాను" అన్నాడు ప్రకాష్.
    "అవును."
    "మనం కలుసుకుని సంవత్సరం అవుతోంది కదూ?"
    "అవును, అప్పుడు రెగ్యులర్ గా క్లబ్ లో కలుసుకునేవాళ్ళం. ఆ తరువాత నేను క్లబ్ మార్చేశాను."
    "ఎందుకని?"
    "ఇక్కడ అలవాటయిపోయింది. మా క్లయింట్స్ రోజూ ఇక్కడే పార్టీలిస్తుంటారు......."

 Previous Page Next Page