ఇసుక వేస్తె రాలనంత జనాభా కలిగిన భారతదేశంలో ఓ నిమిషం సమయంలో ఎన్ని అద్భుతాలు జరిగినా ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి అద్భుతాలు ఎన్ని జరగటానికయినా ఓ నిమిషం చాలా ఎక్కువని కూడా అనుకోవచ్చు.
ముఖ్యంగా భవానీశంకర్ తలుపు తట్టిన తర్వాత ఓ నిమిషం సమయంలో బయట చాలా వింతలు జరిగాయ్. తలుపు తీసేలోపుగా సిగరెట్ వెలిగించుకుని రిలాక్స్ అవుదామని అతగాడు ముచ్చట పడుతుండగా వెనుక నుంచి "స్స్- స్స్- స్స్" అన్న శబ్దం వినిపించింది.
"స్- స్ స్- " అన్న శబ్దానికి మిగతా చోట్లేమో గాని హైదరాబాద్ లో చాలా రకాల అర్ధాలున్నాయి.
అ శబ్దం సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు చేస్తే దానర్ధం "మా సైకిల్ కి బెల్ లేదు! కనుక మీ ఆరోగ్యం కాపాడుకోడానికి పక్కకు తప్పుకోండి" అని!
అదే మీరు హోటల్లో కివెళ్లి కూర్చుని "స్-స్స్-స్- " అంటే "హలో బేరేర్ - త్వరగా రా" అని అర్ధం.
రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ శబ్దమే వెనుక నుంచి వినిపిస్తే "హలో ఎక్స్ క్యూజ్ మీ ప్లీజ్" అని అర్ధం అన్నమాట.
హైదరాబాద్ చేరుకున్న కొద్దిరోజులలోనే ఇలాంటి కోడ్ లాంగ్వేజ్ లు అన్నీ క్షుణ్ణంగా నేర్చేసుకోటం వలన భవానీశంకర్ కి "స్-స్-స్" అంటూ వినిపించిన శబ్దానికి ఏ మాత్రం చలించలేదు. వెనక్కు తిరిగి చూడనూ లేదు.
"యస్ ప్లీజ్" అన్నాడు గేటు దగ్గర తచ్చట్లాడుతున్న లావుపాటి ఆయనతో.
'ఆర్ . కె. శ్యామ్ ఇల్లిదేనా" అడిగిందా ఆకారం గేటు తెరచుకుని లోపలి కొచ్చేస్తూ.
"యస్ కామ్రేడ్! ఇదే ఆర్. కె. శ్యామ్ ఇల్లు" అన్నాడు భవానీశంకర్.
"ఆర్. కె. శ్యామ్ ఇంట్లో వున్నాడా?" తిరిగి అడిగిందా ఆకారం.
"అది తెలుసుకోవటానికే నేనూ ప్రయత్నాలూ చేస్తున్నాను కామ్రేడ్ త్వరలో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది!"
"ఓ అయ్ సి అయ్ సి -" అంటూ మెట్లెక్కి తనే స్వయంగా డోర్ బెల్ మోగించాడతను. భవానీశంకర్ తను మెట్లు దిగి క్రింద నిలబడి డోర్ బెల్ మోగించే అధికారాన్ని పూర్తిగా ఆ లావుపాటి ఆకారం హస్తగతం చేశాడు.
ఈ అద్భుతాలన్నీ కేవలం ఒకే ఒక్క నిమిషంలో జరిగాయ్.
"అంతే!"
ఆ తరువాత కార్యక్రమం మాత్రం చాలా వేగంగా జరిగిపోయింది . ధడేలున తలుపులు తెరుచుకోవటం , స్మితారాణి ఓ లావుపాటి కర్ర తీసుకుని ఆ ఆకారం నెత్తిన బలంగా కొట్టటం ఆ ఆకారం "అబ్బా" అని ఆవులా అరుస్తూ ఆ మేట్ల మీదే కుప్పకూలి పోవడం క్షణంలో జరిగిపోయింది.
భవానీ శంకర్ ఆ దృశ్యాన్ని క్రైమ పిక్చరు లో క్లయిమాక్స్ సీను చూస్తున్నట్లు చూడసాగాడు.
అభిల భాను అర్ధం పర్ధం లేని అవార్డు సినిమా చూస్తున్నట్లు పీలయితే స్మితారాణి తన పెద్ద కళ్ళను మరింత పెద్దవిగా చేసి -- చూసింది హైదరాబాద్ టి.వి. నాటకం చూసినంత షాక్ తో.
హటాత్తుగా వెలసిన శిలా విగ్రహంలా నిలబడిపోయిందామె.
అనిశ్చేష్ట షాకుల పర్వం నుంచి ముందస్తుగా కోలుకుంది ఆ లావుపాటి ఆకారమే. అప్పటికప్పుడే బట్టతల మీద అర్జంటుగా కట్టిన బొప్పిని తడుముకుంటూ "అంబా" అని మరోసారి అని నెమ్మదిగా లేచి నిలబడ్డాడతను.
"మైగాడ్ కొంపమునిగింది!" అంది అఖిలభాను ఆ వ్యక్తీ వేపు భయభక్తులతో చూస్తూ.
భవానీశంకరు చప్పున ఆ వ్యక్తికీ సహాయం చేస్తూ "పదండి లోపల కుర్చుందురు గాని" అన్నాడు.
అఖిలభాను ఆ వ్యక్తికీ చేయి అందించి లోపలకు నడిపించింది. ఆ వ్యక్తీ కుర్చీలో కూలబడుతూనే మరోసారి బాధగా మూలిగి వెనక వాలి కూర్చుని తల వాల్చేశాడు .
అభిల భాను తడబడుతూ మాట్లాడసాగింది.
"సార్! ఐయామ్ వెరీ సారీ! మా ఫ్రెండ్ స్మిత పొరపాటున మీరే అతననుకుని అహహ అతనే డోర్ బెల్ అనుకుని ఆహా అదికాదు. డోర్ బెల్ మీరనుకుని ........" అంటూ తడబడి పోతుంటే భవానీశంకరు చప్పున అందుకున్నాడు.
వదినమ్మా! ఈ కామ్రేడ్ కొంచెం షాక్ లోకి వెళ్ళినట్లు వున్నాడు వివరాలన్నీ వచ్చే సంచికలో ఆయనకి చెప్పవచ్చులే - " అన్నాడు ధైర్యం చెపుతూ.
అఖిల భానుకి భయం బెరకూ పోలేదు.
"అయ్యో ! ఇప్పుడేమిటి చేయటం? ఈయనేవరనుకుంటున్నావు? శ్యామ్ పనిచేసే ఆఫీసులో సూపర్నంటుగారూ! ఈ ఉద్యోగం పర్మినెంట్ అయేలా రికమెండ్ చేయించడానికి కని ఆయనను భోజనానికి పిలిచాడు శ్యామ్" అందామె పాలిపోయిన మొఖంతో.
"డోంట్ వర్రీ సిస్టరిన్ లా! ఇంటికి వచ్చే అతిధుల నెత్తిమీద అమ్మాయిలు పోల్ వాల్టు ప్రాక్టీస్ చేయడాన్ని నేను హర్షించను గానీ పొరపాట్లు అనేవి హిట్లర్ కైనా సహజం! అంచేత ఈ కామ్రేడ్ వ్యవహారం నేను చూసుకుంటాను. మీరేం వర్రీ అవకుండా ముందు ఏ క్లాస్ కాఫే చేసుకురండి. రెండు కప్పులు తెస్తే బెటర్" అన్నాడు భవానీశంకరు.
స్మితా రాణీ అప్పుడే ఆ షాక్ నుంచి తేరుకుంది. అయితే పరిస్థితులేమీ ఆమెకు అర్ధం కావటం లేదు. తను కర్రతో కొట్టిన దెబ్బ భవానీశంకరుకీ కాకుండా ఆ లావుపాటి వ్యక్తీ కెలా తగిలింది? భవానీ శంకరు స్థానంలో ఆ లావుపాటి వ్యక్తీ ఎలా వచ్చాడు? భవానీ శంకరు అఖిల భాను ని "వదినమ్మా" అని ఎలా పిలుస్తున్నాడు? వీటన్నిటి సంగతి అలా వుంచితే ఇప్పుడే ఆఫీస్ సూపర్నెంటుగారు శ్యామ్ ఉద్యోగాన్ని పీకీపారేయడు గదా తన వాళ్ళ పాపం అభిలభాను వాళ్ళకి హాని జరుగుతుందేమో! ఎంత తొందరపాటు పని చేసింది తను? ఈ గొడవ అంతటికి కారణమైన భవానీ శంకరు వేపు కోపంగా చూసిందామె. భవానీశంకరు ఆమె వేపు చూసి చిరునవ్వు నవ్వాడు.