"ఇవన్ని పాతకాలపు జమిందారీ భావనలు వీటి రిపెరిల గురించి యీ మధ్య కాలంలో ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం కేవలం దీని రిపెర్సుకె రెండు లక్షల వరకు అవుతుందని అంచనా వేశాడు మా మేనేజరు డబ్బు కోసమని కాదు గాని యీ పాత బంగళా మీద రెండు మూడు లక్షలు పెట్టడం వేస్టు అవుతుందేమోనని ఆలోచిస్తున్నాను. ఈ బంగాళా అమ్మేసి కొత్తది కొనాలని ప్లాను.
కాని సెంటిమెంటల్ వేల్యూస్ అంటగడుతూ ఈ ఇల్లు అమ్మడానికి మా అమ్మ వొప్పుకోవడం లేదు. ఏదో చెయ్యాలి లోపలికి రండి ఆవిడేమో అమ్మ "ఎదురుగా నిలబడ్డ తెల్లని ఆకారాన్ని పరిచయం చేశాడు ఆవిడ కట్టుకున్న చీర తెలుపు. నిండా జరి పని వున్న పాతకాలపు పట్టు చీర. నిరుకావి రంగుపట్టి పోయి దర్జాకి బదులుగా దైన్యాన్ని సూచిస్తోంది. ఆవిడ వొంటి రంగు తెలుపు కళకళలాడే పాలరాతి తెలుపు కాదు. ఎదురుచూడని ఏ ప్రమాదానికో గురైనప్పుడు హటాత్తుగా భయపడి పాలిపోయిన తెలుపు ఆవిడ కళ్ళు కూడా రక్తం లేనట్టు తెల్లగానే వున్నాయి. వొంటి నిండా తెల్లని రాళ్ళ నగలు. చౌకరకం రాళ్ళలాగా తళుక్కు తళుక్కు మంటున్నాయి. పగటి వేషగాళ్ళేవరో వేషం వేసుకున్నట్లువుంది గానీ జమిందారిణి దర్జాగా అలంకరించుకున్నట్లు లేదు. ఆవిడ చూపులు కూడా దేనికో బెడురుతున్నట్లున్నాయి గాని, ఆడంబరంగా, ఠీవిగా లేవు కుతూహలంగా పరిశీలనగా చూస్తూ చేతులు జోడించింది.
"నాపేరు రాణి అచ్చయ్యమ్మా దేవి మా దివాణాలో డాన్సు ప్రోగ్రాం ఇవడానికి వచ్చిన దానివి నువేనా?" అడిగింది ఆవిడ. దర్జా వోలకబోయ్యాలనుకుందో లేదో అణువేదకి తెలియలేదు గాని ఆవిడ మాట్లాడుతుంటే మాత్రం ఎవరో గుహలోంచి మూలుగుతున్నట్టుగా వుంది.
"అవును"
"మా మామగారి తండ్రిగారు బతికి వున్న రోజుల్లో యి చిన్న వేడుక జరిగినా భోగం మేళాలు ఏర్పాటు చేసేవారు."
గతుక్కుమంది అణువేద. ఈవిడ తన డాన్సు ప్రోగ్రాంని ఆనాటి బోగం మేళాలతో సమంగా అంచనా వేసుకుంటుండా? జీవన్ చటుక్కున ఆమె ప్రక్కకి వొచ్చి నిలబడి మీరు లోపలికి రండి మీ గది చూపిస్తాను" అని లోపలికి దారి తీశాడు. తల్లి అక్కడే నిలబడి గాజు చూపులతో చూస్తోంది. ఆవిడ ఒకమనిషె కానట్టు ఆ పాతకాలపు యింటికి సంబంధించిన మరేదో పాతకాలపు నడియాడేవి గ్రహమైనట్లు లోపలిగాడుల్లోకి దారి తీశాడు. అన్నీ పెద్ద పెద్ద గదులు, పెచ్చులుడిపోయిన గోడలు యేవో వింత వింత ఆకారాలు వాటి మీద ఊగిసలాడుతున్నట్లు భ్రమ కలిగిస్తున్నాయి. గదులు సరిగా శుభ్రం చేస్తున్నట్లు లేదు. ఏదో ముక్కు వాసన వొస్తోంది అన్నీ ములల్లోంచి.
ఒక గదిలోంచి మరో గదిలోకి వెళ్తుంటే ఏవో చిక్కు దారుల్లో తప్పిపోతున్నలాంటి అనుభూతి కలగాసాగింది అణువేదలో. ఆమె ఊహించినట్లు జమిందారీ వైభవం ఎక్కడా లేదు. ఒక మూల గోడ కున్న కన్నంలోంచి పందికోక్కులా బలిసిన ఎలుక ఆమె మీద నుంచి ఎగిరి దూకి పరిగెత్తింది. ఏదో అవ్యక్త భయం ఆవహించసాగింది. ఇద్దరు ముగ్గురూ అడపనివారు అటూ ఇటూ తిరుగుతున్నారు వాళ్ళెం పనులు చేస్తారో అణువేదకు అంతుపట్టలేదు. ఎందుకంటే వాళ్ళు బొమ్మల్లా నిలబడి చోద్యం చూస్తున్నారే తప్ప ఏ పనిలోనూ కల్పించుకోవడం లేదు. వాళ్ళ చూపుల్లో యజమానుల పట్ల భయభక్తులు లేవు. నిర్లక్ష్యమే వుంది. అంత పెద్ద యింట్లో తల్లి కొడుకు పనివాళ్ళు తప్ప వేరే మనుషులే లేరు. జీవన్ అణువేదని ఒక అద్దాల గదిలోకి తీసుకొచ్చాడు. ఆ గదిలో అడుగు పెట్టగానే అన్నీ వైపులా తన రూపాలు కనిపించే సరికి హడలిపోయింది అణువేద. తను ఇన్ని మూర్తులుగా చిలీపోబోతున్నానా- అనే వూహ కలవరపరిచింది.
"మీరి వూళ్ళో వున్నన్నాళ్ళు ఈ గది మీదే. మీ ఆర్కెస్ట్రా గ్రూపుకి వేరే బస ఏర్పాటు చేశాను. ఇక్కడ మీరు కౌసల్య వుండొచ్చు."
ఒక్కసారి సంతృప్తిగా గర్వంగా ఆ గది చూసుకొని వెళ్లిపోయాడు జీవన్. అతడు వెళ్ళిపోయాక తనూ ఒకసారి చుట్టూ చూసింది అణువేద. చుట్టూ ప్రతిబింబాలు వెక్కిరిస్తున్నట్టుగా తోచింది. జీవన్ కావాలనే తనకి గదిలో బస యేర్పాటు చేశాడు. బహుశా యీ బంగాళా అంతట్లో యీ గది ఆడంబరమైనది కావచ్చు. రూఫ్ కి వెళ్ళాడుతున్న షాండ్లియర్ కూడా చాలా గ్రాండ్ గా వుంది. దానిలోనూ ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి.
పాతకాలపు జమిందారు ఇళ్ళల్లో అద్దాల గదుల గురించి చాలా వింది. ఆ గది ఎవరిదో తెలుసుకోవాలనిపించింది. గుమ్మంలోకి వచ్చి నిలబడింది. కాస్త దూరంలో సిమెంటు అరుగు మీద దాసిది పడుకొని ఇంగ్లీషు సెక్స్ మేగజైను తిరగేస్తోంది. ఈ యిళ్ళలో వాతావరణం ఇంతే కాబోలు, "లోలోపల అనుకుని నిట్టూర్చింది. అణువేద వెనకే నిలబడి కౌసల్య చప్పట్లు కొట్టి దాసిని పిలిచింది. అది బద్దకంగా ఆవులిస్తూ లేచి, "ఏం కావాలి?" అంది విసుగ్గా-
"ఈ గది ఎవరిది?" అడిగింది అణువేద.
"నాకు తెలవదు. మా అమ్మమ్మ పనిచేసే రోజుల్లో పెద్దబాబుగారి రెండో తమ్ముడు వుంచుకున్న ముండ ఈ గదిలో ఉండేదని చెప్పుకునేవారు."
రోమాలు నిక్కబొడుచుకున్నాయి అణువెదకి. ఇలాంటి చోటికొచ్చిందేమిటి? తను ఒకవేళ వచ్చినా యేదేనా హొటల్లో దిగాక యీ బంగళాలో దిగడానికి ఎందుకోప్పుకున్నట్లు? ఇదామిత్దమని నిరచించలేని అసహనం పెరగసాగింది ఆమెలో.
"ప్రస్తుతం ఎవరుంటున్నారు ఇక్కడ?" అడిగింది కౌసల్య దాసిని.
"ఇప్పుడెవరు లేరు. ఎప్పుడైనా జీవన్ బాబే ఫ్రెండ్స్ తో గడిపి పోతుంటాడు."
దాసిది ఫ్రెండ్స్ అనే ఇంగ్లీషు మాట ఉపయోగించడం గమనించింది కౌసల్య. ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళకంటే పనివాళ్ళే యెక్కువగా ఇంగ్లీషు మాటలు దొర్లిస్తున్నారు తమ సంభాషణలో.
"నేనీ గదిలో వుండను. ఇన్ని అద్దాలు లేని మరో గది చూపించు" అడిగింది అణువేద.
"అద్దాలగదోద్దా!" ఆశ్చర్యంగా నోరు తెరచిన దాసిది అణువేద కళ్ళలో గాంభీర్యం చూసి చటుక్కున నోరు ముసేసుకుంది.
"ఇంకో గదేదైనా వుందా? లేక ఏదైనా హొటల్ కి పొమ్మంటావా?" తీక్షణంగా అడిగింది. దాసిది బెదిరి యిపుడే వస్తాను అని జీవన్ ని పిలుచుకొచ్చింది.
"సారి! అద్దాల గదిలో మీకు సౌకర్యంగా వుంటుదనుకున్నాను. పోనీ నా గదిలో వుండండి. అది బాగానే వుంటుంది." అన్నాడు జీవన్ నొచ్చుకుంటున్నట్లు.
"ఏ గదిలోనూ వద్దు నేను హొటల్లో వుంటాను."
"ఈ టౌన్ లో హోటళ్ళు అంత గొప్పగా వుండవు. వారం క్రితమే తుఫాను వానలు రావడం వల్ల వాటర్ పోల్యుషన్ కూడా ఎక్కువగా వుంది ప్లీజ్ రండి. "తన గదిలోకి తీసుకెళ్ళాడు. లంకలా వున్న అ బంగళాలో కాస్త నీట్ గా వున్నది ఆ వొక్క గదే గోడలకి రంగులు లేకపోయినా సున్నాలున్నాయి. గోడల్లో షెల్ఫులకి తలుపులు విరిగిపోయి ఆ స్థానంలో సిల్కు తెరలు వెళ్ళాడుతున్నాయి. తెరల వెనకనించి క్రికెట్ కి సంబంధించిన రకరకాల పుస్తకాలు సగం సగం బయటికి కనిపిస్తున్నాయి. గోడ కానించి డబుల్ కాట్, ఒక డ్రస్సింగ్ టేబిల్, నేల మీద కార్పెట్, ఇది ఆ గది.
"మీరు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం ఏడింటికి కదా ప్రోగ్రాం ఒక అరగంట ముందుగా వస్తాను. ఈ లోపల స్టేజి దగ్గర యేర్పాట్లు చూస్తాను. సంకోచించకండి. రిలాక్స్ కండి" నవుతూ చెప్పి వెళ్లిపోయాడు జీవన్. ఈ గదిలో మనసుకి కాస్త శాంతిగానే తోచింది. ఎటాచ్ డ్ బాత్ రూమ్ కూడా వుంది. స్నానం చేసి బట్టలు మార్చుకుని బెడ్ మీద నడుం వాల్చింది. తలుపు తట్టిన చప్పుడైతే కౌసల్య తెరిచింది. మరేదో లోకంలోనించి వచ్చినట్లున్న తెల్లని ఆకారం గదిలోకి వచ్చింది. విధి లేక లేచి కూర్చుంది అణువేద. డాన్సు ప్రోగ్రాంకి ముందు మరొకరితో మాట్లాడటం ఆమెకి యిష్టముండదు.