Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 7

   

    జవాబుగా మారుతి కారులో నుంచి హరన్ వినిపించింది తప్ప కారు పక్కకు జరగలేదు.
 

    కిన్నెరలో సహనం నశించిపోయింది.


    కార్ల హరన్లతో పల్లె జనం ఇళ్ళలో నుంచి బయటికి వచ్చి విచిత్రంగా చూస్తున్నారు రెండు కార్లను.


    ఒకటి.....రెండు.....మూడు.... అయిదు నిముషాలు గడిచాయి.


    ఒకేసారి కారుల్లోనుంచి దిగారు ఇద్దరూ- కిన్నెర, భోజరాజు కూతురు భవ్య కూడా.


    కిన్నెర ఆవేశంతో రోప్పుతుంటే, నిశ్చలంగా చూస్తుంది భవ్య.


    ఇద్దరూ ఒకే ఈడువాళ్ళే, చదివింది అనకాపల్లి లోని ఒకే కాలేజిలో.


    కానీ భావ్యకు పెళ్ళయింది. కిన్నెర కింకా కాలేదు.


    అసలు కాలేజి రోజుల్నుంచి ఇద్దరూ ఇదే పద్దతిలో ఒకరి కొకరు ఎదురు నిలబడడం అలవాటు పడినవాళ్ళు కావడంతో, ఇప్పుడు అదే పద్దతిని పాటించటానికి సిద్దపడ్డారు.


    ఒకటి అరా భవ్య తగ్గిన దాఖాలాలున్నాయేమోకాని, గత చరిత్ర రిత్యా తమకు దిటైనా వంశం ఆ చుట్టుపక్కల లేదన్న అతిశయంతో కిన్నెర ఇంతవరకూ వెనకడుగు వేయలేదు.

    
    "ఏమిటి నీ పొగరు?" ముందు పెదవి విప్పింది కిన్నేరే.


    "పొగరు నాది కాదు కిన్నెరా, నీది" నిశ్చలంగా అంది భవ్య.


    "మర్యాదగా కారు పక్కకు తియ్."


    "ఆ పని నువ్వే చెయ్యొచ్చుగా?"


    "ఈ కిన్నేరకు వెనకడుగు వేయటం చేతకాని పని."


    "ఓసారి ప్రాక్టీసు చేస్తే సరి."


    "చూడు భావ్యా! మర్యాదగా మారుతి వెనక్కు తీయకపోతే కాంటేస్సాతో పచ్చడి చేసి మరీ వెళతాను."


    "ఏం.....ఈ మధ్య పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టావా?" అందముగా నవ్వింది భవ్య. "మరేం లేదు కిన్నెరా! ఎంతైనా పని పాటా లేకుండా ఖాళీగా ఉన్నారు కదా......అందుకని అడుగుతున్నాను."

    
    "భావ్యా!" అరిచింది కిన్నెర.

    
    "నువ్వరిచి గీపెట్టినా నేను కారు తీయను."


    "నన్ను రెచ్చగొడుతున్నావ్"


    "అప్పటికైనా బాగుపడతావేమో అని"

    
    "ఏం.....నే నేమీ చెడిపోలేదే" వ్యంగ్యంగా అంది కిన్నెర.


    "అదే నా భయం కిన్నెరా! ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో తీరాలి. లేకపోతే విగరూ, పొగరూ ఉన్న ఆడపిల్ల తప్పకుండా చెడిపోయే అవకాశ ముంది."


    "నేను రావు బహుద్దూర్ రామ్మోహనరావు మనవరాల్ని."


    "ఆ విషయం నీ వయసుకు తెలియాలిగా."


    "భావ్యా!" కిన్నేరకు ఉక్రోషం ముంచుకొస్తుంది. కాని,  ఏం చేయాలో పాలుపోవటం లేదు. "నేను నిగ్రహాన్ని కోల్పోతున్నాను."


    "అలా కట్టుకున్న వాడి దగ్గర కోల్పోతే కాస్త సుఖమైన దక్కుతుంది."


    "సుఖమంటే గర్భిణి కావటమా?"


    భవ్య రెచ్చిపోకుండా సమాధానం చెప్పింది. " ఖచ్చితంగా అదే సుఖమని అనను కాని, కోరుకున్న వాడికి అలా దగ్గర కావడం మాత్రం సుఖమంటాను."


    అలా అని నువ్వు సరిపెట్టుకో తప్ప నా సుఖానికి నువ్వు నిర్వచనం అందించకు."


    "వచనమో, కావ్యమో, నాకు తెలిదు కాని నువ్వు అర్జెంటుగా ఎవర్నైనా పెళ్ళాడితే మంచిది."


    "నా సంగతి నికనవసరం!"


    "పాపం, సాటి ఆడపిల్లవిగా!"


    "భావ్యా!"


    "శాంతం!" వినిపించింది వెనుక నుంచి.

    
    అక్కడ రాయుడు నిలబడి ఉన్నాడు చిద్విలాసంగా నవ్వుతూ.


    "అవునమ్మా! శాంతమే భూషణం అన్నారు. అది నిజమే అని మీరు అంగికరించి తీరాలి. ఎందుకంటే ఆడపిల్లలకు అది కచ్చితంగా వర్తిస్తుంది కాబట్టి."


    "అది కాదు బాబాయ్!" భవ్య ఏదో చెప్పబోయింది.


    ప్రత్యర్ధులైన ఇద్దరు తండ్రులతో పాటు, ఇద్దరమ్మాయిలకూ రాయుడంటే గౌరవమే.


    అర్దోక్తిగా అన్నాడు భవ్యతో. " నువ్వు వయసులో కిన్నెరతో సమానమే అయినా, ముందు పెళ్ళయిన దానివి, ముందు తల్లివి కాబోతున్న దానివి, అంటే కిన్నెర కన్నా ఎక్కువ భాద్యతల్ని ముందే మోస్తున్న అమ్మాయిగా నువ్వు పక్కకి జరగాలి. తప్పదు!"


    హటాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.


    "మానసిక పరిపక్వత ఉన్న వాళ్ళు ముందే నిర్ణయాలు తీసుకుంటాడంటాడు శాంతియాతోపే. ఆయనేవరు అంటే మొదటి సిపాయిల తిరుగుబాటులో వీరోచితంగా , పైగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడినవాడు"


    రాయుడి మాటల గారడీ ఫలించింది. అసలు శాంతియాతోపే అలా అన్నాడో, లేదో ఆలోచించలేదు ఇద్దరూ, కాని , పరిపక్వత విషయంలో పోటీ పడుతున్నట్టు ఇద్దరూ కార్లలో కూర్చుని ఒకేసారి వెనక్కి తప్పి చెరో దారిలో వెళ్ళిపోయారు.


    నవ్వుకున్నాడు రాయుడు. మానసిక పరిపక్వత విషయంలో భవ్య మేలని రాయుడికి తెల్సు కాబట్టే, అమాయకంగా అహాన్ని ప్రదర్శించే కిన్నేరను ఇబ్బంది పెట్టలేదు.


    కాని కిన్నెర కొద్దిగా బాధపడింది. అసలు ముందే పెళ్ళవటం - ముందే తల్లి కాగలిగే అర్హతను సంపాదించుకోవాడము ఎక్కువ బాధ్యతల్ని మోయడమంటే మాత్రం ఆమె అంగికరించలేకపోయింది.

    ఆవేశంలో అనకాపల్లి వెళ్ళి అర్జెంటుగా ఓ నవలేదో తీసుకుని సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇంటికి వచ్చింది.


    
    దాన్ని పడగ్గదిలో ఓ మూల గిరాటేసి రాయుడి వాక్యాలను మననం చేసుకుంటూ సాయంకాలం దాక ఆలోచిస్తూ ఉండిపోయింది.

 

                                                            *    *    *    *


    "మంగా!"

    
    సాయంకాలం నిద్రలేవగానే హవ్యాళికి శారదా నది ఒడ్డుకు వెళ్ళే అలవాటున్న కిన్నెర , ఇంకా ఆలస్యం కాకపోయినా ఎందుకలా అరిచిందో అర్ధంకాక, ఒక్క అంగలో పడగ్గదిలోకి దూసుకొచ్చింది మంగ.


    "ఏమందమ్మా?"

    
    కిన్నెర చెంపలు కెంపులవటం మాత్రమే కాదు, ఆమె నేత్రాలు రోషంతో అరుణ రాగరంజితాలయ్యాయి.


    "మనం వెంటనే సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాలి."


    దాని కింతగా ఎందుకు అరవాలో, ఇంతలా ఎందుకు ఆవేశాన్ని ప్రదర్శించాలో తోచని మంగ--"అలాగే వెళ్దాం చిన్న దొరసానీ! కాని, నీ ఎంగ్లయిటి దేనికో నాకు అర్ధం కావడంలేదు."


    ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫైయిలై నర్సు ట్రైనింగ్ వెళ్ళటానికి కుదరక, ఉన్న ఉళ్ళోనే వీర్రాజు ఇంట్లో పనిమనిషిలాగో, ఆయా లేక చిన్నమ్మగారికి నర్సు లాగో, ఉండాలని ఉద్యోగంలో చేసిన మంగ, ఖాళీ వేళల్లో తనూ ఇంగ్లీషు, తెలుగు నిఘంటువును దగ్గరుంచుకుని కొన్ని పదాల్ని కంటస్థం చేయడం అలవాటు చేసుకుంది. అందుకే ఎంగర్ అనాలో, ఎంగ్లయిటి అనాలో తోచక అందాకా ఓ పదాన్ని వాడింది.


    "చూడవే, ఆ నవలను చూడు" ఇంకా అదే ఆవేశాన్ని ప్రదర్శిస్తుంది కిన్నెర.


    దాన్ని చేతిలోకి తీసుకుంది మంగ. "ఏకవీర.....విశ్వనాధ సత్యనారాయణ గారి గొప్ప నవలల్లో ఇదొకటి మేడం!"

    
    "నీ బొంద!" రోషంతో ఊగిపోయింది కిన్నెర. "నేననేది నవల మంచి, చెడుల గురించి కాదు, అందులో ఓ కాగితం ఉంది."

 Previous Page Next Page