Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 6

   
    "అలాగా! అయిదు నిమిషాల్లో వస్తాను." అంటూ కాలకృత్యాలు ముగించుకోటానికి అన్నట్టుగా బాత్ రూంలోకి వెళ్ళింది కిన్నెర.


    అంతసేపూ రాణి వాసంలో యువరాణి సపర్యలు చేసే చెలికత్తెలా నిలబడి ఉన్న మంగ, కిన్నెర అలంకరణలో సహాయ పడింది ఆమె స్నానం చేసి రాగానే.


    అయిదు నిమిషాల తర్వాత అమ్మాయిగారికి వెంట నడుస్తూ డైనింగ్ హాలు చేరుకుంది.


    "నాన్నా! మిరేమిటి ఇంకా బ్రేక్ ఫాస్ట్ తీసుకోలేదు!"


    అప్పటికి కింకా మీసాలకు సంపెంగ నూనె రాసుకోని వీర్రాజు మృదువుగా నవ్వాడు. చెట్నీ లాంటిది మీసాలకు అంటుకుంటుందని టిఫిన్ కార్యక్రమం పూర్తయితే తప్ప సంపెంగ నూనె రాసుకోవడం ఆయనకు అలవాటు లేదు. అసుర్యంపశ్యలా, అప్పుడే దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా అనిపిస్తున్న కిన్నేరని చూస్తూ మంగతో అన్నారాయన...." అమ్మాయికి దిష్టి తీసెయ్, మంగా!"


    నవ్వేసింది కొన్నేర. అదో మూడనమ్మకమని తెలిసినా తండ్రిని వారించడం ఆమె కిష్టం లేదు.


    మంగ ఓ పక్క మిరపకాయలతో దిష్టి తీసే కార్యక్రమంలో నిమగ్నమై ఉండగానే అంది కిన్నెర.."మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోవడం లేదు నాన్నా!"


    ఇది ప్రతిరోజూ చర్చలో భాగమే అయినా, కూతురు తన గురించి అలాంటి అపేక్ష ప్రదర్శించడం వీర్రాజుకు చాలా ఆనందదాయకమైన విషయం.


    "బహుశా నా పెళ్ళి గురించి దిగులుతో మీరు అతిగా తగుతున్నట్టున్నారు."


    'నిజమే' అనాలనిపించినా ధైర్యం చాలలేదు. ఒకసారేప్పుడో అలా అంటే 'మీకు తోచిన వరుడ్ని మీరే నిర్ణయించండి' అంది మోహంలో వ్యధను వ్యక్తం చేస్తూ. ఆ తర్వాత అలాంటి ప్రసక్తిని తేవడం మానేశాడు.


    "అబ్బే.....అది కాదు కిన్నెరా!"


    "కారణమేమన్నా కాని, మీరు అతిగా లిక్కర్ తీసుకుంటే రక్తంలో కొలస్ట్రాల్ పెరిగే అవకాశముంది. కొలస్ట్రరాల్ హెచ్ డిఎల్ నిష్పత్తి  సవ్యంగా లేనప్పుడు అది గుండెపోటుకు కారణమవుతుంది. మీకు తెలుసుగా నాన్నా! రెండు వందలు దాటకుడని కోలెస్టరాల్ మీకు రెండువందల డెబ్బై దాకా ఉన్నట్టు ఈమధ్య రిపోర్ట్స్ తెలియచేస్తున్నాయి.


    ఇంతసేపూ ఆమె మాట్లాడిన వాక్యాల్లో ఒక్కటి వీర్రాజుకు అర్ధం కాలేదు. చిన్నతనం నుంచీ ఘోషా పద్దతిలో అమ్మాయిల బడిలోనూ, అమ్మాయిల కాలేజిలో మాత్రమే చదివిన కిన్నెర , బియ్యే పూర్తయ్యాక ఇక చదువు చాలించి జనరల్ నాలెడ్జిని పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమై పోయింది. తరచుగా తండ్రి దగ్గర తన తెలివిని అలా ప్రదర్శించాలని ఉబలాట పడుతూ ఉంటుంది.


    అయితే అది కేవలం ఉత్సాహం, ఉబలాటం అంటే ఆమె కూడా అంగికరించదు.


    "ఈ దేశం దౌర్భాగ్యం కిన్నెరా!" అన్నాడు చాలాసేపటి తర్వాత.


    దేని విషయంలో  ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చిందో ఆమెకి అర్ధం కానట్టు చూస్తుండగానే అన్నాడు--"అవునమ్మా! నీ తెలివికి నువ్వు కావాలనుకుంటే ఓ ఐయ్యేయెస్ చేసి ఉండేదానిని. కాని, మన వంశ చరిత్ర అడ్డం వచ్చింది." ఉద్యోగం చేస్తున్న కొడుకు గుర్తుకొచ్చాడెమో వెంటనే ఈ విషయాన్నీ ప్రస్తావించాడు.... "ఆడపిల్లలు ఉద్యోగం చేయడమన్నది మన వంశంలో నిషిద్దం."


    "అవును నాన్నా! మనకేం తక్కువని?" అంది కిన్నెర టిఫిన్ చేస్తూ.


    ఏం తక్కువో చెప్పాలనిపించినా నిభాయించుకున్నాడు వీర్రాజు. అసలు స్వర్గంలో పెళ్ళిళ్ళు నిర్ధారితం నిజమనే సైంటిఫిక్ రిజనింగ్ కోసం ఆమెను అడగలేక, నిన్న రాత్రి రాయుడు చెప్పిన విషయం మననం చేసుకుంటూ అన్నాడు--" మీ తాతగారు కాని, ముత్తాతగారు కాని, ఈ దేశం కోసం సర్వస్వం ఒడ్డిన మహానుభావులు.'


    సర్వస్వం ఒడ్డితే ఇంత ఆస్తి ఎలా ఉందని ఆమె అడగలేదు. ఒకటి రెండుసార్లు ఇలాంటి అనుమానం కలిగినా తాత, ముత్తాతలకు ద్రోహం చేసినట్టవుతుందని భావిస్తూ, హాల్లోని తాతగారి తైలవర్ణ చిత్రాన్ని చూసింది తదేకంగా.


    "అలాంటి మహానుభావులకు వారసుడిగా ఈ ప్రజలకు నేనూ సేవ చేయాలనుకుంటున్నాను కిన్నెరా! కాని, నా ప్రత్యర్ధి భోజరాజు ఈసారీ తనే ఎంపీగా పోటీ చెయ్యాలనుకుంటున్నాడని తెలిసింది."

 

    కిన్నేరకు రాజకీయాలంటే జుగుప్సే కాని, తండ్రి మీద సానుభూతిగా చూసింది, "నిజమా!"


    "అవునమ్మా! దానికోసమే బలంగా పోరాడాలనుకుంటున్నాను."


    తండ్రిని సంతృప్తిపరిచేలా అణువంత క్రోధాన్ని వర్షింపచేసింది కళ్ళతోనే . "తప్పదు డాడీ! మన వంశ చరిత్రతో పోలిస్తే భోజరాజుగారిది అంత ఘనమైనదేమీ కాదు."


    "పైగా తన కూతురికి నీకన్న ముందే పెళ్ళయిందని, అప్పుడే ఆమెకు నెల తప్పిందని తెగ విర్రవీగుతున్నాడు" కక్కేశాడు అది తనకు బాధ కలిగించే విషయాల్లో ఒకటి అన్నట్టుగా.


    నిశ్చలంగా చూసింది కిన్నెర.


    ఒక లోగిలిలో ఉండి పరిసరాల్ని, ప్రపంచాన్ని చదవాలనుకునే ఘోషా, స్త్రీ లాంటి కిన్నెర , ఇప్పుడు తండ్రి మాటల్లో ద్వనించిన వేదనను అర్ధం చేసుకోవాలని ప్రయత్నించలేదు.


    ప్రయత్నించేదేమో కాని, అసలు కూతుర్ని అలా పెంచలేదు వీర్రాజు. ఆసాధారణమైన అందంతోపాటు, అవసరమైన మేధ కూడా ఉన్న తన కూతురు ఎప్పటికైనా కట్టుకోవాల్సింది ఈ శతాబ్దపు మగవాడినే తప్ప, స్వయవరంలోలా ఎన్నుకోటానికి ఇది రాచరిక వ్యవస్థ కాదని ఏనాడైనా చెప్పి ఉంటే, ఆమె కధల్లో చదివే రాజకుమారుల కోసం రహస్యంగానైనా కలలు కనడం మానేసి, వాస్తవికంగా ఆలోచించేదేమో.


    భేషజమే తప్ప నిజానికి తనో అమాయకురాలినని తెలీని పిచ్చిపిల్లలా నవ్వి తండ్రిని సమిపించింది.

    
    ఇందాక భోజరాజు కూతురు నెల తప్పడం అన్న వాక్యం గురించి తను స్పందించటం మాట అటుంచి, కడుపు, కావటానికి జీన్స్, క్రోమోజోమ్స్, అండాలు గట్రా మాట్లాడబోయింది.

    మళ్ళీ అంతలోనే అసందర్భమనిపించిందేమో-- "నేను లైబ్రరికి వెళ్తున్నాను నాన్నా" అంది రోజులాగే.

    మనసంతా మతిభ్రమించిన వాళ్ళమే అని ముందే మనం గ్రహిస్తే బ్రతుకులో బేషజాలు అదృశ్యమౌతాయి. జీవితానికి నిర్వచనం అర్ధమైపోతుంది అంటాడు మార్క్ ట్వైన్ ప్రేమనే మైకం గురించి వివరణలో"


    ఇలాంటి గొప్ప సత్యానికి కిన్నెర సైతం అతితురాలు కాదు.


    
                                * *    * *    * *    * *


    అయిదు వేల గడపల గల పల్లె.


    పక్కన శారదా నది.


    నదికి, పల్లెకూ మధ్య పచ్చని పొలాలు, మామిడి తోటలు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి దాకా సిమెంట్ రోడ్డు, ఆ రోడ్డుకు అనుకుని ఈ మధ్యనే కట్టించిన హైస్కులు, ముప్పాతిక శాతం వ్యవసాయం పైనే ఆధారపడి బ్రతికే అమాయకులైన జనం. ఊరి మధ్యలో పోలేరమ్మ గుడి, గుడికి పడమట భోజరాజు లోగిలి, తూర్పున వీర్రాజు భవంతి, ఓ చిన్న లైబ్రరీ. ఆ లైబ్రరీలో ఈగలు తోలుకుంటూనో, దుమ్ము పట్టిన పాత పుస్తకాలు చూస్తూనో రోజంతా గడిపే లైబ్రేరియన్, పల్లెకి తప్పనిసరైన ఓ పంచాయితీ ఆఫీసు. ఆఫీసులో కాక పదవిలో ఉన్న ఎంపీ కొంపలోనే గడిపే పంచాయితీ బోర్డు సభ్యులు. ఇదీ తుంపాల వివరాలు.

    
    అలాంటి పల్లెలో ఉదయం పది గంటల ప్రాంతాన ఓ కాంటేస్సా పోస్టాఫీసు సందు గుండా అనకాపల్లి రోడ్డును చేరుకోవాలని ఓ వీధిలో ప్రయాణం చేస్తూ టక్కున ఆగిపోయింది.

    దానికి కారణం కాంటేస్సాకు అభిముఖంగా ఓ మారుతి అడ్డు పడడం.

    పుట్టినరోజు కానుకగా తండ్రి బహుకరించిన కాంటేస్సా నడుపుతున్న కిన్నెర, మారుతిని దాటి వెళ్ళటానికి మార్గం ఇదుకుగా ఉండటంతో ముందు సీరియస్ గా చూసింది. మరుక్షణం ఎదురు మారుతిలో ఉన్నదేవరో అర్ధమైనట్టు ఆవేశంగా హరన్ నొక్కింది.

 Previous Page Next Page