"ఎనిమిదింటికంతా వచ్చేయండి" అన్నాడు వెంకటేశ్వర్లు. మేము తిరిగొచ్చేశాం. చీకట్లుపడ్డాయి.
తాగేవాళ్ళమంతా చేరి చెరో క్వార్టర్ చీఫ్ తాగాం. తిరిగి అదే పచ్చిపులుసన్నం తిని చేతులు కడుక్కునేటప్పటికి టైమ్ ఏడున్నర అయింది
వీధి దీపాలు లేకపోవడంతో తార్రోడ్డు అయినా వేగంగా అడుగులు వేయలేకపోయాం. అందులోను కూడా ముసలీముతకా, మేం వెళ్ళేటప్పటికి ఆ ఇల్లు కొత్తగా కనిపించింది. ఇల్లంతా అప్పుడే అలికారు కాబట్టి పేడ వాసన మధ్యలో సున్నం పిండితో వేసిన పెద్ద ముగ్గు. దాని మధ్యలో చతురాస్రాకారంలో ఈతపట్టల్తో నేసిన చిన్న తడికలాంటిది వుంది.
మేము అంతా ఆ ముగ్గురు వదిలిపెట్టి చుట్టూ కూర్చున్నాం. మరో పదినిముషాలకి వెంకటేశ్వర్లు వచ్చాడు. తలంతా విరబపోసుకున్నాడు. నుదుటున పెద్ద కుంకుమబొట్టు పెట్టుకున్నాడు. చూస్తుంటేనే ఒళ్ళు జలదరించినట్లయింది. ఆయన ఈతాకు తడికమీద కూర్చున్నాడు. పక్కన అసిస్టెంట్ కూర్చున్నాడు.
వెంకటేశ్వర్లు ఏమీ మాట్లాడలేదు. ఆయన్ని చూస్తుంటేనే ఏదో మత్తు అవహిస్తున్నట్లుంది.
అసిస్టేంట్ తన ముందున్న డప్పులాంటిదాని మీద చిన్నపుల్లతో రాయడం మొదలుపెట్టాడు.
దాని సౌండ్ ఎలా వుందంటే ఏదో జంతువు గొంతును పులి పట్టెసుకున్నప్పుడు అది ఎలా అరుస్తుందో అలా వుంది. ఊరికి దూరంగా విసిరేసినట్టున్న ఇంట్లో ఆ సౌండ్ భయాన్ని కలిగిస్తోంది. మనం ఎక్కడికో పాత రోజుల్లోకి వెళ్ళిపోయినట్టుంది.
వెంకటేశ్వర్లు మెల్లిగా ఊగటం ప్రారంభించాడు.
చంద్రయ్య వాలిపోయాడు.
గొంతు వెంకటేశ్వర్లుదే అయినా ఆ చెబుతున్నదంతా చంద్రయ్యేనని తెల్సిపోయింది.
మొదట తాను ఎంత గొప్పగా బ్రతికింది చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన భార్యనీ, తన పిల్లల్ని ఎంత ప్రేమించిందీ చెప్పాడు. ఆ తరువాత తన భార్య తనకు తెలియకుండా ఎలా రంకు సాగించింది. చెప్పుకొచ్చాడు.
ఈ మాటలు చెబుతూ చంద్రయ్య ఎంత కోపగించుకున్నాడంటే జయలలిత ఎదురుగా వుంటే పీకనులిమి చంపేవాడనిపించింది.
ఇక ఆరోజు తాను ఎలా చచిపోయిందీ చెప్పాడు. తాను సైకిల్ పైన వస్తుంటే ఎవరో కుర్రాడు వచ్చి అపి తన గుండెలమీద కొట్టి చంపేశాడంట. ఇది చెప్పిన తర్వాత, ఇక తన ప్రతిరూపాలుగా మిగిలిన తన పిల్లల్ని ఎలా చూసుకోవాలో చెప్పాడు.
పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా పెద్దచెయ్యాలో చెబుతుంటే అడంగులు ఎలా ఏడ్చారంటే వెంకటేశ్వర్లు అసిస్టెంట్ కూడా వలవలా ఏడ్చేశాడు. వాళ్ళు ముక్కు చీదడాలు చూస్తుంటే చంద్రయ్య మరీ రెచ్చిపోయాడు.
అప్పుడు " తట్టినట్టు తనకు ఇంతకీ నిన్నెవరు చంపింది?" అని గురవయ్య డైరెక్టుగానే అడిగాడు.
"ఇంకెవరు నా భార్య లవ్వరు...." అని చెప్పి మళ్ళీ ఏడ్చాడు చంద్రయ్య.
అంత క్లియర్ గా ఇన్ని విషయాలు చెప్పాక ఇక ఏముంటాయ్ సందేహాలు? పదిగంటలకి ముగిసింది రంగం. అందరం బయటేపడ్డాం. ఏడ్చి ఏడ్చి ముఖాలు ఉబ్బరించాయి. పదకొండు గంటలకు ఓ లారి ఎక్కి అందరం ఇంటికి చేరుకున్నాం"
" ఎవరు చంపేశారో తెలిసిపోయింది కదా. మరి ఆ చంపేసిన వాడ్ని ఏమైనా చేశారా?" సురేష్ అడిగాడు.
"అక్కడే ఓ కొత్త చిక్కొచ్చిపడింది."
"ఏమిట్రా?" అన్నాడు సురేష్ వర్మ.
"జయలలిత లవ్వరు అన్నాడుగానీ ఏ లవ్వరో చెప్పలేదుగదా. అమెకి పుట్టింట్లో ఒకడూ, మెట్టిన ఊర్లో ఇంకొకడూ వున్నాడంటా. మరి ఆ ఇద్దరిలో ఎవరో తెలియదు. పోని మళ్ళీ రంగం పెట్టిద్దామంటే వెంకటేశ్వర్లు ఒప్పుకోలేదు. స్వర్గంలో చంద్రయ్య చాలా బిజిగా వున్నాడంటూ ఇప్పుడు కాదన్నాడు."
"అంటే అమె పాతివ్రత్యమే అమె లవ్వర్లను కాపాడిందన్న మాట" పగలబడినవ్వాడు సురేష్ వర్మ. కొంతసేపు నవ్వి తమాయించుకుని-
"ఇందులో తేలిన నీతి ఏమిటంటే, ఒకవే్ళ రంగంలో నీ భర్తను ఎవరు చంపిందో తెలియకుండా కన్ ప్యూజన్ లో పడవేయడానికి స్త్రీకి ఒకరికి మంచిన ప్రియుళ్ళు వుండాలని....." అని మళ్ళీ నవ్వుకున్నాడు.
బాబు మాత్రం తన యజమాని ఎందుకంతగా నవ్వుకున్నాడో తెలియక కనుక్కోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
"అయినా మీరు తప్పుచేశారు. ఈసారి రెండు క్వార్టర్ల చీప్ కు వెంకటేశ్వర్లు మాట్లాడుతుండేవాడు. చీఫ్ అంటే చంద్రయ్యకు చేదా ఏమిటి?" అని గేలిచేస్తూ నవ్వుతున్న సురేష్ వర్మను బాబు అడ్డుకున్నాడు.
"మీకు నవ్వులాటగా వుందిగాని ఆత్మలు అలా చీప్ కి, పుల్ కి దిగిరావు."
" సరేలేరా...చి్ట్టిబాబు విషయం ఏమైంది?" అని ఆ టాపిక్ మార్చి సిగరెట్ వెలిగించాడు.
ఇక అక్కడ్నుంచి అవీ ఇవీ మాట్లాడుతూ చివరికి తనకు కావాల్సిన ప్రశ్న అడిగాడు.
"మన ఉదయం రోజునుంచి చూస్తున్నాను- బావి దగ్గర నిల్చుంటుందే అమె ఎవరు?" క్యాజువల్గా అడిగాడు.
"ఎవరూ?" అంటూ సడన్ గా గుర్తొచ్చినట్టు ముఖం పైకెత్తాడు.
"అమె.... కాంట్రాక్టర్ నరేంద్ర భార్య కదూ" అని కరెక్టు కాదా అన్నట్టు యజమాని వైపు చూశాడు.
"కరెక్ట్! అమే... మనూరు అయితే నాకు తెలియదూ" అని మళ్ళీ అతనే " ఇంతకీ ఏ ప్రాంతం వాళ్ళది....?" అంటూ ప్రశ్నించాడు సురేష్ వర్మ.
"అయనది ఒంగోలు దగ్గరున్న సంగరాయకొండ. అమెది నెల్లూరు జిల్లా కావలి. అయనే మా కుండూరు బ్రిడ్జి కడుతోంది...." చెప్పాడు బాబు.
"బాగానే మిగులుతోందా?" అడిగాడు సురేష్ వర్మ.
" ఆ వివరాలు నాకేం తెలుస్తుంది? మొత్తానికి బాగానే వున్న కుటుంబం కాని ఆ దంపతులకి భగవంతుడు అన్నీ ఇచ్చి ఒక్కటే వక్రం పెట్టాడు. ఇద్దరూ చూడటానికి బట్టలు వేసుకున్న చిలకాగోరింకల్లా వుంటారు. కాని లోపమంతా పిల్లలు లేకపోవడమే!"
"పిల్లల్లేరా?" షాక్ తిన్నట్టు అడిగాడు సురేష్ వర్మ. ఆ విషయం వింటుంటే తనకీ బాధగానే వుంది.
ఇక బాబు చెప్పగలిగే విషయాలు ఏమీ వుండవు. అందుకే పనిదగ్గరికి వెళ్ళమన్నాడు.
అలా అన్యమనస్కంగానే మద్యాహ్నం వరకు గడిపాడు. ఇక అక్కడ వుండలేక ఇంటికొచ్చేశాడు.
అంత ఎండలో వచ్చేటప్పటికి చెమటతో స్నానం చేసినట్టయిపోయాడు.
భోజనం చేశాక నిద్రపట్టేసింది.
అయిదు గంటలకు లేచాడు.
రాత్రి ఉభయాల దగ్గరికెళ్ళి శశిరేఖను చూడాలనిపించింది. అయినా వెళ్ళకూడదనుకున్నాడు. కాని మనసు అతని మాట వినటంలేదు. ఇక లాభంలేదని దేవాలయం దగ్గిరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తయారయ్యేటప్పటికి పొద్దుపోయింది.