Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 7


    "ఎక్కడికి?"
    
    "ఎక్కడికో... ఈ మనుషులూ, యీ ఛండాలం ఇదంతా లేని ఏకాంతం వున్నచోటుకి."
    
    "ప్రతి పిచ్చిముండా ఇలాగే అనుకుంటుంది. నీలాంటివాళ్ళకి ఏకాంత మెక్కడా దొరకదు. అక్కడ ఇంతకన్నా ఛండాలం వుంటుంది."
    
    "అలాగే... అలాగే... నీలాగే నీలాంటి నీచుల కళ్ళకి నాలాంటివాళ్ళు పిచ్చిముండల్లాగే కన్పిస్తారు. సరే, నీకూ నాకూ పడదు. నేను లేనప్పుడు నా విలువ తెలుసుకుంటావు. నే వెడుతున్నాను" అంటూ విసురుగా గుమ్మంవైపు వెళ్ళింది.
    
    అతనంతకంటే వేగంగా వెళ్ళి ఆమెకడ్డంగా నిలబడ్డాడు. "ఎక్కడికే వెళతావు రాత్రివేళల్లో, నీకేమన్నా బుద్దుందా?"
        
    "వెళ్ళవద్దనడానికి నువ్వెవడివి?"
    
    "నీ మొగుడ్ని."
    
    "ఓహో! అదా నీ అహంభావం? అయితే సరే" అంటూ మెడలోంచి మంగళసూత్రాలు తీసి విసిరిపారేసింది. ఇప్పుడు నీకూ నాకూ మధ్య ఏమీలేదు. తెలిసిందా? అడ్డులే."
    
    "నే లేవను."
    
    "లే. మర్యాదగా చెబుతున్నా."
    
    "వెళ్ళి ఏంచేస్తావు?"
    
    "ఏమైనా చేసి బతగ్గలను. వంటచేసి బతుకుతాను. అంట్లుతోమి బతుకుతాను. లేకపోతే ఎవడితోనైనా పడుకొని...."
    
    చెంప పేలిపోయింది.
    
    "నన్ను కొడతావా? నన్ను కొట్టడానికి నీకేం హక్కువుంది?"
    
    "వుందే. నిన్నేమైనా చెయ్యటానికి నాకు హక్కువుంది. కొడతాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే నరికి పోగులుపెడతానే."
    
    "అలాగా! చూద్దాం" అంటూ బలమంతా వుపయోగించి అతన్నో తోపుతోసి బయటకు వెళ్ళబోయింది. అతను తూలిపడబోయి సర్దుకుని గుమ్మందాటి వెళ్ళిపోతున్న ఆమెను జుట్టుపట్టుకుని వెనక్కి ఈడ్చాడు. ఆమె నిలద్రొక్కుకుందామని ఎంత ప్రయత్నించినా సాధ్యంగాక నేలమీద పడిపోయింది. ఆమె లేవటానికి ప్రయత్నిస్తోంది. "ఎక్కడికి లేస్తావు?" అంటూ డొక్కల్లో ఫెడీ ఫెడీ తన్నాడు. "నువ్వు మనిషివా? పశువ్వా?" అంటూ చేతికందిన వస్తువులు అతనిమీదకు బలంగా విసిరేసింది. అదొచ్చి తలకి కొట్టుకొని 'అమ్మా' అని మూలిగి చేత్తో నుదురు పట్టుకున్నాడు. చేతికి నెత్తురు తడిగా తగిలింది. 'మొగుడ్ని పట్టుకుని కొడతావా రాక్షసీ' అంటూ మళ్ళీ జుట్టుపట్టుకొని ఎడా పెదా కొట్టాడు. ఆమెకు లొంగిపోవటం ఇష్టంలేదు. 'భార్యననే కనికరం లేకుండా పశువును బాదినట్లు బాదుతావా? చూడు నిన్నేం చేస్తానో చచ్చి సాధించక పోతే..." అంటూ అతన్ని గట్టిగా విదిలించి లేచి నిలబడి స్విచ్ బోర్డు దగ్గరకెళ్ళి ప్లగ్ లో చెయ్యి పెట్టబోయింది. అతను ఆమె భుజం పట్టుకుని ఇవతలికి లాగిపారేశాడు. "పిశాచి! నన్ను అప్రతిష్టపాలు చేద్దామని చూస్తున్నావుటే" అంటూ వగరుస్తున్నాడు.
    
    ఆమె అతన్ని మళ్ళీ విదిలించిపారేసి లోపలిగదిలోకి పరిగెత్తింది. ఆ గదిలో దేనికోసమో అట్టేపెట్టిన తాడొకటి కనిపించింది. గబగబ ఆ తాడు తీసుకొని మెడచుట్టూ బిగించుకొని రెండుచేతుల్తో అంచులు లాగుతూ పట్టుకొని గట్టిగా బిగించుకుంటోంది. కళ్యాణచక్రవర్తి లోపలికి పరుగున వచ్చి బలవంతంగా తాడు ఆమె మెడనుంచి విడదీసి అవతలికి గిరాటేశాడు. "నువ్వు.... నువ్వు..... వెధవా" అంటూ గోడదగ్గరకెళ్ళి తల గోడకేసి కొట్టుకుని బాదేసుకుంటోంది. ఆ దృశ్యం పరమవికారంగా, వికృతంగా కనిపించిందతనికి ఈ రాక్షసితోనా యీ పిశాచంతోనా ఇన్నాళ్ళూ తాను కాపురం చేసింది! "చస్తే చావనియ్" అనుకున్నాడు.
    
    "నన్ను అల్లరి చెయ్యటానికి గాని యిదా చచ్చేది? అసలు ఇలాంటివాళ్ళకి చావంటే భయం" అని చస్తూ వూరుకున్నాడు. తలబాదుకొన్నంతసేపు బాదుకుని తర్వాత ఫిట్ వచ్చినట్లు క్రిందపడిపోయింది.
    
                                                                    * * *
    
    ఎదురుగా వున్న యింట్లో జరిగేదంతా చిన్మయి గమనిస్తూంది. ఆ తిట్టుకోవడం, భయంకరంగా కొట్టుకోవడం చూచాయగా తెలుస్తూనే వున్నాయి. ఆమె గుండె దడదడమని కొట్టుకుంటూంది. భార్యా, భర్తల మధ్య కాపురం యింత వికారంగా కూడా వుంటుందా?
    
    ఆ రాత్రి భర్తచుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకుని పడుకుంది. ఆమెచేతిలోని ఒణుకు అతను గమనించాడు.
    
    "చిన్మయీ! ఎందుకలా భయపడుతున్నావు?" అడిగాడు.
    
    "ఆ ఎదురింటివాళ్ళు..."
    
    "అవును. నేనూ గమనిస్తూనే వున్నాను."
    
    "వాళ్ళమధ్య... ఎందుకలా జరుగుతోంది?"
    
    "నూటికి తొంభయి కాపురాలు ఇలాగే వుంటాయి."
    
    "అమ్మో, నిజంగానా?"
    
    "అవును జీవితాలేమో చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి. ఆ వేగంతో సరిసమానంగా మనసులు ఎదగటంలేదు. దాంతో సంసారాల్లో గందరగోళాలు కనిపిస్తున్నాయి. ఒకరి లోపాలే ఒకరికి కనిపిస్తోన్నాయి. ఒకరిలోని మంచిని మరొకరు దర్శించటానికి ప్రయత్నించడంలేదు. అహం, స్వార్ధం, సంకుచితత్వం, మితిమీరిన వ్యక్తిత్వం, యివి డామినేట్ చేసి మనుషుల్ని బలహీనులుగా తయారు చేస్తున్నాయి."
    
    "మీరు జనారలైజ్ చేసి చెబుతున్నారనుకోండి, వాళ్ళిద్దరి విషయమే తీసుకుంటే తప్పు ఎవరిదంటారు?"
    
    "నా అభిప్రాయం చెబితే మగాడిని కదా స్వార్ధం వుందనుకొంటావు. నువ్వు ఏమనుకుంటున్నావు?"
    
    చిన్మయి కొంతసేపు ఆలోచించింది. "తప్పు ఆనందదే అనిపిస్తుంది. అతను చూస్తే సౌమ్యుడులాగానే కనిపిస్తున్నాడు. ఆమె అతన్ని రెచ్చగొడుతూన్నదనిపిస్తోంది" అన్నది.
    
    "కళ్యాణచక్రవర్తి గురించి నాకు తెలుసు. అతను చాలా మంచి మనిషి ఎవరితోను కటువుగా మాట్లాడటం నేను చూడలేదు. అంతేకాదు, చాలామంది అతన్ని లైక్ చేస్తారు కూడా, అటువంటి మనిషి భార్యదగ్గర అప్పుడప్పుడూ పశువుగా ప్రవర్తిస్తున్నాడంటే అతన్ని మానసికంగా ఎంత హింస పెట్టకపోతే ఆ అధమస్థితికి వచ్చివుంటాడో."

 Previous Page Next Page