Previous Page Next Page 
ఖజురహో పేజి 8


    "ఏం? ఇంకెవరైనా ముందుకువస్తారా? నన్ను వెళ్ళమంటారా?" అడిగింది.
    
    ఎవరూ మాట్లాడలేదు. గప్ చిప్ గా చూస్తూ నిలబడ్డారు.
    
    మాయ దర్జాగా లోపలికి వెళ్ళి సగం వూడి వేళ్ళాడుతున్న రేకు తలుపు మూసుకుంది.
    
    లైన్ ని ఓవర్ టేక్ చేసే విధానం ఏమిటో చాయకు తెలిసింది. 'దౌర్జన్యం' కానీ అందుకు బలం వుండాలి. తనకంత బలం వుందా? ఆలోచనలో పడింది. లేదు.....కానీ అందం వుంది. ఈ అందం ఎలా వుపయోగపెట్టుకోవాలి?
    
    చాయ తన ఆలోచనలో వుండగానే ఆమె వంతు వచ్చింది. బాత్రూంలోకి వెళ్ళగానే కాలు జర్రున జారింది. చాయకి కలలో కనిపించిన యువకుడితో స్నో స్కేటింగ్ చేస్తున్న అనుభూతి కలిగింది. గూట్లో అరిగిపోయిన తన రూపం వాసనా పూర్తిగా కోల్పోయిన వృద్ద వేశ్యలాంటి సబ్బుముక్క ఎంతకీ చేతికి రాలేదు. ఓపిక లేనట్లు అక్కడే అతుక్కుపోయింది. చాయ బలంగా దాన్ని లాగి ఒంటికి రాసుకోవడానికి ప్రయత్నించింది.
    
    నున్నటి, గుండ్రటి భుజాలమీదుగా కారుతున్న నీటిబొట్లని నాలికతో తాకింది. తన చేతులు స్ప్రుశిస్తున్న శరీర భాగాల అందం చూసుకుంటూ వుంటే ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. పన్నీరు, గులాబీ, అత్తరు కలిపినా హాట్ వాటర్ టబ్ లో పడుకుని హేండ్ షవర్ ముఖంమీద పెట్టుకుని అది కలిగించే గిలిగింతకి పులకించాల్సిన అందం, ఇలా చీకటి కొట్టులాంటి బాత్ రూంలో, రొచ్చువాసనలో సరైన సబ్బు కూడా లేకుండా దిక్కుమాలిన స్థితిలో స్నానం చేయడం ఆమెకు రోజూ దుఃఖాన్నే మిగులుస్తోంది.
    
    స్నానంచేసి విడిచిన చీరనే చుట్టపెట్టుకుని బయటకు వచ్చింది చాయ. తడిసిన చీర వంటికి అతుక్కుపోయి వుంటే ఎక్కడ ఎంత ఎత్తువుండాలో, ఎటువంటి ఒంపు వుండాలో సరిగ్గా అంటే ఆమె శరీరాకృతి మన్మధుడి చేతిలోని వింటినారిలా వుంది. సంధించబడడానికి సర్వ సన్నాహాలతో సిద్దంగా వుంది. ఆ దేవదేవుడు యవ్వనమనే అమృతాన్ని హేమపాత్రలో పొర్లిపోయేంత నిండుగా పోసి భువికి పంపినట్లుగా వుందామె రూపం.
    
    గదిలోకి వచ్చి తలుపు వేసుకుని వంటిమీదున్న చీర కిందకి జార్చేసింది చాయ.
    
    "నా" అన్న కేక వినిపించి తలతిప్పి చూసింది.
    
    నోరు తెరుచుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న మాయ కనిపించింది.
    
    "నువ్విక్కడేం చేస్తున్నావు" చాయ కోపంగా అరిచింది.
    
    మాయ జవాబివ్వలేదు. చాయ శరీరాన్ని పరమ ఆశ్చర్యంగా చూస్తోంది. ఆత్రంగా, ఆశగా చూపులతోనే తడిమేస్తోంది.
    
    చాయకి తను నగ్నంగా వున్నట్లు అప్పుడే స్ఫురించి చటుక్కున క్రిందపడిన చీర తీసి పైన కప్పుకుంటూ "ఇక్కడనుంచి వెంటనే వెళ్లిపో లేకపోతే వార్డెన్ తో చెప్పి నీకు పనిష్మెంట్ ఇప్పిస్తాను. పో పొమ్మంటుంటే నీక్కాదూ?" అని గట్టిగా అరిచింది.
    
    మాయ నెమ్మదిగా దగ్గరకు వచ్చి "నిన్నిలా చూస్తుంటే నాకేదో అవుతోంది చాయా! ఓసారి తాకనా?" అంది.
    
    చయకి మాయ కళ్ళల్లో ఏదో అసహజత్వం కనిపించి కాస్త భయం వేసింది. అంతలోనే దులపరించుకుంటూ "నువ్వు పోతావా? పోవా?" అంది.
    
    మాయ తన చేతిని చాయ భుజంమీద వేసింది.
    
    చాయ అసంకల్పితంగా అయినా వెంటనే ఆ చేతిని పట్టుకుని విసిరికొట్టింది. ఆ విసురుకి బలమైన మయకి కూడా తన చెయ్యి విరిగిపోతుందేమో అన్న అనుమానం వచ్చింది. చాయంటే కాస్త భయం కలిగింది. ఆమె బలానికి కాదు ఆమె కళ్ళలలోని ఏహ్యభావనకి. ఆ చూపుకి అంత శక్తి వున్నట్లు మాయ మారుమాట్లాడకుండా వెళ్ళి తలుపు తీసింది. రూంలోంచి బయటికి వెళుతూ తల వెనక్కి తిప్పి "నీది మామూలు అందం కాదు. భరించలేని అందం. ఆహా! ఇంత అందం నాకే వుంటేనా? ఈ ప్రపంచాన్నే ఒక ఆట ఆడించేసి వుండేదాన్ని" అని వెళ్ళిపోయింది.
    
    మాయ మాటలు చాయ మనసుని ఒకంతట వీడిపోలేదు. చీర కట్టుకుంటున్నా జడ వేసుకుంటున్నా అవి చెవుల్లో గింగురుమంటూనే వున్నాయి. తన రేకుపెట్టె తాళం తీసి అందులోంచి పౌడర్ డబ్బా బయటికి తీసింది. ఆ చౌకబారు పౌడర్ ఆమె మేనికాంతినీ, ఆ ఒంటి నునుపునీ చూసి సిగ్గుపడుతున్నట్లుగా ఒకంతట బయటికి రాలేదు. డబ్బా కాయితంమీద బోర్లాపెట్టి వెనుకనుండి గుండ్రాయితో మోది కాస్త పౌడర్ బయటికి తెప్పించగలిగింది. దాన్ని ముఖానికి ఆదరాబాదరాగా రాసుకుని బొట్టు స్టిక్కర్ అంటించుకుంటూ వుండగానే గంట మ్రోగడం మొదలయింది.
    
    ఈ రోజు కూడా ఆలస్యమయితే వార్డెన్ కి కోపం వస్తుంది. కోపం వస్తే తిడితే ఫర్వాలేదు. ఖర్మ! గదిలోకి పిలిచి వేమనలా సూక్తిముక్తావళి మొదలు పెడుతుంది. ఎవరిచేతో అస్తమానం నీతిసూత్రాలు చెప్పించుకోవడం ఉరికన్నా భయంకరమైన శిక్ష అనుకుంది.
    
    చాయ పరుగులాంటి నడకతో మెస్ చేరేసరికి-
    
    "వార్డెన్ అమ్మగారు నిన్ను అర్జంట్ గా రమ్మన్నారు" అంది ఆయా ఎదురొస్తూ.
    
    చాయకి ఎక్కడాలేని నీరసం ముంచుకొచ్చింది. ఈ వార్డెన్ లనీ, టీచర్లనీ ఎందుకు కనిపెట్టార్రా బాబూ?" అనుకుంటూ నీరసంగా వార్డెన్ రూంవైపు అడుగులు తీసింది. ఆఫీస్ రూం సమీపిస్తుంటేనే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అందుకు కారణం అక్కడ ఆగివున్న వైట్ మారుతీ కారు. చాయ అబ్బురంగా చూస్తూ దానిమీద చెయ్యివేసింది. ప్రొద్దుటే దీనిలో ఆ దిక్కుమాలిన హాస్టల్ కి ఎవరొచ్చారబ్బా? అనుకుంటూ ఉండగానే-
    
    "రా చాయా! ఈ అబ్బాయి నీకోసమే వచ్చాడుట" అన్న వార్డెన్ కంఠం వినిపించి గభాల్న చెయ్యి తీసేసి వెనక్కి తిరిగింది.
    
    అతన్ని చూడగానే చాయకి ఆశ్చర్యంతో పెద్దగా కేకవేయాలనిపించింది.
    
    అతను.....అతనే తనకి తెల్లవారుజామున కలలో కనిపించిన యువకుడు. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమౌతాయన్నమాట. అసత్యం కాదు అన్నమాట.
    
    ఆమె శిలాప్రతిమలా అతడివంక చూస్తుండిపోయింది.
    
    ఆ యువకుడి కళ్ళు ఆమె కళ్ళల్లోకి కలుసుకాగానే కొంటెగా నవ్వాయి.
    
    అతను వేసుకున్న సూటు, కళ్ళకి పెట్టుకున్న గాగుల్స్, ఖరీదైన షూ అతని రూపాన్ని మించి మనోహరంగా అన్పించాయి చాయకి.
    
    చాయకి ఇది కలకాదు కదా అన్పించింది.
    
    తనకోసం ఓ అందమైన అబ్బాయి కారులో రావడం, అదీ అతను అచ్చు తన కలలో కన్పించే అబ్బాయిలాగే వుండడం చూస్తూవుంటే ఆమెకి తన జాతకంమీదా, తనమీద నమ్మకం పెరిగిపోసాగింది.
    
    "బస్ పాస్ పారేసుకున్నావట? ఆ సంగతి నాతో చెప్పలేదేం?" వార్డెన్ కంఠం కరుగ్గా పలికింది.
    
    చాయ అప్పుడు చూసింది అతని చేతిలో పట్టుకున్న తన బస్ పాస్ ని.

 Previous Page Next Page