"ఎందుకని కాలేదు?"
"టైము సరిపోలేదండీ."
"ఎన్నాళ్ళు పడుతుంది పూర్తి చెయ్యటానికి?"
"ఇంకా మూడు, నాలుగురోజులు పడుతుంది."
"అయితే ఇవాల్టినుంచి అదే పనిమీద ఉండండి."
"కాని..."
"చెప్పండి."
"రేపట్నుంచి అయిదురోజులు సెలవు తీసుకుంటున్నానండి.
అతను సెలవు కావాలని అడగలేదు. సెలవు తీసుకుంటున్నానని చెప్పేశాడు.
"సెలవా! దేనికి?"
"మా మారుతీ అన్నగారి తద్దినమంది."
"తద్దినానికి అయిదు రోజులా?"
"ఇవి ఏదుగుల తద్దినాలండి. మా ఇళ్ళలో ఆచారం ప్రకారం అలాగే పెడతాం."
"క్రితం నెలలో నాలుగురోజులు పెట్టారు?"
"అవి మా అమ్మాయి సమర్త ఆడినందుకండి."
"అంతకు ముందునెలలో వారం రోజులు పెట్టారు?"
"అవి నా సుస్తీ గురించండి."
"ఆ క్రిందటి నెలలో అయిదురోజులు పెట్టారు?"
"అప్పుడు మా మేనకోడలి పెళ్ళి అండీ."
"అంతకుముందు నెలలో నాలుగురోజులు పెట్టారు ?"
"అప్పుడు మా నాన్నగారి తడ్డినమండీ."
"మొత్తం ఏడాదిలో మీకెన్ని తద్దినాలుంటాయి ?"
"అయిదారుంటాయండీ. మా తండ్రిగారిదీ, మారుటి అన్నగారిదీ , మారుటి తల్లిగారిదీ ..."
"లెక్క చాల్లెండి ఇంకా ఈ ఏడాది తద్దినాలు పూర్తయినట్లేనా?"
"ఇంకా ఒకటో రెండో ఉన్నాయండీ రేపు భాద్రపద మాసంలో ఒకటి, కార్తీక మాసంలో ఒకటీ..."
"చాల్చాలు ఎవరయినా తద్దినాల గురించి ఆఫీసులకి సెలవులు పెట్టుకుంటారండీ?"
"మా ఇళ్ళలో అంతేనండీ."
రాజాచంద్రకు కోపమొచ్చింది. "ఇక్కడ కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. ఇంకో చోటయితే ఇవన్నీ ఒప్పుకోరని తెలుసునా?"
"అలాంటప్పుడు ఉద్యోగాలు మానేస్తాము కానండీ ఆచారాలు మానుకోమండీ."
"ఆచారాలంటే తద్దినాలూ, సమర్తలూ, శోభనాలూ ఇవేనా?"
"పెళ్ళిళ్ళకెళితే అక్కర తీరేదాకా ఉండకపోతే బావుండదు కదండీ."
రాజాచంద్రకు అసహ్యమేసింది. "ఆడంగి వెధవా" అని తిట్టాలనిపించింది. అతనికి కోపమొచ్చినప్పుడూ, అసహ్యమేసినప్పుడూ అని వ్యక్తం చెయ్యటానికి మాటలు దొరకవు. ముఖంలో కూడా కోపం, అసహ్యం, ప్రదర్శించటానికి మొహమాట పడతాడు.
"సరే ఇహ వెళ్ళండి" అన్నాడు.
* * *
తనకు నచ్చనివి పక్కవారిలో ఏమాత్రమున్నా అతను సహించలేడు. ఆ వ్యక్తితో మనస్ఫూర్తిగా మాట్లాడలేడు. అతను తన అభిప్రాయాలను బయట పెట్టకపోవచ్చు. అవతలి వ్యక్తి అసహ్యంగా ప్రవర్తించినా, తప్పు చేసినా పరుషంగా మాట్లాడలేకపోవచ్చు. దండించలేకపోవచ్చు. కాని గుండెలమీద కుంపటిలా భరిస్తూ ఉంటాడు.
అతను ప్రపంచంలో అన్ని విధాలా, అన్ని కోణాల నుంచీ ఇష్టపడింది ఒకే ఒక వ్యక్తి విశారద మిగతా భర్తలు వాళ్ళ భార్యలను ప్రేమించటం వేరు. అతను ప్రేమించటం వేరు. ఆమె అతని హృదయాధి దేవత. ఇద్దరికీ ఇంత వయసొచ్చినా ఆమెని విడిచి అతను క్షణమైనా ఉండలేడు. పెళ్ళయాక ఈ ఇరవై మూడు, ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడో పురిటికి తప్ప పుట్టింటి కెప్పుడూ పంపించలేదు. పురిటికి వెళ్ళినప్పుడు కూడా అతను వారానికి ఒకసారయినా అత్తవారింటికి వెళ్ళి వస్తుండేవాడు. ప్రతిరోజూ ఆమెకు ఫోను చేసేవాడు. అతని బంధువులుగానీ, స్నేహితుగానీ ఎగతాళి చేసినా లెక్క చేసేవాడు కాదు. ఆమె అతనికి కావాలి అంతే!
అతనికి నలభయి ఎనిమిదేళ్ళయినా, ఆమె అతనికంటే నాలుగయిదేళ్ళు మాత్రమే చిన్నది. అయినా తనకి వయసు వస్తున్నదని అతనేనాడూ అనుకోలేదు. అతనికంటినామె ఎప్పుడూ ప్రౌఢలా కనిపించలేదు. అతను చాలా చలాకీగా యాక్టివ్ గా ఉండేవాడు. ఆమె చాలా నిరాడంబరంగా, నాజూకుగా ఉండేది. చేతులకి ఒక జత గాజులు తప్ప ఇంకా ఏ ఆభరణాలూ ధరించేది కాదు. ఆమె సింప్లిసిటీ ఆమెకు మరింత వన్నె తెస్తూ ఉండేది.
"విశారదా! ఐ... ఐ... ఐలైక్ ఎవ్విరి బిట్ ఆఫ్ యూ!"
"అందులోంచి చిన్న పోకిరీ అర్ధంకూడా ఉంది."
ఆమె హుందాతనంలో ఉన్న చిలిపితనం అతని కళ్ళకి ఒ అలంకారంగా కనిపించేది.
3
వినూత్న ఓ ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళింది. ఆ ఫ్రెండ్ పేరు హిమశైలజ. బర్త్ డే కని పార్టీ ఇస్తుంది.
మొత్తం పది పదిహేనుమంది అమ్మాయిలు, అబ్బాయిలదాకా ఉన్నారు. అబ్బాయిలు సరే- వ్యామోహం కోసం, అమ్మాయిలతో తిరగాలన్న సరదా కోసం, అమ్మాయిలతో తిరగాలన్న సరదగా తీరటంకోసం అవకాశ మొచ్చినప్పుడల్లా వాళ్ళు చుట్టూ మూగుతారు. లోలోపల రగిలే తపన చల్లార్చుకుంటారు. కాని అమ్మాయిలకి కూడా వాళ్ళతో యథేచ్చగా మాట్లాడటానికి అభ్యంతరం లేదు.
నవ్వులు, కేకలు, కేరింతలు.