ఎవరో తట్టి లేపేదాకా తెలియలేదు చీకటి పడిందని.
ఉలికిపాటుగా చూసింది.
దూరంగా సోమయాజులుగారు నాన్నని ఓదార్చుతున్నారు.
అంటే...
అప్పుడే తమ్ముడి అంత్యక్రియలు పూర్తయ్యాయా?
నాన్న తిరిగివచ్చి ఎంతసేపైందీ...
"పిచ్చితల్లీ! పదిమందికి చెప్పగల ఆడపిల్లవి నువ్వే ఇలా బెంబేలు పడితే నీ తండ్రి మాటేమిటీ?" సోమయాజులు మాస్టారి భార్య ఓదార్చుతూంది తననే.
గదిలో దీపం చీకటిని తరిమేసే శక్తిలేక తమ్ముడికి చెప్పిన ఆఖరి వీడ్కోలు సాక్ష్యంలా నీరసంగా వెలుగుతూంది.
చుట్టూ కలియచూసింది.
బోసిపోయిన ఇల్లు... పెన్ను కోసమూ, అన్నం కోసమూ తమ్ముడు పెడుతున్న కేకలు ఇంకా వినిపిస్తుంటే నీరసంగా లేచిందామె. గోడమీద తనతోబాటు అప్పుడెప్పుడో దిగిన ఫొటోలోని తమ్ముడు 'పద్దెనిమిదేళ్ళకే నీకంటే పొడవైపోయానక్కా' అంటున్నాడు. గోడ మేకుకి వేలాడుతున్న తమ్ముడి చొక్కా 'షాపువాడు మనకి పాతిక రూపాయలు టోపీ వేశాడు నాన్నా' అన్న తమ్ముడి గొంతుని గుర్తు చేస్తూంది.
అమ్మో!
ఆమె చాలా ఆందోళన పడింది. పద్దెనిమిదేళ్ళ అనుబంధానికి తానే ఇంత కలవారపడితే జన్మకి కారణమై నూరేళ్ళ కొడుకు జీవితంకోసం కలలాంటి వృద్దాప్యాన్ని ఈడ్చుకువస్తున్న నాన్న మాటేమిటి?
నిజమే... తాను ధైర్యాన్ని చిక్కబట్టుకోవాలి. కంటతడిపెట్టుకునే నాన్నకి క్షణభంగరమైన జీవితం గురించి, ప్రారబ్ద కర్మల గురించి వేదాంతిలా నచ్చచెప్పాలి.
అయినా ఆ పిచ్చివెధవ ఎంత అవమానం జరిగితే మాత్రం ఆత్మహత్య చేసుకోవాలా?
ఆమె నిశ్శబ్దంగా మరో గదిలోకి నడిచింది. నాలుగు దశాబ్దాల ఉపాధ్యాయ వృత్తి ఇద్దరు పిల్లల్నీ, మూడు గదుల పెంకుటింటినీ అందిస్తే... అందులో ఒకబిడ్డ నేలరాలిపోయిందిప్పుడు. మిగిలింది మూడు గదులూ మిగిలిన ఇద్దరికి ఓ జీవితకాలమంత విషాదం.
నిర్వేదంగా గోడకి జారగిలబడి కళ్ళు మూసుకుంది. అది అలసట కాదు. భావాతీత ధ్యానంలాంటి స్థితి. తన చివరి గాన స్వరాల్ని అవశేషంలా ఆలపించిన బ్రతుకు వీణకి రేపు పల్లవి ఏదో తెలీని ప్రశ్నలాంటి పరిస్థితి.
అదిగో...
సరిగ్గా అప్పుడు ఓ గాలి అల కిటికీలో నుంచి బలంగా లోనికి దూసుకొచ్చింది.
పాదాలకి ఏదో తాకినట్టనిపించి చూస్తే ఓ కాగితం.
సమీపంలోని గూటిలో నుంచి వర్తమానంలా జారిన ఆ కాగితం తమ్ముడు రాసిన చివరి లేఖని అనిపించాలేదు ముందుగా.
కానీ ఏదో ఇంట్యూషన్...
అసంకల్పితంగా అందుకుంది.
"అక్కా!"
క్షణంపాటు ఆమె రక్తప్రసరణ స్తంభించిపోయింది.
ఇక లేవూ, మరెన్నటికీ రావూ అనుకున్న అశ్రువులు కళ్ళల్లో సుడులు తిరుగుతుంటే ఆర్తిగా చదవటం ప్రారంభించింది.
"నేను నువ్వు వచ్చేదాకా ఆగేవాడ్ని. కానీ అంతదాకా ఓపిక పట్టలేకపోయాను. అవునక్కా! అంత కలవరపడిపోయాను నిజం...నాకు శ్వేతమీద ఎలాంటి ఇష్టమూలేదు. అందుకే తప్పించుకునేవాడ్ని. అయినా జూనియర్ కాలేజీ స్థాయిలో ప్రేమలేంటే.. కాబట్టే ప్రేమలేఖ రాసిన శ్వేతని నిన్న క్లాసులోనే మందలించాను. ఎంత అహంకారి అంటే ఇంటికెళ్ళి నా మీద లేనిపోనివి చెప్పినట్టుంది వాళ్ళ నాన్నతో. తప్పు నాదో కాదో తెలుసుకోకుండానే-కాదు తెలుసుకోకూడదనేనేమో గొడ్డును బాదినట్టు బాదేశారు."
ఆశ్రిత చదవలేనిదానిలా దృష్టి మరల్చుకుంది. అసలు వాడికి ఏనాడైనా ఒంటిమీద దెబ్బ పడితేగా... పేదరికంలాంటి జీవితమైనా ప్రేమతప్ప ద్వేషం ఎరగడే.... అసలు నాన్న మాట జవదాటని మంచి కొడుకులా, అక్కనే అమ్మనుకుంటూ కొంగుపట్టుకు తిరిగే మంచి బాలుడికి పైగా ఎవరి ఊసూలేని వాడికి అలాంటి స్థితిని ఎదుర్కొనే అవకాశం ఏదీ అయినా ఓ పసికందు మీద అంత ఘోరంగా అఘాయిత్యం చేయటానికి ఆ రాక్షసులకి చేతులెలా వచ్చాయి?
నిజంగా తప్పు చేస్తే మాత్రం దండించటానికి ఎన్ని మార్గాలు లేవని...
"అక్కా" రాజేష్ కళ్ళనీళ్ళు పడినందుకేమో అక్షరాలు అలికినట్టుగా వున్నాయి.
"శిక్ష నాకే పరిమితమైతే నేను అంతగా బాధపడేవాడ్ని కాదు. సూర్నారాయణంటే చాలా గొప్పవాడు, మినిస్టరు కాబట్టి తన్నులు తిని నిశ్శబ్దంగా ఇంటికి వచ్చేసేవాడ్ని. కానీ ఎలా తెలిసిందో ఏమో అనుకోకుండా నాన్నగారు వచ్చారక్కడికి. వస్తూనే నా పరిస్థితి చూసి కంగారుపడి సూర్నారాయణ కాళ్ళమీద పడ్డారు. ఆ తర్వాత జరిగింది నేను రాయలేకపోతున్నానక్కా.. నాకు జ్ఞాపకం తెలిశాక నాన్నగారు ఎంత గౌరవంగా బ్రతికిందీ చూశాను. చిన్నప్పుడెప్పుడో ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ పెద్దయ్యాక పనిగట్టుకుని ఆయన్ని కలుసుకుని పాదాన్ని తాకి కృతజ్ఞతలు తెలియచెప్పటాన్నీ గమనించాను. ఒకమంచి ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం గుర్తించే ఆయనకి చాలాచోట్ల సన్మానాలు చేసి గౌరవించడమూ నాకు బాగా తెలిసిందేగా... అలాంటి నాన్నని సూర్నారాయణ ఎంత దారుణంగా అవమానించాడూ అంటే ఆయన ముసలితనాన్ని సైతం పట్టించుకోకుండా డొక్కలో తన్నేడు... ప్రాణాలు కడగంటిపోయే బాధతో నాకోసం ప్రాధేయపడుతుంటే తన ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో, చేతుల్తో కొడుతూ చాలా నీచంగా అవమానించారు. అదే అక్కా... అదే నేను భరించలేకపోయాను. అసలు అంతలా శిక్షించటానికైనా నేను తప్పు చేస్తేగా! పైగా నేను బ్రతికుండగానే నాన్నగారిని ఆ స్థితిలో చూడాల్సి రావటాన్ని జీర్ణించుకోలేకపోయాను.
అక్కా... దేవుడున్నాడో లేదో నాకు తెలీదు, తెలిసింది దేవుడిలాంటి నాన్నగారు. చాలామంది దేవుడిలా పూజించే నాన్నగారు మాత్రమే... అలాంటి నాన్నకి నా మూలంగా అంతటి అవమానం జరిగింది. అందరి అబ్బాయిల్లా అల్లరి చిల్లరగా నేనూ పెరిగివుంటే నేను తట్టుకునేవాడ్నేమో...కానీ నేను నాన్న వుండే గర్భగుడిలాంటి ఇంటిలో పెరిగాను. నాన్న లాలిత్వంతో మంచి స్టూడెంటుని అనిపించుకున్నాను. "ఈ మాత్రందానికే నువ్వు చావాలిట్రా" అని నువ్వుంటే నా దగ్గర జవాబులేదు. నూరేళ్ళ జీవితకాలంలో ఒక్క ఏడాది పరీక్ష తప్పినందుకే ప్రాణాలు తీసుకునే చాలామంది విద్యార్ధుల్లాంటి మనస్తత్వమే నదీ అయినందుకే ప్రాణాలు తీఉస్కునే చాలామంది విద్యార్ధుల్లాంటి మనస్తత్వమే నాదీ అయినందుకేమో-నువ్వు వస్తే నన్నెక్కడ ఓదార్చి, వారిస్తావో అని నువ్వు రాకముందే ప్రాణాలు తీసుకుంటున్నాను.
నాన్న జాగ్రత్తక్కా! నిన్ను కొడుకుగా, నన్ను ఆడపిల్లగా నాన్న అప్పుడప్పుడూ పరిహాసంగా అనేవారు గుర్తుందిగా... అందుకే ముగిసిపోతున్న ఈ ఆడపిల్ల జీవితం గురించి పట్టించుకోకుండా మిగిలిన ఒక్కగానొక్క కొడుకులా నాన్నని నువ్వే కాపాడుకోవాలంటున్నాను. చివరగా ఒక్క మాటక్కా! ఇది తొందరపాటో, పొరపాటో నాకు తెలీదు. కానీ మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకు తమ్ముడిగా, నాన్నకి కొడుకుగానే పుట్టాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను"