రాధ అక్కడున్న చాపమీద చతికిలబడి "ఏరా కృష్ణా! మా ఇంటివైపు బొత్తిగా రావటం మానేశావు" అంది.
"వస్తే నువ్వు కోప్పడుతావేమో ననుకున్నాను."
"నేనా? ఎందుకు?
కృష్ణుడు తడుముకోకుండా "ఆవేళ నీకు కోపం వచ్చిందిగా" అన్నాడు.
రాధ "మరి కోపం వచ్చేటట్లు ఎందుకు మాట్లాడతావు" అంది.
"ఉన్న విషయం చెప్పటంగూడా తప్పేమిటి?"
"ఒరేయి, ఒకటడుగుతాను జవాబు చెబుతావా?" అని ప్రశ్నించింది రాధ ఉత్కంఠగతో.
కృష్ణుడు గంభీరంగా ముఖంపెట్టి "అలాగే చెబుతాను" అన్నాడు.
రాధ అటూ ఇటూ చూసి, ఎవ్వరూ లేరని నిర్ధారణ చేసుకుని "నన్ను వదినా అని పిలవమని నీకు ఎవరు చెప్పారు?" అని అడిగింది మందంగా.
"అన్నయ్య."
జవాబు సూటిగా వచ్చింది. రాధ ఒక్కసారిగా నిలువునా వణికింది. ఈ జవాబు ఆమె శారీరంలోని ప్రతి అణువునూ స్పృశించి బాధించింది.
"అన్నయ్య" కోపంతో కపించిపోతూ అంది తిరిగి.
"మా అన్నయ్య చాలా మంచివాడు వదినా" అన్నాడు ఆమె వంక చూడకుండా కృష్ణుడు. "మా అన్నయ్య ఎంత తెలివిగలవాడో తెలుసా? నన్ను దగ్గరకు తీసుకుని- ఎటువంటి కబుర్లు చెపుతాడనుకున్నావు? మా అన్నయ్య ఎలా పాడుతాడో తెలుసా? బుల్ బుల్ వాయిస్తూ మా అన్నయ్య పాడుతూంటే....."
"నోర్ముయ్!"
తన ధోరణిలో చెప్పుకుపోతున్న కృష్ణుడు తృళ్ళిపడి ఆగాడు. ఎర్రబారిన ఆమె నేత్రాలు, కంపిస్తున్న ఆమె ఆధారాలు చూసేసరికి అమాయకమైన వాడి ముఖం ఆశ్చర్యంగా, భయంగా మారింది.
"అదేమిటి వదినా?" అన్నాడు మెల్లగా.
రాధ కూడదీసుకుంటూ "ఏమిటిదంతా? ఇవన్నీ నాతో చెప్పమని ఎవరు బోధించారు? నన్ను అవమానపరుద్దామని మీ అందరి ఉద్దేశమా?" అని త్వర తవరగా అనేసింది.
"వాడు చెప్పిందాంట్లో తప్పేమిటి?"
ఈ కంఠస్వరం విని రాధ చకితురాలై నిలబడింది. పరాయి మొగవాళ్ళతో మాట్లాడటం ఆమెకు అలవాటు లేదు. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది.
"మీకు అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చునా?"
ఈ మాటలు మాట్లాడిన మనిషి తాలూకు రెండుకళ్ళూ తనని గ్రుచ్చి గ్రుచ్చి చూస్తున్నాయని రాధ గ్రహించింది. అవమానంతో, బాధతో, సిగ్గుతో ఆమె మనస్సు తల్లడిల్లిపోతోంది. వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోవాలని మొదట అనుకుంది. కాని ఆ పనికూడా కష్టంగానే పరిణమించింది.
"మాట్లాడరా?"
ఏమిటీ మనిషికి ఇంత చొరవ? తను అతనికి సూటిగా జవాబు చెప్పలేదా? అరుణ కాంతితో రాగరంజితమైన రాధ ముఖం ఆ క్షణంలో చాలా మనోహరంగా వుంది.
ఆమెలోని ఆత్మాభిమానం చెలరేగిగా, పడగవిప్పిన నాగులా తలఎత్తి అతనివంక చూసింది. కాని ఆమె చూపులు అతని చూపుల్తో కలుసుకునేసరికి జవాబు చెప్పటం అనుక్కుంత సులభం కాదని గ్రహించింది.
చివరికి ఆమె అనగలిగింది అదే; "ఆడవాళ్ళని ఇలా అవమానించడం భావ్యమా!"
ప్రక్కగది ద్వారంలో రెండు చేతుల్తో పైనున్న ద్వారబంధాన్ని పట్టుకుని నిల్చున్న ఆనందరావు ఈ సారి ఆశ్చర్యంగా "మిమ్మల్ని నేను అవమానించినట్లు ఎందుకు భావించారూ?" అన్నాడు
"కాక మరి ఇదేమిటి?"
అతనేమీ చెప్పకముందే రాధ తెగించి మళ్ళీ అందుకుని, లేకపోతే ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని అమాయకుడైన కుర్రాడిచేత అలా అనిపించటం ఏం మర్యాదైన విషయం? ఇంటికి ఒకరి కోసం వచ్చిన స్త్రీతో మరొకరు చొరవ తీసుకుని మాట్లాడటం ఏం గౌరవమైన పని?" అని ఈసారి సాంతం నిలదీసి అడిగింది.
అయితే కృష్ణుడు అందరూ అనుకునేంతటి అమాయకుడు కాదు. ఈ సన్నివేశంలో వాడు వుండకుండా ఎప్పుడో తప్పుకున్నాడు.
అతను బెదిరిపోకుండా, అనుషంగికంగా చూస్తున్నవాడి మాదిరి ఆమె వంక చూస్తూ "నిర్మలమైన మనస్సుతో ఇలా ప్రవర్తించానని ఎందుకనుకోరు?" అన్నాడు.
ప్రశ్నరూపంలో వున్న ఈ జవాబు చాలా హాస్యాస్పదంగా కనబడింది రాధకు బహుశా అతను మనస్సు స్థిరంగా వుండి మాట్లాడటం లేదని ఆమె అనుకుంది. ఆమెకింకా జవాబు చెప్పాలనే వుంది. కాని ఏమైనా అక్కడ నిలబడి సవ్యంగానో, అవసవ్యంగానో అతనితో మాట్లాడుతూ వుండటం చాలా అసహ్యంగా తోచింది. "ఇలా ఇంకెప్పుడూ చేయకండి" అని చివరిసారిగా ఒక మాట దులిపేసి బైటకొచ్చిపడి, ఇంటివైపు నడవసాగింది.
ఆమెకు ఇదంతా ఒక కలలా తోచసాగింది. ఇన్నాళ్ళూ రోడ్డుమీద నడుస్తున్నా, ఎక్కడికన్నా పోతున్నా తనవంక ఎవరైనా చూస్తున్నారో, ఏమి చేస్తున్నారో ఇవన్నీ పట్టించుకునేదికాదు. తనలో ఏమయినా ఆకర్షణ వుందో లేదో కూడా ఆమెకు తెలీదు. కాని, ఇప్పుడు అంత కంగారులోనూ కూడా తనవంక ఎంతోమంది గుచ్చి గుచ్చి చూస్తున్నట్లుగా మాసివున్న తన దుస్తుల్ని గురించి పరిహసిస్తున్నట్లూ బాధపడసాగింది.
ఇంటికెలాగో వచ్చిపడింది. తల్లి లోపల గదిలో చాప పరుచుకుని నిద్రపోయింది. వాడు బడికి పోయినట్లున్నాడు! పెద్దన్నయ్య ఆఫీసుకు పోయాడు. తండ్రి ఆయన ఆటగొడవలో ఆయన వున్నాడు. ఒక గదిలో నాయనమ్మ ఛాయని కావిలించుకుని నిద్రపోతోంది. తను ఏకాంతంగా వుండేందుకు అనువుగా ఒక గది వెతుక్కుంది. అక్కడ ఒక మూలకుపోయి నేలమీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఎందుకు ఏడుస్తూందో అర్థం చేసుకోలేకపోయినా, అలా చాలసేపటి దాకా ఏడుస్తూ పడుకుంది. కళ్ళన్నీ మంటలు పెట్టసాగాయి. కొంతసేపు గడిచేసరికి దుఃఖించేందుకు కూడా ఓపికలేక- అలసిపోయి పడుకుంది.
తిరిగి ఆమెకు మెలకువ వచ్చేసరికి వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. సాధారణంగా పగటినిద్ర ఆమెకు అలవాటులేదు. అందుచేత మెలకువ రాగానే కొంచెం తడబడి మళ్ళీ స్పృహ తెచ్చుకుని లేచినిల్చుంది దగ్గిర ఒక కిటికీ వుంది. అందులోంచి బయటకు చూసింది. ఎండ బాగా తగ్గిపోయింది. బహుశా ఐదుదాటి వుండవచ్చు. ఎక్కువ రద్దీ లేని ఆ రోడ్డు మీద కూడా ఈ వేళ ఎంచేతో జనం సందడిగా తిరుగుతున్నారు. ఇంకా కొంచెం దృష్టి సారించి చూస్తే మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది. రాధ అటు చూసింది. కారు యాక్సిడెంటు ఏదో అయినట్లుంది. జనం గుమిగూడి వున్నారు. "ఎవరో అభాగ్యుడు" అనుకుంది.
ఒకసారి బద్ధకంగా ఆవులించి రాధ ఇవతలకు వచ్చింది. ఎదురుగా అద్దం కనిపించింది. ఎందుకో ఒకసారి అద్దంలో ముఖం చూచుకోబుద్ధయింది ఆమెకు.
బాగా ఏడ్చినందువల్లా, ఎక్కువగా నిద్రపోయినందువల్లా కళ్ళు బాగా ఎరుపెక్కి వున్నాయి. చెంపలమీద కన్నీటిధారలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ మించి ఒక కొత్త వస్తువు ...... ఉహుఁ ఒక కొత్త భావం ఆమె ముఖంలో కనిపించింది. కాని అదేదో ఆమెకు తెలియలేదు, తెలియదు.
పెరట్లోకిపోయి నీళ్ళతో ముఖం కడుక్కుని వచ్చింది. ఇంతలో వెనకనుంచి తల్లి పిలిచింది. రాధ వెనక్కి తిరిగి చూసేసరికి "వంటింట్లో కాఫీ గ్లాసుపోసి పెట్టాను. చల్లారిపోయి వుంటుంది. వెచ్చపెట్టుకుని తాగవే" అంది ఆమె.
రాధ కుంపటిముందు కూర్చుని ఆలోచించసాగింది. ఈ విషయం ఎవరికైనా చెప్పటమా వద్దా?
చెబితే ఏమని చెప్పాలి? చెప్పేందు కేముంది?
తనకు తెలిసినంత వరకూ రాధ ఇంతవరకూ తల్లి ముందర రహస్యాలు దాచలేదు. "పెద్దవాళ్ళ ముందు దాచే రహస్యాలు తన దగ్గిర ఏముంటాయి?" అని ఆమె ఇన్నాళ్ళూ భావించింది. కాని ఇప్పుడా అభిప్రాయం పొరపాటయింది.
కొన్ని కొన్ని విషయాలు చెబుదామనుకున్నా చెప్పలేకపోతారు. కొన్ని కొన్ని చెప్పలేక చెప్పలేకపోతారు. కొన్ని కొన్ని చెప్పకూడదని చెప్పకుండా వుంటారు.
ఇన్నింటికి కారణం ఏమిటి? చెప్పాలా వద్ద అన్న సంశయం ఇన్నాళ్ళ నుంచి రానిది ఇప్పుడెందుకు రావాలి?
రాధ ఈ ప్రశ్నకు సమాధానం కోసం యోచించలేదు. యోచించినా ఇన్నిటికి కారణం "వయస్సు" అనే జవాబు తోచి వుండదు. అలా తోచివుండక పోవటానికి కూడా కారణం వుంది. రహస్యాలు దాచుకునే వయస్సు వచ్చినా తనకు ఆ రహస్యాలు దాచుకునే వయస్సు వచ్చిందనే సత్యాన్ని గుర్తించే యీడింకా ఆమెకు రాలేదు.
కాఫీ త్రాగాక సావిట్లోకి వచ్చి అరుగుమీద నిల్చుని చూడసాగింది. అంతలో నారాయణ ప్రయాసమీద యెప్పటిదో ఆ సైకిలును బయటనుంచి లాక్కువస్తూ గోచరించాడు.
"ఏమిటయిందన్నయ్యా?" అంది అతని అవస్థ చూసి.
అతను సైకిలును అరుగుకు ఆనించి చెమటలు కారుచున్న ముఖాన్ని పైకెత్తి చెల్లెలి వంక చూస్తూ "ఏం చెప్పను? అరిగిపోయి అరిగిపోయి వుందేమో చెయిన్ -టప్ మని విరిగిపోయింది. అంతటితో ఆగినా బాగుండునా? సరే అని నడిపించుకుంటూ వస్తూంటే హాండిల్ బార్ బిడుగుకుపోయి కదలనని మొండికేసింది. దీన్ని ఇంటికి చేరవేసేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చిందనుకో" అని విచారంగా నవ్వాడు.
ఇటువంటి సమయంలో నవ్వే నవ్వు పరిచితమైన రాధకు అన్నగారిని చూస్తే మితిలేని జాలి వేసినది. అయినా ఓ చమత్కారం విసరాలని బుద్ధిపుట్టి "కాని నీకు తోకలేదుగదా అన్నయ్యా" అంది.
"నువ్వు జుఆలజీ చదువుకోలేదు మనుష్యులకి కూడా జంతువులకి లాగే తోక వుంటుంది. అది బయటకు వుండేది. కాని......" అని గంభీరమైన విషయాన్ని నవ్వులాటగా మర్చివేస్తూ "నాగరికత పెరగటంతో ఆ తోక కాస్తా తరిగిపోయి శరీరంలోంచి బయటకు రానంతగా హరించుకుపోయింది."అంటూ చెల్లెమ్మ బుగ్గమీద ఒక చిటికవేసి లోపలకు వెళ్ళిపోయాడు.
అన్నయ్యను ఒక ప్రశ్న అడగాలనుకుంది రాధ. ఇటువంటి విషయాలే చిత్రంగా వుంటాయి. ఆకస్మాత్తుగా ఉద్భవించిన సందేహాలు ముందూ వెనకా ఆలోచన చేయటానికి అవకాశం లేకుండా చేస్తాయి.
అన్నగారు కరచరణాలు కడుక్కుని వచ్చాక అతని గదిలోకి వెళ్ళి "అన్నాయ్, నిన్నో ప్రశ్న అడగనా?" అంది.
"చిక్కు ప్రశ్న కాకపోతే సరి!"
ఆమె మెల్లగా "యిలా అడుగుతున్నానని తెల్లబోకు అన్నాయ్. తెలియక ఓ స్త్రీ తప్పుచేసినప్పుడు-- తప్పే అది. ఆమెమీద హక్కు సంపాదించిన మొగవాడు క్షమించటం అవసరం అంటావా? కాదంటావా?
నారాయణ ఆమె ముఖంలోకి తరిచి చూస్తూ "నీ నోటి నుంచి చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న విన్నాను రాధా! అసలు నీకి సందేహం ఎందుకు వచ్చిందో కాస్త చెబుతావా? అన్నాడు.
రాధ తలవొంచుకుని "పొద్దున్న ఒక నవల చదువుతూంటే అనుమానం వచ్చింది" అని పలికింది.
"అయితే, ఆ గ్రంథకర్తగారు యేమని సెలవిచ్చారు?"
"ఆ నవలలో ఈ విషయం వివరంగా చెప్పటానికి గ్రంథకర్తకు సాహసం చాలినట్లు లేదు. ఇదమిద్ధమని తేల్చి చెప్పకుండానే సందేహస్పదంగా వొదిలేసేడు."
నారాయణను కూడా ఈ ప్రశ్న ఆకర్షించినట్లుంది; కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించి "నేను కూడా ఆ జవాబే యిస్తాను" అన్నాడు అస్పష్టంగా గొణుగుతూ.
రాధకు ఈ జవాబు వినిపించింది. నువ్వూ అలానే అంటావా అన్నాయ్?" అంది తెల్లబోతూ.
"నేనేకాదు, దీనికి ఎవరిమట్టుకు ఖచ్చితమైన జవాబు చెప్పగలరు అమ్మాయ్. ఇది కేవలం వ్యక్తులకూ, వ్యక్తిత్వాలకూ సంబంధించిన సమస్య. తన భావన, అదయినా నిలకడలేని భావన అందరి అభిమతంగా భావించి జవాబు చెప్పాలంటే ఒక మనిషికి సాహసం చాలదు."