"సారీ ఎందుకు? నాకు నా ఉద్యోగం ఎంత ముఖ్యమో నీకు నీ ఉద్యోగమూ అంతే ముఖ్యం". ఆ మాటల్లో వ్యంగ్యం వినిపించలేదు, అతడి ముఖంలో కనిపించింది.
"అత్తయ్యగార్ని తీసుకు రాకపోయావా?"
"ఆమె ఆరోగ్యం సరిగా లేదు. అక్కయ్య దగ్గిర వదిలి వచ్చాను" నౌకర్లున్నారు. అన్ని పనులూ చేస్తారు. కాని ఆ మాట ఒప్పుకోవడం నామోషీ అతడికి ఏదీ ఫ్రాంక్ గా మాట్లాడే అలవాటు లేదు. 'హిపోక్రటిక్ జీవితాలు' అనుకుంది మనసులో
పడక గదిలోనూ అంతే.
శరీరాన్ని వేడెక్కించడానికి అతడుచేసే చేతలకు శరీరం మాత్రమే స్పందిస్తుంది. అలా అలవాటయిపోయింది. ఆ తృప్తిని మనసుతో కాక శరీరంతో అనుభవించడం నేర్చుకుంది తనే. కారణం అది ఒక అవసరం కాబట్టి.
పదిహేను రోజులుగా శరీరానికి ఇవ్వలేకపోయిన సుఖం, నాలుగు రోజులుగా పడ్డ టెన్షన్ అరగంటలో తీరిపోయాయి.
అంతా అయిపోయాక తిరిగి ప్రశ్న ఎలా అనుభవించగలిగిందా సుఖాన్ని? ఆ వేడిలో తమ మధ్య నశించిన ప్రేమానురాగాల విషయం గుర్తురాదెందుకని? ఇష్టపూర్వకంగానే అనుభవించి తర్వాత రేప్ చేయబడ్డట్లు ఫీలవడం దేనికి?
శారీరక సుఖానికి, మానసిక వ్యధకూ సంబంధం లేదని ఏనాడో తెలుసుకోవడం వల్లనా? అందుకేనా ప్రతిక్షణం కీచులడుకునే దంపతులు కూడా పిల్లల్ని కనగలుగుతున్నారా?
"అమ్మ గొడవ పెడుతోంది. ఇంకా ఎన్నాళ్ళు ఆమెను బాధపెట్టడం?" శరత్ మాటలకు ఈ లోకంలోకి వచ్చింది.
"దేని గురించి?"
"ఏం తెలియనట్లు అడుగుతావేం? మా అమ్మా నాన్నలకు నేను ఒక్కన్నే కొడుకుని నా తరువాత మా వంశం అంతరించిపోవడం వాళ్ళు సహించగలరా?"
"ఇప్పట్లో కుదరదని ఈ మధ్యనే చెప్పాగా?"
"అదే, ఎందుకు కుదరదని? ఇంకా ఆలస్యం ఏమిటి?"
"మరో రెండేళ్ళు ఆగుదాం మించిపోయిందేం లేదు".
"నాకు మించిపోతుంది. అమ్మ ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణిస్తోంది. ఆమె కోరిక తీర్చాలనయినా లేదా నీకు? నీ ఉద్యోగం, నీ భవిష్యత్తేనా నీకు ముఖ్యం? చాలా స్వార్ధపరురాలిని నువ్వు బిడ్డని కనడానికి సందేహించే స్త్రీని నేనెక్కడా చూడలేదు".
"అవును చూడలేదు. నేను అందరి స్త్రీల లాంటిదాన్ని కాదు. అంతగా నువ్వు కావాలనుకుంటే రేపే ఒకరుకాదు ఇద్దర్ని దత్తత తీసుకుందాం".
"అంత ఖర్మ మనకేం పట్టింది? డజనుమంది పిల్లలను కంటానను, నేను అభ్యంతరం చెప్పను. కాని ఎవరికో పుట్టిన పిల్లలను నా పిల్లలని చెప్పుకోవాల్సిన ఖర్మ నాకేం పట్టలేదు. ఆ అవసరం లేదుకూడా".
"అవసరం వుంది. నాకు పిల్లల్ని కనాలనే ఉద్దేశ్యంలేదు. దేశంలో అనాధ పిల్లలు అనేకమంది వున్నారు. కనీసం యిద్దరికి తల్లినయి పోషిస్తాను. మనం పిల్లల్ని కనకపోతే దేశానికొచ్చిన నష్టం ఏమీలేదు ఇద్దరు అనాధల్ని పెంచితే మేలుచేసిన వారమవుతాం".
"అంటే నీ యిష్టమే నీకు ముఖ్యమా? నా గురించి ఆలోచించలేవా? నా రక్తం పంచుకుపుట్టిన పిల్లలు నాకు కావాలని నేను కోరడం తప్పా? నేనేం కాని కోరికను కోరడం లేదే. భర్త కోరిక తీర్చలేని నువ్వూ ఓ భార్యవేనా? ఓ స్త్రీవేనా?" కోపంగా అరిచాడు శరత్.
వైజయంతి మంచంమీద లేచి కూర్చుంది. కోపంతో ఆమె ముఖం జేవురించింది.
"ఏమంటున్నావు శరత్? రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కావాలా నీకు? వాళ్ళమీద నీకు ప్రేమ వుందా? ఇప్పటికీ నీ రక్తం పంచుకు పుట్టిన పిల్లలు ఎంతమందున్నారో నీకేమయినా తెలుసా? అవును. నేను బిజీ మనిషిని నా ఉద్యోగం అలాంటిది. నీకు కావాలనుకున్నప్పుడల్లా అందుబాటులో వుండను. నీకు సెక్స్ కావాలి. ప్రతిరోజూ కావాలి. అందుకే డబ్బిచ్చి సుఖాన్ని కొనుక్కుంటున్నావు. అది నీ దృష్టిలో తప్పుకాదు. నీ అవసరం నీది. కాని అదే టైములో నీ బీజాన్ని ఏ స్త్రీ గర్భంలోనయినా వదిలి వచ్చుండొచ్చుగా నీ రక్తం పంచుకుపుట్టిన పిల్లలు ఎంతమంది రోడ్లమీద అడుక్కుతింటున్నారో, ఎందరు దిక్కుమొక్కులేక అనాధాశ్రమాలలో పెరుగుతున్నారో నీకేమయినా అయిడియా వుందా? లీగల్ గా పెళ్ళి చేసుకున్న భార్యద్వారా లీగల్ గా పుట్టిన పిల్లలే నీకు వారసులా? నీ వల్ల పుట్టిన పిల్లలెవరో తెలియని నువ్వూ ఓ తండ్రివేనా? నా దగ్గర వాగ్వివాదాలు పెంచుకు శరత్ నా లక్ష్యం వేరు. నువ్వర్ధం చేసుకోలేవు. నీ దారికి నేనెప్పుడూ అడ్డురాలేదు. నువ్వూ నా దారికి అడ్డు రాకపోతే మన సంసారం ఈ రకంగా నయినా నిలబడుతుంది. ఇకపోతే, యియా నేను చెప్పాల్సిన అవసరం రాదు. గుడ్ నైట్".
ఆమెకు దుఃఖం వచ్చింది శరత్ ఏమన్నాడు?
తనలో మాతృహృదయం లేదా? అసలు మాతృహృదయం అంటే ఏమిటో వాళ్ళకి తెలుసా? కనుపించిన ప్రతి పాపలోనూ బిడ్డని చూడగలగడం కాదా మాతృహృదయమంటే? తన బిడ్డకు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి, ఆకలితో నకనకలాడే అనాధకు పట్టెడన్నం పెట్టలేని స్త్రీ కూడా ఓ తల్లేనా! పిల్లల్ని కంటేనే తల్లి అవుతుందా స్త్రీ? అసలు పెళ్ళే చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా వేలమంది పిల్లలకు తల్లి అయిన మదర్ థెరిసా అసలయిన అమ్మకాదా!
అత్తగారు మాత్రం కేవలం తన కడుపున పుట్టిన బిడ్డనే బిడ్డలా చూసుకుంటుంది. వాళ్ళకోసం ఆరాటపడుతుంది. కాని కోడల్ని పరాయి దానిలాగానే చూస్తుంది. ఆమె దృష్టిలో తను స్త్రీ కాదు. మగమహారాజులా తిరుగుతావు అంటుంది.
వాళ్ళ దృష్టిలో స్త్రీ అంటే పిల్లల్ని కని, వాళ్ళ బాధ్యత స్వీకరించేదే. అంతేకాని ఆమెలో జీవితం గురించి, అభిప్రాయాలు, ఆదర్శాలు వేరే వుండకూడదు. తన అస్థిత్వాన్ని రుజువు చేసుకోవడానికి వేరే మార్గం ఎంచుకోరాదు. ఏం చదువులు చదివినా, ఉద్యోగాలు చేసినా పెళ్ళయ్యేంతవరకే. ఆ తర్వాత భర్తను మించిన తెలివితేటలు ప్రదర్శించకూడదు. ఉన్నావాటిని అణిచెయ్యాలి. పురుషుడు మాత్రం కుటుంబాన్ని కూడా వదిలేసి తన అభివృద్ధి కోసం ఇల్లు పట్టకుండా ఎంత తిరిగితే అంత గొప్ప అదే గుణం స్త్రీలో వుంటే సహించలేడు. సంఘం, తోటి బంధువులు అతని పక్షానే వుంటారు. అదే ధైర్యం అతడిది.
దిండుమీద తలపెట్టగానే ముంచుకొస్తుందనుకున్న నిద్ర కనుచూపు మేరలో లేకుండా ఎగిరిపోయింది.
"అవంతీ! ఎందుకంత దూరంలో వున్నావు? ఈ క్షణంలో నాకు కావలసింది నీలాంటి స్నేహితురాలి అండ"- ఆవేశాన్ని, దుఃఖాన్ని కప్పిపుచ్చుకునేందుకు మనసుని గతంలోకి మళ్ళించింది.
2
నలుగురు స్నేహితులూ విడిపోయారు.
శలవులు గడిచిపోయాయి.
రిజల్ట్సు వచ్చాయి.
పేపరు కూడా చూసే అవసరంలేదు వైజయంతికి. ఢిల్లీ కాలేజీలో డిగ్రీకి అప్లై చేసింది.
లిస్ట్ లో మొట్టమొదటి పేరు ఆమెదే.
ఆ రోజు కాలేజీకి మొదటిరోజు వెళ్తూ వుంటే, తల్లి తండ్రి గేటు దగర నిలబడి చెయ్యి వూపారు. డ్రైవరు బయట గేటు దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు. వైజయంతి బిక్కు బిక్కుమంటూ కాలేజీలోకి అడుగుపెట్టింది. ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది.
ఎదురుగా పెద్ద బిల్డింగ్ వెళ్ళి వరండాలో నిలబడింది. చాలా మంది అమ్మాయిలు హడావుడిగా నడుచుకుంటూ వచ్చి వెనక బిల్డింగ్ ల వైపుగా వెళ్ళిపోతున్నారు. కొందరు సైకిళ్ళ మీద వస్తున్నారు. చాలా వరకు ఆధునాతనామిన దుస్తుల్లో వున్నారు. వాళ్ళలో ఉత్సాహం తొణికిసలాడుతోంది.
"ఈ రోజునుంచీ తనూ ఈ కాలేజీ స్టూడెంటు" అనుకుంటూ గర్వంగా ఫీలయింది వైజయంతి. కాలేజీ తెరిచి పదిరోజులయినా సమయానికి సర్టిఫికెట్స్ రాని కారణంగా ఆలస్యమయింది. అందుకే రాగింగ్ నుంచి తప్పించుకుంది.
అవంతి యింకా రాలేదు. కొత్త ఊరు, కొత్త కాలేజి, ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతుంటే తన స్నేహితుడి కూతురు అదే కాలేజీలో బియస్సీ చదువుతోందని వచ్చి కలవమని చెప్తానని తండ్రి చెప్పాడు. తొమ్మిదిన్నరకల్లా వరండాలో వెయిట్ చేయమందని చెప్పాడు. పావుతక్కువ పదైంది. అవంతి రాలేదు. ఇద్దరికీ పరిచయం లేదు కాబట్టి తనే వచ్చి పలకరిస్తుందేమోనని చూస్తోంది వైజయంతి. వరండా అంతా పరిశీలించి చూసింది. ఎవరూ లేరు-వచ్చినవాళ్ళు వచ్చినట్లుగా క్లాసులోకి వెళ్ళిపోతున్నారు.
మరో అయిదు నిమిషాలయింది. పదింటికి క్లాసు వెతుక్కుంటూ వెళ్ళడానికి టైం పడుతుంది. మొదటిరోజు ఫస్టు పిరియడ్ క్లాసుకు ఆలస్యంగా వెళ్ళడం అసహ్యంగా వుంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటూంది. అయినా ఎలాగో ధైర్యం చేసి బయలుదేరింది. దూరంగా సైన్సు, ఆర్ట్స్ బిల్డింగులు కనిపిస్తున్నాయి ఆర్ట్స్ అని వ్రాస్తున్న బిల్డింగు వైపు నడిచింది గబగబా.