Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 7

  

     డాక్టర్ మైథిలి చాలా జాగ్రత్తగా మేటర్నల్ పల్స్ రేటు వాచ్ చేస్తుంది. సహజంగా వుండే బలహీనత వుందిగాని ఎబ్ నార్మలిటీ ఏమీలేదు.
   
    టైం గడిచిపోతుందిగాని యుటెరస్ ఎక్కువగా డైలేట్ కాలేదు. నాలుగు సెంటీమీటర్లవరకూ డైలేట్ అవుతుంది.
   
    డాక్టర్ మైథిలి యింకా కాసేపు వెయిట్ చేసి చూసింది.
   
    యుటెరస్ నాలుగు సెంటీమీటర్లకు మించి డైలేట్ అవటంలేదు.
   
    హెడ్ ఎంగేజ్ అవటంలేదు.
   
    డోబుల్స్ యినస్ట్రమెంట్ తో ఫీటల్ హార్ట్ రేట్ నూట అరవై వుంది. చాలా ఇరిగ్యులర్ గా కూడా వుంది. మామూలుగా ఫీటల్ హార్ట్ రేట్ నూటనలభై వరకూ వుంటుంది.
   
    డాక్టర్ మైథిలి అసిస్టెంట్ ని ఓ ఎపిడోసిన్ యింజక్షన్ ఇమ్మని చెప్పింది.
   
    శ్వేతబిందుకు పెయిన్స్ అలాగే వస్తున్నాయి. యుటెరస్ కంట్రాక్ట్ అవటం అలాగే వుంది.
   
    నొప్పి వచ్చినప్పుడల్లా ఆమె నరకబాధ ననుభవిస్తోంది.
   
    అసిస్టెంట్ డాక్టరు పేరు సరోజ. శ్వేతబిందు పరిస్థితిచూస్తే ఆమెకు కాంప్లికేట్ అవుతున్ననట్లనిపించింది. మైథిలి దగ్గర ఎవరూ నోరు తెరచి మాట్లాడటానికి సాహసించరు. అయినా ధైర్యం తెచ్చుకుని "మేడమ్!" అంది.
   
    డాక్టర్ మైథిలి ఆమెవంక ప్రశ్నార్ధకంగా చూసింది.
   
    "యుటెరస్ ఫోర్ సెంటీమీటర్లకంటే డైలేట్ అవటంలేదు. మేటర్నల్ పల్స్ వీక్ అవుతోంది. సిజేరియన్ చేస్తే బాగుంటుందేమో!"
   
    "వాట్?" డాక్టర్ మైథిలి ఆమెవంక నిరసనగా ఓ చూపుచూసింది. డాక్టర్ సరోజకు యిరవై ఏడు, యిరవై ఎనిమిదేళ్ళకంటే ఎక్కువ వుండవు. ఎమ్.డి. వచ్చి ఓ ఏడాదికంటే ఎక్కువ అయి వుండదేమో. ఆమె వొచ్చి తనకు సలహా యిచ్చేసరికి డాక్టర్ మైథిలికి అహం దెబ్బ తిన్నట్టయింది.
   
    "నేను కొన్ని వందల, వేల కేసులు చూశాను. ట్రయిల్ లేబర్ యిస్తే నార్మల్ గా డెలివరీ అయిపోతారు. అయినా ఏమాత్రం వెయిట్ చేసే సహనం లేకుండా ప్రతి చిన్నదానికి సిజేరియన్ చెయ్యటం మీ యంగ్ స్టర్స్ కి ఫేషన్ అయిపోయింది."
   
    "అది కాదు మేడం....!"
   
    "మైండ్ యువర్ బిజినెస్. లోమోడెక్స్ యిన్ డెక్స్ట్రోజ్ డ్రిప్ స్టార్ట్ చెయ్యి పెథిడిన్ హండ్రెడ్ ఎం.జి. ఒకటి ఫుష్ చెయ్యి స్టార్ట్ ఆక్సిజన్."
   
    "అలాగే మేడం!"
   
    శ్వేతబిందుకు తాను లేబర్ రూంలో టేబిల్ మీద వున్నట్లు తెలుసు. ఏమిటి జరుగుతుంది! కళ్ళముందు వలయాలుగా ఏవో తిరుగుతున్నాయి. డాక్టర్లు అటూ యిటూ తిరుగుతున్నారు. ఏమేమిటో యింజక్షన్లు చేస్తున్నారు. "అలా చేయమ్మా యిలా చెయ్యమ్మా, క్రిందికి జరగమ్మా, కాళ్ళు యిలా పెట్టమ్మా, అలా పెట్టమ్మా" అంటున్నారు. పల్స్ చూస్తున్నారు. బి.పి. చూస్తున్నారు.
   
    పెయిన్స్ వచ్చినప్పుడు గిలగిల్లాడిపోతుంది. ఆ బాధ భరించటం తనవల్ల కావటంలేదు.
   
    ఎక్కడున్నాడు ప్రదీప్! లోపలకు రాడేం? ఇంతమంది కొత్తవాళ్ళమధ్య తనను వంటరిగా వదిలేసి బయట ఏం చేస్తున్నాడు?
   
    ఇలా ఎంతసేపు? నిముషాలు యుగాల్లా గడుస్తున్నాయి. ఎంతకూ కాన్పు అవదేం? ఆమెకు తల్లి, తండ్రి గుర్తువచ్చారు. వీళ్ళంతా తనని ఎంత నిర్దాక్షిణ్యంగా వదిలేశారు!
   
    మధ్య మధ్య మగత ఆవహించి, నొప్పి వచ్చినప్పుడల్లా తెలివి వస్తుంది.
   
    ఉన్నట్లుండి పెద్దనొప్పి, "అమ్మో!" అని అరవబోయి నిగ్రహించుకుంటుంది.
   
    భూకంపం వచ్చినట్లు, ఆకాశం పగిలినట్లు, సముద్రం విరిగినట్లు...
   
    తర్వాత ఏమీ తెలీటంలేదు.
   
    అసలు నొప్పేమీ లేదు.
   
    కాని- నీరసంగా.... చాలా నీరసంగా వున్నట్లనిపించింది. శరీరంలో ఏమీ ప్రాణంలేనట్లు, ఒళ్లంతా తేలిపోతున్నట్లు...
   
    అసలు నొప్పేమీ లేదు. నొప్పిగురించి ఏమీ తెలియటంలేదు.
   
    ఒళ్లంతా చల్లబడి..... ముద్దయిపోతున్నట్టు....
   
    నాలిక ఎండిపోతోంది. కళ్ళముందు మనుషులు మసక మసకగా కనిపిస్తున్నారు.
   
    ప్రదీప్! ప్రదీప్!!
   
    నోరుతెరచి ఏదో మాట్లాడబోయింది. కాని మాట బయటకు రావటంలేదు.
   
                                               * * *
   
    "ఏం జరిగింది?"
   
    ఆమె శరీరమంతా చల్లబడింది. మంచుముద్దలా అయిపోయింది. పల్స్ ఎక్కడో వున్నట్లు వడివడిగా కొట్టుకుంటుంది.
   
    "షి యీజ్ యిన్ షాక్."
   
    డాక్టర్ మైథిలి దగ్గరకు వచ్చి ఎగ్జామిన్ చేసింది. ఆమెకళ్ళలో విపరీతమైన ఆతృత కనిపించింది.
   
    షాక్ కి కారణమేమిటి?
   
    మైగాడ్! రప్చర్ ఆఫ్ ది యుటెరస్.
   
    "సరోజా!" అంది. ఇప్పుడామె గొంతులో కొంచెం ఒణుకువుంది.
   
    "మేడమ్!"
   
    "యుటెరస్ రప్చర్ అయినట్లుంది."
   
    సరోజ స్తబ్ధుగా వుండిపోయింది.
   
    "షీ యీజ్ యిన్ సివియర్ షాక్. మొదట షాక్ ని రెక్టిఫై చెయ్యగలిగితే, తర్వాత హిస్టిరెక్టమీ..."
   
    ఇప్పుడామె గొంతులో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది.
   
    షాక్ నించి యివతలకు తీసుకొచ్చే ప్రయత్నాలు వెంటనే మొదలయినాయి.
   
    మెఫెన్ టిన్ ఇంట్రామెస్క్యులర్, తర్వాత డ్రిప్ లో కలిపి ఇంట్రా వీనస్ గా ఇవ్వబడింది!
   
    ఐ.వి. డెక్స ట్రోస్.
   
    బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ మొదలయింది.
   
    నిముషాలు గడుస్తున్నాయి. డాక్టర్ మైథిలి ప్రతి రెండునిముషాలకూ ఓసారి పల్స్ చూస్తుంది. బి.పి. చూస్తున్నది.
   
    కొంచెం బి.పి. వచ్చింది.
   
    చాలు ఆ మాత్రంచాలు ఆపరేషన్ చెయ్యడానికి.
   
    "సరోజా!" అంది.
   
    "యస్ మేడమ్!"
   
    "ఈమె హజ్బెండ్ బయట వుండివుంటారు. అతనికి యిన్ ఫాం  చెయ్యి ఆపరేషన్ చెయ్యాలని పర్మిషన్ తీసుకోవటం, ఆ ఫార్మాలిటీస్ అన్నీ వెంటనే పూర్తిచెయ్యి."
   
    "యస్ మేడమ్!"
   
                                  * * *
   
    ప్రదీప్ వరండాలో వున్న స్టీల్ బెంచీమీద కూర్చుని వున్నాడు. అలా కొన్ని గంటలనుంచీ కూర్చునే వున్నాడు. బిందుని ఎడ్మిట్ చెయ్యగానే మామగారికి వైర్ యిచ్చేశాడు.
   
    ఆమెను లేబర్ రూంలోకి తీసుకెళ్ళి చాలా గంటలైంది. లోపలేం జరుగుతుందో తెలీటంలేదు. చాలా నెర్వెస్ గా వుందతనికి. మధ్య మధ్య నుదుటి మీద పడ్డ స్వేదబిందువుల్ని తుడుచుకుంటున్నాడు.
   
    లేబర్ రూం తలుపులు తెరుచుకుని ఒక లేడీ డాక్టరు బయటికి వచ్చింది చివరకు.
   
    ఆమెవంక ఆతృతగా చూశాడు.

 Previous Page Next Page