Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 7

 

       "నో... నో.... ఐయామ్ ఇన్ ఫుల్ కంట్రోల్" అంటూ ఉండగానే పెద్ద శబ్దం అయింది. "ఏమిటదీ? ఏవైందీ?" కంగారుగా అడిగింది ధరణి.
   
    "ఏం కాలేదు. ఈ టెలిఫోన్ బూత్ ఎందుకో ఊగుతోంది. బహుశా భూకంపం అనుకుంటా, జాగ్రత్తగా ఉండు" అన్నాడు.
   
    "అలాగే! ముందు మీరు ఇంటికి దయచెయ్యండి!" అని విసుగ్గా ఫోన్ పెట్టేసింది ధరణి.
   
    మరో మూడు నిమిషాలకి డోర్ బెల్ రింగ్ అయింది.
   
    ధరణి తలుపు తియ్యగానే "ఓ.....సారీ..... మా ఇల్లనుకున్నాను" అంటూ వెనక్కి తిరగబోయాడు శ్రీధర్.
   
    ధరణి వెంటనే అతని కుడిచెవి పట్టుకుని "ఇది మీ ఇల్లే రండి......దయచెయ్యండి!" అంది.
   
    "ఆ ... ఆ ... ఇలా నా చెవి మా రాకాసి తప్ప ఎవరూ పట్టుకుని మెలితిప్పలేరు..... ఇది తప్పకుండా మా ఇల్లే ... హీ..... హీ" నవ్వుతూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు శ్రీధర్.

    ధరణి వచ్చి ఎదురుగా కూర్చొని, "ఏమిటీ నాటకాలూ?" అంది.
   
    "నాటకమా ... ఔను.... చింతామణి లో డైలాగ్స్ గుర్తొస్తున్నాయి. చెప్పమంటావా... ఒద్దులే ఉద్యోగ విజయాల్లో పద్యం చెప్తా...." అంటూ శ్రీధర్ "షెల్లియో.... షెల్లకో..." అని అందుకున్నాడు.
   
    ధరణి చెవులు మూసుకుంటూ "ఆపండి" అంది.
   
    అతను రెచ్చిపోయి ఇంకో పద్యం చెప్పాడు.
   
    "హమ్మయ్యా.... మీరీ పూట హోష్ లో లేకపోవడం ఎంత మంచిపని జరిగింది? లేకపోతే నేను చేసిన పనికి ఎంత తిట్టేవారో" అంది ధరణి.
   
    "ఏం చేషావు?" అడిగాడు శ్రీధర్.
   
    "ఎవడో బస్ లో నన్ను ముట్టుకున్నాడనీ వాడిమీద కేసు పెట్టాను. ఇంకా కాసేపట్లో వాడు మన ఇంటిమీదకి గూండాలని వేసుకుని గొడవ చెయ్యడానికి వస్తాడనుకొంటా" కూల్ గా అంది.
   
    "రాకాసీ, ఎంత పని చేశావూ? పైగా ఇంత కూల్ గా చెప్తావా? అసలింతకీ వాడెవడూ? రౌడీ వెధవా? వెనకాల ఎంత గ్యాంగ్ వుందో ఏవిటో?" కంగారుగా ధరణి భుజం పట్టి కుదుపుతూ అన్నాడు.
   
    ధరణి పకపకా నవ్వింది.
   
    "నీకు నవ్వెలా వస్తోందే?" కోపంగా అన్నాడు.
   
    ధరణి ఇంకా నవ్వుతూనే "అయిపోయిందా మీ తాగుబోతు ఏక్షన్? నన్ను ఇంకా హడలగొట్టాల్సిందేమైనా మిగిలిపోయిందా?" అంది.
   
    శ్రీధర్ వెంటనే నాలిక కరుచుకుని "ఈ రోజు నిన్ను ఓ ఆట ఆడిద్దాం అనుకున్నాను. పదేళ్ళ నుంచీ ట్రై చేస్తున్నాను. నిన్ను ఫూల్ ని చెయ్యడం కుదరడంలేదు" అన్నాడు బాధగా.
   
    "నన్ను ఫూల్ని చెయ్యడానికి వేషాలూ? ఎప్పుడో చేశారు కదండీ!" సీరియస్ గా అంది ధరణి.
   
    "ఎప్పుడు చేసానూ?" ఉత్సాహంగా అడిగాడు శ్రీధర్.
   
    "పెళ్లవగానే!"
   
    "అదెలా?"
   
    "పెళ్ళికి ముందు నేనో తెలివైన వాణ్ణి  చేసుకోబోతున్నానని అనుకున్నాను లెండి.... పదండి స్నానం చేస్తే భోజనం పెడ్తాను" అని వస్తున్న నవ్వు ఆపుకుంటూ లోపలి వెళ్ళిపోయింది ధరణి. నిముషం తరువాత అర్ధమైంది. "రాకాసీ" అంటూ పెదవి కొరుక్కున్నాడు.
   
    "నీళ్ళు పెట్టాను స్నాననికి రండి" ధరణి గొంతు బాత్రూంలోంచి వినిపించింది.
   
    శ్రీధర్ లోపలి వెళుతూనే బాత్ రూం తలుపు వేసేశాడు.
   
    "అదేవిటీ..... నన్ను బైటికి వెళ్ళనీయండీ!" అంది ధరణి.
   
    "ధరణీ, నువ్వు అలా వెనక్కి తిరిగి నిలబడి నీళ్ళుతొలుపుతూ ఉంటే ఎంత బావున్నావో తెలుసా?" అంటూ ఆమెఇ గట్టిగా కౌగిలించుకున్నాడు.
   
    భర్త ఇచ్చిన కాంప్లిమెంట్ కి ధరణి బుగ్గలు కెంపులయ్యాయి. ఇష్టమైన మగాడు తన అందాన్ని గురించి ఆస్వాదించడాన్ని మించిన గర్వం, ఆనందం ఇంకొక దానివలన కలగదు స్త్రీకి!
   
    "ముందు స్నానం కానివ్వండి...." అతడి మెడ క్రిందుగా తన ముఖాన్ని దాచుకుంటూ గోముగా అంది.
   
    "ఇదిగో, అన్ని విషయాల్లో ఇలా నా మాట వినకుండా ఎదిరిస్తే నేను ఊరుకోను" ఆమె ముఖాన్ని తన చేతుల్తో ఎత్తుతూ అన్నాడు.
   
    ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.
   
    శ్రీధర్ విసుగ్గా చూసి, "ఈ సమయంలో ఎవరొచ్చారూ, పనీ పాటా లేకుండా?" అన్నాడు.
   
    "పనిమీదే వచ్చి వుంటారు. నే చూసొస్తా ఉండండి" ధరణి విడిపించుకొని వెళ్తూ అంది.
   
    "ఏయ్..... నీ బొట్టు పక్కకి జరిగిపోయింది. సరిగ్గా పెట్టుకో!" వెనకనుండి చెప్పాడు శ్రీధర్.
   
    "థాంక్యూ!" బొట్టు సరిచేసుకుంటూనే ధరణి గుమ్మం వైపు నడిచింది.
   
    తలుపు తియ్యగానే ఎదురుగా కనిపించిన వ్యక్తుల్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచేసింది.
   
    "సారీ.... ఫర్ ది డిస్టర్బెన్స్" చిన్నగా నవ్వుతూ అన్నాడు విక్రం.
   
    "ఇట్స్ ఆల్ రైట్.... లోపలికి రండి!"
   
    ఇన్ స్పెక్టర్ లోపలికి వస్తూ తనతోపాటు ఉన్న వ్యక్తిని కూడా లోపలి లాగి "సారీ చెప్పరా!" అంటూ లాఠీతో అతని గడ్డం క్రింద గుచ్చాడు.
   
    ధరణి అతనిని బస్ లో తనను తాకిన వ్యక్తిగా గుర్తించింది.
   
    అతను నోరు విప్పి సారీ చెప్పేలోగా ఇన్ స్పెక్టర్ లాఠీతో మోకాళ్ళ మీదా, వెనకాలా నాలుగు దెబ్బలు వేశాడు.
   
    "కొట్టద్దు... కొట్టద్దు సార్!" అతను క్రిందపడిపోతూ అరిచాడు.
   
    "ఆపండి.... అంతలా కొట్టకండి" ధరణి ఆపటానికి ట్రై చేసింది.
   
    ఈ గొడవకి శ్రీధర్ లోపలి నుంచి వచ్చాడు. "ఏమైందీ?...." అన్నాడు. ఇన్ స్పెక్టర్ని చూసి గాభరాగా!
   
    "సారీ చెప్పరా!!" అంటూ ఇన్ స్పెక్టర్ మరోసారి లాఠీ ఎత్తగానే, అతను అమాంతం ధరణి కాళ్ళమీద పడిపోయి "సారీ సిస్టర్!" అన్నాడు.
   
    ధరణి కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి. "సిస్టర్, మదర్ లాంటి పదాలు పలకడానికి నీలాంటి వెధవలు అర్హులు కాదురా! నీకు సిస్టర్, మదర్ అయినందుకు ఆ స్త్రీలుకూడా సిగ్గుతో చచ్చిపోతారు! ఛీ......పోరా!" అంది ఈసడింపుగా.
   
    శ్రీధర్ అయోమయంగా చూస్తే "వీడేనండీ బస్సులో నన్ను వేధించిందీ!" అంది భర్తతో, వెంటనే శ్రీధర్ కలగజేసుకుని, "ఇన్ స్పెక్టర్! ఇంటిదాకా ఎందుకు తీసుకొచ్చారు? అనవసరంగా గొడవ చెయ్యడంవల్ల మాకు నష్టం తప్ప లాభం ఏముందీ?" అన్నాడు కాస్త నిష్టూరంగా.
   
    ఇన్ స్పెక్టర్ అభిమానపడ్తూ, "ధరణిగారి కంప్లెయింట్ నేను లైట్ గా తీసుకోలేదనీ, యాక్షన్ తీసుకున్నాననీ చెప్పడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ రాత్రి వీణ్ణి లాకప్ లో పెడుతున్నాను. రేపు ఉదయం కోర్టుకి తీసుకెళ్తే మరోసారి రావలసి వుంటుంది!" ధరణితో అన్నాడు.
   
    "రాదు!" గట్టిగా అన్నాడు శ్రీధర్.
   
    ధరణి వెంటనే "అదేమిటండీ కంప్లెయింట్ ఇచ్చాక రానంటే ఎలా?" అంది.
   
    "ఎవరిని అడిగి ఇచ్చావు కంప్లెయింట్?" కోపంతో రెచ్చిపోతూ అరిచాడు శ్రీధర్.
   
    "నా శరీరాన్ని అతను బాధ పెట్టాడు కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆయన తన విధి నిర్వహణ తను చేశారు! మధ్యలో నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాలి?" అంది ఆశ్చర్యంగా.
   
    "సరే ఇచ్చావు. ఆయన యాక్షన్ తీసుకున్నాడు! బావుంది ఇక ఇక్కడితో ఈ గొడవ ఆపేస్తే మంచిది" శ్రీధర్ చెమటలు తుడుచుకుంటూ అన్నాడు.
   
    "మీరు అనవసరంగా భయపడుతున్నారు" అన్నాడు విక్రం.
   
    "నేను రోజూ ఒక్క వార్త కూడా విడిచి పెట్టకుండా పేపర్ చదువుతాను. నాకు ఎందుకు మీ డిపార్ట్ మెంట్ అంటే భయమో మీకూ, నాకూ కూడా తెలుసు! ఏమీ తెలియని అమాయకురాలు. నా భార్య తొందరపడి కేసు రాయించింది. పెద్దమనాసుతో దాన్ని కొట్టేసి ఇతన్ని విడిచెయ్యండి" అన్నాడు శ్రీధర్.
   
    "ఒక బాధ్యతగల పౌరుడిగా మీరిలా...." అని విక్రం ఏదో అనబోయాడు.
   
    "ప్లీజ్ ఇన్ స్పెక్టర్! మీకు దండం పెడ్తాను.... మమ్మల్ని ఇలా ప్రశాంతంగా బ్రతకనీయండి" చేతులు జోడిస్తూ అన్నాడు శ్రీధర్.
   
    "ఏమండీ.... మీరు అనవసరంగా...." ధరణి ఏదో చెప్పబోతుంటే - శ్రీధర్ ఆమెవంక తీవ్రంగా చూస్తూ "నువ్వు లోపలికి వెళ్ళు.... లేదా నేను బయటికి వెళ్తాను" అన్నాడు.
   
    ధరణి ఇన్ స్పెక్టర్ వైపూ, భర్తవైపూ మార్చి మార్చి చూసి, పెదవిని మునిపంట బిగపట్టి లోపలికి వెళ్ళిపోయింది.
   
    "సారీ.....ఆవిణ్ణి ఏవీ అనకండి. మీరు చెప్పినట్లే చేస్తాను" అని ఇన్ స్పెక్టర్ తను తెచ్చిన వ్యక్తిని తోసుకుంటూ వెళ్ళిపోయాడు.
   
    శ్రీధర్ లోపలి వెళ్ళేసారికి ధరణి కంచంలో అన్నం వడ్డిస్తోంది. "రండి భోంచేద్దాం" అంది.
   
    శ్రీధర్ కోపంగా "నీకింకా ఆకలిగా కూడా ఉందా?" అన్నాడు.
   
    "ఔను! ఇప్పుడే సంతోషంవల్ల ఎక్కువ ఆకలవుతోంది. త్వరగా రండి" అంది అన్నం కలుపుకుంటూ.

 Previous Page Next Page