"అంతే....."
తెరలు తెరలుగా నవ్వొచ్చింది రమణికి. ఇక ఆపుకొనే ప్రయత్నం ఏదీ చెయ్యలేదు. నవ్వుతూనే వృద్దుడితోపాటు కాంపౌండులోకి ప్రవేశించేడు. చాలా పురాతనమైన ఇల్లు అది. బయట బాగా పిచ్చి మొక్కలు పెరిగి వున్నాయి. ప్రహరీ గేట్లు పడిపోవడానికి సిద్దంగా ఉన్నాయి. ఇంట్లోంచి బయటకీ, బయట్నుంచి ఇంట్లోకి గబ్బిలం ఒకటి ఎగురుతూ వుంది. పై కప్పు ఇరవై అడుగుల ఎత్తుంది. సాలెగూళ్ళు వేలాడుతున్నాయి.
"ఎవరిదీ ఇల్లు?" చుట్టూ చూస్తూ అడిగేడు.
"నాదే" అన్నాడతను. "మా అమ్మమ్మ నాన్నకి ఆ కాలపు నవాబు రాసిచ్చేడు. అది నాకు వచ్చింది."
వీధికి చాలా లోపలగా, మూలగా వున్నదా భవనం. నవాబుల ఒకప్పటి రమ్యహర్మ్యాలు యిప్పుడు ఆ స్థితిలో వుండటం అతడికి తెలిసిందే. అందుకే అతడికి ఆశ్చర్యం కలగలేదు. అలాంటి పాడుబడిన ఇళ్ళు ప్రస్తుతం భిక్షగాళ్ళకి నివాస కేంద్రాలు. దూరంగా గ్రౌండులో పిల్లలు ఆడుకొంటున్నారు.
అతడు నడుస్తూ వుంటే కాలికింద దుమ్ము పైకి లేస్తోంది. చాలా పెద్ద ఇళ్ళు అది. నగరపు నడిబొడ్డులో వుంది. అద్దెకిస్తే నాలుగువేలకి తక్కువరాదు. అతను ఆలోచనల్లో వుండగానే కాలికేదో తగిలింది తీసి చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ కాగితం. పన్ను కట్టమని నోటీసు.
"అలాంటి పన్లన్నీ నువ్వు చెయ్యాలి" అన్నాడు. "నేను మర్చిపోతూ వుంటాను. టీ కొచ్చి డబ్బులు మర్చిపోయినట్టు.... "మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు "అన్నట్టూ నీకు అపాయింట్ మెంట్ ఆర్డర్ టైపు చేసి కావాలా, ఓరల్ గా సరిపోతుందా? టైప్ ది కావాలంటే వెళ్ళి టైపు చేయించి తెచ్చుకో..... ఏది కావాలి?"
"నాకు అడ్వాన్స్ కావాలి....." అన్నాడు రమణ 'ఇంటికెళ్ళి చేసే పనేమీ లేదు. ఇక్కడ బాగానే ఉబుసుపోతోంది' అనుకున్నాడు.
"అడ్వాన్సు నోబుల్ ఫ్రైజ్ వచ్చాక ప్రస్తుతం డబ్బంతా ఇన్వెస్టుమెంటుతో వుంది."
"మీ పేరు?"
"ప్రొఫెసర్ ఆరోగ్య మరపు ఆనంద మార్గం" అన్నాడు ఎడమవైపు గదిలోకి నడుస్తూ, "అందరూ ఎ.ఎమ్.ఎ.ఎమ్. అంటారు. చివరికి అదే 'అయోమయం' అయింది."
రమణ నవ్వుతూ "ప్రొఫెసర్ అయోమయంగారూ....." అంటూ ఏదో అనబోయి విభ్రమంతో చప్పున ఆగిపోయేడు.
అప్పటికి వాళ్ళు ఎడమవైపు గదిలో ప్రవేశించారు. దానికి పై కప్పు లేదు. పెద్ద అద్ధం బిగించి వుంది. పెద్ద రివాల్వింగ్ డోమ్ మీద అజిమోటార్, దానిమీద యాభై మీటర్ల పొడవూ, నలభై అయిదు మీటర్ల డయామీటరూ వున్న టెలిస్కోపు హుందాగా నిలబడి వుంది.
ప్రపంచంలోకెల్లా పెద్ద టెలిస్కోపు రష్యాలో వుందని విన్నాడు. కానీ యిప్పుడు చూస్తున్నాడు. అతడు ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే వెనుకనుంచి ప్రొఫెసర్ కంఠం వినిపించింది.
"మీ జనరల్ నాలెడ్జి పుస్తకంలో యిది కనపడదు. జెలింస్కియా నార్త్ కేకాసన్ లో వున్న స్కోప్ కంటే ఇది పెద్దది. దీన్ని నేనే తయారుచేశాను. బైదిబై ఇంకొ సిగరెట్టుంటే యివ్వు. దీన్ని.......ఐ మీన్ యీ స్కోప్ ని తయారుచెయ్యడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది. మా అమ్మమ్మ నాన్నకి ఆ నవాబు భరణంగా యిచ్చిందంతా ఖర్చయింది. దీని బరువు తొంభై అయిదు టన్నులు, లెనిన్ గ్రాడ్ ఆప్టికల్ ఇంజనీరింగ్ అమాల్గమేషన్ వాళ్ళు దీన్ని చూస్తే మూర్చపోతారు. దీన్ని అమ్మితే ఎంతొస్తుందో తెలుసా?- నీ జీతం అడ్వాన్స్ ఇవ్వలేదని అనుమానపడకు. దీనికి ఉపయోగించిన ఇనుముతో పదకొండు పెట్టెలున్న పాసింజరు ట్రైను తయారు చెయ్యొచ్చు. జీడీల వాడికి అమ్ముకుంటే రెండువేల మంది జీవితాంతం తినటానికి సరిపోయేటన్ని జీడీలు వస్తాయి. దీని పేరు ఏమిటో తెలుసా? లిప్పర్ షే. టెలిస్కోపు కనుక్కొన్నది గెలీలియో అని మీరందరూ అంటారు. కాదు లిప్పర్ షే. అసలు మీకు జనరల్ నాలెడ్జి ఏం తెలుసని? ఊరు మధ్యలో వున్న టెలిస్కోప్ సంగతి ఎవరికీ తెలియదు. కాలిఫోర్నియా- మౌంట్ విల్ఫన్ అబ్సర్వేటరీలో వున్న ప్రొఫెసర్ అడమ్స్..... ఇప్పుడు లేడులే. పోయేడు. అతని కొక్కడికే తెలుసు. బైదిబై యీ టెలిస్కోప్ లో ఎంతదూరం చూడొచ్చని నువ్వు అనుకుంటున్నావు?"
నోట్లో తడారిపోతుండగా తెలీదన్నట్లు రమణ తల అడ్డంగా వూపేడు.
"పదివేల మిలియన్ ల కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే?" ఆగేడు. "సెకనుకి లక్షా ఎనభై ఆరువేల మిల్ల వేగంతో కాంతి ప్రయాణం చేస్తుంది. లెక్కకట్టు. సెకన్ లు అరవై ఇంటూ నిముషాల అరవై అరవై ఇంటూ గంటలు ఇరవై నాలుగు ఇంటూ మూడువందల అరవై ఐదు రోజులు అయితే ఒక సంవత్సరం. 60 x 60 x 24 x 365ని లక్షా ఎనభై ఆరువేల మైళ్ళతో హెచ్చిస్తే ఒక కాంతి సంవత్సరం. ఈ టెలిస్కోపు అంత దూరం చూస్తుంది. లెక్కకట్టేవా గ్రాడ్యుయేటూ? 54132960000000000000 మైళ్ళు. అన్ని మైళ్ళ విశ్వాన్ని రోజూ చూస్తాన్నేను. అజిమొటల్ మౌటింగ్. కాబట్టి ఆకాశంలో ఏ మూలకైనా తిరుగుతుంది ఇది. నాకింకో కోర్కెవుంది. విశ్వం నలుమూలలనుంచి వచ్చే కంటిన్యువస్ రేడియేషన్ ని పెద్ద 'ఆంటెనా' పెట్టి చూడాలని. తెలుసుగా అంటెనా అంటే....."
రమణకి తెలీదు. అయినా తెలుసన్నట్టు తలూపేడు అతను. తను చూస్తున్నది కల కాదని నమ్మకం కలిగించుకోవదానికే అతడు బ్రహ్మ ప్రయత్నం చెయ్యవలసి వస్తోంది.
"చెప్పు గ్రాడ్యుయేటా....చేస్తావా నా దగ్గర పని?"
".....చప్పున వాస్తవంలోకి వస్తే.....ఇంటిదగ్గర బీదరికం. మాలతి కళ్ళలో తనపట్ల ప్రేమ. ఆమె తండ్రికి తనపట్ల నిర్లక్ష్యం. నాన్న దగ్గు......అన్నయ్య చాలీచాలని జీతం. చాక్లెట్లకోసం నోరు తడిచేసుకొనే గోపి. బాధల్ని చిరునవ్వుతో నొక్కిపట్టే వదిన.
"నా దగ్గర ప్రస్తుతం డబ్బు తక్కువుంది గ్రాడ్యుయేటూ, ఉన్నదంతా.....చూసేవుగా ఖర్చుపెట్టేసేను."
అతడి మొహంలో కనబడిన విషాదఛాయకి విచలితుడై "నేనేం చెయ్యాలి?" రమణ అడిగేడు.
"నాతోపాటూ ఆకాశంలోకి చూడాలి. కొత్త 'ఫ్లానెట్' దొరకవచ్చు. కొత్త 'గలాక్సీ' కనపడొచ్చు. నోబుల్ ప్రైజు రావడానికి చాలదా? అదిగో, కదలకుండా చూపు ఎడమవైపు తిప్పి చూడు. ఎలుక ఒకటి మనల్ని వెక్కిరిస్తున్నట్టు మీసాల్ని ఎలా తిప్పుతూందో? కనీసం దాని గర్వాన్ని అణచటానికైనా మనం ఒక గొప్ప విషయాన్ని కనుక్కోవాలి. ఏమంటావ్!"
రమణ తలూపేడు చేస్తానన్నట్టు.
జూన్ ఇరవై తొమ్మిది
తెల్లవారుఝాము నాలుగున్నర!
శాన్ ఫ్రాన్సిస్కో, ప్రకృతి సిద్దంగా ఏర్పడిన ఎయిర్ కండీషన్ డ్ వాతావరణం పసిఫిక్ సముద్రం పక్కగా, కాలిఫోర్నియా దక్షిణ ప్రాంతపు కొండల్లో వుండటం వల్ల దానికా సౌలభ్యం చేకూరింది. మూడువైపులా సముద్రం, ఒకవైపు కొండలూ ఉండటం వల్ల ప్రపంచపు గొప్ప రేవుపట్టణాల్లో ఒకటిగా పేరు పొందింది. పట్టణంలో ప్రవేశించటానికి ముఖ్యద్వారం గోల్డెన్ గేట్.
రకరకాల వాతావరణం, రకరకాల మనుష్యులూ ఉన్నపట్టణం అవటంచేత దాని పెరుగుదల గమ్మత్తుగా జరిగింది. ఉత్తర ప్రాంతాల్లో రష్యన్లూ.....నాబ్ హిల్ దాటేక ఇటాలియన్ క్వార్టర్లూ....గోల్డెన్ గేట్, ప్రెసీడియోల మధ్యనున్న రిచ్ మాండ్ సెక్షన్ లో ఓల్డుటౌనూ కనిపిస్తాయి. సముద్రతీరానికీ, మిషన్ స్ట్రీట్ కీ మధ్య దక్షిణ దిశగా పారిశ్రామిక వాడలు పెరిగాయి.
బేషార్న్ హైవేమీద మెక్ కారు దూసుకుపోతున్నది. అకస్మాత్తుగా ఉపద్రవం సంభవిస్తే తప్ప అమెరికా అధ్యక్షుడి నుంచి తనకి అంత అర్జెంటుగా పిలుపురాదని అతడికి తెలుసు. దాదాపు ప్రపంచం మొత్తాన్ని ఆజ్ఞాపించగల ఒక దేశపు అత్యున్నత పదవిలో వున్న మనిషికి ఫస్టు సెక్రటరీ అతడు. ఎటువంటి ఉపద్రవం....? ఏదయినా కావచ్చు.....ప్రపంచంలో నిముషానికి యాభై లక్షల ఖర్చు.....ఆయుధాల ఉత్పత్తి గురించి జరుగుతూంది. ఎంత గొప్ప చేదునిజం! ప్రొఫెసరు కంట్రోఎట్జ్ చెప్పింది నిజమైతే - ఇంకో అయిదు సంవత్సరాల్లో 'లాసర్ బీమ్' ఆయుధాన్ని రష్యాతయారు చేస్తుంది. కాంతి వేగంతో అవతలి గమ్యాన్ని నాశనం చేసే సాధనం అది.
నిజానికి యుద్ధం ఒకటే కాదు ప్రమాదం-
రోజు రోజుకీ పెరుగుతున్న జనసాంద్రత.....పూర్వం లేనన్ని వాతావరణ విపరీతాలు, భూకంపాలు తుఫానులు.....హింసాప్రవృత్తి.....డ్రగ్స్, శాడిజం, పాకిపోతున్న సుఖవ్యాధులూ, వాతావరణ కాలుష్యం.