అది రాణీ గంభీరా కాలేజీ గేటు. గేటుకివతల కన్నెపిల్లలు, కుర్రాళ్లు గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పెసుకుంటున్నారు. అవి మామూలు కబుర్లు కావు. ఆనందం పట్టలేనంత ఉత్సాహం, ఉత్సాహం పట్టలేనంత ఉద్రేకం- వీటిలో కలగలిసిన అమాయకత్వం- అక్కడున్న వారందరినీ అందానికి మారు రూపంగా తయారు చేసింది.
వారిలో కొందరు సగం తీసి వున్న గేటులోంచి ముందుకు వెళ్ళి గంభీరంగా మారిపోతున్నారు.
దేవేంద్ర అక్కడున్న ఆడపిల్లల్ని అదే పనిగా చూస్తున్నాడు. అతడి చూపుల బాణాలెటునుంచి వస్తున్నాయో తెలియకుండా నల్లద్దాల కళ్ళజోడు పెట్టాడు.
అంతా బాగున్నారు. వారిలో ఎవరిని....?
అదే అతడి ఆలోచన.
ఆ సమయంలో అక్కడున్న ఆడ, మగ అందరూ ఓ వైపుగా తిరిగారు. అదిగో, అదిగో అంటున్నారు.
అక్కడేముందోనని దేవేంద్ర కూడా అటు తిరిగాడు. అంతే! అతడి కళ్ళు అతడివి కావు. అతడి వళ్ళు అతడిది కాదు....
* * * *
హాస చేతిలో స్వెట్టరు....
"ఓ మూల ఉక్కబోసి మేమంతా చస్తుంటే ఆ స్వెట్టరెందుకే?" అంది పార్వతమ్మ.
"భోంచేయడానికి వెడుతున్నాను" అంది హాస.
"భోంచేస్తే స్వెట్టరెందుకు?"
"నరసింహంగారు ట్రాన్స్ ఫరై వెళ్ళిపోతూ నాన్నగారికీ ఫ్రిజ్ అమ్మేసి డబ్బులు మీ యిష్టం వచ్చినప్పుడు పంపించండి అన్నారు. అది మనింటికొచ్చి పదిరోజులయింది. సెకండ్ హాండ్ దైనా ఫస్ట్ క్లాస్ గా పని చేస్తోంది...."
"బాగుందే, నువ్వేం ఫ్రిజ్ లో కూర్చుని భోంచేస్తావా?" అంది పార్వతమ్మ.
"ఓహ్, నీకంతా మడికదా, ఏ రోజు వంట ఆరోజే తింటావు. అందుకని నీకేం తెలియదు? అమ్మ నిన్న రాత్రి మిగిలిన అన్నం, దొండకాయ కూర, కొబ్బరి పచ్చడి, సాంబారు అన్నీ ఫ్రిజ్ లో పెట్టి సరిగ్గా నేను భోంచేసేముందే తీస్తోంది. అవి ముట్టుకోగానే....అమ్మో తల్చుకుంటేనే.." అంటూ వణికిపోసాగింది హాస.
"చాల్లే బడాయి...." అని బామ్మ అంటూండగా హాస తమ్ముడు ఐస్ క్రీం తింటూ అలా వచ్చాడు.
"ఏరా పాలగ్లాసు అన్నం గిన్నెగ్గానీ తగిలిందేమిటీ? వెళ్ళి కాసిని పసుపు నీళ్ళు చల్లుకో. బామ్మ అంటుంది" అంది హాస.
"ఇది నిజంగానే ఐస్ క్రీం, నువ్వేమంటున్నావో నాకర్ధం కావడం లేదు" అంటూండగా నవ్వు వినిపించి అటు చూశాడు వాడు.
తాతగారు అతి కష్టం మీద నవ్వాపుకుని, "మనుమరాలా! ఈరోజు కాలేజీ మానేయకూడదే- రోజంతా కబుర్లు చెప్పుకుందాం" అన్నాడు.
నేనిక్కడుండిపోతే నా స్నేహితులంతా ఏమైపోతారు?" అంది హాస.
* * * *
"ఏమిటే యింత ఆలస్యం" అంది సుగుణ.
"ఇందాకటినుంచీ నవ్వడానికి జోకుల్లేక ఉత్తినే నవ్వేసుకుంటున్నాం. రా తల్లీ.... ఓ మంచి జోక్ చెప్పి నవ్వించు" అంది మాలతి.
హాస ఏదో అంటోంది కానీ దేవేంద్రకామె మాటలు వినిపించడం లేదు.
అతడామెనే చూస్తున్నాడు.
లేత నీలంరంగు చీర మీద అదే రంగు బ్లవుజ్ వేసుకుందామె. లేత గులాబిలా వున్న ఆమె ముఖంలో నల్ల కలువలవంటి కళ్ళు, దొండపండువంటి పెదాలు తమాషాగా మెరుస్తున్నాయి.
"ఈమె మనిషి కాదు, దేవకాంత" అనుకున్నాడు దేవేంద్ర. వెళ్ళి వెంటనే పలకరించాలని తోచిందతనికి. కానీ తను వేటగాడి ఎర. తొందరపడకూడదు.
ఆమె పెదవుల కదలికలో సంగీతపు నడకలు. ముత్యాల్లాంటి ఆమె పళ్ళు పియానో మెట్లలా అప్పుడప్పుడు దర్శనమిస్తున్నాయి.
"వేటకు సివంగి కూన దొరికింది. వేటాడి దాన్ని కురంగ బాలగా మార్చాలి" అనుకున్నాడు దేవేంద్ర.
8
టైము తొమ్మిదయింది.
గౌతమ్ స్నానం చేశాడు. బట్టలు మార్చుకున్నాడు.
అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూంటే అక్కడ అతడికి తన ప్రతిబింబం స్థానంలో సీత కనబడింది.
"సీతా!" అన్నాడతను.
సీత నవ్వింది.
"నువ్వు మధ్య తరగతివాడివి. మనిషిలా బ్రతుకుతున్నాననుకునే వాడివి. నీ జీవితం మధ్య. నీకు మనుషులానందాన్నివ్వలేరు. అందుకే ప్రతిబింబంగా వచ్చాను. నీ ముచ్చట తీర్చుకో" అందామె.
గౌతమ్ బదులివ్వలేదు.
అద్దంలో ప్రతిబింబం తన దుస్తులు విప్పుతోంది.
గౌతమ్ చటుక్కున వెనక్కు తిరిగాడు. అక్కడెవరూ లేరు.
"ఛీ!" అనుకున్నాడతడు.
"నా మనసులో ఆ సీతపట్ల వాంఛ వుంది. అందుకే యిలా జరుగుతోంది" అనుకుంటూ అతడు తిరిగి అద్దం వైపు చూశాడు.
సీత సినిమాల్లో సిల్కు స్మితలా వుంది. ఎటొచ్చీ కాస్త నాజూగ్గా వుంది.
ఆమె నృత్యం చేస్తోంది. ఆ నృత్యం అసభ్యంగా వుంది.
ఏవగించుకుంటూనే గౌతమ్ ఆ నృత్యం చూస్తున్నాడు.
అప్పుడు వీధి తలుపునెవరో తట్టారు.
అద్దంలో ప్రతిబింబం మాయమయింది.
గౌతమ్ వెళ్ళి తలుపు తీశాడు.
ఎదురుగా గెడ్డం మాసి, కళ్ళు లోతుకుపోయి, తైల సంస్కరం లేని జుత్తుతో, అక్కడక్కడ చిరిగినా దుస్తులలో ఓ యువకుడు. అతడికి ఇరవై ఏళ్ళు దాటి వుండవు.
గౌతమ్ అతడివంక ప్రశ్నార్ధకంగా చూశాడు.
ఆ యువకుడు మౌనంగా అతడికో కాగితం అందించాడు. అయిష్టంగానే గౌతమ్ ఆ కాగితం అందుకుని చదివాడు. అందులో వ్రాసిన ప్రకారం ఆ యువకుడికి బ్లడ్ క్యాన్సర్. ఆపరేషన్ కి డబ్బు కావాలి. ఆర్నెల్లలో యాభైవేలు జతపడితే అతడు బ్రతుకుతాడు. అయినవాళ్ళెవరూ లేరు. తృణమో పణమో యిచ్చి సాయపడమనీ విన్నపం.
గౌతమ్ కాగితం చదివి ఆ యువకుడివంక ఎగాదిగా చూశాడు.
ఆ యువకుడు ఇబ్బందిగా కదిలి అతడి చేతిలోని కాగితం అందుకున్నాడు.
"లోపలికొస్తావా?" అన్నాడు గౌతమ్.
ఆ యువకుడు అర్ధం కానట్లు ప్రశ్నార్ధకంగా చూశాడు.
"లోపలికి రా!" అన్నాడు గౌతమ్.
"ఎందుకు?" నీరసంగా నూతిలోంచి వచ్చినట్లున్నాయా మాటలు.
"అన్నీ చెబుతాను. లోపలకు రా!"
ఇద్దరూ లోపలకు వెళ్ళారు. గౌతమ్ అతడినీ కుర్చీలో కూర్చోమని ప్లాస్కులోంచి కాఫీ కప్పులోకి పోసిచ్చాడు.
"నేను కాఫీ తాగను" అన్నాడా యువకుడిబ్బందిగా.
"ఈ ఒక్కసారికే, కొంచెం తాగు."
ఆ యువకుడు వేడి కాఫీని ఒక్క గుక్కలో తాగేసి కప్పు పక్కన పెట్టేసి ఇబ్బందిగా గౌతమ్ వంక చూశాడు.
"నీకు నీ జబ్బు తగ్గాలనుందా? ఉంటే ఇది మార్గం కాదు బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్నవాడివి ఎన్నాళ్ళని తిరుగుతావు? ఎంత తిరిగినా ఆర్నెల్లు కాదు, ఆరేళ్ళుగడిచినా నువ్వు యాభైవేలు పోగుచేయలేవు...." అన్నాడు గౌతమ్.
అతడు నిట్టూర్చి "అంతా నా అదృష్టం" అన్నాడు.
"నీ అదృష్టం కొద్దీ నువ్వు నా దగ్గరకొచ్చావు. అందరిలా కాక ప్రత్యేకాశయంతో జీవితం గడపాలని లక్ష్యం కోసం వెతుకుతున్న నాకో లక్ష్యం తప్పిపోయింది. నువ్వు నా రెండో లక్ష్యానివి. నా జీవితం ధారపోసి నీ ఆరోగ్యం కాపాడతాను. నువ్విక ఇలా తిరగడం మానేసేయ్" అన్నాడు గౌతమ్.
"నేను మీకేమౌతానని?" అన్నాడా యువకుడు అనుమానంగా.
"వరసలు, బంధుత్వాలు అన్నీ భ్రమ! మనిషికి మనిషి ఏమీ కాదనుకోవడం కంటే అన్నీ అవుతాడనుకుంటేనే బాగుంటుంది నాకు.
"మీరు నా జబ్బును అనుమానిస్తున్నారు. నన్ను మోసగాడిననుకొంటున్నారు. నాకు డాక్టరు పరీక్ష చేయించి పోలీసుల కప్పగించాలనుకుంటున్నారు" అన్నాడా యువకుడు నిష్టూరంగా.
ఏం నువ్వు మోసగాడివా?"
ఆ యువకుడదోలా నవ్వి, "నా జబ్బును నమ్మిన వాళ్ళని నేను నమ్మలేదు" అన్నాడు.
"నా ప్రశ్నకు జవాబదికాదు. నువ్వు మోసగాడివా అన్నాను. దానికి బదులు కావాలి."
"కూటికోసం కోటి విద్యలు మోసమౌతాయా?"
"కూటికోసమే అయితే నాతో ఉండు. ఏ విద్యలక్కర్లేదు."
"అంటే?"
"నాకో తోడు కావాలి...."
"తోడు కావాలంటే పెళ్ళి చేసుకోవచ్చుగా...."