కౌంటర్లో వ్యక్తి తొందరగా వ్యవహారాలు తేల్చేస్తున్నాడు. మరో పది నిముషాలలో క్యూ అయిపోయింది. ఈశ్వరరావు మరోసారి అతన్ని పలకరించాడు. అతను పెదిమవిరిచేశాడు. అలాగంటే ఎలాసార్ అంటూ ఈశ్వరరావు నోట్లునతని కళ్ళు ఆకర్షించేళా కదిపాడు.
కౌంతలో మనిషి చురుగ్గా చూసి కౌంటరులోనుంచి బయటపడ్డాడు. ఈశ్వరరావతని వెంటబడ్డాడు. అతను ఈస్వర్రావుని పట్టించుకోవడంలేదు. అయినా ఈశ్వరరావతన్ని వదలడంలేదు. ఆఖరికి అతను- "మీరు భువనేశ్వర్ నించి వస్తున్నానంటున్నారుకదా- వాల్తేర్ టూ బొంబాయికి బోగీకి భువనేశ్వర్ లో కోటా వుంది. అక్కడే రిజర్వ్ చేసుకోలేకపోయారా? అన్నాడు.
ఈశ్వరరావు గతుక్కుమన్నాడు. ఈ సదుపాయం గురించి ముందే తెలిస్తే ఎంత బాగుండేది? హాయిగా భువనేశ్వర్ లోనే రిజర్వ్ చేసుకుని వుండేవారు. అయినా తమ ప్రయత్నాలన్నీ-అక్కడ భువనేశ్వర్ లో రిజర్వేషన్ కౌంటర్ ముందే చర్చించారు. ఈ సమాచారం ఆ వ్యక్తి, ఇచ్చి వుంటే ఎంతో బాగుండేది. అయినా ఇప్పుడనుకుని ఏం లాభం?
"ఈ సంగతి తెలియదుసార్-" అన్నాడతను.
"మీరు నా వెంటబడి ఏమీ లాభంలేదు. నేను బొంబాయి బోగీ కండక్టర్ని కాను. కావాలంటే సికింద్రాబాదు వరకూ ఏదైనా ఏర్పాటు చేయగలను- వేరేబోగీలో, బొంబాయి బోగీ కావాలనుకుంటే ఆపెట్టెలో ఎక్కికూర్చోండి. కండక్టర్ ఎక్కగానే మీ ప్రయత్నాలు చేసుకోండి..."
"ఏమైనా అవకాశముంటుందంటారా?"
"మీ అదృష్టం!"
"అలాగనాకండిసార్ - మీరు మా కేసు రికమండ్ చేయండి..." అంటూ ఈశ్వరరావు తన కుడిచేతిలోని నోట్లుని ఎడమచేతిలోకి మార్చాడు.
అతను వాటివంక ఓసారి చూశాడు- "సరే చూద్దాం లేండి. గ్యారంటీ ఏమీలేదు. అందాకా బోగీలో ఎక్కి కూర్చోండి...." అన్నాడు.
ఈశ్వరరావు పరుగున రాజారావు దగ్గరకు వెళ్ళి- "చూద్దాం. బోగీలో ఎక్కికూర్చోండి- అనిపించానండీ..." అన్నాడు.
"గ్యారంటీ ఇచ్చాడా?" ఇలాంటి ప్రయాణాలు అలవాటులేని రాజారావుకు అన్నీ పకడ్బందీగా వుండాలి. రిజర్వేషన్ వుంటే ఆ కంపార్ట్ మెంట్ లో ఎక్కుతాడతను. లేని పక్షంలో చచ్చో బతికో కంపార్ట్ మెంటులోనే ప్రయాణం చేస్తాడతను.
ఈశ్వరరావు మనసులో కాస్త విసుక్కుని- "రైల్వే వాళ్ళెప్పుడు గ్యారంటీ అన్న పదం వాడరు. వాళ్ళు చూద్దాం అంటారు. అదేమనకు వెయ్యి ఏనుగులబలం. మీరు కంపార్ట్ మెంటులో వుండండి. నేనీలోగా పట్టవలసిన వాళ్ళందర్ని ఓ పట్టుపట్టి వస్తాను..." అన్నాడు.
అప్పటికి రాజారావు ముఖం కడుక్కుని టిఫిన్ తిన్నాడు అందువల్ల అతను బొంబాయి బోగీలో ఎక్కేసి- "మీరు వెళ్ళిరండి-" అన్నాడు.
ఈశ్వరరావు గబగబా ముఖం కడుక్కుని కాఫీ తాగాడు. అతను కాఫీ గత ప్రాణి. అని తాగేక అతనికి కొండంతబలం వచ్చింది. ఆ బలంతో అతను ఏకారణంవల్లనో స్టేషన్ కు రాలేక పోయిన స్నేహితున్ని విసుక్కోగలిగాడు. తన టెలిగ్రాం అందిందనీ, ప్రయత్నాలు చేస్తున్నాననీ జవాబు వ్రాసిన స్నేహితుడు ఏమయిపోయాడు? ఎందుకు రాలేదు?
ఈశ్వరరావు కాఫీ తాగడంపూర్తయ్యేసరికి బొంబాయి బోగీముందు జనం బాగా పోగడ్డారు కండక్టరు వచ్చి వుంటాడనుకున్నాడతను. మళ్ళీ ప్రయత్నాలారంభించడం కోసం అతనక్కడికి వెళ్ళాడు.
ఈశ్వరరావు వెళ్లేసరికి ఓ పాతికమంది జనం మధ్య ఒకే సమయంలో అయిదారుగురికి సమాధానం చెబుతూ ముఖం నిండా చిరాకు పులుముకున్న ఒక ముసలాయన కనబడ్డాడు. నిన్నటి రాత్రి అనుభవాన్నిబట్టి డ్రస్సులో వున్నా ఆయన కండక్టరవునా కాదా అని సందేహం కలిగింది ఈశ్వరరావుకి. అయితే కోతుకి వున్నా ఇత్తడి బిళ్ళ, చేతిలోని చార్టు మూగివున్న జనం - కాకతాళీయంగా జరుగవు కాబట్టి ఆయనే కండక్టరై వుండాలనుకున్నాడతను. ఆయన్ను సమీపించాలని అతను అభిమన్యుడిలా ప్రయత్నిస్తూ, భీమనకులసహాదేవుల్లా ఫెయిలయిపోతున్నాడు. ఆయన చుట్టూ వున్నది పద్మవ్యూహంకన్న దుర్భేధ్యంగావుంది. అతనింకా ప్రయత్నంలో వుండగానే ఆ ముసలాయన- "బాబూ- నన్ను చంపకండి. ఎలుగెత్తి చెబుతున్నాను వినండి. బొంబాయి బోగీలో ఒక్క బెర్తుకూడా కాళీలేదు. ఆ ఆశతో ఉన్నవాళ్ళందరూ తక్షణం దిగిపోవచ్చు సామాన్లు బోగీలో పెట్టుకునివుంటే దింపేసుకోండి. బండి కదలడానికింకెంతోటయింలేదు. ఇంకో బోగీలో ప్రయత్నాలు చేసుకోండి..." అని గట్టిగా ఆర్తనాద లాంటిది చేశాడు.
ఆయన చుట్టూ వున్నవాళ్ళల్లో ఎవ్వరూకూడా దానికి చలించలేదు. అందరూ కాకలుతీరిన ప్రయాణికుల్లాగున్నారు. ఆఖరికి ఆ ముసలాయనే వారందరినీ చేధించుకుని బయటపడి ప్లాటుఫారం మీదకు షికారు వెళ్ళాడు. అప్పటికీ కొందరు ఆయన వెంటబడ్డారు. ఈసారి ఈశ్వరరావు ఆయనకు సమీపంలో స్థానాన్ని సంపాదించగలిగాడు. ముసలాయన ఎవరివైపూ చూడకుండా ఎవరితోను మాట్లాడకుండా తిన్నగా ఇది వరకటి కౌంటరులో వ్యక్తివద్దకు వెళ్ళాడు ఆ వ్యక్తి దగ్గర ఓ మనిషి పుణికింతాలు పడుతున్నాడు.