Previous Page Next Page 
అసావేరి పేజి 7

    "అంటే...." వణికిపోతున్నాడు తలవంచుకుని.
   
    "వచ్చేక చెబుతాను. ఈ అల్లరి పిల్లాడికి అన్నీ నేర్పుతాను" మంగ వెళ్ళిపోయింది ఉత్సాహంగా.
   
    వద్దని ఎందుకు చెప్పలేకపోయాడో శంకూకి స్పురించలేదు కాని ఈ రాతఃరికి మంగ అదేదోగాని అన్నంత పనీ చేస్తుందని మాత్రం అర్ధమైపోయింది.
   
    ఆలోచనలనుంచి ఇంకా తేరుకోనేలేదు.
   
    అప్పుడు వినిపించింది బయట స్కూటర్ శబ్దం.
   
    "ఇంకా అలానే కూచున్నావేమిట్రా క్విక్ టైమవుతూంది. తయారుకా...."
   
    చిన్నప్పటి స్నేహితుడూ....ఇప్పటికీ శంకూ అంటే ఇష్టపడే సురేంద్ర తొందర చేశాడు.
   
    లక్ష్మమ్మ కేరేజి శంకూ చేతికందిస్తూ సురేంద్రని చూసింది. "పసి వాడు....జాగ్రత్త నాయనా...."
   
    "నేనుంటానుగా బామ్మా" హామీ ఇచ్చాడు. అదే కాలేజీలో బి.యస్సీ చదువుతున్న ఇరవై ఏళ్ళ సురేంద్ర.
   
    సురేంద్ర తండ్రి మిలటరీలో సుబేదారుగా వుంటూ ప్రమాదంలో కాళ్ళు పోగొట్టుకుని రిటైరైనాడు. శంకూపై సురేంద్రకే కాదు శంకూ కుటుంబంపై రిటైర్డ్ సుబేదారు బంగార్రాజుకీ విపరీతమైన సానుభూతి వుంది. కాబట్టే ప్రభుత్వం ఉదారంగా యిచ్చిన భూమిలో అరెకరం అరటి తోటనిప్పించి ఆ కుటుంబానికే ఇచ్చేశాడు.
   
    శంకూకి కాని లక్ష్మమ్మకి కాని ఆదరువు ఆ తోటే....
   
    కాలేజీ కెళ్తున్న శంకూని పక్కవాటాలో నిలబడ్డ మంగ రెప్పవాల్చకుండా చూస్తూంది.
   
    ఇప్పుడామె నిమిషాల్ని లెక్కపెట్టుకుంటూంది.
   
    అర్దరాత్రివేళ వస్తానన్నప్పుడు శంకూ మౌనం ఒక అంగీకారంలా ఆమెను పిచ్చిదాన్ని చేస్తూంది.
   
                                        *    *    *    *
   
    పల్లెకి మూడు మైళ్ళ దూరంలో వున్న ఏ.వి. కాలేజీలో ఉదయం తొమ్మిదిన్నర గంటలవేళ....
   
    విధ్యార్దీ విద్యార్ధినులు గుంపుగా నడుస్తున్నారు.
   
    సుమారు రెండెకరాల స్థలంలో నిర్మించబడిన ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదలుకుని డిగ్రీదాకా వుంది. పట్టణంలో మరో జూనియర్ కాలేజీ లేకపోవటంతో చుట్టుపక్కల పల్లెల్నుంచి వచ్చే విద్యార్ధులకదో కూడలిలా సందడిగా వుంటుంది. వెయ్యిమంది దాకా స్టూడెంట్సుండే ఆ కాలేజీకి భిన్నం కాదు. అక్కడా విద్యార్దుల రాజకీయాలూ విచ్చల విడిగా సాగే కొట్లాటలూ జిల్లాలో ఆ కాలేజీకే ఓ ప్రత్యేకతని సంతరించిపెట్టాయి.
   
    హైస్కూలు దాటిన విద్యార్ధులు తొలిసారి కాలేజీలో అడుగు పెట్టినప్పుడు ఉండే బెరుకుతో కొందరు దిక్కులు చూస్తుంటే అప్పటికే డిగ్రీస్థాయిలో వున్న స్టూడెంట్స్ ఆకతాయిగా ఆవరణలో నిలబడి కొత్తగా వచ్చే విద్యార్దులపై ఒకటీ అరా విద్యార్దినులపై కూడా కామెంట్సుని అస్త్రాలుగా సంధిస్తున్నారు.
   
    క్లాసెస్ మొదలవడానికి మరో అరగంట వుందనగా సురేంద్ర ఇంటర్మీడియట్ క్లాస్ రూంని శంకూకి చూపించాడు.
   
    ఇక్కడే శంకూ చేసిన పొరపాటు క్లాస్ మొదలయ్యేదాకా అయినా సురేంద్రతో వుండకపోవడం.
   
    బిక్క మొహంతో దిక్కులు చూస్తూ కారిడార్ లో నడుస్తున్న శంకూకి హఠాత్తుగా ఎదురయ్యారు సీనియర్ విద్యార్ధులు కొందరు.
   
    "రాకుమారా స్వాగతం" శంకూ తొడుకున్న నిక్కర్ని చూస్తూ అన్నారెవరో.
   
    ముందు తనని కాదేమో అనుకున్నాడు. కాని అప్పటికే అతడ్ని చేయి పట్టుకుని ఖాళీగా వున్న ఓ క్లాస్ రూంలోకి నడిపించారు.
   
    ఓ విద్యార్ధి శంకూ నిక్కరునే తదేకంగా చూస్తూ "రండి...అలా విశ్రమించండి" అన్నాడు బెంచీ చూపిస్తూ.
   
    భాష కొంచెం కొత్తగా అనిపిస్తున్నా బహుశా కాలేజీలో ఇలా మాట్లాడుకుంటారేమో అనుకుంటూ ఇబ్బందిగా నవ్వి కూర్చున్నాడు.
   
    "రాకుమారా....తమరు...."
   
    తన పేరు తెలీదేమో అన్న సంశయం ఏర్పడిపోవడంతో "నా పేరు రాకుమార్ కాదు....శంకూ" అన్నాడు వాస్తవాన్ని ఎరుకపరుస్తూ.
   
    "అటులనా క్షంతవ్యులం" మరో విద్యార్ధి అందుకున్నాడు.
   
    "బాగు_బాగు_మా తప్పిదాన్ని మనసారా మన్నించండి" పదిహేను మందిదాకా వున్న గుంపు కోరస్ లా ఒకేసారి అన్నారు. "మాట్లాడకండి మహాప్రభూ!"
   
    శంకూలో సన్నగా ప్రకంపన మొదలైంది. ఏం జరగబోతుందో వూహ కందకపోయినా ఇప్పుడేదో జరుగుతుందని అనిపించడంతో భయముగా దిక్కులు చూశాడు సురేంద్రకోసం.
   
    "ఏమిటి ప్రభూ! అలా భీతిచెందుట పాడియవునా? తురగము గడ్డి మేయుచున్నది."
   
    "అవేంటి?"
   
    "తమరు అధిరోహించి వచ్చిన గుర్రము"
   
    "లేదె......" కొద్దిగా మెలితిరిగి "స్కూటర్ మీద  వొచ్చాను....సురేంద్రలేడూ... తుంపాలనుంచి వస్తాడే...."
   
    "అయినచో నన్ను తమరు గుర్తించివుండరే" ఇప్పుడు ముందు కొచ్చాడు బియ్యే చదువుతున్న రవి....వీర్రాజుగారి సుపుత్రుడు.
   
    "మీ కిరీటములెక్కడ? భుజకీర్తులు ఎక్కడుంచితిరి?"
   
    "అస్సలు అర్ధం కావడంలేదు" ఏడుపొచ్చేట్టుంది.
   
    "అవుతుంది. నిక్కరు మహాశయా....నిక్కముగా ఇప్పుడిక అర్ధమవుతుంది. వెంకట్...ఓరీ భావకవీ....ఎక్కడ?"
   
    ఓ పూలచొక్కాల అబ్బాయి ముందుకు చొచ్చుకొచ్చాడు.
   
    "ఏం....ఓ కవిత చెప్పమంటారా?" ఉద్వేగంగా అడిగాడు.
   
    "మేం జీవహింస నీతోనే ప్రారంభిద్దామనుకుంటున్నాం" రవి అన్నాడు.
   
    "పైగా కొత్తపిల్లడు కూడా....తట్టుకు నిలబడతాడో లేదో చెక్ చేస్తే సరి."
   
    వెంకట్ చొక్కా సర్దుకున్నాడు. సామాన్యంగా రాసిన ఏ కవితనో నోరు తెరిచి చెబుతుండగానే హఠాత్తుగా అదృశ్యమయ్యే స్నేహబృందం ఈ క్షణంలో కోరి కవిత చెప్పమనడం గర్వంగా అనిపించింది పూల చొక్కాల వెంకట్ కి.
   
    "నిక్కరుతో ఒక్కరు"
   
    హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది.
   
    "నా కవిత మకుటం నిక్కరుతో ఒక్కరు"
   
    శంకూ భయంగా నిక్కరుపై చేతుల్నుంచాడు.
   
    "నిక్కరా నిక్కరా ఇది నీకు తిక్కరా
       
    లేనినాడు టక్కరా...చూస్తుంటే ఉక్కరా
       
    అది నిజమైన ముక్కరా....
   
    నిజమైతే కక్కరా...."
   
    "వెంకట్ ఆపరా!" తమకే స్ప్రుహను తప్పించే ఆ కృతి శంకూని అణువంతయినా కదిలించకపోవడం ఆ బృందాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
   
    "చూడు శంకూ!" ఆ గుంపుకి నాయకుడిలా రవి అడిగాడు ముందుగా "నీకు సినిమాలు చూసే అలవాటుందా నాయనా?"
   
    నెమ్మదిగా తలూపేడు ఉందీ అన్నట్టుగా.
   
    "నీ అభిమాన నటి ఎవరు?"
   
    చెప్పలేకపోయాడు.
   
    "నిన్నే" గర్జించాడు రవి. ఆ గద్దింపుకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
   
    "చెప్పకపోతే చెడ్డీ విప్పేస్తాను"
   
    అసలు రేగింగ్ అంటూ ఒకటుంటుందని, అది ఇంత దారుణంగా కలవరపెడుతుందని తెలీని శంకూ అప్పటికే స్టూడెంట్స్ చుట్టుముడుతుంటే "చెప్పేస్తాను....నిర్మల" అన్నాడు.
   
    "అబ్బో! ఏం టేస్టు....వెనిరాడై నిర్మలా....విజయనిర్మలా!"

 Previous Page Next Page