''చెప్పా పెట్టకుండా వచ్చింది కాకుండా, ఇంత రాత్రివేళ వచ్చి నా
వర్క్ డిస్టర్బ్ చేసింది పోయి....ఇన్నాళ్ళూ నువ్వెందుకు రాలేదని నేనెక్కడ నిన్ను
నిలదీస్తానో అని నువ్వే ముందుగా తెలివిగా నాపై దాడి చేయడం అంటే ఇదేనన్న
మాట....'' ప్రేమగా విసుక్కుంటూ వెళ్ళి తలుపు వేసి వచ్చింది ధీరజ.
''ధీరూ....ఇక్కడ నీ ఉద్యోగం ఎలా ఉంది? ముందు నీ
సంగతులు చెప్పు?'' అంటున్న శేఖర్ పక్కనే వచ్చి కూర్చుంది ధీరజ.
''ముందు స్నానం చేసిరా బాబూ....తరువాత
మాట్లాడుకుందాం.''
''ఇప్పుడా? ఇంత రాత్రివేళ ఎవరు చేస్తారోయ్? నావల్ల కాదు,
ప్లీజ్ ధీరూ....నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలెయ్యరా!''
''నథింగ్ డూయింగ్....లేదంటే నాదగ్గరకు
రానీయను....కనీసం ముద్దు కూడా పెట్టుకోనివ్వను.''
''ఓరినాయనోయ్....ఇదెక్కడి గొడవరా బాబూ! రాకరాక
వచ్చినప్పుడు ప్రియురాలిని ముద్దు కూడా పెట్టుకోనివ్వకపోతే నేనేం చేసేది....సర్లే ఏం
చేద్దాం....తప్పుతుందా మరి.''
బాత్రూమ్ కు వెళుతున్న శేఖర్ వైపు ప్రేమగా, మురిపెంగా
చూస్తుండిపోయింది ఇన్స్ పెక్టర్ ధీరజ.
తనంటే ప్రాణం ఇచ్చే ఏకైక వ్యక్తీ....తనకే చిన్న ఇబ్బంది
ఎదురయినా చలించి పోయే ప్రియబాంధవుడు శేఖర్ ఏంతెచ్చాడన్న ఆనందంతో
అప్పటికప్పుడు చకచకా వంట ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయిందామె.
మరో అరగంటలో భోజనాలు పూర్తయ్యాయి.
ఇద్దరూ బెడ్ మీదకు చేరారు.
శేఖర్ కౌగిలిలో గువ్వలా వొదిగిపోయి వున్నది ధీరజ.
ఇంతవరకూ పెళ్లి ఆనే బంధంతో ఇద్దరూ ఒకటి కాకపోయినా, ఎన్నో
రాత్రులు కలిసి ఒకే మంచం పై....ఒకరి కౌగిలిలో ఒకరు ఎన్నో సార్లు వున్నా,
కేవలం మనసు విప్పి కబుర్లు చెప్పుకోవడం వరకే పరిమితమయి పోయారు తప్ప పరిధిలు
అతిక్రమిచలేదు.
క్షణికమైన శారీరక సుఖం కోసం వాళ్ళిద్దరూ ఏ క్షణం లోనూ
తొందరపడలేదు. మూడు ముళ్ళూ పడిన తరువాతనే ఆ బంధంలోని తోలి
అనుబూతిని పొందాలనే నిర్ణయం తీసుకుని , ఆ మాటకే కట్టుబడిపోయి వున్న అమర
జంట ప్రేమికుల జంటగా చెప్పుకోవచ్చు.
ఆ రాత్రి వాళ్లకు జాగారమే అయింది.
మనసు విప్పి ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు.
ఒకరి కౌగిలిలో ఒకరు అలానే....ఒకే మంచంపై ఎప్పటికి
నిద్రపోయారో వాళ్ళకే తెలియదు.
అక్కడకు వచ్చాక తొలిసారిగా ఎలాంటి టెన్షన్ లేకుండా ధీరజ నిద్రపోయిన
తొలిరాత్రి అది!
****
యూనివర్సిటీ....
ఆఫేస్ రూమ్ లో ప్రిన్సపాల్ చాలా బిజీగా వున్నాడు.
నిజానికి అక్కడ డిపార్ట్మెంట్ హెడ్స్ తో మీటింగ్ జరుగుతోంది.
లోపలకు వచ్చిన లెక్చరర్ నీలిమను చూసి అతని బృకుటి
ముడివడింది.
మిగతా హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ లెక్చరర్స్ ఆమెనే ఎగాదిగా
చూస్తున్నారు.
''ఏమ్మా! చెప్పా పెట్టకుండా మాయమయ్యావు....ఇన్నాళ్ళూ
ఏమైపోయావు? అంత అత్యవసరమైతే కనీసం లీవ్ లెటర్ అయినా పంపకపోయావా?
కాలేజీకి రావడం లేదని కనీసం ఫోన్ చేయడమో, అదీగాక పొతే ఏ స్టూడెంట్ తో నైనా
కబురుచేయవచ్చు కదా?'' ప్రిన్సపాల్ రొటీన్ గా చివాట్లు పెట్టాడు.
''ఏమిటి మీరనేది? నేను కాలేజీకి రాకపోవడం ఏమిటి ? అసలు
నేనెక్కడికి వెళ్ళందే'' నీలిమ విసుగ్గా చెప్పింది.
అ సమాధానంతో ప్రిన్స్ పాల్ ఖంగుతిన్నాడు.
''అదేమిటి నీలిమా? నువ్వు మూడు రోజులనుంచీ యూనివర్సిటీకి
రావడం లేదు. హాస్టల్ లోనూ లేవు...అయినా నేనేక్కడకు వెళ్ళాను అంటూ తిరిగి
నన్నే ప్రస్నిస్తున్నావు?'' బట్టతల రుద్దుకుంటూ అన్నాడు ఆయన.
''సర్! ఐయాం నాట్ ఏ కిడ్....అసలు నాగురించి మీరెందుకు
కంగారు పడటం?''
''మరి ఖంగారు పడక ఏం చేయమంటావు? కాలేజీకి రాక,
హాస్టల్ లోనూ కనిపించక అసలు నువ్వేమైపోయినట్టు? పై పెచ్చు ఖంగారు
పడవద్దంటావు?''
''నేను కాలేజీకి రాకపోవడం ఏమిటండీ-రోజు వస్తూనే వున్నాను.
మీకు విష్ కూడా చేశాను. గుర్తులేదా? కావాలంటే అటెండెన్స్ రిజిస్టర్
చుడండి....నేను వస్తున్నానో, లేదో తెలిసిపోతుంది.''
ప్రిన్స్ పాల్ ఇంకా అయోమయావస్తలో నుంచి తేరుకోలేదు.
నిజానికి....మూడు రోజులు తరువాత నీలిమని ఇప్పుడు ఇలా
చుస్తున్నాడతను, అంతేకాదు....యూనివర్సిటీ కాంపస్ లో ఆమె తోటి లెక్చరర్లకు
గానీ, స్టూడెంట్స్ కు గానీ ఎవరికీ కనిపించలేదు. ఏ క్లాస్ కీ అటెండ్ కాలేదు. కాని
తను వచ్చాననడంతో ఇదేం చోద్యం రా బాబూ....అనుకుంటూ అటెండెన్స్ రిజిస్తర్ని
తెరిచి ఆమె ముందుకు నేట్టబోతూ మరోసారి ఆశ్చర్యపోయాడు.
జరిగిన రెండు రోజులూ నీలిమ రాకపోవడం వలన ఆమె సంతకం
చేయవలసిన చోట ఖాళీగా వుండాలి.
కానీ....
ఇప్పుడు ఆ చోట సంతకం చేసి వుంది.
అనుమానంగా మరోసారి చూసాడు.
నో డౌట్ !
అది నీలిమ సంతకమే!