Previous Page Next Page 
మిస్టర్ రాంగో పేజి 6

    ఇక నిద్రను బలవంతంగా ఆపుకోవడం ఆమెకు సాధ్యం కానిపని.
   
    ఆ విషయం రాంగోకు....బామ్మకూ అర్ధమయింది.
   
    "జాజీ....అయిపోవచ్చిందిలే....నిజంగా ఆరోజు ఆయనే గనుక సారి అయినా సమయానికి రాకపోయి వుంటే నా జీవితం ఏమైవుండేదో ఇప్పుడు తలుచుకున్నా భయం వేస్తుందనుకో...." చెప్పడం పూర్తి చేసి చెమర్చిన కళ్ళను పైట చెంగుతో అద్దుకున్నది బామ్మ.
   
    రాంగో ఇబ్బందిగా కదిలాడు.
   
    "నీకు నిద్ర వస్తుందనుకుంటాను...ఇంతకూ మెస్ కి వెళ్ళివచ్చావా" బామ్మ కుర్చీలో నుంచి లేస్తూ అడిగింది.
   
    చేసి వచ్చానన్నట్టు తలూపి బ్రతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళడానికి లేచి నిలుచుచున్నాడు.
   
    రెండడుగులు వేసిన రాంగో మళ్ళీ వెనక్కు వచ్చాడు.
   
    "ఏం బాబూ....ఏమయినా కావాలా?"
   
    "చిన్న డౌటు బామ్మగారూ...."
   
    "ఏమిటది....?"
   
    "ఇందాక మీరు చెప్పిన కరెంటు కొత్త ప్లాష్బాక్ లో.....ఆ మిడిగుడ్ల విలన్ గాడు మీ దగ్గరకు వస్తుండగానే స్పృహ కోల్పోయానని చెప్పారు. మరి ఆ తర్వాత.....మీ ఆయన అకస్మాత్తుగా వచ్చి అతన్ని గుద్దిన ఫైటింగ్ సేనంతా అంత నీట్ గా ఎలా చెప్పగలిగారు?"
   
    "చెప్పగలను....ఎందుకంటే.... నేను స్పృహ పోయినట్టు నటించాను కాబట్టి"
   
    "హమ్మ బామ్మా.....నిన్ను బర్మా జైలులో పెట్టా...నీది సూపర్ కంప్యూటర్ బ్రెయిన్" అనుకుంటూ మరో డౌట్ అడగకుండానే అడుగులు వేశాడు.
   
    వెళుతూ వెళుతూ జాజిబాలవైపు చూశాడతను. కుర్చీలో కూర్చునే నిద్రపోతూ...నిశ్శబ్దంగా నవ్వుతోంది.
   
    ఉడుక్కుంటూ తలతిప్పి గదిలోకి చూశాడతను.
   
    బామ్మగారు పక్కలు సర్దుతోంది.

            [4]
   
    "అన్ని బామ్మ పోలికలే...దొంగ బుద్దులు..." అంటూ చిన్నగా వంగి ఆమె కాలిమీద గిచ్చాడు. కెవ్వున అరిచింది జాజిబాల.
   
    "జాజీ... ఏమైందే?"
   
    "ఆ...ఏమీలేదు..." తడబాటులో పలికింది జాజిబాల.
   
    "మరెందుకు కెవ్వుమన్నావ్?"
   
    "న...ల్లి... కుట్టింది."
   
    జాజిబాలకు సైగచేసి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు రాంగో.
   
    బామ్మ పిలవడంతో వెళ్ళి మంచమెక్కింది జాజిబాల.
   
    పడుకున్న కొద్దిసేపటికే బామ్మ నిద్రలోకి జారిపోయింది.
   
    జాజిబాల మాత్రం ఏదో విషయాన్ని గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నది.
   
    పదకొండున్నర అవుతుండగా...
   
    జాజిబాల చప్పుడు కాకుండా మంచందిగి.... నిశ్శబ్దంగా తలుపు తెరుచుకుని మధ్య గదిలో నుంచి పైకి ఏర్పాటు చేయబడిన చెక్కమెట్లపై మెల్లగా అడుగులు వేస్తూ బిల్డింగ్ పైకి చేరుకున్నది.
   
    ఆ విశాలమైన బిల్డింగ్పైన లక్కపిడతలా ఉన్న సింగల్ రూమ్ తలుపులపై రిథమిక్ గా తట్టింది.
   
    ఆ మ్యూజిక్ కోసమే చకోరపక్షిలా ఎదురు చూస్తున్న రాంగో వెంటనే తలుపుతీసి ఆమెకు చిరునవ్వుతో స్వాగతం పలికాడు.
   
    ఆమె అతని మంచం ప్రక్కనే వున్న వైరు కుర్చీలో కూర్చున్నది.
   
    "ఇలా వచ్చి మంచంపైన కూర్చోవచ్చుగా బాలా...."
   
    "ఓహో... నా అంతట నేను నీ గదికి వచ్చినంత మాత్రాన నీ మంచంమీద కూర్చుంటానని ఎలా అనుకున్నావ్?" చిరుకోపంగా రుస రుస లాడిందామె.
   
    "అనుకోలేదు కానీ...అలా అడిగేటంత చనువు మనిద్దరి మధ్య వుందనుకుంటున్నాను....లేదంటావా చెప్పు."
   
    జాజిబాల మాట్టాడలేదు.
   
    ఆమె దగ్గరకు వెళ్ళి, పైకి లేపి...ఆమెను మంచం దగ్గరకు నడిపించుకు వెళ్ళి తన ప్రక్కన కూర్చోపెట్టుకుని.... చనువుగా ఆమె భుజంపై చేయి వేశాడతను.
   
    "ప్లీజ్...చేయి తీసేయ్... నా మనసేం బాగోలేదు...."
   
    ఠక్కున చేయితీసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ....
   
    "నీకు పదహారు కదూ...."
   
    "అవును..."
   
    "నాకు పదిహేడు అని తెలుసు కదా...."
   
    "ఊ..... తెలుసు.... అయితే ఏమిటంట?"
   
    "అదే చెబుతున్నాను..... విను. పదహారేళ్ళ అందమైన అమ్మాయికి మనసు బాగోలేదంటే అందుకు కారణము సెక్స్...."
   
    "ఒట్టి ట్రాష్!"
   
    "నో.... బాలా.... ఇట్ ఈజ్ ట్రూ...."
   
    "స్టాఫ్ దట్ బ్లడీ మాటర్...."
   
    ఆమె పెద్దగా విసుక్కుంది.
   
    రాంగో భ్రుకుటి ఆశ్చర్యంగా ముడిపడింది.
   
    అతనికి తెలిసి జాజిబాల అంతా డల్ గా ఎప్పుడూ లేదు చలాకీగా, ఎప్పుడూ జోక్స్ వేస్తూ ఎదుటి వాళ్ళలో హుషారు తెప్పించగల బ్యూటీకి.... ఈ వేళ ఏమయింది?
   
    రాంగో బాగా దగ్గరగా వచ్చి....
   
    "ఓ ఫ్రెండ్ కిస్ ఇస్తావా?" ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు.
   
    "ఎట్ లీస్ట్ బర్మా కిస్ కూడా ఇచ్చే మూడ్ లో లేను..... చూడు రాంగో.... మనం వీలయినంత త్వరలో పెళ్ళి చేసుకోవాలి...." సీరియస్ గా చెప్పిందామె.
   
    "అదేదో చెరో రెండు చాక్లెట్లు కొందాం.... అన్నంత సింపుల్ గా చెప్పేశావ్......"
   
    జాజిబాల చురుగ్గా చూసింది.
   
    "చూడు బాలా...... నీకు నిండా పదిహేడు లేవు. నాకు మూడు నెలల తరువాత కానీ పద్దెనిమిది ఏళ్ళు రావు. ఇంత లేత వయస్సులో మైనారిటీ తీరకుండానే వెళ్ళి చేసుకుని మనం ఏం సుఖపడతాం చెప్పు..... మీ వాళ్ళు కానీ, మా వాళ్ళు కానీ ఎవరూ మన అభిప్రాయాన్ని మన్నించరు సరికదా విడదీయాలని ప్రయత్నం చేస్తారు.... అవునో కాదో నువ్వె చెప్పు...."

 Previous Page Next Page