మునగ బెండు పైకి తేలుస్తున్నా నీళ్ళని చూసి భయం వేసింది శిశిర్ కి. పైగా కప్పలు, రాళ్ళ సందుల్లో పెద్ద పెద్ద కొండ్లు పెట్టుకొని ఎండ్రకాయలూ! హడలిపోయి మెట్లెక్కి నిలబడ్డాడు శిశిర్. నడుముకి కట్టిన బెండు విప్పేశాడు.
"ఏమిట్రా? ఎందుకు భయం? కప్పలు మనల్నేం చేస్తాయ్? నీళ్ళలో, భూమ్మీదా కీటకాలను భక్షించే అమాయక ప్రాణులవి"
"అంతంత లావు కొండ్లు పెట్టుకొని రాళ్ళ సందుల్లో ఏమిటో ఉన్నాయండీ!"
"అవా? అవి ఎడ్రకాయలంటారు ! కొంగా, పీత కథ నువ్వు చదువుకోలేదా? ఎడ్రకాయ అంటే పీతన్నమాట! వాటికి మనల్ని చూస్తే భయం. అందుకే అవి రాళ్ళ సందుల్లో దాగున్నాయ్. అపురూపని చూడు ఎంత బాగా చేపపిల్లలా ఈదుతూందో? నువ్వు అలా ఈదాలి. రా! నా చేతుల మీద బోర్లాపడుకొని చేతులు ఆడించు!"
ఆచారి అతడి భయం పోగొట్టాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. బెంబేలెత్తినట్లుగా బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు.
అపురూప వెనక్కి ఎప్పుడు చేరుకుందో, అమాంతం అతడిని నీళ్ళలోకి త్రోసేసింది.
"బాబోయ్! చచ్చాను!" కెవ్వున కేక పెట్టాడు శిశిర్. నీళ్ళు ముక్కులోకి, నోట్లోకి పోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. నీళ్ళు మింగేశాడు. ఊపిరాడక ప్రాణం పోతుందేమో అనిపించింది.
కాని, అంతలోనే ఆచారి అతడి పొట్ట క్రింద చేతులు వేసి పైకి లేపాడు. "నీకేం భయం లేదురా! నేనున్నాగా? కాళ్లూ చేతులు ఆడించు"
"వద్దండీ! నాకు ఈతొద్దు! నాకు నీళ్ళని చూస్తే భయం వేస్తుంది" గింజుకోసాగాడు.
"ఆ బయం పోవడానికేరా ఈత నేర్చుకోవడం! మనిషికి భూమ్మీద ఎన్నో గండాలు. అందులో జలగండమొకటి. ఈత వచ్చిన వాళ్ళకి జలగండముండదు. అయిదేళ్ళ పిల్లలు కూడా చేపల్లా బావిలో ఈదుతార్రా!"
"పైకి డాబుసరే! ఈ పట్నం పిల్లలంతా వట్టి పిరికివాళ్ళన్నట్టున్నారు నాన్నగారూ!" అపురూప వెక్కిరించింది నీళ్ళలో చేపలా తేలుతూనే. చేప రెక్కల్లా ఆ పిల్ల కాళ్లూ చేతులూ చిన్నగా కదులుతున్నాయి.
అపురూపే కాక ఇంకా చాలామంది పిల్లలు అవలీలగా అటునుండి ఇటు, ఇటునుండి అటు ఈదుతున్నారు. కోనేటిలో నీళ్లు చెల్లాచెదురు అవుతున్నాయ్. పోటీలు పడి ఈదుతున్నారు.
నీళ్ళలో అలా తేలడం, చేపలా ఈదడం ఎంత అద్భుతం! తను ఎప్పటికయినా అలా ఈదగలడా?
ఓవేపు ఈత నేర్చుకోవాలన్న ఆశ!
ఓవేపు నీళ్ళనీ, నీళ్ళలోని జీవరాసుల్నీ చూస్తే భయం!
"ఆడపిల్ల వెక్కిరిస్తుందిరా! షేమ్ షేమ్!"
రేపటి నుండి తను అపురూపకి ముఖం చూపాలన్నా తను ఊత నేర్చుకోక తప్పదు! మగపిల్లాడినే అని నిరూపించుకోక తప్పదు!
మళ్ళీ వారం వచ్చేసరికి నడుముకి బెండు అనిపించుకున్నాడు శిశిర్.
ఇక అపురూపతో పోటీ పడడం ఒక్కటే మిగిలింది!
ఈత బాగా వచ్చిందనుకొన్నాక గంగకి కొబ్బరికాయ శిశిర్ చేత కొట్టించాడు ఆచారి.
పన్నెండు గంటల దాకా బావిలో ఈత పడి, కడుపులో కర కర మని ఆకలేస్తూంటే ఇంటికి పరిగెత్తి అన్నం పెట్టించుకు తిని అలసినట్లుగా నిద్రపోయేవాడు శిశిర్. సాయంత్రం మళ్ళీ నాలుగింటికి బయటపడే వాడు.
చీకటి ముసురుకునేదాకా ఆటలే ఆటలు!
చీకటి పడ్డాక కూడా ఒక్కోసారి అపురూప నానమ్మ చెప్పే కథలకోసం, సుప్రసన్నాచారి చెప్పే నాటంక డైలాగులకోసం ఆగిపోయేవాడు.
రవి మామయ్యో, జీతగాళ్ళో బలవంతంగా తీసికెళ్లేవాళ్ళు.
పెళ్ళి పనుల్లో పడిన సుధకి అతడిని పట్టించుకునే తీరికే లేకుండా పోయింది. హైదరాబాదు వెళ్ళిపోదాం అని తన ప్రాణం తీయకుండా ఆడుకొంటున్నాడు కదా, అంతే చాలనుకొంది.
సెలవులు అయిపోవచ్చాయ్.
రవి పెళ్ళి కూడా ఐపోయింది.
పుట్టింటివారి సారె చీరలతో బయల్దేరుతూంది సుధ. ఒడి బరువెక్కి నట్టుగానే ఆమె మనసు కూడా బరువెక్కింది.
అందరికంటే దిగులుగా ఉంది శిశిర్ మనసు.
"వెళ్లొస్తాను" అంటూ ఆచారి ఇంటిలో అందరికీ చెప్పొచ్చాడు. అపురూపకి చెబుతూంటే అతని గొంతు పట్టేసింది.