Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 6

    అడవిలో  అందునా  అంధకారంలో  మనిషి  ఎంత  బలహీనుడో  నట్వర్ సింగ్ మరచిపోకుండా  వుంటే  రెస్టు  హౌస్ కి వెళ్ళాలన్న  తొందర పాటుతో  చెట్టు  దిగేవాడు  కాదు.

    ఫేలిస్ టైగ్రిస్  జాతికి  చెందిన  పులిని  తక్కువగా  అంచనా వేసిన  నట్వర్ సింగ్ కు తెలీదు_మరో  అయిదడుగుల  దూరంలో  వెదురు పొదల  మాటున  అయిదు వందల  పౌన్ల  బరువున్న మేనీటర్ పొంచి వుందని. వారిని దెబ్బతీయాలనే  అవకాశం కోసం  వేచి చూస్తోందనీను.

    దుర్గమారణ్యాన్ని  దాటాలంటే  మరో అయిదు  నిముషాలు  చాలు. తర్వాత రెస్టు అవుస్ కు  చేరుకుని తులసి  చేరువలో  తెల్లవార్లూ  గడిపేయొచ్చు. కంజి వృక్షాన్నానుకుని  వున్న  పొద  కదిలింది.

    టక్కున  ఆగి కళ్ళు  చిట్లించి  చూశాడు. సహజంగా  ధైర్యవంతుడైన  నట్వర్ సింగ్ కాని, అప్పటికే ఆలస్యమయింది.

    అతని చేతులు  రైఫిల్ ను  బలంగా  పట్టుకుని  పైకెత్తబోతుండగా అడవి దద్దరిల్లేటట్లుగా  గాండ్రించిన  మేనీటర్ కుడిపక్కనుంచి  అతని పైకి దుమికింది .పాయింట్ బ్లేంక్ గా  ట్రిగ్గర్  నొక్కడంతో  తూటా చెట్టును దూసుకుపోయింది  తప్ప పులి  ఆగమనాన్ని  ఆపలేకపోయింది.

    నేలపై  వెల్లకిలపడిన  నట్వర్ సింగ్  కుడిజబ్బ  పంజా  దెబ్బతో  వేరై పోయింది. తుపాకీ నేలపై  పడింది.

    "తులసీ  పారిపో....!"

    అదే నట్వర్ సింగ్  అన్న చివరిమాట. పెద్దపులి  తులసిపై  విరుచుకుపడే  ప్రయత్నాన్ని   నిరోధిస్తూ  ఎడమ చేతితో శక్తిని  కూడగట్టుకుని  పులి మెడని  పట్టుకున్నాడు.

    మరుక్షణం  అతని  కంఠం పదునైన పులి గోళ్ళ  తాకిడికి  చీలి రక్తంవాగులా బయటకు చిమ్మింది.
 
    కొన్ని క్షణాల క్రితంవరకూ  తనను  సందిట బంధించిన  అతని చేతులు నిర్జీవంగా  నేలపై బడగానే ....

    శవాన్ని నోట కరుచుకుని  సమీపంలోని  పొదల్లోకి  పులి దూసుకుపోతుంటే దిక్కుతోచని  దానిలా నిలబడ్డ తులసి నిస్సహాయంగా  అరణ్యరోదన చేసింది.

    ఆ అర్ధరాత్రి వేళ....

    అడవంతా  గగ్గోలు  పెడుతున్న  పసికందు  ఆక్రందనలా  వినిపించినా పల్లె  ప్రజలు  పులి రక్కసి బారినుంచి  నట్వర్ సింగ్ తమను రక్షించాడనుకున్నారు  కాని, పులి చేతనే  అతను  వేటాడ బడ్డాడని ఊహించలేకపోయాను.


                                          3

    ఆ ఉదయం....

    హైదరాబాద్ లోని  చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్  ఫారెస్టు కాన్పరెన్స్  హాల్  ప్రెస్  రిపోర్టర్లతో  నిండిపోయింది.

    రాష్ట్రంలో  ఆధునిక  సంచలనాన్ని  రేపుతున్న  మేనీటర్  విషయంలో  అటవీశాఖ  వైఫల్యం  గురించి  రిపోర్టర్లు  కురిసిస్తున్న  ప్రశ్నలు  వర్షానికి  జవాబు  చెప్పటం  చీప్ కన్జర్వేటరు  అనిల్ కుమార్ కు ఓ పట్టాన సాధ్యం  కావడం లేదు.

    మరోపక్క  ప్రభుత్వం, ప్రతిపక్షాలు  సైతం  అటవీశాఖను నిందిస్తుంటే  అప్పటికే  చాలా టెన్షన్ లో ఉన్నాడతను.

    "నట్వరుసింగ్ మరణం  గురించి  మీ అభిప్రాయం  ఏమిటీ?" ఓ రిపోర్టరు అడిగాడు.

    "వేటలో మంచి నైపుణ్యం, అంతకుమించి  డ్యూటీ  విషయంలో  మంచి దీక్షగల వ్యక్తి నట్వరుసింగ్. అందుకే మొదటి ఫారెస్టాఫీసరు  రఘునందన్  పాముకాటుతో  చనిపోయేక, బాగా ఆలోచించి  సమర్దుడయిన  నట్వరుసింగ్ ను పంపడం జరిగింది" జవాబిచ్చాడు  అనిల్ కుమార్.

    "అంత అనుభవమున్న  నట్వరుసింగ్  మేనీటరును  చంపే ప్రయత్నంలో  తనే మేనీటరుకు  బలి కావడమన్నది, యాదృచ్చిక మంటారా, లేక  అతడు చేసిన ప్రయత్నంలో  లోపమంటారా?" మరో రిపోర్టరు  అడిగిన ప్రశ్న అది.

    "నో!"తలను అడ్డంగా  ఊపిన  అనిల్ కుమార్  ఆలోచించకుండానే  "అది యాదృచ్చికమూ కాదు. ప్రయత్నంలోని  లోపం అంతకంటే  కాదు" అని, "కేవలం  అతడెదుర్కొన్నదిమేనీటరు కావడమే" అంటూ ముగించాడు.

    "మేనీటరయినా, అతడు  వేటాడబోయింది  పులేగా?"

    "కావచ్చు. కాని, సామాన్యమైన పులికి, మనిషి మాంసానికి అలవాటుపడ్డ పెద్దపులికి  బిహేవియరులో  చాలా వ్యత్యాసముంటుంది...."

    పశ్చిమ బెంగాల్  రాష్ట్రంలో వున్న  సుందర్ బన్స్  అనే ఊబి  అడవి ప్రాంతం  పులులకు  ప్రసిద్ధి కనుక  మనదేశంలోని పులులకు  'రాయల్ బెంగాల్ టైగర్సు' అన్న   పేరు  వచ్చింది. పులులు ఆసియా ఖండంలో ఉత్తర దిక్కున మంగోలియా, సైబీరియా  ప్రాంతాలనుండి  దక్షిణదిక్కున  ఇండియా  వరకూ, తూర్పున  ఇండోనేషియా నుండి పడమట కాకేషన్  పర్వత  శ్రేణివరకూ  కనిపిస్తాయి.

    పులుల గురించి  టూకీగా పరిచయం  చేసిన  అనిల్ కుమార్ మేనీటర్సు  గురించి  స్పష్టంగా  చెప్పడం  ప్రారంభించాడు.

    "సామాన్యంగా  ఏ వన్యమృగమయినా  మనుషులకు దూరంగా ఉండాలని  ప్రయత్నిస్తుంది. పెద్దపులి  కూడా అంతే! సాధారణంగా కణుసులనూ, లేళ్ళనూ, పందులనూ, పశువులనూ  పిల్లిలాగే  ఎలుకలనూ, పందికొక్కులను  వేటాడి  ఆకలి  తీర్చుకుంటుంది  పులి. అలాంటి  పులి నరమాంస  భక్షకిగా  మారటానికి  కొన్ని బలమైన  కారణాలున్నాయి" సాలోచనగా  రిపోర్టర్లందరివైపు  చూసిన  అనిల్ కుమార్ క్షణం ఆగేడు.

    "జూలాజికల్  స్టేటిస్టిక్స్  ప్రకారంగా  ఆలోచిస్తే  ఓ పెద్దపులి మేనీటరుగా మారటానికి  ముఖ్యకారణం  వయసు మీరడంతో  తను సహజంగా  ఆహారంకోసం  జంతువుల్ని  వేటాడే  శక్తిని  కోల్పోవడం, రెండవది_అర్బనైజేషన్  కారణంగా  అడవులు  క్రమంగా  నశించిపోతూ  పులికి  అందుబాటులో  ఉండే  జింకలు, అడవి పందులు  లభ్యం కాకపోవడం. మూడవది  ఇతర జంతువులతో  జరిగిన పోరాటం మూలంగాగాని, ఏటవాలుగా  వున్న  గుట్టలపై  ఎక్కి  జారిపడటం  వలన గాని, గురితప్పిన  వేటగాడి  తుపాకీ  తూటా  మూలంగా  ఏర్పడ్డగాయం మూలంగా గాని, అంగవైకల్యం ఏర్పడి చురుకుగా  వేటాడే శక్తిని పోగొట్టుకోవడం, అందుకే సునాయాసంగా  దాడిచేసి  వశపరచుకోగల  మనిషిని  ఆకలి  బాధతో  తొలిసారి  గాయపరచి  చంపి  కడుపు  నింపుకుంటుంది. అలా ఒకసారి  మనిషి  మాంసాన్ని  రుచి  చూసేక  పూర్తిగా మేనీటరుగా మారిపోతుంది. ఈ ప్రోసెస్ లో  మనిషంటే  సహజంగా తనకున్న  భయాన్ని కోల్పోయాక, మేనీటరు సాధారణమయిన  పులిని మించిన ఎత్తుల్ని  ప్రదర్శిస్తూ  మన ప్రయత్నాన్ని  తిప్పికొట్టే  తెలివితేటల్ని  సమకూర్చుకుంటుంది. మౌలికంగా  దీనికంతటికి  కారణం ఆకలి బాధ. ఏ ఆకలి  బాధ మనిషిని  దొంగగా, హంతకుడిగా  మారుస్తుందో....అదే ఆకలి బాధ  పులిని  మేనీటరుగా మార్చుతుంది. ఇట్స్ నథింగ్ బట్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్" చెప్పడం  ఆపేడు.

    "సో....అలా  సరిపెట్టుకుని  చేతులు  ముడుచుకొని  కూచోడం సమంజసమంటారా?" అన్నారెవరో.

    "చేతులు  ముడుచుక్కూచునేవాణ్నే  అయితే  ఐ ఉడ్  హేవ్ నాట్ లాస్ట్ టు ఎఫిషియంట్  ఫారేస్టాఫీసర్సు. నేను చెప్పింది  అనాల్సిస్ మాత్రమే" కోపాన్ని  నిగ్రహించుకున్నాడు  అనిల్ కుమార్.

    "పోనీ తర్వాతైనా  ఈ సమస్యనెలా  పరిష్కరించబోతున్నారు?"

    కర్చీప్ తో ముఖాన  అలుముకున్న  స్వేదబిందువుల్నీ  తుడుచుకున్న  అనిల్ కుమార్ వెంటనే  జవాబు  చెప్పలేకపోయాడు.

 Previous Page Next Page