"దట్స్ గుడ్! క్రిందకుపద టిఫిన్ చేద్దాం" చిరునవ్వుతో అన్నాడు రాజశేఖర్ ఠీవీగా.
టిఫిన్ చెయ్యడం పూర్తయ్యాక పైకి వెళ్ళిపోయింది చందన.
ఆమె చెవుల్లో రాజశేఖర్ మాటలే ప్రతిద్వనించసాగాయి.
యధాలాపంగా డ్రస్సింగ్ మిర్రర్ ముందునున్న తన వ్యానిటీ బాగ్ ను అందుకున్నదామె. తెరచి చూసిన మరుక్షణం ఆమె ముఖ కవళికలు మారిపోయాయి.
గాయపడిన మనస్సును సమాధానపరచుకుంటూ అంతకుముందే రాజశేఖర్ గదిలోనుంచి దొంగచాటుగా తెచ్చి దాచిన రివాల్వర్ వ్యానిటీ బాగ్ లో ఉందో లేదో చేతితో తడిమి చూసుకుంది చందన.
బయట కారు స్టార్ట్ అయిన శబ్దానికి కిటికీలో నుంచి చూసింది.
బయట దూసుకువెళుతున్న మారుతీరావు, బ్యాక్ సీటులో కూర్చుని వున్న రాజశేఖర్ రూపం స్పష్టంగా కనిపించాయామెకు.
అతడు వెళ్ళిన అయిదు నిమిషాలకు కృతనిశ్చయానికి వచ్చినట్టు పోర్టికోలో వున్న మరొక కారులో బయలుదేరింది చందన.
అంతవరకూ ఆ భవంతికి దూరంగా ఒక గోడచాటున నిలిచిన వ్యక్తి రోడ్డుమీదకు వచ్చి బుల్లెట్ ను స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు.
* * *
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా రైలుస్టేషన్.
నెంబర్ వన్ ఫ్లాట్ ఫారం మీద విజయవాడ వెళ్ళే రైలుకోసం ఎదురు చూస్తున్నాడొక పెద్దమనిషి.
అతనిచేతిలో రెక్జిన్ తో చేసిన సంచి సగానికి మడిచివుంది. దానిలో తన ఆస్తి అంతా ఇమిడివున్నట్టు ఆ సంచిని ఎంతో భద్రంగా పట్టుకుని మాటిమాటికీ వాచీవంక, రాబోయే ట్రయిన్ కోసం పట్టాలవైపు చూడసాగాడతను.
అతనొక కమీషన్ వ్యాపారి. తాడేపల్లిగూడెంలో పార్టీకి శనగకాయల లోడ్ ని అప్పగించి, వారు ఇచ్చిన యాభైవేల క్యాష్ ను తీసుకుని బయలుదేరాడు.
విజయవాడలో కూడా పార్టీ నుంచి రావలసిన కలెక్షన్ ను వసూలు చేసుకుని, చీరాలలోని మరో పార్టీకి యాభైవేలు అందజేయాలి.
తాడేపల్లి గూడెం స్టేషన్ బయటనుంచి ఫోన్ చేసి విజయవాడ పార్టీకి తనొస్తున్న విషయం చెప్పాడు. ఎటూ విజయవాడలో ఆలస్యం అవుతుంది కనుక రాత్రి తిరుమలకు బయలుదేరవచ్చుననే ఉద్దేశంతో చీరాల పార్టీకి కూడా ఆ టైమ్ కు చీరాల స్టేషన్ లో వెయిట్ చేయమని ఫోన్ చేశాడు.
అతన్ని రెండు జతల కళ్ళు గమనిస్తున్నాయనీ అతనెక్కడి నుంచి ఎక్కడకు బయలుదేరాడో అతనిదగ్గర ఎంత క్యాష్ వుందో అదెక్కడ ఇవ్వాలో, అతనేం చేయబోతున్నాడో కూడా పూసగుచ్చినట్టుగా ఆ ఇద్దరికీ తెలిసిపోయిందనే విషయం పాపం ఆ వ్యాపారికి తెలియదు.
విజయవాడ వెళ్ళే ఎక్స్ ప్ర్రెస్ రైలు వచ్చి స్టేషన్ లో ఆగింది. సమయం తొమ్మిదీ ముప్పయ్ ఐదు.
కమీషన్ వ్యాపారి తన బ్యాగ్ ను జాగ్రత్తగా చూసుకుని ట్రెయిన్ ఎక్కాడు. దూరం నుంచే ఇది గమనించిన ఇద్దరూ వ్యక్తులూ మౌనంగా అదే బోగీ ఎక్కారు.
క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారి సంధ్య చీకట్లు ముసురుకున్నాయి.
కమీషన్ వ్యాపారి తన చేతిలోని సంచిని ఎదురుసీటు వాళ్లకు ఇవ్వబోయి వెంటనే తన ప్రయత్నాన్ని విరమించుకొని, క్యాష్ సంచితోనే టాయ్ లెట్స్ వేపుకు కదిలాడు.
అంతకుముందే ఆ ఆగంతకుల్లో ఒకడు టాయ్ లెట్ రూమ్ లోకి వెళ్ళి బోల్డ్ వేయకుండా లోపల నక్కి వున్నాడు. వ్యాపారి లోపలకు రావడంతోనే తలుపు బోల్డ్ వేశాడు. ఆకలిగొన్న కొండచిలువలా కదలి అతని నోటిని మూసేశాడు ఆగంతకుడు.
మెరుపులా అతని చేతిలో ప్రత్యక్షమైంది ఎనిమిది అంగుళాల పొడవు ఉన్న కత్తి.
దానితో తననేం చేయబోతున్నాడు. చంపెస్తాడా? ఎందుకు? తన మీద అతని కెందుకు పగ? ఏమాశించి ఇలా చేస్తున్నాడో! ఆ వ్యాపారి ఆలోచనలు అంతటితో ఆగిపోయాయి.
మెత్తని శరీరాన్ని చేదిస్తూ దిగిపోయింది కత్తి అతని పొట్టలో. చివ్వున బయటకు చిమ్మింది వెచ్చటి రక్తం. హృదయవిదారకమైన కేక ఒకటి అతని గొంతు దాటి రాబోయి, రాలేక ఉక్కిరి బిక్కిరై విలవిల్లాడి పోయాడు. అంత బాధలోనూ తన నోటికి అడ్డంగా వున్న అతని చేతిని తొలగించుకొనే ఆఖరి ప్రయత్నం చేశాడు. కానీ, ఇంకోపోటు...
అతని కన్నుల్లో తొణికిసలాడుతున్న భయాన్ని చూసి తమాషాగా నవ్వుకుంటూ, ఈసారి కత్తిని కంఠంలోకి దింపాడు. నెమ్మదిగా చర్మాన్ని కోసుకుంటూ రక్తనాళాల్ని ఛిద్రం చేస్తూ లోపలకు.... ఇంకా లోపలకు వెళ్ళిపోయింది కత్తి. సగానికి తెగనరికినట్టుగా మెడ వ్రేలాడబడి పోయింది.
ఆ ఆగంతకుడు బాత్ రూమ్ లో వున్న మిర్రర్ కి కమెండో అని రాసివున్న స్టిక్కర్ ను అంటించి కత్తిని కడిగి దాచుకొని, సంచిని పొట్టకు కట్టుకొని తలుపు తెరచుకొని, బయటకు అడుగు పెట్టబోతూ ఎదురుగా నున్న ప్రయాణీకురాలిని చూశాడు.
ఆమె ఒంటినిండా నగలు....
లోపల కుప్పకూలి రక్తపు మడుగులో వున్న శవాన్ని చూసిందామె.
ఆ దారుణం చూడగానే ఆమె గుండాగినంత పనయింది. మెదడు మొద్దుబారిపోయి నోట మాట రాలేదామెకు.
ఆగంతకుడు క్షణాలమీద కదిలాడు.
ఆమెలో అప్పుడు చలనం వచ్చింది.
తనకు కూడా ఏం జరగబోతోందో వూహించి గభాల్న వెనుదిరిగి, మరొక బాత్ రూమ్ లోకి దూరి తలుపు వేసుకుంది.
అప్పటికే ఆ బాత్ రూమ్ లో వున్న మరొక ఆగంతకుడు ఆమె నోరు తెరచి కేకలు పెట్టకముందే, కన్నుమూసి తెరిచేంత వ్యవధిలో, ఆమె పీక పుచ్చుకున్నాడు.
అతన్ని దూరంగా నెట్టాలని పెనుగులాడుతూ ప్రయత్నం చేయసాగిందామె. అతని శక్తిముందు ఆమె బలహీనపడిపోసాగింది. మరో రెండు నిమిషాలకు ఆమె శరీరం కట్టెలా క్రిందపడిపోయింది.
ఆ ఆగంతకుడు ఆమె వంటిమీద నగలను క్షణాల్లో వలిచేశాడు. తన పని పూర్తి అవ్వగానే కమెండో అని రాసివున్న స్టిక్కర్ ను బార్ రూమ్ లో వున్న అద్దానికి అంటించాడు.
ట్రెయిన్ ఏలూరు అవుటర్ లో ఆగడంతో ఆగంతకులిద్దరూ కిందకు దిగి చీకట్లో కలసిపోయారు.
ఈ నేరంతో కమెండో ను నీచుడుగా, శాడిస్టుగా, రక్తపిపాసిగా చిత్రించి అధఃపాతాళానికి తొక్కివేసింది మాస్ మీడియా.
* * *
మెత్తగా దూసుకుపోతున్న కారు కోడంబాకం బ్రిడ్జి దాటి టి.నగర్ వైపు తిరిగింది.
పానగల్ పార్క్ దగ్గర రౌండ్ కొట్టి వాణీమహల్ కెళ్ళే రోడ్డులోకి తిరిగి వందగజాలు వెళ్ళి ఆగిపోయింది.
అదొక అనాధ శరణాలయం. రాజశేఖర్ ట్రస్టు ఆధ్వర్యాన నడుస్తున్నది.
దానిని నెలకొల్పి ఆ రోజుకు మూడు వసంతాలు నిండడం వల్ల నగరంలోని ప్రముఖు లందరితో తన ఆనందాన్ని పంచుకోవాలని ఆహ్వానించాడు రాజశేఖర్. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, నగర ప్రముఖులు అందరూ అప్పటికే వచ్చివుండడం వల్ల రాజశేఖర్ వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు.