Previous Page Next Page 
అనిత పేజి 7


    ఆ చిరాకు, ఎదురు చూసిన అనిత రానందుకని తెలియని శారదమ్మ అనిత రావటం రాజారావుకు ఇష్టంలేదని భావించి లోలోపల నొచ్చుకుంది. అంతలోనే ఇంటిముందు కారాగింది.
    కారులోంచి దేవలోకం నుండి దిగి వచ్చిన అప్సరసలా అనిత దిగి నిల్చుంది.
    అప్రయత్నంగా ముందుకు రెండడుగులువేశాడు రాజారావు.
    అనిత ముఖంలో వికాసం శారదమ్మకు ఆశ్చర్యం కలిగించినా సంతృప్తినీ  ఇచ్చింది.
    అనిత శారదమ్మ  దగ్గిరకువచ్చి పాదాలకు నమస్కారం చేసింది.
    అనిత రూపు రేఖలకే మురిసిపోతున్న శారదమ్మ ఈ చర్యతో మరింత పొంగిపోయింది.
    అనితను ఆశీర్వదించి లేవనెత్తింది.
    "నువ్వు రాలేదని అనుకుంటున్నాం!" అంది.
    "రాకుండా ఏలావుంటాను? మిమ్మల్నందరినీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాటపడుతున్నాను"
    ఈ మాటలు అనిత ప్రత్యేకం రాజారావును చూస్తూ అంది,
    రాజారావు కాళ్ళు మెరిశాయి, చిరునవ్వులో గర్వరేఖ తొంగి చూసింది.
    అనితఅ సుశీలనూ, కన్ననూ పేరున పలకరించింది.
    "వదినా! నువ్వు వచ్చినందుకు నాకు చాలాచాలా సంతోషంగా వుంది."
    మనసారా అంది సుశీల.
    "బావకు మాత్రమే కాస్త కష్టంగా ఉన్నట్లుంది." రాజారావు వంక కొంటెగా  చూస్తూ అంది అనిత.
    "లేదు,' లేదు. నాకూ సంతోషంగానే ఉంది. బంధువులు ఇంటికొస్తే ఆదరించగలిగే  సంస్కారం నాకు లేకపోలేదు,"
    రాజారావు గంభీరంగా అనడానికి ప్రయత్నించినా అతనా మాటలు ఉప్పొంగే సంతోషంగా అన్నాడని అతని కళ్ళు చెప్పక చెపుతున్నాయి.
    "నువ్వు కారులో వచ్చావా?"
    కుతూహలంగా అడిగింది కమల.
    "అవును. కారులోనే రావలసివచ్చింది. ఏం చెయ్యను? రాణితో టైయిన్ ప్రయాణం చాలా ఇబ్బంది"
    "రాణి ఎవరు?"
    శారదమ్మ ఆశ్చర్యంగా అడిగింది.
    రాజారావు సుశీల కుతూహలంగా చూశారు.
    "నా కూతురు. రా రాణీ!"
    అనిత డోర్ తెరిచి పట్టుకుంది. నాలుగేళ్ళ పాప అనిత చెయ్యి పట్టుకుని క్రిందకు దిగింది.
    శారదమ్మ నెత్తిన పిడుగు పడింది.
    రాజారావు కాళ్ళ క్రింది భూమి కంపించింది.
    సుశీల ముఖం పాలిపోయింది.
    కన్న, కమల చంటీ పాపను చూసిన ఆనరదంతో చప్పట్లు కొట్టారు.
    "నీ కూతురా?"
    శారదమ్మ మళ్ళీ అడిగింది.    
    "అవునత్తయ్యా! నా కూతురు, బాగుందికదూ! మా నాన్నగారు ఇది చాలా ముద్దుగా  ఉంటుందంటారు."
    "చాలా బాగుంది."
    కన్న, కమల ఏక కంఠంతో వప్పుకున్నారు. "ఏం నాన్నగారు నీకు పెళ్ళి కాలేదని చెప్పారు......"కంఠం వణుకుతుండగా అంది శారదమ్మ.   
    "అవునత్తయ్యా!ఇంకా నాకు పెళ్ళి కాలేదు."
    తల గిర్రున తిరగసాగింది రాజారావుకు. సుశీల వణికే క్రింది పెదవిని మునిపంటితో నొక్కి పట్టుకుంది.
    "మరి....మరి....కూతురెలా పుట్టిందీ?" అయోమయంగా అడిగింది శారదమ్మ.
    పకపక నవ్వింది అనిత.
    "ఇంత వయసొచ్చి పిల్లలెలా పుట్టారని అడుగుతున్నావా అత్తయ్యా!"
    ఆ వయసులో శారదమ్మ సిగ్గుతో చితికిపోయింది. పెళ్ళి కాకుండా తల్లి కావటమే కాక తన సంతానాన్ని చేత్తో పట్టుకుని  నిర్లక్ష్యంగా నవ్వుతోన్న ఆ సుందరమూర్తిని పిచ్చి పట్టిన వాడిలా చూశాడు రాజారావు.
    "ఆ పాపకి తండ్రి ఎవరు?"
    అతని కంఠంలో పలికింది క్రోధమో, అయోమయమో, అసహ్యమో సరిగా అర్థంకాలేదు.
    "అది చెప్పగలిగేస్థితిలో నేనుంటే నా కింత ప్రయాసదేనికి? సమయం సందర్భం కుదరగానే మీ కందరికీ అన్నీ చెపుతాను, అంత వరకూ నన్నేమీ అడగకండి..."
    "మీరీ ఇంట్లో వుండటానికి వీల్లేదు___"
    లోపలకు వెళ్ళబోతున్న అనిత రాజారావు కటువు స్వరం విని ఆగిపోయింది.
    పెంకిగా కవ్విస్తున్నట్లు రాజారావును చూస్తూ "మీ బంధువులను ఆదరించగలిగే సంస్కారం మీకుందన్నారు కదూ ఇప్పుడే. క్షణాని కొక మాటా మీకు?"
    రాజారావు తడబడ్డాడు.
    "కానీ. కానీ...మీరు..."
    "ఊ! నేను?"
    నడుం మీద చేతులాన్చి విలాసంగా నవ్వుతూ నిర్లక్ష్యంగా చూస్తోన్న ఆ మధురమూర్తిని క్షణకాలం మైమరచి చూస్తూ నిలబడి పోయాడు రాజారావు.
    పకపక నవ్వింది అనిత.
    రాజారావు వులిక్కిపడి లజ్జ పడ్డాడు.   

 Previous Page Next Page