Previous Page Next Page 
అనిత పేజి 6


    "దివ్యంగా ఉంది, శారదా!! ఒక దివ్యమైన ఆలోచన! మన రాజారావుకే అనిత నిచ్చి పెళ్ళిచేస్తే...."
    రాజారావూ, శారదమ్మా ఇద్దరూ తెల్లబోయారు.
    "ఇదిగోనయ్యా! మా అనిత ఫోటో చూడు...."
    "నిర్లక్ష్యంగా క్రిందపడెయ్యాలనుకున్నా రాజారావూ ఆ ఫోటోమీంచి కొన్ని క్షణాలవరకూ చూపులు తిప్పుకోలేక పోయాడు. అప్రయత్నంగా దానిని జేబులో వేసుకున్నాడు.
    "మేనల్లుడని నీకేం లోపం చెయ్యను. వాళ్ళమ్మ తన డబ్బు లక్ష రూపాయలు అనిత పేర బేంక్ లో వేసింది. అది అనిత  కుంటుంబంకోసం తప్ప మరే సందర్భంలోనూ వాడకూడదని గట్టి నియమం చేసింది. ఆలోచించుకుని సమాధానం చెప్పు"
    శారదమ్మ కళ్ళు మెరిశాయి. ఆవిడకు అన్నగారంటే మొదటి నుంచీ చాలా ఆపేక్ష ఆ ఆంగ్లో ఇండియన్ వదినగారు పోనే  పోయింది అనితను తన కోడలిగా  చేసుకుంటే రెండు కుటుంబాలూ కలుస్తాయి. తమ కుటుంబానికి ఒక అండ ఏర్పడుతుంది.
    కానీ  రాజారావు ముఖం మాత్రం గంభీర మయింది.
    "క్షమించండి. మీ అమ్మాయిని నేను చేసుకోలేను." అన్నాడు.
    తెల్లపోయాడు దయాశంకర్
    "అదేవిటయ్యా! అమ్మాయి నచ్చలేదా? ఫోటో లోకంటె చాలా  బాగుంటుంది."
    "అంత అందమైన అమ్మాయిని ఎక్కాడా  చూడలేదు"
    "మరి, ఇంకా   కట్నంకావాలా?"  "కట్నానికి నేను ఆశపడటం లేదు."
    "ఇంకేమిటి నీ అభ్యంతరం? కొంపతీసి నువ్వెవరినైనా ప్రేమించావా?"
    చిన్న తనంలోనే బాధ్యతలన్నీ నెత్తినబడి ప్రేమింపడానికి తీరిక లేకపోయింది మావయ్యా?"
    దయాశంకర్ పకపక నవ్వి "మరి, ఎందుకు కాదంటున్నావో కారణం  చెప్పు," అన్నాడు.
    "ఒక ఆంగ్లో ఇండియన్ యువతి కూతుర్ని నేను పెళ్ళి చేసుకోలేను"
`    ఎగిరి కూర్చున్నాడు దయాశంకర్.
    "నాట్? ఇందాకటినుంచి మాటల్లొ అంత సంస్కారం వలక బోసి....."
    "సంస్కారం మాటల్లోనే కాదు మావయ్యా! మనసులోనూ ఉంది. ఎవరైనా ఇలాంటి పెళ్ళి చేసుకుంటే మనసారా అభినందిస్తాను."
    "భలే సంస్కారం!"
    హేళనగా అన్నాడు దయాశంకర్.
    "అవును, కొన్ని కొన్ని  సంస్కారాలు భలేగానే ఉంటాయి. ఒక కుంటుంబానికి యజమానిగా  నా బాధ్యతలు గుర్తించే సంస్కారం కూడా  నాకుంది. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా చెల్లెళ్ళకు పెళ్ళి కావటం కష్టం. మన సంఘం  ఈ  నాటికీ కబుర్లలో ముందుకు దూకు తున్నంత కార్యాచరణలో ముందుకు దూకటం లేదు..... ఆగండీ! మీరనబోయేది నాకు తెలుసు. మీ డబ్బూ హొదా సహకరిస్తాయంటారు. కానీ, అది నా కిష్టంలేదు."
    దయాశంకర్ ముఖంలో హేళన ఎగిరి పోయింది. వాత్సల్యంగా రాజారావు వీపుతట్టి "శభాష్!" అని శారదమ్మతో" ఆణిముత్యం లాంటి కొడుకుని కన్నావు  శారదా!" అన్నాడు.
    ఈ ప్రశంసకు  శారదమ్మ పొంగిపోయినా, రాజారావు అని తను కాదనటం నచ్చలేదు ఆవిడకు. ఆలునా ఎప్పటిలాగే ఏమీ అనలేక పోయింది.
    ఆరోజే దయాశంకర్ వెళ్ళిపోయాడు.
    ఆనాటి కీనాడు సంవత్సరం తరువాత అనిత దగ్గరనుండి ఈ ఉత్తరం....
    అతని చాలా అందంగా ఉంటుందిట! అనిత వచ్చాక........అనిత రాజారావుకి నచ్చితే...వాళ్లిద్దరికీ పెళ్లి జరిగితే....ఇలా తియ్యతియ్యగా సాగిపోయాయి శారదమ్మ ఆలోచనలు .....అటు రాజారావుకీ ఇంచు  మించు ఇలాంటి ఆలోచనలే వచ్చాయి.
    అనితను చేసుకోమని మామయ్య తననుఅడిగాడు. తను కాదన్నాడు. అనిత ఫోటో తనకి చూపింఛినట్టే ఫోటో అనితకు చూపించి ఉండవచ్చు. ఆ ఫోటో చూసి తనను ఎలాగైనా  ఆకర్షించాలని వస్తోందా అనిత?


                                                            5


    స్కూటర్ మీద స్టేషన్ కి వెళ్లిన రాజారావు ఎంతో ఆతృతతో ప్రతి కంపార్ట్ మెంటూ గాలించాడు!
    తను ఫోటోలో  చూసిన ఆ సుందరమూర్తి ఎక్కాడా కనిపించలేదు.
    ఒక్క క్షణం నిరుత్సాహంతో డీలా అయిపోయాడు.
    తనకు కలిగిన నిరుత్సాహానికి తనే ఆశ్చర్యపోయాడు రాజారావు.
    తనకు తెలియకుండానే తన మనసు అనిత రాక కోసం ఇంతగా ప్రరీక్షిస్తోందా?
    రాజారావు స్కూటర్ చప్పుడు వినగానే ఇంటిల్లి పాదీ  బిల బిల లాడుతూ బయటకు వచ్చారు.
    అందరూ ఒక్కసారే "అనిత ఏదీ?" అని అడిగారు.
    "రాలేదు,"
    అందరి ముఖాల్లోనూ నిరుత్సాహం స్పష్టంగా కనపడింది.
    శారదమ్మ మరీ దిగులు పడింది.
    "రాలేదా? ఎందుకు రాలేదు?"
    "బాగుంది నా కెలా తెలుస్తుంది ?"
    చిరాకు పడ్డాడు రాజారావు.   

 Previous Page Next Page